1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శ్రీ అనసూయా కల్యాణం

శ్రీ అనసూయా కల్యాణం

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : May
Issue Number : 10
Year : 2014

మే 5 వ తేదీ అనగానే వినగానే జగన్మాత అమ్మ, జగత్పిత నాన్నగార్ల కళ్యాణదినోత్సవ వేడుకలు, సంబరాలతో మనస్సు పరవళ్ళు తొక్కుతుంది;

‘జగతః పితరౌ వన్డే’ – అని మనోజ్ఞంగా నర్తిస్తుంది. కారణం అది జగత్కళ్యాణ యజ్ఞానికి శుభముహూర్తం, శుభారంభం.

ఆరోజు మనందరిని అమితానంద భరితుల్ని చేసే సన్నివేశం – కులము, గోత్రము, వయస్సుతో నిమిత్తము లేకుండా అమ్మ (పెళ్ళికూతురు) వైపు ఒక దంపతులు, నాన్నగారు (పెళ్ళికొడుకు) వైపు ఒక దంపతులు పీటల మీద కూర్చుంటారు; నాన్నగారి కాళ్ళు కడిగి అమ్మను కన్యాదానం చేస్తారు.

శ్రీ సీతారామకల్యాణ సందర్భంగా జనకమహారాజు శ్రీరామచంద్రునితో అన్న మాటలు :

(… ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ॥

ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృష్ణాష్వ పాణినా।

పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతాసదా ॥ –

అంటే ఈ సీత నా కుమార్తె; నీ సహధర్మచారిణి కాబోతున్నది. ఈమె సౌభాగ్యవతి, పతివ్రత. ఈమె పాణిగ్రహణం చెయ్యి. నీకు సకల శుభాలు కలుగును. నీడవలె నిన్ను అనుసరించి సదా ఎడబాయక ఉండును) – స్మరించుకుంటూ 

‘ఈ అనసూయ నా కుమార్తె. నాయనా ! నాగేశ్వరరావు ! ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె సౌభాగ్యదేవత. పతివ్రతయై నీకు సకల సౌఖ్యములు, శుభములు కలిగించును’ – అని గర్వంగా పురాకృతతపః ఫలంగా ఆనందాతిరేకంతో చెప్పే శుభఘడియలు అవి; అదే మే 5వ తేదీ. కాగా

అమ్మ మన్నవ వారి ఆడపడుచు కదా ! మన్నవ సీతాపతి తాతగారి కూతురు కదా ! నా కూతురు ఎట్లా అవుతుంది అని ప్రశ్నించుకోవచ్చు. నాకు తెలిసిన వాస్తవం ఏమంటే – అమ్మకి మనందరం బిడ్డలు అనేది త్రికాల సత్యం. 

అదే సమయంలో మగవారిని ‘నాన్నా!’ అనీ, ఆడవారిని ‘అమ్మా!’ అనీ కోట్లాది పర్యాయములు నిండు మనస్సతో నోరోరా అమ్మ పిలిచేది. అవ్యక్త మధురమైన ఆ పిలుపులో అమ్మ శరీరంలోకి ప్రతి అణువు స్పందించేది, మమకార సాగర తరంగాలు ఉవ్వెత్తున లేచి ఉప్పెన వలె మనల్ని ముంచెత్తేవి.

అమ్మకి మనం తల్లిదండ్రులమే; సందేహం ఏమీ లేదు. అమ్మ ఆద్యంతరహిత; అమ్మకి జననీ జనకులు లేరు వాస్తవానికి. అట్టి మూలప్రకృతికి తల్లిదండ్రులు కావటం మన అదృష్టం.

ఒక ఏడాది మా దంపతులం పీటలు మీద కూర్చున్నాం. మంగళసూత్రాలు, నల్లపూసలు, మెట్టెలు తెచ్చుకుని; అమ్మ కడుపు చలవ కోసం చలిమిడి, పసుపు కుంకం, చీరె సారె సమకూర్చుకున్నాం. పాణిగ్రహణ మహోత్సవ సమయంలో కలిగిన ఆనందం అనన్య సామాన్యం అనుభవైకవేద్యం. ఆ ఏడాదే మా పెద్దమ్మా, చి.సౌ.అనసూయ పెళ్ళి అయ్యింది. ఇంకా ఎన్నో శుభాలు, లాభాలూ కలిగాయి.

ఒక సంస్కార దీపం, మహోన్నత భావం :

ఆరోజుల్లో సీతాపతి తాతగారు అమ్మను నాన్నగారికి ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయించి శుభలేఖలు కూడా అచ్చు వేయించారు. అమ్మ, నాన్నగారు మేనత్త మేనమామ బిడ్డలే. కొన్ని కారణాల వల్ల ఆ లగ్నానికి వివాహం కాలేదు.

