అమ్మ అందరికీ అమ్మగా ప్రకటితమైనప్పుడే కాదు ముక్కుపచ్చలారని వయస్సులో కూడా ఎంతో మందిని సంస్కరించిన విషయం అమ్మ చరిత్ర మనకు చేస్తోంది. బాల్యంలో అమ్మ తన తాతమ్మగారైన మరిడమ్మ గారితో కలసి పెనుగుదులపాడు వెళ్తూ మార్గమధ్యంలో శ్రీరంగపురంలో తెలిసిన వారి ఇంట్లో ఉంటుంది. ఆ ఇంటి యజమానిని సంస్కరించడం కోసమే అమ్మ వారి ఇంట్లో బస చేసింది. ఆ ఇంటి యజమానికి పిల్లలు లేరు. ఆస్తి లేనందువలన దత్తతకు పిల్లల్ని ఇవ్వడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. ఆయన భార్య రంగమ్మ. ఆమె అక్క రాజమ్మ. చిన్నతనానే భర్త పోవడం వల్ల వారి వద్దనే ఉంటూ చెల్లెలి అమాయకత్వాన్ని మరిది బలహీనతని ఆసరాగా తీసుకొని ఇంటి పెత్తనం అంతా తానే చేస్తోంది. అమ్మను అమ్మ ఒంటిమీద బంగారాన్ని చూడగానే రాజమ్మ ఆలోచన పరిపరి విధాలుగా పోయి ఒక దురూహ తలెత్తింది. అమ్మాయి ఒంటినిండా బంగారమే. ఎలాగయినా ఆ బంగారాన్ని తీసుకోవాలి అని రంగమ్మతో చెప్పింది. ‘అమ్మాయి దేవతలా ఉంది. నీ మాటలు వింటే శపిస్తుంది’ అన్నది రంగమ్మ. ఆ సంభాషణ అంతా విన్నది అమ్మ. అందరూ నిద్రపోయారు అనుకుని రాజమ్మ లేచి అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మ మెడలో ఉన్న హారాన్ని తీసింది. వెంటనే అమ్మ లేచి కూర్చొని తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి దోసిట్లో పోసుకొని రంగమ్మ వద్దకు వచ్చి ఆమె దోసిట్లో కుమ్మరించి ఆ నగలను రామయ్యకిచ్చి గౌరవించమని రంగమ్మకు చెప్పింది. అంతకుముందే రామయ్య రంగమ్మను కొట్టడం చూసిన అమ్మ “మీరు ఇందాక ఆమెను చేయి చేసుకున్నారు. దానికి ఏమి శిక్ష వేసుకుంటారు? “మీరు తన్నితే పడి ఉండడం ఆమెకు ఎట్లా ధర్మమో మీరు తన్నకుండా మీకు ధర్మాలు అనేకం ఉన్నాయి” అని మందలించింది. అంత చిన్నపిల్ల అంత చురుగ్గా పదునుగా మాట్లాడుతూ ఉంటే వారు మువ్వురూ నిర్విణులై నిలబడిపోయారు. రామయ్య తేరుకొని “నన్ను దండించడానికి వచ్చావా? నీవెవరివమ్మా”? అని అడిగాడు. అతడి తప్పును ఖండించడానికి వచ్చానని అమ్మ చెప్పి రామయ్య కొట్టినప్పుడు రంగమ్మ మెడలో పెరిగిన మంగళ సూత్రాన్ని రామయ్య చేత రంగమ్మ మెడలో కట్టించి, వారి కొత్త జీవితానికి ఊపిరి పోసింది అమ్మ. రాజమ్మ కూడా తన తప్పు తాను తెలుసుకొని నిష్క్రమించడం ఈ సన్నివేశంలోని కొసమెరుపు. అమ్మ నగలన్నీ రామయ్య స్వయంగా అమ్మ మెడలో అలంకరించి పాదాభివందనం చేశాడు.
పెనుగుదలపాడు వెళ్లి తిరిగి వస్తూ అమ్మ రామయ్య ఇంటికి మళ్ళీ వెళ్ళింది. అక్కడ భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. ఈ సన్నివేశం ద్వారా అమ్మ కేవలం వేదాంతబోధ చేసే గురువు మాత్రమే కాదని నిత్య జీవిత నిర్వహణ సక్రమంగా సాగటమే ఆధ్యాత్మిక సౌధ సోపానమని ప్రబోధించడమే అమ్మ అవతార పరమార్థమని తెలుస్తోంది. ఈ సన్నివేశంలో అమ్మ ఆరేళ్ల బాలికలా కాకుండా అనుభవం పండిన 60 ఏళ్ల ముత్తైదువులా కనిపిస్తుంది. వయస్సు చిన్నదయినా పెద్దమనస్సుతో అమ్మ చేసిన సంస్కరణకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉదాహరణలు అమ్మ జీవిత సన్నివేశాలలో బాల్యంలోనే కోకొల్లలుగా కనిపిస్తాయి.
