1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వెన్నంటి కాపాడే తల్లి అనసూయ మాత

వెన్నంటి కాపాడే తల్లి అనసూయ మాత

Mellacheruvu V R Sai Babu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : July
Issue Number : 12
Year : 2022

అన్నపూర్ణాలయంలో డబ్బులు ఏమీలేని రోజుల్లో వచ్చిన అమ్మ బిడ్డలకు, ప్రాంగణంలో నివసించేవారికి అమ్మ కరుణతో భోజనవసతులు ఆటంకం లేకుండా జరిగాయి. కోట్లు వచ్చే రోజుల్లో కూడా అలాగే జరిగాయి, జరుగుతున్నాయి. అన్నపూర్ణాలయం నడిపించడానికి, ఇక్కడ అవసరాలకు డబ్బులేని రోజుల్లో అనేకమంది అన్నయ్యలు, అక్కయ్యలు విరాళాలకోసం అనేకమందిని కలవడం జరిగేది. వారిలో ప్రముఖ పాత్ర గోపాలన్నయ్యది. గోపాలన్నయ్య విస్తృతంగా అనేకచోట్లకు ప్రయాణం చేసి విరాళాలకోసం అనేక మందిని కలవడం జరిగేది. ఒకసారి గోపాలన్నయ్య, బుద్ధిమంతుడు గారు విజయవాడలో రావూరి బ్రదర్స్ వారిని విరాళం అడగాలని ప్రయాణం అయ్యారు. విజయవాడ చేరారు. బుద్ధిమంతుడు గారికి ఆకస్మికంగా విపరీతమైన జ్వరముతో ఒళ్ళు వణకడం వల్ల రావూరి బ్రదర్స్ వారిని కలిసే అవకాశం కలగలేదు. ఆయన గోపాలన్నయ్యతో తనను చీరాల ట్రైన్ ఎక్కించమని, తాను ఎలాగో చీరాలచేరి డాక్టర్ పొట్లూరి సుబ్బారావు గారి దగ్గర వైద్యం చేయించుకుంటానని చెప్పారు. గోపాలన్నయ్య అవసరంగా రావూరి బ్రదర్స్ వారిని కలవాల్సి వున్నందున అమ్మ మీద భారం వేసి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించారు. ట్రైన్లో పైన స్లీపర్ మీద పడుకోబెట్టి |ట్రైన్ కదలగానే ఆయన తన పనిమీద వెళ్ళిపోయారు. అమ్మ మీద భారం వేశారు కదా ! ఇక అమ్మే బుద్ధిమంతుడు గారిని ఎలా కాపాడిందో చూడండి. ఆయనకు స్లీపర్ మీద పడుకున్న తర్వాత జ్వరంతో స్పృహ లేదు. చీరాల స్టేషన్ రాగానే ఎవరో తట్టినట్లు స్పృహవచ్చి స్టేషన్ బయటకు వచ్చి రిక్షా చేయించుకుని ఇంటికి వెళ్ళారు. ఇంట్లో వారి భార్య, పిల్లలులేరు. మద్రాస్ లో ఉన్న తమ పుట్టింటికి వెళ్ళింది. వారి భార్య పిల్లలతో సహా. వృద్ధురాలైన వారి అమ్మ గారు మాత్రం ఉన్నారు. ఆమె బుద్ధిమంతుడు గారికి సేవచేసే పరిస్థితుల్లో లేదు. తలుపు కొట్టి మంచం వేయించుకుని పడుకున్నారు. విపరీతమైన జ్వరం, కాళ్ళనొప్పులు, వళ్ళునొప్పులతో అమ్మా అమ్మా అని మూలుగుతూ పడుకున్నారు. ఎలాగో డాక్టర్ గారు వచ్చి మందిచ్చి వెళ్ళారు. కాళ్ళు ఎవరో నొక్కి ఉపశమనం కలిగించారు. వృద్ధురాలైన అమ్మగారు తప్ప ఎవరూ లేరు. ఆమె చెయ్యగలిగిన స్థితిలో లేదు. రెండుమూడు రోజులైన తర్వాత జ్వరం తగ్గుముఖం పట్టి ఓపిక వచ్చి జిల్లెళ్ళమూడి వెళ్ళారు. అమ్మ ఒడిలో సేదతీరుతున్నప్పుడు అమ్మ ఒక ప్రశ్న వేసింది. “నాన్నా! నీవు జ్వరంతో కాళ్ళనొప్పులు విపరీతంగా బాధపడు తున్నప్పుడు నీ కాళ్ళు ఎవరు నొక్కారురా?” అని. బుద్ధిమంతుడు గారికి గొంతు గద్గదమై కళ్ళ నీళ్ళు వచ్చినయి. ఆ పని ఎవరు చేసి ఉంటారో ఈ పాటికి అక్కయ్యలకు, అన్నయ్యలకు అర్థం అయి ఉంటుంది. బిడ్డలకోసం అమ్మ ఎంతటి పని అయినా చేస్తుంది. మనల్ని వెన్నంటి కాపాడే తల్లి అనసూయ మాత శ్రీచరణాలకు సహస్రాధిక కృతజ్ఞతాభి వందనములు.

 జయహెూమాతా!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!