‘శ్రీరాజేశ్వరియై సనాతన తపస్సింహాసనమ్మందు లోకారాధ్య ప్రతిభా విభూతులను నిత్యమ్మున్ ప్రసారించు సత్కారుణ్యమ్మున పావనుల్ పతితులేకమ్మై తరింపంగ నూత్నారంభ మ్మొనరించినట్టి అనసూయా మాతకున్ మ్రొక్కెదన్’ – అంటూ అమ్మ అనంత కల్యాణ గుణవైభవాన్ని కీర్తించారు శ్రీ బృందావనం రంగాచార్యులుగారు.
శ్రీరాజేశ్వరియై అంటే సర్వోత్కృష్టమైన శక్తి; సనాతన తపస్సింహాసన మ్మందు అంటే వేదవిహితమైన ఆర్ష ధర్మబద్ధమైన పాతివ్రత్య ధర్మ నిరతి అనే సింహా సనమును అధిష్టించి; లోకారాధ్య ప్రతిభావిభూతులను నిత్యమ్మున్ ప్రసారించు అంటే సకల జగదారాధ్యయై దివ్యదీధితులను ప్రసాదిస్తూ; సత్కారుణ్యమ్మున అంటే కేవలం కరుణారసామృతమూర్తి కావున; పావనుల్ పతతితులేకమ్మై తరింపంగ అంటే – యోగులను, జ్ఞానులను అనుగ్రహించటంతో పాటు విషయ వాసనాధీనులై దీనులై పాపప్రవృత్తికి బానిసలైన పతితులను కూడా చేరదీసి ప్రేమతో వారి మనోమాలిన్యాలను కడిగి శుభ్రం చేసి సంస్కరించి ఏకకాలంలో ఉద్ధరించే; నూత్నారంభమ్మొనరించి నట్టి అంటే మాతృధర్మ పరిరక్షణ లక్ష్యంగా ‘అందరికీ సుగతి’ని ప్రసాదిస్తూ విలక్షణమైన ఆదరణ మార్గానికి ప్రేమ తత్వానికి శ్రీకారం చుట్టిన; అనసూయా మాతకున్ మ్రొక్కెదన్ – అని..
అట్టి వాత్సల్యామృత వర్షిణ వేదస్వరూపిణి అయిన అమ్మ నేడు మన కళ్ళముందు లేదు. ది. 28.3.1923 తేదీన అవనీతంలపై ఆవిర్భవించిన అమ్మ ది 12.6.1985 తేదీన శరీరత్యాగం చేసి ది. 14.6.1985 తేదీన ఆలయ ప్రవేశం చేసింది. కనుకనే ఏటా జూన్ 12వ తేదీన ‘అనంతోత్సవం’ అనీ, ‘మహాభినిష్క్రమణం’ అనీ జరుపుకుంటున్నాము; పరిమితమైన రూపాన్ని విడిచి అనంతమైన స్వస్వరూపాన్ని అవధరించింది అని అర్థం చెప్పుకుంటాం. మూలకారణశక్తి ఐచ్ఛికంగా ఈ పుడమిపై అమ్మగా ఆవిర్భవించింది. మాయా మానుషవేషయై కొన్నాళ్ళు మన మధ్య నడయాడింది. పరిమిత రూపంతో ఉన్నా అమ్మ సర్వదా యదార్ధ స్థితిలో అంతా తానుగా ఉంటూనే ఉంది.
అమ్మ ‘అంబాంబా’ – తల్లులకు తల్లి. అట్టి తల్లి లేని తల్లికి ‘ఆవిర్భావం’ – ‘మహాభినిష్క్రమణం’ అనేవి వర్తించవు. అమ్మ ఎప్పుడూ ఉంటుంది. మనం కన్నులు తెరవనప్పుడు, తెరచి నప్పుడు, మూసినప్పుడూ సదా అమ్మ ప్రకాశిస్తుంది. వేదములు ముక్తకంఠంతో ఏ పరతత్వాన్ని ‘సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’ అని ప్రస్తుతిస్తున్నాయో ఆ బ్రహ్మే అమ్మ.
