అమ్మ సన్నిధిలో మాత్రమే జరిగే విశిష్టమైన సమావేశమిది. బొంబాయి, పూనా, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖ వంటి దూరప్రదేశాలనుండి కూడా ఎందరెందరో ఈ సమావేశానికి వచ్చారు. సెప్టెంబరు 13,14 తేదీలలో జరిగిన ఈ సమ్మేళనానికి ముందు 12వ తారీకున అమ్మ రెండవ కుమారుడు శ్రీ రవీంద్రరావు జన్మదినోత్సవం కావటం వల్ల కొందరు ఆరోజుకే వచ్చి (అతనికి శుభాకాంక్షలు చెప్పి సమావేశంలో జరగబోయే కార్యక్రమాలను గూర్చి చర్చించవలసిన విషయాలను గూర్చి ఆలోచన చేశారు. అందులో శ్రీ కొమ్మమూరి కృష్ణ, శ్రీ యు. గిరీష్ కుమార్, శ్రీ కామరాజు, శ్రీ ఐ. రామకృష్ణ వంటి వారున్నారు.
13.9.2014 ఉదయం వేదికపైకి శ్రీ వారణాసి ధర్మసూరి శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షుడు శ్రీ దినకర్ను, పరిషత్ పాట్రన్ శ్రీ రవీంద్రరావును, సంస్కృత కళాశాల అభివృద్ధి సంఘ అధ్యక్షుడు శ్రీ బి. రామబ్రహ్మంను ఆహ్వానించారు. అమ్మకు గజమాలాలంకారణ, దీప ప్రజ్వలనా, అమ్మనామ సంకీర్తన, వేదపారాయణ, సభాస్వాగతగీతాలాపన జరిగిన తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది.
అధ్యక్షుడు శ్రీ దినకర్ తన ప్రారంభోపన్యాసంలో అమ్మప్రేమ, వాత్సల్యము, అనురాగముల ద్వారా మానవతాసేవ ఎలా చేయాలో మనకు నేర్పిందని ఆ మార్గంలో లోకాన్ని ఆకర్షించి అమ్మతత్త్వాన్ని అందించాలని పలికారు. శ్రీరామబ్రహ్మంగారు అమ్మ మీరంతా నా అవయవాలు అన్నదని, ఆ అవయవాలన్నీ, సహకరిస్తేనే విశ్వమానవజీవనం నిరాటంకంగా సాగుతుందనీ, అమ్మకు మనం శరణాగతి చేస్తే అవసరానికి తగినంత ధనం దానంతట అదే వస్తుందనీ అమ్మజీవిత తరంగాలనూ, అమ్మనామసంకీర్తననూ చేస్తుంటే అమ్మ మన సంస్థకు మనకు అండదండలకూరుస్తూ మనల్ని తరింప చేస్తుందనీ చెప్పారు.
పరిషత్ పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు పూర్వం 2009 సెప్టెంబరులో ఇటువంటి కార్యక్రమం నిర్వహింపబడిందనీ, అప్పుడు తీసుకొన్న నిర్ణయాలలో అన్నపూర్ణాలయభవన నిర్మాణం, ఆదరణాలయ నిర్మాణం వేదపాఠశాల స్థాపన వంటి కార్యక్రమాలు అమ్మ అనుగ్రహంతో పురోగతిని సాధించాయనీ. ఇంకా చేయవలసిన బాపట్లలో చిదంబరరావు తాతగారి ఇంట్లో సూపర్స్పెషాలిటీ హాస్పిటల్, నిరంతరంగా అఖండనామం, వేదపాఠశాలకు భవననిర్మాణం వంటివి ఎన్నో ఉన్నాయనీ చెప్పారు. అమ్మ ఆడియోలను, వీడియోలను ముందుతరాల వారికి అందించగలిగే స్థితిలో ఉంచాలి. అధ్యయన పరిషత్లను పెంచాలి. అలాగే తత్త్వప్రచార సమితి ఏర్పడ్డది. దాని కార్యక్రమాలను విస్తృతం చేయాలి. ఇలా ఎన్నో విషయాలను గూర్చి సమగ్రసుందరంగా వివరించారు. జిల్లెళ్ళమూడిలో కార్యకర్తలబలం తగ్గిపోతున్నదనీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధ్యతలు స్వీకరించాలని కోరారు.
