శ్రీశ్రీశ్రీ సద్గురు శివానన్దమూర్తిగారు ది. 10.6.2015 తేదీన శివసాయుజ్యం పొందారు. అఖిల సోదరసోదరీ పక్షాన ‘మదర్ ఆఫ్ ఆల్’ పత్రిక వారి శ్రీచరణాలకు సాశ్రునయనాలతో సహస్రాధిక వందనముల నర్పిస్తోంది. వారు అమ్మను గురించి చేసిన ప్రసంగం నుండి కొన్ని భాగాలనందిస్తున్నాము:
నేను చాలామంది మహాత్ముల చరిత్రలు చూశాను; పురాణాల్లో చూశాను. ఎలా ఉన్నారు? ఏమి చేశారు? అని. కానీ ఇతః పూర్వం అమ్మవంటివ్యక్తి ఎక్కడా వచ్చినట్టు రికార్డుల్లో లేదు. అపూర్వమైన స్థితి ఆమెది, విశేషమైనస్థితి.
లలితా సహస్ర నామాల్లో ‘శ్రీమాత్రే నమః’ మొదటి పేరు. అంటే జగన్మాత శ్రీమాత – ఆ అమ్మకు నమస్కారం అని అర్థం. ఆ మాతృతత్వం ఏదైతే ఉన్నదో అది మానవ స్వరూపంలో మన ఎదురుగుండా వచ్చినటువంటి ఒక రూపమే. జిల్లెళ్ళమూడి అమ్మగారు మాతృమూర్తి. ఆమె గురువు, దైవం ఏకకాలంలోనే.
జిల్లెళ్ళమూడిలో అమ్మ ఆ జగన్మాతృ స్వరూపమైనటువంటి పరాశక్తి. మాతృత్వం అనేటటువంటి భావంతో మనకి ఎదురుగుండా సాక్షాత్కరించింది. తల్లి కనక పరదేవత ఐతే, పరదేవతే మనకి తల్లి ఐతే ఏ విధంగా మనం ఆ అమ్మ వలన లాభం పొందుతామో ఆ లాభాన్ని మనందరికీ ఇవ్వడానికి ఆమె వచ్చింది. “అమ్మా! అమ్మా! అని నన్ను పిలవండి. నావల్ల మీకు ఏది అతి ముఖ్యమైనదో అది ఇస్తాను. అని మౌనంగా మనకి చెప్పిన అమ్మ; తల్లి.
‘ఆమె మహాలక్ష్మా దుర్గ అమ్మవారా? అన్నపూర్ణా ఏమిటండీ? దేవీ స్వరూపాల్లో ఏ రూపంలోంచి వచ్చిన స్వరూపం ఆమెది?’ అని నన్ను అడిగారు. అంటే అలా చెప్పటానికి నిజంగా వీలులేదు. కానీ ‘కాళీ’ అంశలో ఒక లక్షణం ఉన్నది. జీవుల్ని గుర్తించి వెంటనే తనలో కలుపుకోవడం, వాళ్ళను తనలో విలీనం చేసుకోవడం. అదే వాళ్ళకి ముక్తి హేతువు. ఇంకొక జన్మ లేకుండా చేయడం.
అమ్మ గుప్పెడు అన్నం చేతిలో పెట్టిందంటే, తిన్నవాడికి తెలియకుండానే జీవుడిని ఆశ్రయించి ఉన్న పూర్వ జన్మ సంస్కారములు నాశనం అవుతాయి. కర్మ క్షయం అవుతుంది. ‘ప్రసాదము’ అని దానికి పేరు. ప్రసాదం అంటే ‘దయ’ అని అర్థం. ప్రసాదగుణం – వాత్సల్యం, ప్రేమ, ఆశీర్వచనం. ఆమె ప్రసాదం నిజమైన ప్రసాదం; అన్నం కాదది.
ఆమె పట్ల మన కర్తవ్యం:- ఆర్తిలో ఉన్నప్పుడు “ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడో మీకు తెలుసా?” అంటే “ఇక్కడ అమ్మ ఉంది. వెళ్ళు. ఆర్తితో అడుగు” – అని చెప్పటం మన ధర్మం.