– (గత సంచిక తరువాయి)
‘నానా భయావహభవోత్కర బాధితస్య
కేనాప్యనల్పసుకృతేన మనుష్యయోనిమ్ ।
నీతస్య దుఃఖవిధుతస్య శివే నసూయే !
మాతర్భవాని ! మమ దేహి కరావలంబమ్ ॥ (5)
దీని అర్థం : ‘పరమేశ్వరీ ! శ్రేయస్కరి! ఇంత వరకు అనేక భయంకర జన్మ పరంపరలు నన్ను బాధించాయి. పూర్వపుణ్య ఫలముగా నేడు మానవ జన్మ ధరించితిని. అయినా నన్ను దుఃఖము విడువలేదు. దయతోనాకు నీ చేయూత నిమ్మా!’ అని.
రాగద్వేషాలు – ఇది కావాలి, ఇది వద్దు (likes and dislikes) అనేవి సంతోషాన్ని, దుఃఖాన్నీ కలిగిస్తున్నాయి. ఇందుకు హేతువుని చాల సున్నితంగా సూటిగా స్పష్టంగా వివరిస్తూ అమ్మ, “చింతకు కారణం నా స్వంతం అనుకోవటమే కదా! ‘స్వంతం’ అనుకోక పోతే సౌఖ్యానికి దారి లేదు. సౌఖ్యం గల దారిగా కనిపిస్తూ దుఃఖాన్ని ఋజువుచేస్తుంది నాది అనేది” అన్నది. “సంకల్పమే సంసారం” అన్నది అమ్మ.
అట్టి ‘సంసారం సాగరం దుఃఖం’ అన్నపుడు సంసారం రసబంధురం, రమణీయం, సకలార్ధ సాధకం అనీ గుర్తించాలి. కామ్యకర్మ, నిష్కామకర్మ దేనిని ఆచరించాలన్నా కరచరణాద్యవయవాల ద్వారానే సాధ్యం. శరీరధారులంతా మసలేది కర్మ భూమి మీదే, అవనీతలంపై. పైగా చాతుర్విధ ఆశ్రమ మనుగడకి జీవగర్ర గృహస్థాశ్రమమే.
అంతేకాదు. దైవానికి సృష్టిపైన, సృష్టిలోని సకల జీవకోటిపై ఉన్న కడుపుతీపి మమకార వైభవాన్ని గుర్తిచాలంటే గృహస్థాశ్రమమే రాచబాట, ఉత్కృష్టమైన ఉపకరణం, మార్గం. తల్లిదండ్రులు తమరక్తాన్ని పంచుకుని పుట్టిన సంతానాన్ని ఎంతగా ప్రేమిస్తారో; అంతగా- కాదు, కాదు; అంతకు వందరెట్లు అనురాగ రక్తసంబంధ బాంధవ్యంతో దైవం మనల్ని ప్రేమిస్తున్నాడు, సేవిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అందుకు విధేయతతో అంజలిఘటించి నమస్కరిస్తూ సర్వదా సర్వధా మనం కృతజ్ఞతతో శ్వాసించాలి. దీనినే ఆర్ష సంస్కృతి ‘భక్తి ప్రపత్తి- శరణాగతి’ అని నామకరణం చేసింది. జనన మరణరూపమైన సుఖదుఃఖ కారమైన కర్మబంధ విచ్ఛేదనానికి జన్మకారక ఆవర్తనచక్రవిమోచనానికి తరుణోపాయం మోక్షం. అందుకు మార్గాలు
రెండు : 1. భగవంతుని సేవ, 2. భగవంతుని రూపంలో ఉన్న మానవసేవ. కనుకనే మానవసేవని పరోపకారం అనుకోవటం పొరపాటు; అదే అక్షరాలా నారాయణ సేవ.
‘కేనాప్యనల్ప సుకృతేన మనుష్యయోనిం నీతస్య’ అన్నారు కవి.
పురాకృత పుణ్యఫలంగా మానవజన్మ ధరించాడు అని. మానవ జన్మ సర్వోన్నతమైనది, దుర్లభమైనది కావున అపురూపము అమూల్యము అని తలపోయటం పరిపాటి. ఈ సందర్భంగా మరొక ముఖ్యాంశాన్ని గమనించాలి.
‘Best are all things as ordained by the God, His creating hand, Nothing imperfect or deficient left’ అన్నారు Milton. మానవ పరిమిత దృష్టికి సృష్టిలో లోపాలు, అసమానతలు, అసమగ్రత, ఉదాసీనత కనిపిస్తాయి. సర్వం ఆశక్తి రూపాంతరమే అని యదార్ధం తెలిస్తే అన్ని వంకరలు మటుమాయమౌతాయి; “సృష్టి అంటేనే మాతృత్వం’ అన్నది అమ్మ. స్పష్టిని మించిన ఆత్మీయతా రూపం లేనే లేదు – అనీ తెలుస్తుంది. శ్రీ, లక్ష్మి, సంపద, విభూతి, miracle సృష్టికర్తకి మించిన mysterious power, వైభవము, ప్రసాదం అనే పదాలు సుబోధకం అవుతాయి.
