(జూన్ 2011 సంచిక తరువాయి)
- ‘ఓం బ్రహ్మండ జననాధారాయై నమః
(బ్రహ్మాండము ఆవిర్భవించటానికి కారణమైనది)
అమ్మవాక్యం : తల్లి అంటే తొలి; ఆది.
ఈ సృష్టి అనాది, నాది.
- ‘ఓం పరిణామ స్వరూపాయై నమః’
(Matter can neither be created nor destroyed అని నిరూపించింది)
అమ్మవాక్యం : సృష్టి పరిణామశీలంకలది. దీనికి నాశనం లేదు.
38.’ఓం కాలాతీతమహాశక్యై నమః’
(అమ్మకి భూత భవిష్యద్వర్తమానములనెడి త్రికాలములు లేవు. )
అమ్మవాక్యం : నాకు అంతావర్తమానమే.
39.’ఓం మానవాతీత మహిమ ప్రదర్శన పరాజ్ముఖ్యైనమః”
(అమ్మ దివ్యమాతృప్రేమే విశ్వసమ్మోహనాస్త్రము,బ్రహ్మాస్త్రము)
అమ్మవాక్యం : మహత్తత్త్వానికి మాహాత్యాలతో పనిలేదు.
- ‘ఓం అఖండానంద సంధాత్ర్యై నమః’
(ఆనందో బ్రహ్మేతివ్యజానాత్. దైవం నిరపధికానందస్వరూపం. మానవుని మాధవుని చేయాలనేదిఅమ్మ కోరిక.)
అమ్మవాక్యం : మీరంతా నాలా హాయిగా ఉండాలి.
- ‘ఓం అజ్ఞాత ఆరంభ మధ్య అంత మహామహిమ శోభితాయై నమః”
(మూలప్రకృతి అయిన అమ్మయొక్క ఆది, మధ్య, అంతములు తెలియవు. )
అమ్మవాక్యం : ‘అంఆ’ అంటే అంతులేనిది,అడ్డులేనిది, అన్నిటికి ఆధారమైనది.
42.’ఓం అనాధ జనసందోహ త్రాణదీక్షా పరాయణాయై నమః’
(అనాధలు, బాధితులు, పీడితులను ఆదుకోవటానికి అమ్మ కంకణం కట్టుకున్నది. వారంతా సామాన్య దృష్టిలో అనాధలు. కానీ అమ్మకి కన్నబిడ్డలే.)
అమ్మవాక్యం : తల్లి అంటే తరింపచేసేది.
- ‘ఓం అర్ధనారీశ్వరీయుక్తాయై నమః’
(అమ్మ అర్థనారీశ్వరీతత్త్వ రూపిణి)
అమ్మవాక్యం : భార్యాభర్తలకు వియోగంలేదు.మంగళసూత్ర రూపేణా భర్త భార్యతోను, యజ్ఞోపవీత రూపేణా భార్య భర్తతోను సదా ఉంటారు.
- ‘ఓం షడ్వికార నివారిణ్యైనమః’
(అమ్మ అరిషడ్వర్గాల్ని నశింపచేస్తుంది.)
అమ్మవాక్యం : రాగద్వేష అసూయలను పారద్రోలేదే అనసూయ.
- ‘ఓం ఆబ్రహ్మకీటలో కాళీ నిర్విశేషకృపావత్యైనమః’
(పిపీలికాది బ్రహ్మ పర్యంతాన్ని తన సంతానంగా ఎంచిన కారుణ్యరసాధిదేవత అమ్మ)
అమ్మవాక్యం : నేను అమ్మను – నీకు, మీకు, అందరికి,అన్నిటికీ, పశుపక్ష్యాదులకూ, క్రిమికీటకాదులకూ.
46.’ఓం సర్వమానవ సౌభ్రాతృబోధిన్యై నమః’
(“మీరు ఎక్కడఉన్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా అందరూ ఒకే తల్లి పిల్లలు అనే భావం కలిగి ఉండండి. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోండి” – అంటుంది అందరి అమ్మ.)
అమ్మవాక్యం : రక్తమంతా ఈశ్వర తత్త్వమే; మీకూ నాకూ సంబంధం తల్లీ బిడ్డల సంబంధం; మీకు – మీకు సంబంధం అన్నదమ్ముల సంబంధం.
- ‘ఓం విష్ణుమాయా విలాసిన్యై నమః’
అమ్మవాక్యం : నేను చేస్తున్నాను అని అనుకోవటమే ‘మాయ’.
