సెప్టెంబర్ 2వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు జిల్లెళ్ళమూడిలో టి.టి.డి. కళ్యాణమంటపంలోఒక ప్రత్యేక సమావేశంలో శ్రీమతి డాక్టర్ యు. వరలక్ష్మి గారి అభినందన సభ జరిగింది. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఆంధ్రోపన్యాసకురాలుగా రెండున్నర దశాబ్దాలకు పైగా పనిచేసి, బాపట్ల ఆర్ట్స్ & సైన్సు కళాశాలకు బదిలీ అయి, అక్కడ ఆగష్టు 31వ తేదీన పదవీ విరమణ చేసిన డాక్టర్ వరలక్ష్మి గారిని సత్కరించాలని మాతృశ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు సంకల్పించారు. 1974వ సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో తాను ఉద్యోగంలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ వరలక్ష్మిగారు అన్నపూర్ణాలయంలో అందరికీ విందుభోజనం అమ్మ ప్రసాదంగా అందించారు. ఆనాడే వారిని సత్కరించాలని పూర్వవిద్యార్థి బృందం కల్పించింది.
శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు సభకు అధ్యక్షత వహించగా, కరస్పాండెంట్ శ్రీ వి.యస్.ఆర్. ప్రసాదరావు గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వరశాస్త్రిగారు సభాప్రారంభకులుగా పాల్గొన్నారు. ప్రధానవక్త కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు శ్రీమతి డాక్టర్ బి.ఎల్. సుగుణగారు ప్రసంగిస్తూ, డాక్టర్ వరలక్ష్మిగారి ప్రతిభాపాండిత్యాలను, విశిష్టవ్యక్తిత్వాన్ని స్ఫూర్తియుతంగా వివరించారు. “నువ్వు ప్రసంగించేటపుడు నీ నాలుక మీద నేనుంటానుగా” అని డాక్టర్ వరలక్ష్మిగారికి అమ్మ స్వయంగా వరమిచ్చిందని, ఆ బలంతో తెలుగునేల నాలుగు చెరగులా డాక్టర్ వరలక్ష్మిగారు సాటిలేని విఖ్యాతిని సముపార్జించుకున్నారని సభ్యుల హర్షధ్వానాల మధ్య శ్రీమతి డాక్టర్ సుగుణ గారు ప్రకటించారు. రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన పూర్వ విద్యార్థులు సర్వశ్రీ డాక్టర్ జయంతి చక్రవర్తి, డి.గణపతిరావు, పి.అప్పారెడ్డి, కె.కోటేశ్వరరావు, డాక్టర్ ఎస్.ఎల్.వి. ఉమామహేశ్వరరావు, డి. భాస్కర్, శ్రీమతి పి. చిట్టిగార్లు ప్రభృతులు ప్రసంగించారు. డాక్టర్ వరలక్ష్మిగారు పాఠప్రవచనాలతో తమను ఉత్తేజపరచిన విధానం, తమ బాగోగులు చూడటంలో బాధ్యత చూపిన వాత్సల్యం, క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచి, తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తీరుతెన్నులు విద్యార్థులు వివరించారు. పూర్వ విద్యార్థుల ప్రసంగాలకు సభ పులకించిపోయింది.
పూర్వవిద్యార్థులు శ్రీమతి డాక్టర్ బి.యల్.సుగుణగారు, శ్రీ కొత్త ప్రసాదరావుగారు చక్కని ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి, శ్రద్ధాసక్తులతో నిర్వహించారు. డాక్టర్ పి. ఝాన్సీలక్ష్మీబాయి గారు, శ్రీమాన్ ఎస్.వి. రామకృష్ణామాచార్యులు గారు పరిపూర్ణ సహకారాన్ని అందించారు. శ్రీమతి విశాలి గారు, శ్రీమతి కె. సుబ్బలక్ష్మి గార్లు, శ్రీ ఎం. నాగరాజు గారు సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీమతి డాక్టర్ వరలక్ష్మి, శ్రీ కె. సత్యప్రసాద్ దంపతులను పూర్వవిద్యార్థులు పట్టు వస్త్రాలతో, పూలదండలతో, కానుకలతో సత్కరించారు.