పరిమిత రూపంగా కనిపించే అమ్మని INVOLUTION అనీ, అనంతంగా అనిపిస్తున్న సృష్టిని EVOLUTION అనీ అందామా? ఆ సృష్టి అమ్మే. కనుక Involution, Evolution, రెండూ ఏకకాలంలో అమ్మలో ద్యోతక మవుతాయి. ఇది అద్భుత దర్శనం. ఈ సందర్భంగా ఒక సజీవ సాక్ష్యాన్ని, దర్శనాన్ని, నిదర్శనాన్ని అవలోకిద్దాం:
కఠివరం గ్రామస్థులు సో॥లు శ్రీ కృష్ణమూర్తిగారు అందరింటి సోదరీ సోదరులందరకూ ఆత్మీయులే.
1974లో అమ్మ కావాలని తానుగా వారింటికి వెళ్ళింది. వారి తోటను సందర్శించింది. కృష్ణమూర్తిగారు చిన్న మామిడి మొక్కను తెచ్చి ‘అమ్మా! నువ్వు ఈ మొక్కను నాటాలి’ అని కోరారు. వెంటనే అమ్మ అంగీకరించి అలాగే చేసింది.
1977 నాటికి మూడు సంవత్సరాలు గడిచాయి. సాటి మొక్కలన్నీ ఏపుగా పెరిగి సహజంగా పుష్పవంతము, ఫలభరితము అవుతున్నాయి. కానీ అమ్మ నాటిన మొక్క వామనావతారాన్ని తలపిస్తూ జానెడు పరిమాణంతో అలాగే ఉన్నది. దానికి వృద్ధి క్షయాలు లేవు; అది సృష్టి ధర్మాన్ని తృణీకరించింది.
1977లో పెనుతుఫాను వచ్చింది. ఆ ప్రకృతి వైపరీత్యానికి తోటలోని మొక్కలన్నీ నేలమట్టమయ్యాయి. ఆనాడు ఆ మొక్క నిర్గుణ పరబ్రహ్మ స్వరూపానికి చిహ్నంగా అక్షరమై నిల్చింది. ఆశ్చర్యం. మరుసటి ఏడాదికి ఈ నాలుగేళ్ళ పెరుగుదల పోసుకుని మన అంచనాకు అందనంత ఎత్తుకు ఎదిగింది. చిగుళ్ళు వేసింది, అనేక కాయలు కాసింది. ఏటా కృష్ణమూర్తిగారు మే, 5వ తేదీ అమ్మ కల్యాణ మహోత్సవానికి జిల్లెళ్ళమూడి వచ్చేటప్పుడు వీలైనన్ని కాయలు తెచ్చి అన్నపూర్ణాలయానికి సమర్పిస్తారు. ది. 5.5.2014 తేదీన కూడా ఆ సదాచారాన్ని పాటించారు.
ఆ మామిడి చెట్టు, కాయలు అమ్మకు ప్రకృతిపై పంచభూతాలపై గల అప్రతిహతమైన అధికారానికి సజీవ సాక్ష్యాలు. ఏమంటే 1974లో వేసిన మొక్క మామూలుగా ప్రకృతి ధర్మాన్ని అనుసరించి 3 సంవత్సరాల వరకు పెరిగి ఉంటే 1977లో కూలిపోయి ఉండేది. 1974 నుంచి 1977 వరకు తన పెరుగుదలను తనలోనే ఇముడ్చుకొని అవ్యక్తంగా ఉంటూ ఉన్నది. తత్వతః – శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో ‘బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాఙ్గ నిర్వికల్ప పునః’ అంటూ అణురూపంగా ఉన్న సృష్టిని వర్ణించారు. అంటే ఆదిలో సృష్టి ఒక విత్తనము మాదిరిగా ఉన్నది. విత్తనములో మొక్క నిద్రావస్థలో ఉంటుంది. – అంటే ప్రధమ మూలము (తొలివేరు), ప్రధమ శాఖ (తొలికొమ్మ), బీజదళాలు (తొలి ఆకులు) అన్నీ సజీవంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులలో అది మొలకెత్తి త్రివిక్రమావతారంగా ఎదిగి ఆశ్చర్య చకితులను చేస్తుంది. విత్తనంబు మట్టి వృక్షంబునకు నెంత? కనుకనే అమ్మ “సృష్టిని మించిన మహిమలు లేవు” అన్నది.
