శ్రీ అనసూయేశ్వరాలయంలో నాన్నగారు ఆలయప్రవేశం చేసిన తర్వాత అమ్మ ప్రత్యక్షసన్నిధిలో నిత్యం సామూహికంగా శ్రీ అంబికాసహస్రనామపారాయణ చేసేవాళ్ళం’ అని ఇటీవల సోదరీ శ్రీమతి సుగుణ తెలిపింది.
30 సం॥ల సుదీర్ఘకాలం గడిచిన తర్వాత అమ్మ అనుగ్రహం వలన మరల ఆ మార్గంలో పయనిస్తున్నాం. 14.4.2011 తేదీ నుండి 12.6.2011 తేదీ వరకు ఎందరో సోదరీసోదరులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు.
14.6.11 తేదీకి శ్రీ విశ్వజననీపరిషత్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు సోదరీ సోదరులు వై. భాస్కరరావు, ఎన్. భ్రమరాంబ, బి. వసుంధర, ఎమ్. దినకర్, బి.యల్.సుగుణ, బి. రామబ్రహ్మం, ఆర్.శ్రీలక్ష్మి, ఆర్.పద్మ, కె. జానకి, జి.నరళ, ఎస్. లక్ష్మీపుష్పవతి, డి.కమల, ఎ. హైమ, ఎన్. రమ, పి. చిన్నమ్మాయి, యు.వరలక్ష్మి, ఎమ్. సుబ్బలక్ష్మి, వి. హైమ, వి.సీత, ఎ.యస్.చక్రవర్తి, ఎ.వి.యస్. సుబ్రహ్మణ్యం, డి. పద్మావతి, టి. ఆంజనేయులు, డి.లక్ష్మీ నరసమ్మ, గంగమ్మ, డా.రామతులసి, ఎ. లక్ష్మీపార్వతి, మధు, జె. సరస్వతి, జి. పద్మ, కె. సత్యవతి, ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం … మున్నగు వారి అన్యోన్య సహాయంతో చేసిన నామపారాయణ 22 లక్షలు. 14.6.2011 తేదీన అమ్మ ఆలయప్రవేశం చేసిన సందర్భంగా కార్యక్రమాల్లో లక్షమల్లెపూలతో అమ్మకు అర్చనచేసి లక్షల పారాయణని సభక్తికంగా సమర్పించడమైనది.
మనశ్శుద్ధే మనస్సిద్ధి. పరిశుద్ధమైన మనస్సే దైవానికి రత్నసింహాసనం. అది అసంఖ్యాక మహిమల్ని ప్రదర్శిస్తుంది. అఖండ ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. భౌతికంగా చూస్తే సకలనాడులు, ధాతువులలో స్పందనలు కలిగి రక్తప్రసరణ, జీర్ణక్రియ, ఇంద్రియ చలనము మొత్తం శారీరక వ్యవస్థ చక్కబడుతుంది. ‘నేను అఖండ నామస్తోత్రం చేస్తున్నాను’ అనే సంకల్పం వాతావరణం (ambience) మానసిక అలజడిని రూపుమాపి శాంతిని కలిగిస్తుంది.
శ్రీ ‘జగన్మాతా, మధురానందదాయినీ, జగదారాధ్యా, మోక్షసామ్రాజ్య సౌఖ్యదా, కేవలప్రేమరూపిణీ, నిత్యాన్నదానరసికా, అభయంకరీ, పరబ్రహ్మస్వరూపిణీ’ వంటి నామాలు సులభంగా అర్థం అవుతాయి. అవన్నీ అమ్మ అనుగ్రహావతార మహత్తత్వానికి దర్పణం పడతాయి. మనస్సు ఆనందప్రఫుల్ల మవుతుంది. మరుపు మరణ సమానం, మానవ సహజం. అందుకు ఈశ్వర కళ్యాణ గుణస్మరణం, మననం దివ్యౌషధం, రాజమార్గం.
అంతేకాదు. ‘ధ్వని’ అనేది ఎంతో ఆసక్తికరమైన ప్రధానమైన అంశం. నామాపారాయణ రుచి దీనిమీదే ఆధారపడి ఉంటుంది. ఆర్తిపరంగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క స్వరస్థాయి ఉంటుంది.
‘అప్రమేయ స్వరూపా’, ‘ఊహాతీతమహాశక్తి’, ‘ఆద్యా’, ‘పరమేశ్వరీ’ వంటి నామములు అమ్మ స్వస్వరూపాన్ని దర్శింప చేస్తాయి.
‘మోక్ష సామ్రాజ్యసౌఖ్యదా’, ‘శోకహారిణీ’, ‘విశ్వాసదాత్రీ’, ‘సద్గతిప్రదా’ వంటివి. అమ్మ అనుగ్రహించే దివ్యవిభూతులను దర్శింపచేస్తాయి. ‘స్వోత్సంగాశ్రయ హృష్టాత్మధిక్కృత స్వర్గవైభవా’, ‘మధురోదారసల్లాపద్రావిత క్రూరమానసా’ వంటివి అమ్మ దివ్యమాతృప్రేమను ప్రస్తుతిస్తాయి.
సందిగ్ధవేదశాస్త్రార్థ సిద్ధాంతయితభాషితా’, ‘విద్విషద్వేషహారిణీ’, ‘వేదశాస్త్రస్మృతి వ్రాతసారభూతైక జీవితా వంటివి అగ్రాహ్యమైన అమ్మ తత్త్వజలధి లోతుల్లోకి తీసుకుపోతాయి.
జిజ్ఞాస, వర్ణన, అభ్యర్థన, శరణాగతి … భావాలతో ఆయా పావన నామపరంపర ప్రాభవాన్ని మననం చేసుకుంటూ పఠిస్తే లభించే ఇహపరసౌఖ్యాలు అగణితం అనుభవైక వేద్యం.
పారాయణకర్తల సౌలభ్యం కోసం పాకెట్సైజ్ పుస్తకంలోని అచ్చుతప్పులు, సవరణలను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. పునర్ముద్రణలో వాటిని సరిచేస్తామని మనవి చేస్తున్నాము.
ఎవరు అన్నం తింటే వారి కడుపు నిండుతుంది, వారి ఆకలి తీరుతుంది.
కాగా సామూహిక పారాయణ ఫలం వ్యక్తిగత లభేకాక విశ్వకల్యాణమూ కదా !
కావున వచ్చే సంవత్సరము మరింత ఉత్సాహంతో అనుభవంతో ఆసక్తితో ‘అఖండ అంబికా సహస్రనామ పారాయణ యజ్ఞం’లో అందరం పాల్గొందాం.