1. Home
  2. Articles
  3. Mother of All
  4. వైద్యశాస్త్ర విశారద – అమ్మ

వైద్యశాస్త్ర విశారద – అమ్మ

Dr. A. Inaja Kumari
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 11
Month : July
Issue Number : 3
Year : 2012

‘ఇది ఏమిటి?’, అసలు ఇది ఏమిటి?’ అనే తార్కిక చింతన, సదసద్వివేచన కలిగించి నిజమైన హేతువాదిగ, కమ్యూనిష్టుగ, సత్యాన్వేషిగ అచ్చమైన విచికిత్సను రేకెత్తించి అనేక ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు, రుగ్మతలకు ఔషధాన్ని దయతో అనుగ్రహించిన జగద్గురువుగా, భిషగ్వరేశ్వరిగా అమ్మ అందరికీ సుపరిచితమే.

అదే విధంగా శారీరక రుగ్మతలకి కూడా సరియైన వైద్య విధానాన్ని అమ్మ అనుగ్రహించింది. సో శ్రీ వీరమాచనేని ప్రసాదరావుగారి కోడలు కారు ప్రమాదంలో శిరస్సు ఛిన్నా భిన్నం కావటం, వైద్యుల అంచనాలు తారుమారు కాగా పూర్తి స్వస్థత చేకూరటం మనందరకీ తెలిసిందే. ఆశ్చర్యం ఏమంటే ‘అమ్మ స్వయంగా సర్జన్ రూపంలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళటం నేను చూశాను’ అని ప్రసాదరావుగారు ఇచ్చిన సాక్ష్యం.

కాగా నేనూ ఒక డాక్టరే. ఎందరికో వైద్యం చేశాను. సాహసంతో అమ్మకీ వైద్యం చేశాను. ఎన్నో అసంభవాల్ని సంభవం చేసింది అమ్మ. ఈ నేపథ్యంలో నా అనుభవాన్ని తోడబుట్టిన వారితో పంచుకోవాలని ఉంది.

