శోభాయాత్ర అమ్మ దయవలన విజయవంతం కావటం సంతోషం కలిగించింది. ఈ సంకల్పం కలిగినప్పుడు ఇంత ఆలోచన నాకు లేదు. యాత్ర బయలు దేరిన తరువాత దాని విశిష్టత క్రమేపి అవగాహన అయింది.
అమ్మ నాన్న గార్ల వివాహ విషయంలో
అమ్మ నాన్నగార్ల కాపురం జిల్లెళ్ళమూడిలో ఏర్పాటుచేయటంలో మా తాతగారు శ్రీ కొండముది సుబ్బారావు గారి పాత్ర చాలా గొప్పది. అవన్నీ గుర్తుకు వచ్చి యాత్ర పొడవునా మహదానందం వేసింది.
మా తాతగారు సుబ్బారావుగారు నాన్నగారి కరణీకం విషయంలో ఎంతో సహకరించే వారు. వారి తదనంతరం మా నాన్నగారు కొండముది రామకృష్ణ అన్నయ్య ఆ సహకారం కొనసాగించి అమ్మకు ఉపకరణంగా నిలిచారు.
మరొక విషయం గుర్తుకు వచ్చి హృదయం కృతజ్ఞతతో భారమైనది. మా తాతగారు చివరి గడియలలో మరణశయ్య మీద ఉన్నపుడు ఆయనకు సేవచేసినది నాన్నగారే. ఈ యాత్ర జ్ఞాపకాల తేనె తుట్టెను కదిలించింది.
యాత్ర సాగుతుంటే చిదంబరరావు తాత గారిల్లు, రైల్వేస్టేషన్, శివాలయం భావనారాయణ స్వామి గుడి కనిపించి వాటితో పెనవేసుకున్న అమ్మ జీవిత మధుర ఘట్టాలు మనసులో మెదిలి జీవితం ధన్యమైంది అనిపించింది.
యాత్రలో పాల్గొన్న అమ్మ బిడ్డలందరూ ధన్యులు.
జరిగిన అనుభవాలు గమనిస్తే అమ్మ ఈ యాత్రలో తన ప్రమేయాన్ని అడుగడుగున అనుభవైకవేద్యం చేసిన విషయం గమనించినపుడు,
ఈ యాత్రను గమనించిన, విన్న అందరు బిడ్డలు సంభ్రమాశ్చర్యాలలో మునిగి తబ్బిబ్బు అవుతున్నారు.
ఆ అనుభవాల సమాహారాన్ని ఒక్కసారి అవలోకిస్తే అవి మనకి ఏం సందేశం ఇస్తున్నాయో అన్న విషయంలో ఒక అవగాహన వస్తుంది.
సోదరుడు కొండముది ప్రేమకుమార్ శోభాయాత్రకు ప్రభుత్వ అధికారుల అనుమతి కోసం వెళితే అక్కడ అన్ని చోట్లకు ముందే అమ్మ చేరినట్లు అధికారులందరూ అమ్మతో తమకు గల అనుబంధాన్ని వెల్లడిస్తూ అనుమతులు సత్వరమే చేతుల్లో పెట్టారు.
ఎంతో భయపడుతూ, సందేహాస్పదంగా ప్రారంభించబడిన యాత్రా ఏర్పాట్లు ఎవరో (అమ్మే)చేయి పట్టి నడిపించినట్లు నడిచాయి.
ఉదయం 4.30గంటలకే యాత్ర ప్రారంభ స్థలమైన బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీ చంద్రమౌళి చిదంబరరావు తాతగారి ఇంటి దగ్గరకు చేరాము. నిన్నటి దాకా భయపెట్టిన అక్కడ చుట్టు ప్రక్కల పరిస్థితులు నయనానందకరంగా, ఆహ్లాదకరంగా మారినవి.
సమయం ఉదయం 5.15గం అయింది. శోభాయాత్రీకుల రాక క్రమంగా ప్రారంభమైనది. ఎదురుగా సమ్మోహనంగా నవ్వుతూ అనుంగు సోదరుడు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థి మాజేటి రామకృష్ణ నడిచి వస్తున్నాడు. అతను తిరుపతి నుండి రైలులో వస్తున్నాడు. ఆ రైలు సరైన టైమ్ ఉదయం 6గంటలట. విచిత్రం ఆ రైలు ఉదయం 5.15గంటలకే బాపట్ల చేరి అతనికి యాత్ర ప్రారంభం నుండి పాల్గొనే అదృష్టం కలిగించింది. అమ్మ కరుణ కాకపోతే రైలు ముందు రావటమేమిటి. చేతులెత్తి అమ్మ కు అంజలి ఘటించాము అందరం. యాత్ర ప్రారంభం అయింది. అమ్మ తన కరుణకు ప్రత్యక్ష నిదర్శనం చూపించింది. మండు వేసవి ఉదయం 7 గంటలనుండి తీవ్రమైన వేడిమి చూపుతున్న రోజులు. అం . అయినా శోభాయాత్ర పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని గాలులతో తన సహకారం అందించింది.
అమ్మ కార్యం కదా. ఆ సూర్యభగవానుడు, ఆ వాయుదేవుడు అమ్మ మా ప్రక్కనే ఉన్నదని మాకు సూచించారు.