శ్రీవిశ్వజననీపరిషత్ నూతన వస్త్ర సత్కారం చేసింది. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, పాఠశాల అధ్యాపక బృందం డాక్టర్ వరలక్ష్మిగారికి జ్ఞాపిక బహూకరించింది.
సభలో బాపట్ల కళాభారతి కార్యదర్శి, సభాసమ్రాట్ డాక్టర్ కె.వి.ఎస్. ఆచార్యగారు, విశ్వజననీ మాసపత్రికా సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్ ఆంజనేయప్రసాద్ గారు, సుప్రసిద్ధ రంగ స్థల కళాకారులు శ్రీ కె.ఎస్.టి. శాయిగారు, బాపట్ల ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ శ్రీ డబ్ల్యు.జి. కృష్ణమూర్తిగారు, శ్రీ రుద్రరాజు అంజిరాజు గారు, ఆడిటర్ శ్రీ కారుమంచి కృష్ణమూర్తిగారు, పొన్నూరు కళాపరిషత్ అధ్యక్షులు శ్రీ ఎస్. ఆంజనేయులు నాయుడు గారు, శ్రీ కొండముది రామకృష్ణ ఫౌండేషన్ పక్షాన శ్రీ తురుమెళ్ల చెన్నకేశవరావుగారు, శ్రీ కొండముది సుబ్బారావుగారు, శ్రీ కట్టమూరి వేంకటేశ్వరరావుగారు పాల్గొని డాక్టర్ వరలక్ష్మిగారిని అభినందించారు.
శ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ విద్యాపరిషత్ కార్యవర్గసభ్యులు, వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు, బాపట్ల, ఆర్ట్స్ & సైన్స్ కళాశాల అధ్యాపకులు విశేష సంఖ్యలో పాల్గొని డాక్టర్ వరలక్ష్మి గారిని సముచిత రీతిలో సత్కరించారు.
డాక్టర్ వరలక్ష్మిగారి సోదరి శ్రీమతి ఝాన్సీలక్ష్మిగారు, శ్రీ సత్యప్రసాద్ గారి సోదరులు శ్రీ సాంబశివగారు, వరలక్ష్మి ప్రసాద్ గారల కుమారుడు చిరంజీవి శశికాంత్ ఈ సందర్భంగా బంధువర్గం పక్షాన తమ ఆత్మీయతను ప్రకటించారు.
ఎన్నో సంస్థల వారు, బంధుమిత్రులు, శిష్యులు, అభిమానులు డాక్టర్ వరలక్ష్మి గారిని, శ్రీ సత్యప్రసాద్ గారిని పూలదండలతో, నూతన వస్త్రాలతో, కానుకలతో సత్కరించారు.
డాక్టర్ వరలక్ష్మిగారు తగినరీతిలో స్పందించి సమాధానమిచ్చారు. పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతమంది ఆత్మీయులను అనుగ్రహించిన అమ్మకు నమస్కరించారు. తమ అభ్యుదయానికి కారకులైన వారి పట్ల కృతజ్ఞతను ప్రకటించారు. విద్యార్థులను నిండు మనసుతో దీవించారు. తమ జీవితం ‘అమ్మకే పునరంకితం’ అని ప్రకటించారు.
శ్రీ కె. సత్యప్రసాద్ గారు తమ ప్రసంగంలో అ విధాల చేదోడువాదోడుగా నిలిచి, తమ జీవితాలను నడిపించిన అమ్మకు అంజలి ఘటించారు.
శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు సభను ఆద్యంతమూ ఆసక్తికరంగా నిర్వహించారు. పూర్వవిద్యార్ధి శ్రీ డి. గణపతిరావు చేసిన వందన సమర్పణతో సభ ముగిసింది.