  1. మాతృశ్రీ మెడికల్ సెంటర్లో నేను మొదటి ప్రసూతి వైద్యం ‘అనసూయ’ అనే అమ్మాయికి చేపట్టాను. మూలానికి వెడితే ఆ అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మకి మన అనసూయమ్మే స్వయంగా పురుడు పోసిందట. ఆ విషయం తెలిసి జాగ్రత్తపడి, సలహాకోసం నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఒక సీనియర్ మోస్ట్ గైనెకాలజీ ప్రొఫెసర్ శైలిలో అమ్మ, “తల ఏ పొజిషన్లో ఉంది? ఎప్. హెచ్ ఎలా ఉంది అంటూ అన్ని వివరాలు అడిగి నార్మల్ అవుతుంది పో!” అని హామీ ఇచ్చింది. నేను తిరిగి ఎమ్.ఎమ్.సి కి రాగానే అమ్మ మాట ఎప్పటిలాగ సత్యం అయింది. ఇదే బాణీలో కొమరవోలు శేషు, మతుకుమల్లి శారద.. ఎందరి సందర్భాలలోనో జరిగింది. సైద్ధాంతికంగా మా ప్రొఫెసర్లు బోధించిన పాఠాన్ని అమ్మ ఆచరణాత్మకంగా చూపింది.
  2. సాధారణంగా నాడి (పల్స్) ఒక నిముషం కాలం గణన చేయాలి కానీ మాబోటి జూనియర్ డాక్టర్లు అర నిముషం చూసి, రెట్టింపు చేసుకో అని దగ్గర దారి చూపిస్తారు. కానీ ఆ విధానం దోషభూయిష్టం అని అమ్మ సన్నిధి తేల్చి చెప్పింది. ‘అమ్మ మన కంటి వెలుగు, దైవం కదా! కావున అమ్మకి పల్స్ చూసేటపుడు జాగ్రత్తగా ఒక నిముషం చూసేదాన్ని. అదే విధానం అలవాటై రోగులకి కూడా 1 నిముషం చూసేదాన్ని. గర్భకోశ సమస్యతో ఒక రోగి వచ్చింది. అలవాటు ప్రకారం 1 నిముషం చూశాను. Missing beats ఉన్నాయి. గుండె జబ్బు ఉన్నట్లు చెప్పాను. వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయించుకుంది. లోగడ ఆ అమ్మాయికి రెండు కాన్పులు అయినా ఎవరూ గుండె జబ్బును ఎరుకపరచలేదు. నా బిడ్డను బ్రతికించావంటూ ఆనందబాష్పాలు రాల్చింది ఆ సోదరి; ఆ తల్లి. ఇది అమ్మ అనుగ్రహం కదా! అమ్మ చేతిలో నేను ఒక సాధనం మాత్రమే.
  3. అనారోగ్యకారణంగా అమ్మ నెల్లూరులో డా॥ ఎస్.వి.సుబ్బారావు గారింట్లో ఉన్న రోజులవి. ఒక రోగి విపరీతమైన ఆయాసంతో వచ్చాడు. వెంటనే కాకతాలీయంగా నాడి, రక్తపోటు చూసి గుండెవైఫల్యం (హార్ట్ ఫైల్యూర్ కి వాడే మందులు (Lasix, deriphyllin) ఇచ్చాను. డా॥ సుబ్బారావుగారు ఆస్పత్రికి ఇంకా రాలేదు. అర్థగంటలో ఆరోగి కోలుకున్నాడు. ఇంటికి వచ్చి ఈ వృత్తాంతాన్ని అమ్మకి వినిపించాను. వెంటనే అమ్మ అన్నపూర్ణ అక్కయ్యను పిలిచి, “మీ ఆయన వద్దన్న కేస్ మా ఆవిడ చేసింది. చూశావా?” అన్నది మందహాసం చేస్తూ. తర్వాత డాక్టరుగారు ఆ రోగం లక్షణాన్ని వివరించారు – అది left ventricular failure (L.V.failure) అది గుండెపోటు కంటే ప్రమాదకరము, రెండుసార్లు కంటే ఎక్కువగా రాకూడదు అని. తర్వాతకాలంలో బాపట్లలో అటువంటి ప్రాణాంతక రోగగ్రస్తుల్ని ఎందరినో రక్షించాను. హృదయవిదారక విషయం ఏమంటే అదే స్థితిలో ఉన్న అమ్మను దక్కించుకోలేకపోయాను.
  4. అన్నపూర్ణాలయ రధసారధి శేషయ్యగారి మనవడికి Chronic Diarrhoea తో ఏడాది వైద్యుల చుట్టూ తిరిగారు. చివరికి జిల్లెళ్ళమూడి వచ్చారు. ఆ రోజులలో స్కానింగ్ సౌకర్యాలు లేవు. ప్రయోగశాల పరీక్షలే నిర్వహించి పొత్తికడుపుకు సంబంధించిన క్షయవ్యాధి (Abdominal T.B) అని నిర్ధారించి, దాని నివారణకి మందులు వాడాను. నెలరోజుల్లోనే అద్భుతంగా కోలుకున్నాడు.

అలాగే మల్లు అన్నయ్యకుమారుడు తీవ్ర అతిసారవ్యాధి (severe diarrhoea)కి లోనైనాడు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపిద్దామని సలహాకోసం అమ్మ వద్దకు వెళ్ళాను. మల్లు అన్నయ్య అక్కడే కూర్చొని ఉన్నాడు. నేను చెప్పినదంతా విని అమ్మ, “ఆయుర్దాయం ఉంటే ఎక్కడైనా బ్రతుకుతాడు, కదా! నాన్నా!” అంటూ అటు తిరిగి పడుకుంది. అమ్మ ఆ విధంగా నిర్లిప్తంగా మాట్లాడితే తప్పనిసరిగా నయమౌతుందని నా పూర్వానుభవం, ఒక బండగుర్తు. అదే నిజమైంది. రోగం కూడా అనూహ్యంగా మలుపు తిరిగింది. నేను తిరిగి మెడికల్ సెంటర్ చేరుకునే సరికి వాడు హాయిగా ఆడుకొంటున్నాడు. ఈ అద్భుతాలన్నీ అమ్మ నడయాడిన పావన అవని దివ్య ప్రభావసంభవాలు. నా ప్రజ్ఞ ఏమీ లేదు.

