అరమరికలు లేని అందరింటిని జూపి
పెద్దపీట వేసె ప్రేమ కొఱకు
‘గుర్తు చెప్పువాడె గురువం’చు తెలిపిన
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
ఉన్నదేదొ తినుచు, ఉన్నంతలో నీవు
ఆదరముగ పంచు మందరకును
కలిమి ఫలము పంచ గలుగుటే యని తెల్పు
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
కన్నబిడ్డ యందు కాంచున దది యెల్ల
విశ్వ మంత తాను వీక్ష సేయ
భ్రాంతి వీడి పోవు; బ్రహ్మమ్ము కలదనె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
చేత లసలు నీదు చేతులలో లేవు;
ఉపకరణముగానె ఉందువీవు
చేయువాడు అతడె చేయించు నని తెల్పు
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
విధిని మార్చలేవు తిథులేవి యైనను
సర్వ దినము లగును పర్వ మనును
వర్తమాన మొకటే భగవంతు డని పల్కు
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
నిర్ణయించువాడు నిర్ణయ బద్ధుడౌ
తనకు ఉన్నదేమి తప్పిపోదు
అమలు జరుగబోవ దనుకున్న దది యనె
వెలుగుముద్ద అమ్మ విశ్వ గురువు.
(సశేషం)