ఈ ఉదాహరణని సృష్టి ఆవిర్భావక్రమ పరంగా చెప్పుకుంటే Involution, Evolution అని అంటారు. అణురూపంగా ఉన్న సృష్టిని Involution అనీ, అనంతంగా వ్యాపించిన సృష్టిని Evolution అనీ అంటారు. అవి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూంటాయి. ఒకసారి సో॥ శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారు, “అమ్మా! Darwin’s Theory of Evolution అంటే ఏమిటి?” అని ప్రశ్నిస్తే అమ్మ, “ఏముంది, నాన్నా! Involution లోనిదే Evolution” అని ఒక సార్వకాలిక సత్యాన్ని ఆవిష్కరించింది. అంటే విత్తనము – మొక్క, విత్తనము – మొక్క మాదిరిగ అవి పరివర్తనం చెందుతూంటాయి.
విత్తనము మొలకెత్తటానికి అనుకూలపరిస్థితలు కారణం; మరి అణురూపంగా ఉన్న సృష్టి అనంతంగా వ్యాపించటానికి కారణం ఏమిటి? శివసంకల్పం – ‘బహుశ్యాంప్రజాయయేతి’ ‘నేను’ అనేకం కావాలి అని కోరుకోవటం – అంటుంది వేదం.
“ఈ సృష్టి అనాది, నాది” అని సర్వ సృష్టికారిణి అమ్మ ప్రవచించింది. కనుకనే ఒక సోదరి ‘అమ్మా! చివరికి ఈ సృష్టి అంతా ఏమౌతుంది?’ అని ప్రశ్నిస్తే అమ్మ, “దేనికి చివర?” అని ఆరూఢతతో నిశితంగా ఎదురు ప్రశ్నవేసింది.
“సృష్టికి పరిణామమే కాని నాశనం లేదు” అన్నది జగత్తే తానైన జగన్మాత.
‘భగవంతుడు ఉన్నాడు’ అనేది ఎంత సత్యమో ‘అమ్మ ఎప్పుడూ ఉంటుంది’ అనేది అంత సత్యం. కాళిక – కాలస్వరూపిణి – కాలా తీత మహాశక్తి అమ్మ. సృష్ట్యాదిగా ఎందరో మహర్షులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు. దేనికి? పరిమిత రూపంలో అపరిమితత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలని. వారి తపః ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. రెండు కళ్ళతో అమ్మను దర్శిస్తున్నాం, సృష్టి స్థితి లయ కారక తత్వాన్ని అవలోకిస్తున్నాం.
ప్రతి ఏటా జూన్ 12, 13, 14 తేదీలను ఆరాధనోత్సవాలుగా జరుపుకుంటున్నాం, ఆ శ్రీచరణాల్ని పంచామృతాలతో, పయోధారలతో అభిషేకిస్తున్నాం. సహస్ర ఘటాభిషేకాల్ని నిర్వర్తిస్తున్నాం, సహస్రనామాలతో సహస్రకమలాలతో అర్చిస్తున్నాం. అనితర సాధ్యమైన అమ్మ అమోఘ అనిర్వచనీయ ఆశీస్సులను పొందుతున్నాం.