తదనంతరం శ్రీ కొమ్మమూరి కృష్ణ సమ్మేళనలో చర్చించవలసిన విషయాలను విభాగించువచ్చిన సోదర సోదరీమణులను అయిదు విభాగాలుగా విభజించి సామూహిక చర్చలు సమాలోచనలు చేసి ఆయా విభాగాలో చేయవలసిన అభివృద్ధిని సూచించమన్నారు. అందులో తత్కాలిక – దీర్ఘకాలిక కార్యక్రమాలను నిగ్గుతేల్చమని చెప్పారు. 1) అన్నపూర్ణాలయము దాని అంగాలు 2) విద్యా పరిషత్ దాని అభివృద్ధి 3) అమ్మ సందేశం లోకానికి అందించటం 4) పరిషత్ Administration నిర్వహణలో మెలకువలు 6) వైద్యము ఆరోగ్యము-పరిశుభ్రత (Medical & Hygiene). ఈ పై అయిదు విభాగాలలో మిగతావి కూడా ఆలోచించి నిర్ణయించి ఒక నివేదికను ఇమ్మన్నారు.
ఆ రకంగా ఉన్నంతలో విపులంగానే చర్చలు జరిగాయి. శ్రీ దేశిరాజు కామరాజు అన్నపూర్ణాలయ చర్చా నివేదిక సమర్పిస్తూ స్థానికులు సమయనియమం పాటించాలనీ, భోజనము చేసే బల్లలు పరిశుభ్రంగా ఉంచాలనీ, ఇండ్లకు గదులకు కారియర్స్ తీసుకెళ్ళటం నియంత్రించాలనీ, అన్నం తినేవారిలో పెట్టేవారిలో ఇది అమ్మ ప్రసాదమనే భావన కలిగించాలనీ, కూరలు తరిగేందుకు మిషన్లు, వడ్డనకు ట్రాలీలు అమర్చాలనీ, వంటవారికి ఇన్సెంటీవ్స్ కల్పించి ప్రోత్సహించాలనీ పలికారు.
విద్యాపరిషత్ అభివృద్ధిని గూర్చి కళాశాల పూర్వవిద్యార్థి విశాఖలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీ మధుసూదనరావు ప్రసంగిస్తూ విద్యార్థినులకు ప్రత్యేకమైన వసతి గృహం సరిపోయేరీతిలో నిర్మించాలనీ, ప్రభుత్వ విధానాలవల్ల మనం ఏర్పాటు చేసుకొంటున్న లెక్చరర్ల జీతాలు ఇవ్వటానికి కావలసిన మూలధనం సరిపోవటం లేదనీ, విద్యార్థులకు ఆవరణలో సంచరించ టానికి ఒక డ్రస్ కోడ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులను ఒక్కొక్కరు దత్తత తీసుకొని స్వయం సమృద్ధి సాధించాలనీ, పత్రికలలో ప్రకటనలు ఇవ్వాలనీ చెప్పారు.
అమ్మ సందేశాన్ని దశదిశలా అందించటానికి రాబోయే తరాన్ని ఎక్కువగా అమ్మ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయటానికి అనుసరించవలసిన వ్యూహాలను కంకిపాడు పిన్ని మనుమడు శ్రీమతి సుబ్బలక్ష్మి కుమారుడు శ్రీనివాస్ (పూనా నుండి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు) వెబ్సైటును, వీడియోలను ప్రచారానికి ఉపయోగించుకోవాలనీ, అమ్మ చరిత్రను పిల్లల కథల ద్వారా పత్రికలలో ప్రచురింపచేయాలనీ, గ్రామగ్రామాన పట్టణాలలో అమ్మ సినిమావేసి వారిలో స్ఫూర్తిని కలిగించాలనీ, కాలేజీలలో, పాఠశాలలో పోటీలు పెట్టి బహుమతులు పంచాలనీ వివరించారు.