1981 అక్టోబర్ నెలలో సో॥ గరుడాద్రి సుబ్రహ్మణ్యం పెదనాన్నగారు దీర్ఘకాలంగా కామెర్ల వ్యాధితో తీసికొని బాధపడుతున్నారు. వారిని అమ్మ తన వద్దకు పిలిపించుకున్నది. ఎమ్.ఎమ్.సిలో నా పర్యవేక్షణలో చేర్చింది. ఆ నెల 6వ తేదీ సాయంకాలం గం 8లకు నాడి (పల్స్) పడిపోయింది; రక్తపోటు (బి.పి) గణనీయంగా తగ్గింది. కానీ రోగి చక్కగా కూర్చొని మాట్లాడుతున్నాడు. కనుకనే గాభరాపడ్డాను. 7వ తేదీ ఉదయం అమ్మ ఎమ్.ఎమ్.సికి వస్తుంది అని రామకృష్ణ అన్నయ్య కబురు పంపాడు. రేపు ఉదయం వరకు వారిని ప్రాణాలతో ఉంచి అమ్మకు చూపించగలనా అని భయపడ్డాను. 

7వ తేదీ ఉదయం అమ్మ రానే వచ్చింది. పల్స్, పొట్ట అన్నీ చూసి కాసేపు వెక్కి వెక్కి ఏడ్చి వెళ్ళిపోయింది. వెంటనే నెల్లూరు డాక్టర్ గారిని పిలిపించింది. అమ్మకి అన్నీ తెలుసు. కాసేపు ఏడ్చి వెళ్ళిపోయింది. నా పరిస్థితే అగమ్యగోచరం. ఆయనకి ఏమౌతుందో, ఏమౌతారోనని నా టెన్షన్ వారిని ఇక్కడ ఉంచారు; వారికి చాలామంది బంధువులు – బలగం. అనుకోనిది ఏదన్నా జరిగితే ఎంత గొడవ?’ అని ఆవరణలో వాళ్ళంతా నన్ను హెచ్చరించారు.

‘భగవంతుడా! ఇదేమిటి? ఎలాంటి సౌకర్యాలూ లేని చోట వీరిని తెచ్చి నా దగ్గర ఉంచావు’ అని హడలిపోయేదాన్ని. ఆశ్చర్యం; రెండురోజులలో నెమ్మదిగా కోలుకున్నారు. ఇంతకీ అసలు విషయం “ఎంతో మంది బంధువులు, బలగం ఉన్నా, ప్రేమగా చూసే వాళ్ళెవరూ లేరట. అందుకని పిలిపించానమ్మా!” అని అమ్మ నాకు సంజాయిషి (explanation) ఇచ్చుకున్నట్లు చెప్తుంటే చాలా సిగ్గేసింది నాకు.

అమ్మకి నేను చేసిన వైద్యం :

  1. అమ్మ ఒక వైద్యుడు, త్రికాలదర్శిని, ఒకరోగి కూడా. అమ్మ ఓర్పు అనన్యసామాన్యం.ఆ సత్యం అమ్మ చరిత్రలోనే స్పష్టమవుతోంది. అమ్మను ఒక రోగిగా చూసిన సన్నివేశాల్ని వివరిస్తాను. అమ్మ తుంటి మీద పెద్ద గడ్డ లేచింది. అసలు ఎలా కూర్చునేదో, ఎలా దర్శనం ఇచ్చేదో ఆశ్చర్యం. మా డాక్టర్ల దగ్గర మూలిగేది. మేము ప్రక్కకు తప్పుకోగానే స్నానం చేసి దర్శనం ఇచ్చేది. బయటి వాళ్ళకి క్షీరసాగరంలో ప్రభవించిన లక్ష్మీదేవిలా, మానస సరోవరపుటంచున ఉదయించే బాలభానునిలా ప్రకాశించేది. అతః పూర్వం అంత బాధతో విలవిలలాడినది ఈతల్లేనా! అని ఆశ్చర్యపోవటం మా వంతు, మా అమాయకత్వాన్ని చూసి ముసిముసి నవ్వులు చిందించటం అమ్మ వంతు

ఆ సందర్భంలోనే నెల్లూరు డాక్టర్గారితో అమ్మ “గడ్డకూడా బిడ్డే కదా! నాన్నా!” అనటం అలౌకికి శక్తి సంపన్న అమ్మకే సాధ్యం. నిజమే తాను మనుషులకే కాదు, జంతువులు, క్రిమికీటకాదులకూ తల్లినని వివరించింది. అంటే భయంకర రోగకారక సూక్ష్మ జీవుల (బాక్టీరియా)కూ తాను తల్లేనా? అసలు విషయం. ఆ సందర్భంగా అమ్మ గదిలోనే ఆ గడ్డకి ఆపరేషన్ చేయాలి. తగినంత కాంతి లేదు. టార్చిలైట్ ఉపయోగించాలి. మత్తుమందు ఇవ్వలేదు. తగిన పరికరాలు లేవు.