- ‘ఓం విశ్వమాత్రే నమ’
అమ్మవాక్యం : ఎవరిని చూచినా నాబిడ్డే అనిపిస్తుంది.
- ‘ఓం బ్రహ్మతత్త్వ జ్ఞాయైనమః’
అమ్మవాక్యం : తనని తాను తెలుసుకున్ననాడు సర్వాన్నీ తెలుసుకుంటాడు.
- ‘ఓంబ్రహ్మసాయుజ్యదాయిన్యై నమః’
అమ్మవాక్యం : మీరంతా నాలోనే పుట్టి నాలోనే లయం అవుతారు.
51.’ఓం రజోస్తమోగుణాతీతాయై నమః’
అమ్మవాక్యం : నాకు గుణభేదమే లేదు.
52.’ఓం ఆత్మసందర్శితాజాండాయైనమః’
అమ్మవాక్యం మీరంతా నేనే, మీదంతానేనే,ఇదంతానేనే .
53.’ఓం అసిధారావ్రతాచార తత్పరాయైనమః
‘ఓం కంటకవ్రాత సంక్లిష్ట మార్గ సంచార ‘తత్పరాయైనమః’
(ముళ్లబాటలో నడవటం, కత్తి అంచుమీద నడవటం… ని అమ్మకోరుకున్నది.)
అమ్మవాక్యం : శిల ఉలిదెబ్బలతో సౌందర్యవంతం అయినట్లు, బాధలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి.
54.’ఓం విశ్వశాంతి ప్రదోదార దివ్యసందేశబోధిన్యైనమః
అమ్మవాక్యం: సుఖానికి మార్గం ఒక్కటే. అంతా వాడు (దైవం) చేయిస్తున్నాడనుకోవటం.
- ‘ఓం సర్వాత్మక్యాత్మరూపాయైనమః”
(మేను (శరీరం) నేనై న నేను అని మనం అనుకుంటాం. అన్ని నేనులూ నేనైన నేను. అని అమ్మ అనుకుంటుంది.)
అమ్మవాక్యం : నేను నేనైన నేను.
- ‘సర్వ సమ్మత సన్మతాయై నమః’
అమ్మవాక్యం : సర్వ సమ్మతమే నామతం.
- ‘ఓం సర్వాధారైక సర్వాయై నమః’
అమ్మవాక్యం : సర్వం సర్వానికీ ఆధారం.
- ‘ఓం సర్వరాగ విరాగైక్యబోధిన్యై నమః”
అమ్మవాక్యం : సర్వత్రా అనురాగమే విరాగము.
- ‘ఓం సంసారమధ్య సంస్థాయై నమః’
అమ్మవాక్యం : చేసే ప్రతిపనీ దైవసేవే అనుకుంటే సంసారం ఆధ్యాత్మికసాధనకు ప్రతిబంధకం కాదు.
- ‘ఓం సర్వజీవమయత్వాంచద్భావనాయై నమః’
అమ్మవాక్యం : నాదృష్టిలో జడమేమీ లేదు; అంతా చైతన్యమే, సజీవమే.
61.‘ఓం వర్గభేద విహీన ఆత్మ సన్నిధి స్వర్గ సౌఖ్యదాయై నమః’
(తన సన్నిధిలో కులమత వర్ణవర్గ విభేదరహితమైన స్వర్గాన్ని అమ్మ స్థాపించింది.)
అమ్మవాక్యం : వర్గంలేనిది స్వర్గం.
62.’ఓం రాశీభూత క్షమారాశయే నమః’
(అమ్మది సహజ సహనం. సహన గుణంలో అమ్మను గోమాతతోను, భూమాత తోను పోలుస్తారు.)
అమ్మవాక్యం : తల్లికి తప్పేకనపడదు.
(అమ్మ ఎల్లవేళలా పఠించేది ”సరే’ మంత్రం).
- ‘ఓం విరాడ్రూపాయై నమః’
అమ్మవాక్యం : మీరంతా నాబిడ్డలేకాదు; నా అవయవాలు.
64.’ఓం మాంగళ్యరూప నాగేశ పాదపద్మలసద్గళాయై ‘నమః’
అమ్మవాక్యం : మంగళ సూత్రాలంటే భర్త రెండుపాదాలు.
- ‘ఓం విశ్వాసరూపిణ్యైనమః’
అమ్మవాక్యం : నిన్ను నమ్ముకో; నన్ను నమ్ముకో.ఏదైనా ఒకటే. విశ్వాసమే భగవంతుడు.