అమ్మకి పసివాని ఏడుపూ ప్రణవనాదమే; కుంకుడుకాయలు కొట్టేరాయీ సాలగ్రామ శిలే; అజ్ఞానం, అశుద్ధం, అశక్తత… సర్వం ఆశక్తే.
ఈ విధమైన సత్యావిష్కరణ, దివ్యజ్ఞాన ప్రాప్తి నిమిత్తం మానవ జన్మ ఎత్తాక మహాపురుష సంశ్రయం కోసం తపించాలి. మనందరం ప్రేమైక రస రూపిణి, అనుగ్రహవర్షిణి కారుణ్యావతారమూర్తి అయిన అమ్మను ఆశ్రయించాం. అవతారమూర్తి అమ్మ దరిచేరిన తర్వాత ఏం చేయాలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు.
‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ॥
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వ దర్శినః
ప్రణిపాతేనః (సాష్టాంగ నమస్కారం చేయాలి)
అమ్మను కిరీట ధారిణిని చేసి, గళ సీమలో సుమనోహారాన్ని వేసి, పాదాలను పంచామృతాలతో అభిషేకించుకోవటం ఆనందించటం మనవంతు.
కానీ అమ్మకి అందులో ఆనందం లేదు. బాధితులను ఆదరించి, గుండెలకు హత్తుకుని, ప్రేమతో వారి కన్నీటిని తుడిచి, తన చేత్తో వారికి కడుపునిండా అన్న ప్రసాదాన్ని పెట్టుకోవటం ఇదే అమ్మకి ప్రియమైన యాగం, ధర్మం.
పరిప్రశ్నేనః (ప్రశ్నించి సందేహాల్ని నివృత్తి చేసుకోవటం)
సోదరుడు : ‘మాయ’ అంటే ఏమిటమ్మా?
అమ్మ : నేను చేస్తున్నాని అనుకోవటం.
సోదరుడు : ‘రామం అంటే ఏమిటి?
అమ్మ : విరామం లేనిది.
సోదరుడు : ఏం చేస్తే బ్రహ్మత్వ సిద్ధి వస్తుంది?
అమ్మ : ఏం చేసినా రాదు. ఆ శక్తి ఇస్తే వస్తుంది.
సోదరుడు : నువ్వు ఎవరికి అమ్మవు ?
అమ్మ : నీకు, మీకు, అందరికీ… పశుపక్ష్యాదులకూ, క్రిమికీటకాదులకూ. సోదరుడు : నువ్వు జగన్మాతవు కదా!
అమ్మ : జగన్మాత అంటే జగత్తుకి మాత (తల్లి) అని కాదు. జగత్తే మాత. సృష్టే దైవం.
ఈ విధంగా పలువురు పలు విధాలుగా ప్రశ్నించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
సేవయా : ఇందుకు శంకరులు రెండు మార్గాలను సూచించారు.
‘జగన్మాతర్యాతః తవ చరణసేవా న రచితా
నవా దత్తం దేవి! ద్రావిణ మపి భూయ స్తవ మయా |
అంటూ. అంటే ప్రత్యక్షంగా, రెండవది పరోక్షంగా – సంస్థ రూపంగా ఉన్న అమ్మకి సేవలందించటం అందరింటి అభ్యుదయ పథకాలకి, అభ్యున్నతికి ధన వస్తురూపేణ సహాయపడటం, పాటుపడటం.
వీటి అవసరం ఏమిటి అని ప్రశ్నించుకుంటే – అకారమే వికారంతో వచ్చింది; ఆ వికారాల్నీ, వాసనల్నీ తొలగించుకోవాలి, నిర్మలత్వాన్ని పొందాలి. దానికి అలౌకిక శక్తి సంపన్న అమ్మ అనుగ్రహం కావాలి.
ఆవుదూడ జన్మనెత్తి నేల మీద పడగానే దాని దేహాన్ని (వత్సము) మా విమురికి ఆవరించి ఉంటుంది. దానిని సబ్బుతో రుద్ది శుభ్రం చేయలేము. గోమాత ప్రేమతో నాకి శుభ్రం చేస్తుంది. అంతే. మార్గాంతరం, గత్యంతరం లేదు.