కానీ –

లగ్ననిర్ణయం చేసిన నాన్నగార్ని తన పతిదేవునిగా అమ్మ నిర్ణయించుకున్నది, తన నిశ్చితాభిప్రాయాన్ని నాన్నగారికి మనవి చేసింది. వారి రెండు పాదాలు పట్టుకొని “మీ పాదసేవ సర్వార్థ సాధకం” అని అంటుంది. ఆ సమయంలో అమ్మ కన్నీరు ఒలికి నాన్నగారి పాదాలపై పడి రెండు నీటిబిందువుల్లా ఉన్నాయి. అందు నాన్నగారి ముఖం ప్రతిఫలించింది. నాటి వరకు నాన్నగారి పాదాలనే కాని ముఖం ఎన్నడూ అమ్మ చూచి ఉండలేదు. ఆ క్షణంలో కోరుకున్నది అదే విధంగా నాన్నగారి వదనమండలం సర్వత్రా ప్రతిఫలించాలని. దీనిని బట్టి అమ్మ హృదయం సముద్రమంత గంభీరమని, అమ్మ మనస్సు మేరు పర్వత సమున్నతమైనదని తెలుస్తుంది.

ది. 5.5.1936 వ తేదీన నాన్నగారితో అమ్మ వివాహం జరిగింది. “మంగళసూత్రాలంటే భర్త రెండు పాదాలు” అంటూ అనుదినం ఉదయాన ముఖప్రక్షాళ నానంతరం వాటిని అభిషేకించి ఆ తీర్థాన్ని స్వీకరించేది అమ్మ. ఆ సూత్రాలే అన్ని సూత్రాలను తెలిపేవట. ఆ తీర్థం తీసుకున్నందువలన సర్వులకూ తీర్థం వేసే యోగ్యత కలిగిందట.

“స్త్రీణాం ఆర్య స్వభావానాం పరమం దైవతం పతిః

(పూజ్యస్వభావం గల స్త్రీలకు భర్తే దైవం) – అనే అనసూయ సాధ్వి ఆరోక్తికి అమ్మ గార్హస్య జీవితం ఆచరణ రూపం.

మరొక విశేషాంశం :

కన్యాదాన సమయంలో ‘అనసూయా నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం’ అని శ్రీ సీతాపతి తాతగారి గొంతుతో సంకల్పం చెపుతాం; సాక్షాత్ లక్ష్మీస్వరూపిణి యైన ‘అనసూయ’ అనే కన్యను దానం చేస్తున్నాను – అని.

ఎవరికి ?

నాగేశ్వరరావు శర్మణే సాక్షాత్ విష్ణుస్వరూపాయ వరాయ దాదామి. అంటే శ్రీ మహావిష్ణు స్వరూపులైన నాగేశ్వరరావు అనే వరునికి ఇస్తున్నాను- అని.

ఈ సందర్భంగా నాకు తెలిసిన, తెలియని అనేకానేక సంగతులున్నవి.

అ) తెలిసినవి – 

– మన అనసూయ మాత సాక్షాత్తు పరాత్పరి.- ప్రతి ఏటా మే 5వ తేదీన తన ప్రణాళికలో భాగంగా సిద్ధంగా ఉన్న పెద్దగుడి గర్భాలయంలో ప్రవేశించి అనుగ్రహ దేవతగా దర్శనం ప్రసాదించి; భవిష్యత్లో ఆలయ రూపాన్ని కళ్ళకి కట్టినట్లు దర్శింపచేసింది.

– ఆనాడు ప్రతి ఏటా ఏదో ఒక ప్రజాహిత సంస్థ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టింది.

ఆ) తెలియనవి :

-నాన్నగారు నాగేంద్రుడే అని అమ్మ తన ఎనిమిదవ ఏటనే స్పష్టం చేసినా నాన్నగారిలోని దైవీ సంపత్తిని దర్శించలేదు.

– నాన్నగారి తత్వం సోమశేఖరతత్వం.

– నాగేంద్రుడు అంటే మన వెన్నంటి కాపాడేది.

– అమ్మ చేసి అసామాన్యమైన త్యాగం.

తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది; కన్నబిడ్డని కర్పూరహారతిగా పట్టింది.

ముందుగా, 1981లో, నాన్నగారిని ఆలయ ప్రవేశం చేయించింది. పాతివ్రత్యం, పసుపు కుంకుమలు, సుమంగళి .. పదాలకి వినూత్న విప్లవాత్మక నిర్వచనాలను ఆచరణాత్మకంగా ప్రబోధించింది. 1985 లో పతిదేవుని సరసన సుప్రతిష్ఠిత అయింది. ఇంతటికీ హేతువు అమ్మ కడుపు తీపి, మాతృధర్మ పరిరక్షణ, సకల జీవకోటి సముద్ధరణ – ఇదే అమ్మ చేసిన త్యాగం.

‘ప్రకృ తిష్ఠతి ఇతి ప్రతిష్టా’ –

ఎన్నటికీ చెక్కు చెదరక సుస్థిరంగా నిలబడేదే ప్రతిష్ఠ,

అమ్మ ఎక్కడకూ పోలేదు; పోదు.

మనలోనే, మనతోనే ఉన్నది. మన మనో మందిరాల్లో శ్రీమత్సింహాసనేశ్వరియై విరాజిల్లుతోంది. వెలుపల శ్రీ అనసూయేశ్వరాలయంలో శ్రీ జగదేకైక శాసని పరిపాలిస్తోంది.

ఆది దంపతులు, కళ్యాణమూర్తులైన అమ్మ, నాన్నగారల దివ్యాశీస్సులు అనవరతం అందరిపై వర్షించుగాక!

లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు !!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!