(మెడికల్ అండ్ హైజిన్) ఆరోగ్యము వైద్యము – పరిశుభ్రలతను గూర్చి శ్రీ వఝ ప్రసాద్ కోడలు వివరిస్తూ ఒక పనిమనిషి 24 గంటలు హాస్పిటల్లో ఉండాలనీ, పూర్తిగా ఎనిమిది గంటలు పనిచేసే వైద్యుని నియమించుకోవాలనీ, డాక్టర్ లేని సమయంలో కూడా హాస్పిటల్ మేడపై భాగంలో కాంపౌండర్ నివసించి రోగులకు అశసరమైన మందులు ఇస్తుండాలనీ, ఊరూర మెడికల్ కాంప్లు నిర్వహిస్తుండాలనీ, అమ్మ శతజయంతి దశకంలో సమాన్య జనానికి వైద్యం అందేరీతిలో కాంపులు నిర్వహించాలనీ, ఒక్కొక్క క్యాంపుకు 10,000 రూపాయిలు చొప్పున స్పాన్సర్లను ఆహ్వానించాలనీ, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలనీ ఆదరణాలయ నిర్వహణకు తగు సేవాభావం గలవారిని చూచి చక్కగా నిర్వహించాలని. అమ్మ ఆశయానికి తగ్గట్లు సేవచేయాలని పలికారు.
పరిపాలనా నిర్వహణాన్నిమెరుగుపరచటానికి శ్రీ కె.రాజేంద్రప్రసాద్ సూచనలు చేస్తూ ప్రతి సంవత్సరం బడ్జెట్ ఏర్పాటు చేసుకొని తగినట్లుగా నిర్వహించాలనీ, కార్యాలయం సమయనియమము క్రమశిక్షణ ఉండాలనీ, భక్తుల యెడ సేవాభావంతో ప్రేమతో ఉండాలనీ, సంస్థలోని ప్రతివిభాగంలోనూ కార్యక్రమ నిర్వహణ సమర్థవంతంగా ఉండేట్లు చూడాలనీ, ఎవరికి దేనియందు శ్రద్ధఉంటే దానిని వారికి అప్పజెప్పటం మంచిదని చెప్పారు. శ్రీ వల్లూరి హైమ ఆచరణ యోగ్యమైన సూచనలెన్నో చేసి శ్రోతల ప్రశంసలను పొందారు.
శ్రీ వఝ ప్రసాద్ కుమారులు అల్లుడు సంస్థకు పది లక్షలు విరాళం ప్రకటించి నెలకు నాలుగురోజులు వచ్చి అప్పచెప్పిన పనిచేయటానికి సిద్ధమని పలికారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ విశ్వజనని సభ్యుల సంఖ్య పెంచవలసిన అవసరం ఉన్నదనీ, ఒక్కొక్కరు ఒక్కొక్క సభ్యుని చేర్చితే బాగుంటుందనీ, శ్రీ రావూరి ప్రసాద్ చేస్తున్న అమ్మతో పరిచయమున్న సోదరుల ఇంటర్వ్యూలను అమ్మ ఉన్న సమయంలో తీసిన వీడియోలను ఒక కొలిక్కి తెచ్చి భావితరాలకు అందించే పని వేగిరం చేయాలని కోరారు. అమ్మ తత్త్వచింతన సమితికి ప్రత్యేకమైన బాంక్ అంకౌంట్ తెరచి శ్రీ శ్రీమన్నారాయణమూర్తికి తగు ప్రోత్సాహాన్ని కలిగించాలని కోరారు. జనరల్ కార్యదర్శి శ్రీ వై.వి.శ్రీరామూర్తి తగు రీతి స్పందించి నిర్వహణలోని కష్టనష్టాలు వివరించి సాధ్యమైనంత సూచనలు ఆచరణలో పెట్టగలమన్నారు.
