మూడవరోజు (30.3.2023)
“ఎవరో పుణ్యాత్ములు ఇక్కడ అద్భుతమైన తపస్సు చేసి ఉంటారు. దాని ఫలితంగా జగన్మాత ఇక్కడ అమ్మగా అవతరించింది. అమ్మ సన్నిధిలో ఎంతో సన్నిహితంగా ఆడుతూ పాడుతూ కాలం గడిపిన అందరింటి సోదరులను చూస్తుంటే “ఏలా బ్రహ్మపదంబు?” అని గోపబాలుర అదృష్టానికి మురిసిపోయిన బ్రహ్మస్థితి గుర్తుకు వస్తున్నది. కాశీ పట్టణాన్ని శపించబోయిన వ్యాసభగవానుణ్ణి సంయమీవర! ఇటురమ్మని పిలిచి భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవియే తన బిడ్డలకు ఆకలిబాధలేకుండా చేయటానికి అవతరించి దీనిని ‘అన్నపూర్ణాక్షేత్రం’గా మార్చింది. లక్షమందికే కాదు ఈనాడు కోటిమందికి భోజనం పెట్టగల స్థితిని అనుగ్రహించింది.”
- డా.కందుకూరి సత్యనారాయణమూర్తి గారు,
గౌతమి విద్యాపీఠం – విశ్రాంతసంస్కృతాధ్యాపకులు, రాజమహేంద్రవరం
—
“విశ్వజనని అమ్మ శతజయంతి సందర్భంగా ఈ వేదిక మీద ప్రసంగించే అవకాశం నా అదృష్టంగా భావిస్తున్నాను. భారతదేశంలో మెజారిటీసభ్యులుగా ఉన్న దళితవర్గాన్ని ఆదరించాలనే సంకల్పం శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ అధ్యక్షులకు కలగటం ఎంతయినా సంతోషం. అమ్మ ఆనాడే కులమత భేదం లేకుండా దళితవర్గాలకు గాయత్రీ మంత్రం ఇచ్చారని తెలిసింది. సమభావంతో అమ్మ చేసిన సంక్షేమ కార్యక్రమాలను బడుగు బలహీన, వర్గాలలోకి తీసుకు వెళతానని మాట ఇస్తున్నాను. అమ్మ జీవితచరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా పెడితే రాబోయే తరానికి అమ్మ సందేశం చేరుతుంది. దీని కోసం మా రాష్ట్ర అధ్యక్షులకు నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. సోషల్ మీడియాలో కూడా పెడతాను.
- శ్రీ దర్శనపు శ్రీనివాస్, భారతీయ జనతాపార్టీ యస్.సి.యస్.టి. సెల్. అధ్యక్షులు
—
“ఆంధ్రదేశంలో జిల్లెళ్ళమూడి ఆశ్రమం అంటే తెలియని వారుండరు. నేను చిన్నతనంలో విద్యార్థిగా ఉన్నప్పుడు అమ్మ ఆశ్రమానికి వచ్చాను. అమ్మను ప్రత్యక్షంగా చూశానని గుర్తుంది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూశాక మీ ఉపన్యాసాలు విన్నాక ఈ వాతావరణం నాకు ఏదో కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. ఈ క్షణంలో నేను నా అంతరంగంలోనే అమ్మను దర్శించుకున్నాను. మన భారతీయ తత్త్వంలోనే ‘మానవసేవే మాధవసేవ’ అన్న దృక్పథం ఉంది. అమ్మ బోధనల సారం సేవ. అన్నార్తులకు అన్నం పెట్టడమే లక్ష్యంగా అమ్మ ఆచరించి చూపింది. మీ అందరూ అమ్మగారికి ఎంత భక్తులో – మేము అంతకు మించిన భక్తులం…”.
– శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, మాజీమంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు
—
“వంద సంవత్సరాల క్రితం మనదేశంలో మనిషిగా స్వేచ్ఛలేదు బ్రతకటానికి తిండి లేదు. ఆ పరిస్థితులలో అడవిలో ఎన్నో యేళ్ళు రాముని కోసం ఎదురు చూచి చూచి కడకు రేగుపండు ప్రేమతో తినిపించిన శబరిమాత కొంత తృప్తి చెందీ – పరిపూర్ణంగా తృప్తి చెందక ఈ యుగంలో అమ్మగా అవతరించి కన్పించిన ప్రతివారిలో రాముణ్ణి చూస్తూ గోరుముద్దలు తినిపించి మురిసిపోయిందా! కౌసల్య మాతే తానుగా అవతరించి ప్రతి బిడ్డను, శ్రీరామచంద్రుని వంటి సంస్కారం కలవానిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించిందా ! అనిపిస్తున్నది. కేవలం అన్నదానం కాక తద్వారా సమాజ నిర్మాణానికి ఆ తల్లి ఉద్యుక్తులయ్యారు.
1985 నాటికి కూడా ఆహారం విషయంలో భారతదేశం స్వయం సమృద్ధం కాదు. మన బాల్యంలో పల్లె ప్రాంతాలలో రెండు పూటలా భోజనం చేసింది కొన్ని కుటుంబాలు మాత్రమే. ఒక పూట కూడా తిండిలేని వాళ్ళు ఉన్నారనేది మనం మరిచిపోకూడదు. అటువంటి పరిస్థితులలో లక్షమందికి ఒకేపంక్తిలో భోజనం పెట్టిన మాతృమూర్తి ఉన్నారంటే స్వయంగా ఆదిపరాశక్తి కాకపోతే ఈ పనిచేయలేరు. అమ్మ జీవనవైఖరిని, ప్రేమతత్వాన్ని విశదీకరించే ఈ గ్రంథాలన్నింటిని మన తెలుగురాష్ట్రాలలో తరగతి కొకటి చొప్పున ఉపవాచకాలుగా పెడితే అందరూ చదువుకొని మరో వంద యేళ్ళు అమ్మ ఆదర్శం, సిద్ధాంతం ముందుకు సాగుతుంది.”
– శ్రీశ్రీశ్రీ కమలానందభారతీస్వామి, పీఠాధిపతి, భువనేశ్వరీ పీఠం, గన్నవరం
—
“అమ్మ అన్నపూర్ణేశ్వరి. అమ్మ సన్నిధి ఆనందదాయకం”
– డా. కప్పగంతు రామకృష్ణ, కార్యవర్గసభ్యులు, ఆంధ్రప్రదేశ్
తెలుగు సంస్కృత అకాడమీ, విజయవాడ
—
“ఈ జిల్లెళ్ళమూడి ఒక మణిద్వీపం. ఇది శ్రీమన్నగరం. అమ్మ లలితా పరమేశ్వరి. అన్నం పెట్టి మన సంస్కారాలను సరిచేసి, మనకు సద్గతి కలిగించటమే అమ్మ అవతార లక్ష్యం.
అంతులేని ప్రేమ అమ్మ. మహాత్ముల సన్నిధి సుగంధభరితమై ఉంటుందని వేదం చెప్పిన మాట అమ్మ సన్నిధిలో మీ అందరికీ అనుభవమే. తన చేతితో అమ్మ ఇచ్చిన పుట్టమన్ను ఎన్నాళ్ళు గడిచినా దివ్యపరిమళంతో ఉండటం, ఆధివ్యాధులను తొలగించే ఔషధంగా పనిచేయటం మీ అందరికీ అనుభవమే కదా! కంచి కామకోటి పీఠాధిపులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీస్వామివారు అమ్మ బిడ్డలందరికీ తమ దివ్యాశీస్సులను అనుగ్రహించారు”.
డా.ధూళిపాళ రామకృష్ణ, కంచికామకోటిపీఠం ప్రతినిధి, విజయవాడ
డా.యు.వరలక్ష్మి గారి సౌజన్యంతో