(గత సంచిక తరువాయి)
‘చూడ గలమె కులము శుక్ల శోణితముల?
కులము భేద మెపుడు కూడ’ దనియె..
సర్వ సమ్మతమ్మే సరియైన మతమనె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు..
ఆ నవ గ్రహమ్ము లాధారములు కావు.
మహిని చూడ నడువ మానవులకు
ద్వేష రాగములని తెలిసికొ మ్మని పల్కె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
పెట్టినంత కాదు పెళ్ళి ముహూర్తమ్ము
జరిగి నపు దటంచు నెఱుగ వలయు,
తీర్పు చెప్పు వాడు దేవ దేవుండనె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
ఇతరులందు తప్పు లెన్నుటయే వెర్రి
తెలివి తనదు తప్పు తెలిసి కొనుటె
పంచకుండ లోపల కను మనె
వెలుగు ముద్ద అమ్మ విశ్వ గురువు.
వర్గ భేద మెపుడు వైరమ్మునకు దారి
వర్గమొకటి లేక స్వర్గ మగును
ఘర్షణముల వలన హర్షమే లేదను
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
ముక్తి వేరు గలదె? ముమ్మారు తృప్తియే;
ఇష్ట మున్న యెడల కష్ట మేది?
మూలమగును తానె ముల్లోకముల కనె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
- సశేషం