అన్ని మాసాల్లోనూ శ్రావణమాసం మంగళప్రద మయినది. శుభముల నొసగే నోములు, వ్రతాలు ఈ మాసంలో ఎక్కువగా జరుగుతుంటాయి. శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా ప్రసిద్ధికెక్కింది. తెలంగాణా ప్రాంతంలో నాగపంచమికి బహు ప్రాముఖ్యత ఉన్నట్లు విన్నాను.
అమ్మ బాల్యంలోనే నాగేశ్వరావృతమైన సంఘటనలు కలవు. అందువల్లనేమో నాగపంచమి రోజున శుభముహూర్తానికి శ్రీకారం చుట్టిందనిపించింది. అటువంటి పవిత్రమైన రోజు నుంచి శ్రావణపూర్ణిమ వరకు ఏకాదశ పర్వములకు ఒక ప్రత్యేకతను సంతరింప చేసింది. అదే అమ్మ రజస్వలోత్సవం.
షుమారు 30 సంవత్సరముల అనంతరం 12.8.1964వ తేదీన ఈ పండుగ సందర్భాన్ని మనకు తెలియపరిచి నాచే శుభలేఖలు వ్రాయించి అమ్మ పసుపు కుంకుమలు దిద్ది అప్పట్లో సన్నిహితులైన సోదరులకు పోస్టు చేయించింది. ఆ సమయంలో సమీపస్థులయిన ముత్తయిదువులు అయిదుగురికి నాచేత తాంబూలమిప్పించింది.
ఆ సాయంత్రం నుంచే – సంప్రదాయేశ్వరి అయిన అమ్మ సంప్రదాయబద్ధంగా పూర్ణిమ వరకు 11 రోజులు సర్వాలంకారభూషితయై చిద్విలాసిని అయి అలంకరించ బడిన వేదికపై సింహాసనాసీన అయి కన్యకాపరమేశ్వరిగా దర్శనమిచ్చిందని సర్వులూ పులకరించి పోయారు. ఏ రూపంలో ఎవరికి దర్శన మొసగినా, లీలావినోదిని అయిన అమ్మ నవ్విస్తూ, కవ్విస్తూ ఆటపాటలతో మమ్మల్ని అలరింపచేసేది.
శ్రావణపూర్ణిమ యొక్క ప్రాముఖ్యతను మన పెద్దలు ఎంతగానో చెప్పగా విన్నాను. అందుకే పంచమితో మొదలై, పూర్ణిమ దాకా ఎంచుకున్నదనుకుంటాను. చిమ్మిరి అమ్మవారికి శాంతి అని విన్నాను. తెలియనది తెలియ చెప్పటానికే నా రాక షన్న అమ్మ మనకు తెలియచేయాల్సిన బాధ్యత అమ్మదే కదా !
అమ్మ, మనకు కారణం చెప్పదు. మనకు ఏది అవసరమో అది చేయిస్తుంది. అందుకు ఇది మీరు చేయాలి. అని ఆదేశించింది. ఆ ఆదేశంలో ఎన్నో సందేహాలు, నిగూఢ రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయినిపిస్తోంది. 11వ రోజున అరిశెల కావడిని తెమ్మని భాస్కరన్నయ్యకు చెప్పగా. సింగుపాలెం నుండి అరిశెలు తెచ్చి ఇక్కడే కావడితో అమ్మకు సమర్పించటం జరిగినది. 11వ రోజున బంతిరోజు వంటసరిగా చెయ్యకపోయినా మందలించేది. అంతా సక్రమంగా అన్నీ చేయించింది. ఇది ఒక అర్చన. ఈ అర్చనలో మనకు అవకాశాన్ని కల్పించింది.
ఆనాటి నుంచి నేటివరకు ఈ ఉత్సవాన్ని కడువైభవంగా జరిపించుకుంటున్నది. ఒకసారి ఒక సోదరుడు తన సందేహాన్ని అమ్మకు విన్నవించి సమాధానం కోసం ఎదురు చూసి చెప్పమ్మా అనగా “మాటలతో పనేముంది నాన్నా చేయించటమేగా” అన్నది.
మరొకసారి మరొకరితో మాట్లాడుతుండగా నేను మరొక సోదరుడు అమ్మ మాట్లాడుతున్నది అమ్మ దగ్గర కి వెళ్దామని లేచాం. మా మాటలు విన్న అమ్మ మాటలమ్మ కాదు మూటలమ్మే” అన్నది. తన అనుగ్రహాన్ని మూటలు నింపి పంచటమే కాని మాటలలో పనిలేని అమ్మ కారణం చెప్పకుండానే చిమ్మిరి పండుగ కల్పించింది.
ఈ సంవత్సరం స్వర్ణోత్సవ సంవత్సరం. ఇది 50వ సంవత్సరం. ప్రత్యేకమైన అలంకరణలతోనూ, ఆహ్లాదకరంగానూ, ప్రశాంతంగానూ జరుపు కున్నది.
మాతృశ్రీ ఓరియంటల్ పాఠశాల విద్యార్థినులు ఎమ్. సుబ్బలక్ష్మి ఆధ్వర్యములో కోలాట ప్రదర్శన, కళాశాల బి.ఎ. ఫైనల్ సంవత్సరము విద్యార్థిని చి. గౌరి భామా కలాపము, జగదానందకారములను కూచిపూడి నృత్యప్రదర్శనలతోనూ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. మరెంతో వైభవంగా జరగాలని కోరుకుంటూ…
తొలిలో ఆశీ: స్సుమాలనే కురిపించి
మదిలో మురిపెంగా ముసిముసి నగవులతో
పలువిధముల దృష్టినీ, కరుణావృష్టినీ
సారించిన నీ కరుణకు జోహార్లమ్మా!
మరుపులేనిదా – సంఘటన
మరుపురానిదా – ఘటన
ఈ గుండె నిండుగా
పరవశింపచేసిన నీకరుణకు జోహార్లమ్మా!