అమ్మ బంధువర్గంలో పెమ్మరాజు సత్యనారాయణమూర్తి గారని ఒకరు ఉండేవారు. తాను ఉపాసన చేస్తున్నానని ఆ తల్లిదయతో బాధలు తగ్గిస్తానని చెప్తూ ఉండేవారు. వారి కూడని ఆలోచనను పసిగట్టిన అమ్మ “ఉపాసన అంటే ఇదేనా మూర్తి గారూ?” అని సత్యనారాయణ మూర్తి గారిని నిలదీసింది. ఆ తర్వాత అమ్మ మాట్లాడినటువంటి మాటల్లో మృదుత్వానికి బదులు కఠినత్వమే గోచరించింది. అమ్మ మరికొంత వివరణ ఇచ్చింది. “మాటలతో ఏమి బాగుపడతారు? మాటలతో బాగుపడే మార్గం ఉంటే శాస్త్రాలతోనే బాగుపడేవారు” అని ఆయనను గట్టిగా ప్రశ్నించింది అమ్మ. సత్యనారాయణమూర్తి గారు పనివాడై వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ పాదాలు పట్టుకున్నారు. అమ్మలో ఆయనకు బాలా త్రిపుర సుందరీ రూపం కనిపించింది. అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే ఏమిటో స్పష్టం చేసి ఆయనలో పరివర్తన కలిగించింది. “మీరు శిక్ష అనుకోవద్దు, శిక్షణ ఇచ్చి మీ పేరును సార్ధకం చేద్దామని అనుకున్నాను” అని అమ్మ వివరించింది. ఆయన తన తప్పు తెలుసుకొని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు కూడా అమ్మ సాంత్వన వాక్యాలు పలకలేదు. “నా దగ్గరనే కాకుండా ఈ మార్పు ప్రతి చోట కలిగిన నాడు మాత్రమే బాలా త్రిపుర సుందరిగా తనను పిలిచే అర్హత వస్తుంది” అని నిష్కర్షగా చెప్పింది. మానవసమాజంలో మంచి చెడు కలిసే ఉంటాయి. అనివార్యమైన చెడును ఖండించడమో నిందించడమో కాక సరిచేయడం కర్తవ్యం అని అమ్మ ఈ సన్నివేశంలో సూచిస్తుంది. సంహరించడం కాదు సంస్కరించడం కావాలని జాతిని ప్రబోధిస్తోంది. ఈ సన్నివేశంలో మూర్తిగారికి అమ్మ శిక్ష విధించలేదు. శిక్షణను అనుగ్రహించింది. చెడును శిక్షించగా శిక్షణ ద్వారా సంస్కరించడం విశ్వప్రేమ తత్వానికి లక్షణం. ఈ విధానం అమ్మ అవతార ప్రణాళికలో ఒక ముఖ్య భాగం.
అలాగే అమ్మ చిన్నతనంలోనే మంత్రాయి అన్న జీతగాడిలో పరివర్తన తీసుకువచ్చింది. ఎన్నోసార్లు తనకు ఇంట్లో పెట్టిన అన్నం తీసుకువెళ్లి అతడికి స్వయంగా తినిపిస్తూ ఉండేది. ఎందుకమ్మా? ఈ మాలవాడి మీద ఆదరణ అంటే “నాన్నా! నీవు మాలవాడివి కాదు మా వాడివి” అని చెప్పింది. మరొకసారి మంత్రాయి అమ్మ దగ్గరకు వచ్చి తాను చెడ్డవాడినని అన్ని తప్పు డలవాట్లేననీ, కానీ తాను చేసే పాడు పనులన్నింటికీ ఏదైనా శిక్ష వేసి మాన్పించమనీ అమ్మని కోరాడు. “మంచి అలవాట్లు ఏమీ లేదా” అని అడిగింది అమ్మ. అతడు ఆలోచించి “ఒక్కటుందమ్మా ఎవరు తినలేదు అన్నా సహించలేను. నేను మానుకొని అయినా వాళ్లకు పెడతాను” అన్నాడు. “అంతేనా”? అని అమ్మ ప్రశ్నించింది. కొంచెం సేపు ఆలోచించి “అబద్ధం ఆడనమ్మా” అన్నాడు. “ఇవి కూడా నీ దృష్టిలో చెడు అలవాటు లేనా? మనుష్యులందరూ మంచి వాళ్లే నాన్నా! చెడ్డవాడు ఎవరైనా ఉంటే మనం అనుకునే ఈ చెడ్డతనాన్ని మనకు ఇచ్చిన భగవంతుడు మాత్రమే. అందరూ ఇంకెవరో ఒకరు నడిపితే నడిచే వాళ్ళు కదా!” అని అతడిని ఓదార్చింది. ఆ తరువాత 1942లో జిల్లెళ్ళమూడిలో అమ్మ ఇంట పాలేరుగా చేరాడు. అమ్మ దగ్గరకు వచ్చాక అతని జీవన విధానమే మారిపోయింది.
సామాజికపరంగా చూసినా, సంస్కార పరంగా చూసినా కొందరి దృష్టిలో అంటరాని వాడిగా భావించబడే అతడు అమ్మ ఆదరణతో సంస్కారవంతుడై పలువురి ప్రశంసలందుకున్నాడు. దోషులుగా పరిగణింపబడే వారి విషయంలో అమ్మ పరివర్తననే కోరుకున్నది కానీ వారిని శిక్షించాలని ఎన్నడూ అనుకోలేదు.