ఐదవరోజు (1.4.2023)
“సత్యసాయి భక్తుల కుటుంబానికి చెందిన నేను నా బాల్యంలో తరచుగా పుట్టపర్తిలో ఎందరో భక్తుల నోట అమ్మను గురించి విన్నాను.
కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు కుర్తాళంలో తరచుగా అమ్మను గురించి చెప్పగా విన్నాను. ఇంత కాలానికి ఈ క్షేత్రానికి రాగలిగాను. దక్షిణ భారతావనిలో ఎందరో మహాత్ములు అవతరించారు. ఈ వేదిక ధర్మార్థ కామ మోక్షాల సమ్మేళనం.
ఆర్తుల ఆకలి తీరుస్తూ, జిజ్ఞాసువులకు జ్ఞానబోధ చేస్తూ, అర్థార్థులకు కావలసినవి సమకూరుస్తూ,జ్ఞానులకు దివ్యానందం కలిగిస్తూ అమ్మ అందరినీ ఆదరించే తీరు అమోఘం. ఆత్మదర్శనం పొందినవారు ఎక్కువగా మాట్లాడరు. అమ్మ వాక్యాలు సంక్షిప్తంగా ఉంటూనే సందేహ నివృత్తి చేస్తాయి. అమ్మకు ప్రాథమిక విద్య లేదు. కాని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమే అమ్మగా అవతరించింది అనిపిస్తుంది.”
-జస్టిస్. వి రామ సుబ్రమణియన్ గారు.
సుప్రీంకోర్టు న్యాయ మూర్తి. న్యూఢిల్లీ.
—
“మా బంధువు వీరమాచనేని ప్రసాదరావుగారు హేతువాది. కాని తరుచు అమ్మను గురించి చెప్పేవారు. అమ్మ ప్రేమతత్వాన్ని గురించి, అమ్మ సూక్తులలోని విశ్వజనీన సత్యాలను గురించి చెప్పేవారు. నాకు ఆశ్చర్యం కలిగేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఆశ్చర్యం లేదు. అమ్మ విశ్వజనని అనే అనుభూతి కలిగింది. అమ్మను గురించి అధ్యయనం చేస్తుంటే – నడిచి వచ్చే ప్రేమే అమ్మ- అనిపించి, కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ప్రాణులందరి ఆకలిని గురించే నిరంతరం అమ్మ ఆరాటం. పరోపకారం, ప్రేమ, కరుణ, సర్వ సమానత్వం మూర్తీభవించి అమ్మగా దర్శన మిస్తోంది.
‘అంతా ఆత్మగా సాక్షాత్కరించటమే ఆత్మ సాక్షాత్కారం’- అన్న అమ్మ మాట తెలుసుకుని పరవశించాను నేను. పేదవారి కోసం ఇంత మారుమూల గ్రామంలో సంస్కృత కళాశాలను స్థాపించటం కంటె మించిన మహిమ ఏమున్నది? అమ్మ సందేశాన్ని అనుసరిస్తే సమాజం సంస్కరింప బడుతుంది. గుణభేదంకూడ లేని అమ్మ అద్వైత మూర్తి”
-శ్రీ జె.కృష్ణ కిశోర్ గారు,
ప్రిన్సిపుల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్,
ఇన్ కం టాక్స్ శాఖ, భువనేశ్వర్.
––
“నేను హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు మా ప్రధానోపాధ్యాయులు శ్రీ వల్లూరు జగన్నాథరావుగారి వెంట జిల్లెళ్ళమూడి వచ్చాను. అమ్మను దర్శించి, అమ్మ పెట్టిన అన్నంతిని, అమ్మ దీవనలు అందుకొని ఆనాడు ఎంతో ఆనందించాను. అమ్మ దివ్య దృక్కులు నా జీవితాన్ని చైతన్య వంతం చేశాయి. దివ్య ప్రేమ, కరుణ, త్యాగం, సహనం, విశ్వమాతృత్వం, ప్రాణులందరి పట్ల సమదర్శనం అమ్మ స్వరూపం.
అమ్మ అవతార పరిసమాప్తి తర్వాత కూడ అమ్మ దీవనలతో ఇక్కడి కార్యకర్తలు దీక్షగా అమ్మ ఆశయాలను అమలుచేయటం ఆనందం కలిగిస్తోంది.
- జస్టిస్ శ్రీ బి. కృష్ణ మోహన్ గారు,
హైకోర్టు న్యాయమూర్తి, అమరావతి.
—
“మా కైలాసాశ్రమ మహా సంస్థానానికి జిల్లెళ్ళమూడి దివ్య క్షేత్రానికీ చక్కని అనుబంధం ఉన్నది. అమ్మను గురించి గ్రంథ అధ్యయనం చేశాను. అమ్మ సాక్షాత్తూ రాజరాజేశ్వరి అని అనుభవమైంది. మహాత్ములు వసంతం వలె లోకహితం కోసం సంచరిస్తూ ఉంటారని ఆదిశంకరులు చెప్పారు. కాని, అమ్మ సాక్షాత్తూ వసంతమే.
గృహిణిగా ఉంటూనే తన అవతార ప్రణాళికను నిర్వహించింది. పరిమితులు లేని మమకారంతో సర్వ జీవులనూ బిడ్డలుగా ప్రేమించింది. 1923 లో అమ్మ అవతరించిందని మనం 2023లో శతజయంతి చేసుకుంటున్నాం. 1985లో అమ్మ కనుమరుగైందని అనుకుంటున్నాం. కాని 1923కంటె ముందూ అమ్మ ఉన్నది. 1985 తర్వాత కూడా అమ్మ ఉన్నది.
గురుశిష్యుల బంధంలో ద్వైతం ఉన్నదేమో గాని, తల్లీబిడ్డల అనుబంధంలో ఉన్నది అద్వైతమే. ఆ అభేద స్థితే అమ్మ.”
– శ్రీశ్రీశ్రీ జయేంద్రపురి స్వామివారు,
కైలాసాశ్రమ మహా సంస్థానం, బెంగుళూరు.
(శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారి సౌజన్యంతో)