అలా అలా శోభాయాత్ర అమ్మ దయతో దిగ్విజయంగా ప్రారంభమైనది. ఒక చిత్రం జరిగింది. నా భార్య శ్రీమతి కొండముది శ్యామల చాలా కాలం నుండి మోకాలు నొప్పితో బాధపడుతున్నది. దానికి తోడు చిన్న మెదడులో సమస్యతో కళ్ళు తిరగటం. నడుస్తుంటే నడిచే రైలులో నడుస్తున్నట్లు ఉంటుంది. అలాంటి శ్యామలతో వసుంధర అక్కయ్య ఒక మాట అన్నది.
అమ్మ సంకల్పిస్తే నువ్వు కూడా శోభాయాత్రలో నడవగలవు అన్నది.ఆ మాటను దృష్టిలో పెట్టుకుని శోభాయాత్రలో నడక ప్రారంభించింది. చారిత్రకమైన జరిగింది. సంఘటన జరిగింది. శ్యామల 16 కి.మీ అవలీలగా నడిచింది. ఇంతకంటే అమ్మ మహిమకు ఇంకేమి ప్రత్యక్ష నిదర్శనం కావాలి!
అమ్మ కరుణతో ఆమెకి ఆ శక్తి ప్రసాదించ బడిందా? అమ్మ మీద విశ్వాసం ఆమెకు ఆ శక్తిని కలిగించిందా? ఈ మీమాంస ఆధ్యాత్మిక వేత్తలు, ఆధునిక శాస్త్రవేత్తలు తేల్చాలి. ఫలితం మాత్రం కళ్ళముందు ప్రత్యక్షమైనది. కారణాలు ఆ తల్లికే ఎరుక.
అమ్మ మీద విశ్వాసంతో ముందుకు కదలటమే మన ముందు ఉన్న కర్తవ్యం అని ఈ ఘట్టం ద్వారా అమ్మ మనకు చెబుతున్నది.
అదే ఈ శతాబ్ది ఉత్సవాలలో మన అదృష్టం కొద్దీ మనకు లభించిన దివ్యోపదేశం. ఒక దీపం అనేక దీపాలు వెలిగిస్తుంది అనేది సామెత. ఇక్కడ ఆ సామెత నిజమైనది. ఎందరో సంశయంగా శోభాయాత్ర ప్రారంభించిన వారు చివరివరకు అమ్మ ఆలయం వరకు నడవగలిగారు. జిల్లెళ్ళమూడిలో అమ్మ నామం చేసే సోదరి కొండమ్మది ఇదే అనుభవం. కొంచెం గూడా నడవలేని వ్యక్తి శ్యామల నడుస్తూ ఉంటే స్ఫూర్తి పొంది తాను పూర్తిగా నడిచింది.
మా బావమరిది శ్రీ మోగులూరి ప్రేమకుమార్ కూడా ఒక మోకాలుకు ప్రమాదం జరిగి, మరో మోకాలి లిగమెంట్సు తొలగి సునాయాసంగా నడిచే అవకాశం లేకపోయినా అతనూ నడచి శోభాయాత్రలో పాల్గొన్నాడు.శ్రీ మిన్నెకంటి నాగరాజు కుమారుడు చిరంజీవి రిషిత్ 13 ఏళ్ళ కుర్రవాడు కూడా పదహారు కిలోమీటర్లు నడవగలిగాడు.
13 ఏళ్ళ వాళ్ళ దగ్గర నుండి 73 ఏళ్ళ వారి వరకు ఈ శోభాయాత్రలో కాలినడకన పాల్గొన్నారు.
మరో విషయం మా తమ్ముడు ప్రేమకుమార్కు మధ్యలో కాలి పిక్క పట్టుకుంది. కొంత ఉపశమన ప్రయత్నాలు జరిగిన తరువాత తను చెప్పులు తీసివేసి నడక సాగించాడు. అంతే నడక సునాయాసంగా జరిగింది.
ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు అయితే ఇంకో విషయం నమ్మకాలకి సంబంధించినది. రామకార్యం కోసం ఆంజనేయ స్వామి సముద్రం లంఘించినప్పుడు సకల శక్తులు యక్షకిన్నెర కింపురుషులు, మహాపర్వతాలు ఆంజనేయస్వామికి సహకరించారట.
నేడు అమ్మ కార్యక్రమం జరుగుతుంటే మధ్యలో ఆంజనేయ స్వామి దేవాలయం కొంత విశ్రాంతిని ఇచ్చింది. మొదటి మజిలీగా అక్కడ (బాపట్ల జమ్ములపాలెం మధ్య ఉన్న దేవాలయం) కొద్దిసేపు ఉపాహారం తీసికుని కాఫీ త్రాగాము. ఆ విధంగా మానవులే కాదు దేవతలూ ఈ యాత్రలో పాలు పంచుకుని శోభాయాత్ర శోభాయమానం చేశారు.
అమ్మ కరుణకు ప్రత్యక్ష నిదర్శనాల సమా హారంగా ఈ శోభాయాత్ర చరిత్ర లో నిలిచింది.