ఈ నెల 15వ తేదీన శరన్నవరాత్రారంభం. వరలక్ష్మిశ్యామల శాద్వల దుకూల ధారిణియై ధవళ చంద్రికా దరహాస భాసుర వదనంతో తారా ప్రసూనాంజలి ఘటించి నిర్మల తరంగిణీ మధుర గంభీర ధ్వనులతో అమ్మకు స్వాగతం పల్కుతోంది. దేవీపూజా విశేషాలతో ప్రత్యహం ఒక ప్రత్యేకతను సంతరించుకొంటుంది. సకల చరాచర స్వరూపిణియైన ఆ అమ్మకు ఒక్కొక్క నాడు ఒక్కొక్క అలంకార విశేషంతో అర్చనలు జరుగుతాయి.
నవరాత్రులనగానే సాధారణంగా కాళి, దుర్గ, మహిషాసురమర్దని మొదలైన దేవ్యవతారాలు స్ఫురణకువచ్చి అవి భీకరాలనే భావం జనసామాన్యానికే కాక కొందరు విద్వాంసులకు గూడ కలుగుతూంటుంది. ఈ భావం కేవలం అవిచార మూలక మనిపిస్తుంది. ఏ మత సంప్రదాయంలోనయినా పురాణకథలకు, ముఖ్యంగా దేవతాగాధలకు చరిత్రాధారం సంగతి అలా ఉండగా వ్యంగ్యార్థ వైభవస్ఫూర్తి ప్రాధాన్యం విశేషంగా ఉంటుంది. ఈ దృష్టితో పరిశీలించినప్పుడే ఆయా కథలనూ, గాధలనూ మనం సరిగా అర్థం చేసుకొన గలుగుతాము.
ఉదాహరణకు రామాయణం, భారతం, దేవదానవ యుద్ధం మొదలైన వానిని తీసుకోవచ్చు. ఈగాధలలో వచ్చే వ్యక్తులు ఏ యుగానికి చెందినవారు ?
“శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం |
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మహి”॥ అని
సౌందర్యలహరిలో శ్రీ శంకర భగవత్పాదులు శక్తి ప్రభావాన్ని కీర్తించారు.
“రుద్రహీనం విష్ణుహీనం న వదంతి జనా స్తథా |
శక్తిహీనం యథా సర్వే ప్రవదంతి నరాధమమ్” || దేవీభాగవతము
జనులు బలహీనుడయిన వానిని చూచి శక్తి హీనుడంటారు; కాని రుద్రహీనుడనీ, లేక విష్ణుహీనుడనీ అనరు .. అని పై శ్లోకముయొక్క సారాంశం. అయితే ఒక ప్రశ్న : ఆ శక్తి సర్వవ్యాపిని గదా ! “ఆ శక్తి లేనపుడు” అన్నమాట అసలు ఎలా పొసగుతుంది ? అని అడగవచ్చు; కాని ఆశక్తి సర్వవ్యాపిని అని ముందు గుర్తించాలి. ఆ గుర్తింపుకు కూడా అమ్మ అనుగ్రహమే కావాలి మరి !
(అక్టోబరు, 1966 ‘మాతృశ్రీ’ మాసపత్రిక సంపాదకీయం)