మన మనోమాలిన్యాల్నీ అమ్మయే ప్రేమతో కడిగి మంచి ముత్యాలుగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ఈ నేపధ్యంలో శ్రీ శర్మగారు సవివరంగా ఇలా ప్రస్తావించారు. – అమ్మా! మనుష్య జనతా భాగ్య రూపిణీ! పరమేశ్వరీ! తల్లీ! నైరాశ్యముతో కృంగి పోయిన, అజ్ఞానాంధకారములో మునిగి దైన్యముతో ఉన్న, తెలిసీ తెలియని సందిగ్ధావస్థలో పడి కొట్టుమిట్టాడుతున్న, అరిషడ్వర్గములచే అణచివేయ బడిన, పూర్వ జన్మ కర్మానుభవ సంప్రాప్త దుఃఖపరితప్తుడనైన, నీ పావన మహిమాన్విత సాన్నిధ్య సౌఖ్యాన్ని మరిచిన, గర్వాంధకారముతో అధోగతి పాలగుచున్న, కాలప్రవాహంలో ఆపదలలో పడి మృత్యుముఖములో ఉన్న, జీవన యానంలోని ఆటుపోటులకి సూటీ పోటీ మాటలకి మనశ్శాంతిని కోల్పోయిన, కర్తవ్యాన్ని విస్మరించి జడప్రాయంగా ఉన్న, నువ్వు నాకళ్ళ ఎదుట ఉన్నా కానలేకుండా మూడుడనై ఉన్న.. నాకు దయతో నీ చేయూతనిమ్మా!
ఈ శైలి, పోకడ సత్సంప్రదాయ బద్ధమూ, పరంపరాగతము. కానీ అమ్మ విధానం, దృష్టి, తత్వం వేరు. ‘నమ్మిన వారికీ – నమ్మని వారికీ; వచ్చిన వారికీ రాని వారికీ… అందరికీ సుగతే నని బేషరతుగా వరాన్ని ప్రసాదించింది. ఈ స్తోత్రపఠన ఫలితాన్ని వర్ణిస్తూ ‘అనుత్తమ సౌఖ్యదాయి’ అన్నారు. అంటే సర్వశ్రేష్ఠమైన ఆనందాన్ని ఇస్తుంది అని. ‘రసోవైసః’ అన్నట్లు సర్వోత్కృష్టమైనది, సర్వమంగళ అయినది అమ్మ.
ఈ కరావలంబ స్తోత్ర పఠనలక్ష్యం: ఉద్ధరణం, ఉద్వహనం. అంటే అధోగతి పాలగుచున్న వ్యక్తిని ఊర్ధ్వస్థితికి చేర్చుట. ఈ సందర్భంలోనే శ్రీరాధాకృష్ణశర్మ మరొక ముఖ్యాంశాన్ని ప్రస్తావించారు.
‘కిం వాభవేత్ తవ కృపాంతు ఋతే నసూయే । అని అంటే ‘నీ కరుణ లేకపోతే ఏమై ఉండేదో!’ అని. శ్రీ సీతాపతి గారితో అమ్మ, “కరుణ లేకపోతే మనమే లేము. మనం చేసే పనులన్నీ కరుణ వల్లనే. నా దృష్టిలో కష్టసుఖాలు రెండూ కూడా కరుణ వల్లనే. ప్రతిచిన్న పని మన చేతులతో చేస్తున్నామనుకున్నా, మనం ఎట్లా చేసినా వాడి కరుణ వల్లనే. మనకు కనపడకుండా ఆయా తరుణాల్లో ఆయాపనులు చేయించటమే కరుణ”. అన్నది.
అమ్మ కరుణ అకారణమూ, అనంతము, అగ్రాహ్యము అనిర్వచనీయము.
– ఏ ప్రార్థనని ఆలకించి అమ్మ అందరింటిని నెలకొల్పింది?
ఏ తపస్సుకి మెచ్చి అన్నపూర్ణాలయాన్ని స్థాపించి, అన్నప్రసాదాన్ని జ్ఞానభిక్షను అనవరతం అందిస్తోంది?
ఏ కన్నీళ్ళకి ద్రవించి తన కన్నబిడ్డని కర్పూర హారతి పట్టింది? తన మంగళ సూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరిచింది?
అమ్మకి సహనం, కరుణ, ప్రేమ సహజ ధర్మాలు; అది దైవలక్షణం, స్వభావం.
అచంచలమైన విశ్వాసం కలగటానికి మనం అమ్మను ప్రార్థించాలి. కంటికి కనిపించని ఆదైవమే కంటికి కనిపించే అమ్మ అని గుర్తించేందుకు; నిజ జీవితంలో ఆయా తరుణాల్లో స్పృహతో అమ్మ కరుణని, ప్రసాదాన్ని గుర్తించేందుకు, పొందేందుకు ఒక సాధనం శ్రీ అంబికా కరావలంబ స్తోత్ర నిత్యపారాయణం.
తరింప చేసే తల్లి మన అనసూయ మాత. అట్టి అమ్మ చేయూత శ్రీకరము, శుభకరము, కళ్యాణకరము.