- ‘ఓం సర్వతంత్ర స్వతంత్రాయై నమః’
అమ్మవాక్యం : నేను సర్వసిద్ధాంత సార్వభౌమను.
- ‘ఓం అనాధజనతా భాష్పఝరాకులవిలోచనాయై నమః’
(అనాధలు, బాధితుల కన్నీటిని చూస్తే అమ్మ కన్నులు జలజలా వర్షిస్తాయి. )
అమ్మవాక్యం : మీ మంచితనమే నన్ను ఏడిపిస్తుంది.
68.’ఓం సర్వసాక్షిణ్యై నమః’
(కనిపించే అమ్మే కనిపించని బ్రహ్మ. సర్వజ్ఞత్వం, సర్వవాపకత్వం, సర్వశక్తిమత్వం దైవలక్షణాలు)
అమ్మవాక్యం : నాకు ఈ గోడలు అడ్డుకావు. అమ్మ అంటే నాలుగుగోడల మధ్య మంచంమీద కూర్చున్నది కాదు.
- ‘ఓం అమృతాశయాయైనమః’
(అమ్మ ఆశయం దివ్యమైనది, అతులితమైనది.)
అమ్మ వాక్యం :ప్రపంచంలో ప్రతిఒక్కరు కడుపునిండా తినాలి. ఆకలితో ఉండకూడదు.ఆరోజు ఎప్పుడు వస్తుంది ?
- ‘ఓం అభయం కర్యై నమః’
అమ్మవాక్యం : మీ భారం నామీద వెయ్యండి;నేను మోస్తాను (భారం అనికాదు).
*71. ‘ఓం దానవత్వ నివారిణ్యై నమః’
అమ్మవాక్యం : అసుర సంహారమంటే అసురుల్ని సంహరించటం కాదు; అసురగుణాల్ని సంహరించటం.
72.’ఓం పతిసేవాపరాయణాయైనమః’
అమ్మవాక్యం : నాకు పతిధ్యానమేకానీ పరధ్యానం లేదు.
- ‘ఓం పరమేష్ఠి కళారూపాయై నమః’
అమ్మవాక్యం : నేను సర్వసృష్టికారిణిని.
74.’ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః’
అమ్మవాక్యం : ‘ఆ అమ్మ’ ను తెలుసుకోవటానికే ‘ఈ అమ్మ’.
75.’ఓం పరమార్థ ప్రదాయిన్యై నమః’
అమ్మవాక్యం: విరామం లేనిది రామం, రాధ అంటే ఆరాధన, ధ్యాసే ధ్యానం, సాధ్యమైనదే సాధన.(ఎన్నో నిర్వచనాల ద్వారా యదార్థాన్ని పరమార్థాన్ని ఎరుకపరిచింది అమ్మ.)
- ‘ఓం మహనీయ స్వరూపిణ్యై నమః’
అమ్మవాక్యం : రూపం పరిమితం, శక్తి అనంతం.
- ‘ఓం మధురాయై నమః’
(అమ్మనామం, రూపం, వాక్కు, దృక్కు, మనస్సు, సంకల్పం, చేతలు, సాన్నిధ్యం మధురం; మధురాతి మధురం)
అమ్మవాక్యం : నేను మీకు లడ్డు. మీరు నాకు లడ్డు.
లడ్డు అవటం కంటే లడ్డు తినటం హాయి. (అమ్మ అమ్మగానూ, మనం తల్లి చాటు బిడ్డలుగాను ఉండి, అమ్మ చీరచెంగు పట్టుకొని లేక చిటికెనవేలు పట్టుకుని లేక పాదాల చుట్టూ పారాడుతూ, వేదవీధులలో విహరించడమే హాయి.)
78.’ఓం ఫణిరాజ ఫణాధారాయై నమః’
అమ్మవాక్యం : నాగేంద్రుడే నన్ను చుట్టుకొని ఉన్నాడు. నేను నాగేంద్రుని చుట్టించుకున్నాను. ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడై వస్తాడు. వాడు నాకు ఆధారం. వాడి ఆకారమే నేను.
79.’ఓం మధురాపురవాసిన్యై నమః’
అమ్మవాక్యం : కృష్ణుడు కాదు గృష్ణుడు. అగణితుడు గణితుడైనాడు. గుణములకు ఆధారమైనవాడు.
80.’ఓం రసాతల నిమగ్నార్త రక్షణాధిక కౌశలాయై,నమః
(లాలన, పాలన, పోషణ, రక్షణ, శిక్షణ – సముద్ధరణ; ఇదే తల్లి ధర్మం)
అమ్మవాక్యం : నేను తల్లి ధర్మం కోసం వచ్చాను.