మరుసటి రోజు 14వ తారీకున ఎందరో కాలేజీ పూర్వవిద్యార్థులు కూడా వచ్చి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా తనజీవితాన్ని జిల్లెళ్ళమూడికే ముడుపుగట్టి అవివాహితునిగా వాత్సల్యాలయానికి సేవ చేస్తున్న శ్రీ మన్నవ దత్తాత్రేయశర్మ సేవను గుర్తించి సత్కరించారు. శ్రీ రావూరి ప్రసాద్ దత్తుని గూర్చి ప్రసంగించారు. తదనంతరం ఈ మధ్యనే కళ్యాణ షష్టిపూర్తిని చేసుకొన్న సోదరులు శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీమతి సీతాలక్ష్మీ భ్రమరాంబలను సత్కరించారు. భ్రమరాంబక్కయ్య అమ్మ నామానికి చేస్తున్న సేవను గుర్తించి ప్రశంసించారు. శ్రీ కొండముది రవి అమ్మ అఖండనామ నిర్వహణలోనూ, ఏకాహ సప్తాహాల నిర్వహణలోనూ చేస్తున్న సేవకు గుర్తుగా సత్కరించారు. శ్రీ లక్కరాజు సత్యనారాయణ, తిరుపతి నుండి వచ్చిన పూర్వ విద్యార్థి శ్రీ యం. కృష్ణాంజనేయులు రవిని గూర్చి ప్రసంగించారు. సన్మానితులందరికీ నూతన వస్త్రాలు సమర్పించారు.
శ్రీ అన్నపర్తి కృష్ణశర్మ హైదరాబాద్ నుండి వచ్చారు. అమ్మ అనసూయేశ్వరాలయానికి ఏర్పాటు చేసిన ప్రధమపూజారి కవి, జ్యోతిష శాస్త్రజ్ఞుడు, ఉపాసకుడు, అమ్మ ఆలయ అభివృద్ధికి పంచాయతనము ఏర్పాటు చేయవలసిన ఔచిత్యాన్ని వివరించి ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహింపబడాలని పలికారు. తంగిరాల కేశవశర్మ కూతురు శ్రీమతి హైమ అనసూయేశ్వరాలయంలో శ్రీచక్రం ఏర్పాటు చేసి కేశవశర్మ ఆలోచన ఆవేదనలను అర్థం చేసుకోవాలని పలికారు.
సుప్రసిద్ధ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారు గత రెండు రోజులుగా తాను గమనించిన విషయాలన్నింటి పైనా సమగ్రమైన ఒక ఆచరణాత్మకమైన వివరణలను అందించారు. అన్ని రంగాలను స్పృశించారు. కళాశాల పూర్వవిద్యార్థులు దాదాపు ఇరవై మంది వచ్చి పాల్గొన్నారు.
మొత్తం మీద ఈ విశ్వ సౌభ్రతృత్వ సమ్మేళనంలో కొత్త కొత్త యువకులు పాల్గొనటం కొన్ని మంచి ఆలోచనలు చేయటం హర్షించదగ్గ విషయం. అయితే ఇంకా ప్రణాళికా బద్దంగా ముందుగానే ఏవిషయాలపై చర్చ జరగ బోతున్నదో సభ్యులకు తెలియచేసి తయారై రమ్మని చెప్పితే ఇంకా ప్రయోజనకరమైన ఆలోచనలు చేసుకొని వచ్చేవారనీ, ఇక ముందు ఎప్పుడైనా అలా జరిగితే ఇంకా ఇంకా అభివృద్ధి పధంలో ముందుకు పోయేందుకు వీలౌతుందని కొందరు భావించారు.
ఈ సమ్మేళనం శ్రీ విశ్వజననీపరిషత్ అభివృద్ధి ఆలోచనా సరళికి అద్దంపడుతున్నదనే భావించవచ్చును.