ఒక బ్లేడును ఉడుకబెట్టి కురుపును కోశాం, పిండికట్టు కట్టాం. ఇంత అయ్యాక, కుర్చీలో తనను క్రిందికి తీసికెళ్తామంటే అలా చూసిన వారంతా బాధపడుతారని, తానే బాధను ఓర్చుకొని 32 మెట్లు దిగి వచ్చింది. అమ్మ సహనానికి హద్దులు లేవు.

  1. అమ్మకి ఊపిరితిత్తులలో కురుపు (lung abscess) లేచింది. ముందుగా లంగ్ కాన్సర్ ఏమోనని అనుమానపడ్డాం. ఎక్స్రే చేయించాలి. సాధ్యమేనా? అని తలలు చేత్తో పట్టుకొని మధన పడుతున్నాం. మా దీనావస్థను చూసి, “నాకు అలాంటిది ఏమీ లేదు. కావాలంటే మళ్ళీ పరీక్ష చేసుకోండి”. అన్నది. మళ్ళీ పరీక్ష చేశారు. అమ్మ మా కళ్ళకి మాయతెరలు కప్పింది. అమ్మమాటే నెగ్గింది. అది లంగ్ abscess అని సమాధానపడి స్థిమిత పడ్డాం. బిడ్డల దుఃఖ నివారణకోసం అమ్మ ఎంతటి త్యాగానికి సిద్ధమౌతుందీ ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. హైదరాబాదులో చికిత్స ప్రారంభమైంది. తెమడ రూపంలో చీము, నెత్తురు, వగైరా అంతా బయటికి రావాల్సిందే. అందుకు మరొక చికిత్స లేదు అని అన్నారు వైద్యులు. “నన్ను తగ్గించటానికి తీసుకువచ్చారా! దగ్గించటానికి తీసుకువచ్చారా?” అని అమ్మ చమత్కరించింది. దగ్గే సమయంలో ఆ కఫాన్ని ఊయటానికి ఒక పళ్ళెం పట్టుకొని ప్రక్కన నిలబడే వాళ్లం. ఆ పళ్ళెం పట్టుకోవాలంటే గుండెదడదడ లాడేది, చేతులు వణికేవి. ఆ డ్యూటీ నా వల్లకాదు – ఇంకెవరన్నా చేస్తే బాగుండును – అనిపించేది. అంటే ఆ స్థితి ఎంత దుర్భరమో మీరు ఊహించవచ్చు.
  2. ది 18.10.1975 తేదీన నెల్లూరులో ఒక రోగికి (L.V.failure) గుండె వైఫల్యానికి చికిత్స చేసి ప్రాణం పోసిన ఉదంతాన్ని ఇందాక మనవి చేశాను. అలా రెండు సార్లు కంటే ఎక్కువ రాకూడదు. అని డా॥ సుబ్బారావుగారు చేసిన హెచ్చరిక నాకు మరుపు వచ్చింది. నా దురదృష్టం. మీరు నమ్మండి. ఈ వ్యాసం వ్రాసేవరకూ ఆ విషయం నాకు గుర్తులేదు.

అమ్మకు మొదటిసారి 1981లో severe lung infection వచ్చింది. ఆ సమయంలో విపరీతంగా ఆయాసం వస్తే నేను మరియు డా॥ జస్వంత్ కలిసి హార్ట్ ఫైల్యూర్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. మరల రెండవసారి 1985లో వచ్చింది. మూడవసారి జూన్ 12న వచ్చింది. lasixని ఇచ్చే సమయం లేదు, ఇస్తుండగానే అమ్మ మనల్ని వదలి వెళ్ళిపోయింది. ఆ ఘోరం నా కళ్ళముందే జరిగిపోయింది. ఆ వేదన, ఆ లోటు ఊపిరి ఉన్నంతకాలం నన్ను బాధిస్తాయి. అది అమ్మ అమోఘసంకల్ప బలమో నా బలహీనతో తెలియదు.

అమ్మ గురువులకు గురువు; జగద్గురువు.

వైద్యులకు వైద్యుడు; భిషగ్వరేశ్వరి.

 జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!