చిదంబరరావు తాతగారు 1929 ప్రాంతాల్లో రెండుసార్లు మా అమ్మ వేదవ్యాసుడు అంతటిది అవుతుంది అన్నారు. అందువల్ల ఈ వ్యాసంలో అమ్మను వేదవ్యాసునితో పోల్చి పరిశీలించడం జరుగుతున్నది.
వేదవ్యాసుడు:
విజ్ఞానిగా జన్మించిన వేదవ్యాసుడు భాగవతంలో నారాయణుని లీలావతారాలలో ఒకటిగా చెప్పబడ్డాడు.
“వ్యాసమ్ వశిష్ఠ నప్తారమ్ శక్తేః పౌత్రమకల్మషమ్,
పరాశరాత్మజమ్ వందే శుకతాతమ్ తపోనిధిమ్.”
– అనేది వ్యాసుని గూర్చి ప్రసిద్ధి పొందిన శ్లోకం.
వ్యాసుడు అనగానే నాలుగు వేదాలు, అష్టాదశ పురాణాలు, మహాభారతం, భాగవతం అందరికీ గుర్తు వస్తాయి.
చంద్రవంశపు రాజుల చరిత్రతో పెనవేసుకొని పోయినవాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వ్యాసునివలన అంబికకు, అంబాలికకు, దాసీకి కలిగినవారే.
బ్రహ్మసూత్రాలు వ్రాసి వేదాంతదర్శనానికి నాంది పలికిన బాదరాయణుడు, వ్యాసుడు ఒకరో కాదో చెప్పలేము.
వ్యాసుడు అంతటిది అమ్మ అవుతుందని అనడంలో వేదముల విభజన, పంచమవేదనిర్మాణము, భాగవతము వంటివి అమ్మ చేశారా అని ప్రశ్న వస్తుంది.
అమ్మను వాస్తవానికి ఎవరితోనూ పోల్చలేము. కారణము, కార్యము, అన్వయము, ఆధారము, అవకాశము తానే ఐన అమ్మ స్వయంగా ఉపదేశించిన అమ్మజీవితమహెూదధి ఆధునిక కాలంలో వేదమే.
అమ్మ ఆడవారి వేదాలను చీపురు, రోలు రోకలి, పొయ్యి, కత్తిపీట, చేట అని చెప్పారు.
వేదాలు ఎక్కడ చెప్పడం ఆగిపోయాయో, ఉపనిషత్తులు దేన్ని వివరించలేక పోయాయో అక్కడ అమ్మ తన దర్శనానికి పునాదివేశారు.
పరిశీలన, విమర్శ, వివరణ పద్ధతిగా, సమర్థత, సమగ్రత, సమానత్వం, స్వేచ్ఛ పురుషార్థాలుగా, మరుగు, స్పందన, విధి, విధానము ధ్యాస సూత్రాలుగా, సుగతి లక్ష్యంగా జీవితానికి, జీవనానికి ఒక నూతనభాష్యం చెప్పారు. వ్యాసుని దాటి అమ్మ ఒకడుగు వేసి కర్మలో మర్మాన్ని, ద్వైతంలో అద్వైతాన్ని, అనుభవించారు.
అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు, వర్ణాశ్రమ వ్యవస్థ లోని పరంపరగా ఉండే అపోహలను ఎత్తి చూపారు. అవతారతత్త్వాన్ని ఖండించడమేగాక శక్తి గొప్పదనాన్ని, కాలం ప్రాబల్యాన్ని అమ్మ వివరించారు. ప్రవృత్తి నివృత్తి అనే రెండు ఉండవని జీవించడమే యోగమనీ అమ్మ సాధికారికంగా చూపారు.
వ్యాసుడు చెప్పిన గురువు, బోధన, సాధన అనే త్రిపుటిని నిష్కర్షగా అమ్మ ఖండించారు.
అమ్మను వేదాంతవిధానప్రవక్తగా మనం చూడాలనుకొన్నా ‘మరణము ఉండదు, ఉన్నది రూపాంతరం’ అనడంలో అమ్మ మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషత్తు వాక్యానికి నూతన నిర్వచనం చెప్పారు. అమ్మ సాంఖ్యానికి పెద్దపీటవేసి, కనపడని ఆత్మతో నాకేం పని అని, జీవబ్రహ్మైక్య భావంలోని, సూత్రంలోని అపోహలను తొలగించారు. ‘అన్నింటినీ అనుభవిస్తూ అన్నింటినీ త్యజించాలి’ అనే నూతనపంథాను చెప్పి, వేదవ్యాసుడు అందుకోలేని తనస్థితిని ఆచరణలో చూపారు.
అమ్మ రూపము, స్వరూపము, స్వస్వరూపము అనే వానితో ఎలా సమన్వయం చేసుకుంటూ జీవనం చేయాలో చేసి చూపించారు. చెప్పడంరాని అమ్మ మౌనబ్రహ్మచర్యాలు నియమాలుగా నిత్యసత్యాలను వివరించారు.
ఈ రకంగా చూస్తే వేదవ్యాసుడంతటివాడు అవుతుందా అని చిదంబరరావు అనుకొన్నారుగాని, వేదవ్యాసుడు అమ్మ అంతవాడు కాదు అని అర్థం అవుతున్నది.