81.’ఓం నిర్మమాయై నమః’
అమ్మవాక్యం : ఎవరిని చూసినా నాబిడ్డే ననిపిస్తుంది.
82.’ఓం ఔర్వాగ్నిభీషణజ్వాలాక్షుబ్ధసాగర గర్భిణ్యైనమః
(అమ్మ హృదయం సాగరం వంటిది. ఆ జలాల్ని ఎన్నో బడబాగ్ని జ్వాలలు దహిస్తున్నాయి. లోక కళ్యాణంకోసం కన్నబిడ్డనే కర్పూరహారతిపట్టింది, తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది.).
అమ్మవాక్యం : హైమను నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే చంపుకున్నాను, నేనే దైవతమిచ్చాను.
83.’ఓం సర్వసిద్ధి స్వరూపిణ్యై నమః’
అమ్మవాక్యం : మనస్సిద్ధే మనశ్శుద్ధి.
84.’ఓం గజాస్య జనన్యై నమః”
-(పార్వతీమాత వరసిద్ది వినాయకస్వామికి, అమ్మ అద్వైతసిద్ధి ప్రదహైమక్కయ్యకు దైవత్వాన్నిచ్చారు. )
అమ్మవాక్యం : హైమకు నేనే దైవత్వాన్నిచ్చాను.
85.’ఓం వివిక్తాయైనమ’
(ఏకం సత్ విప్రా బహుధావదన్తి’ అంటూ ఆర్షవాణి ప్రస్తుతిస్తుంటే ‘అసలు’, ‘ఏకాకిని’ అమ్మ.)
అమ్మవాక్యం : ‘ఒక్కటే’ అనేకమైంది.
- ‘ఓం రక్తాయై నమః’
(మానవునకీ మాధవునికీ మధ్యగల సంబంధం తల్లీబిడ్డల సంబంధం, రక్త సంబంధం అనే అద్భుత సత్యాన్ని అమ్మ మాత్రమే ఎలుగెత్తి చాటింది.)
అమ్మవాక్యం : రక్తమంతా ఈశ్వరతత్త్వమే.
- ‘ఓం జగన్మాత్రే నమః’
అమ్మవాక్యం : జగన్మాత అంటే జగత్తుకి మాత అనికాదు; జగత్తే తల్లి, సృష్టేదైవం.
- ‘ఓం రాధాయైనమః’
(భర్తని బిడ్డల్ని అమ్మ ఆరాధించింది. అందరిలోనూ దైవత్వాన్నే చూసింది. తత్త్వతః రాధాస్వరూపిణి అమ్మ.)
అమ్మవాక్యం : రాధ అంటే ఆరాధన
89.’ఓం వేదశాస్త్ర స్మృతివ్రాత సారభూతైక జీవితాయై నమః”
‘స్మృతి : ప్రత్యక్షం ఐతిహ్యం అనుమాన: చతుష్టయం’- అంటూ వేదాలు నాలుగు ప్రమాణాల్ని సాధికారికంగా పేర్కొన్నారు. అమ్మ జీవితం వేదసారం; వేదవేద్య అమ్మ. అమ్మ వాక్యాలన్నీ ఆచరణాత్మక ప్రబోధాలు, అనుభవసారాలు. కనుకనే అవి సత్యం, శివం, సుందరంగా ప్రకాశిస్తున్నాయి.)
అమ్మవాక్యం: నేనేం చదువుకోలేదు. చీపురు (ఋగ్వేదం), పొయ్యి (యజుర్వేదం), రోలు – రోకలి (సామవేదం), కత్తిపేట (అధర్వవేదం) ఇవే నా వేదాలు పంచమ వేదం (మహాభారతం) చేట.
90.’ఓం వరదాయిన్యై నమః”
(అమ్మ మానవాళికి అమోఘవరాన్నిచ్చింది.) ఈలోకంలో తల్లిలేని వారెవరూలేరు; అందరకీ నేనే అమ్మను – అని అన్నది. అసలైన అందరి అమ్మ.
అమ్మవాక్యం : నేనే మిమ్మల్నందరినీ కన్నాను; మీ తల్లులకు పెంపుడిచ్చాను.
సో॥ శ్రీపన్నాల రాధాకృష్ణశర్మ గారు రచించిన అంబికా (అమ్మ) సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేద్దాం. అమ్మ అనర్ఘ కళ్యాణగుణ పరంపరని కీర్తిద్దాం, మననం చేసుకుందాం; తరిద్దాం.