ప్రతి ఏటా అమ్మ ఆలయ ప్రవేశం చేసినరోజు (అమ్మ అనంతోత్సవం)న మనం శ్రీ అనసూయేశ్వరాలయ శిఖరానికి తెలియదు. కుంభాభిషేకం నిర్వహించుకోవాలి.
వాస్తు పురుషుని ఆకృతిరీత్యా ఆలయశిఖరం అంటే అర్చామూర్తి శిరస్సు. కావున శిఖరానికి అభిషేకం అంటేనే వాస్తవానికి అమ్మకి అభిషేకం చేసినట్లు. ఈ సత్యాన్ని అమ్మ అచరణాత్మకంగా ప్రకటించింది. ప్రతిసంవత్సరము మే 5వ తేదీ (అమ్మ కల్యాణ దినోత్సవం)న దేవ్యాలయ ఉపరిభాగాన టెంకాయలు, గుమ్మడికాయలు అసంఖ్యాకంగా పగులగొట్టేది, నా దృష్టిలో అది
‘అగ్నయే స్వాహా,
విశ్వేభ్యో దేవేభ్య స్వాహా,
ధర్మాయ స్వాహా, అధర్మాయస్వాహా”… అనే వైశ్వదేవ బలులు. ఆలయ శిఖరానికి హరిద్రాకుంకుమరాశులతో అభిషేకించేది. నా దృష్టిలో అది విశ్వశాంతి స్థాపన లక్ష్యంతో చేసే
పృథివీ శాన్తి రంత రిక్షణం శాన్తి శ్వాశ్శాన్తి ర్దిశశ్శాన్తి
రవాన్తర దిశాశ్శాని రగ్ని శ్శాని ర్వాయు శ్శాన్తి
రాదిత్య శ్శాన్తి శ్చంద్రమా శ్శాన్తి రృక్షత్రాణి శ్శాన్తి
రాప శ్శాన్తి రోషధయ శ్శాన్తి – అనే శాంతి హోమం.
శంకుస్థాపన చేసిన నాటి నుంచీ దానిని పెద్దగుడి అనీ, దేవ్యాలయం అనీ పిలిచేవారు. భవిష్యత్తులో అందులో అర్చామూర్తి “అమ్మ” అనీ శ్రీ రాజుపాలెం రామచంద్రరావు గారి వ్యాసం వల్ల కూడా అందరికీ తెలుసున్నది. ఆ క్రతువు ముగిసిన వెంటనే అమ్మ ఆలయ గర్భాలయంలో ప్రవేశించి వరదాభయ హస్తాలతో కారుణ్యరసాధిదేవతగా దర్శనం అనుగ్రహించేది; తన శుభసంకల్పాన్ని కళ్ళకి కట్టినట్లు దర్శింపచేసేది.
అమ్మ చేతల్లో మంత్రం ఉండదు, కాని తంత్రం ఉంటుంది. లోకంలో కొన్నిసార్లు మంత్రార్థ జ్ఞానం లేక మంత్రం చదువుతారు; చేసేది భిన్నంగా చేస్తారు. ‘అగ్నౌ. ప్రహరతి’, ‘అగ్నౌ అనుప్రహరతి’ రెంటికీ తేడా చాలా మందికి తెలియదు.
“నేను ఏమి వేయవలసి వచ్చినా గాడిపొయ్యిలోనే వేస్తాను” అనే అమ్మ వాక్యం ‘అగ్నిముఖావైదేవాః’ అనే ఆర్షవాక్యాన్ని చక్కగా ప్రబోధిస్తుంది. అమ్మ వేదవిహిత కర్మలను ఆచరించేది. నిరతాన్నదానం వైశ్వానరాగ్నికి నిత్యం చేసే తండుల హోమం కాదా ?
ఇప్పుడు సదాచార సనాతన ధర్మస్వరూపిణిగ అమ్మను దర్శిద్దాం. అమ్మ రోజూ 4, 5 సార్లు స్నానం చేసేది. విశేష గా ప్రతి పర్యాయం 40, 50 బిందెల నీళ్ళు పోసుకునేది. 103, 104 డిగ్రీలజ్వరంతో ఉన్నాసరే స్నానం చేసి వచ్చి దర్శనం ఇచ్చేది. కడిగిన ముత్యంలా, సానబెట్టినా వజ్రంలా, స్వయం ప్రకాశ మాన సూర్యభగవానునిలా ప్రకాశించేది. అది విశ్వాంతరాత్మకి విశ్వజనని చేయించే అభిషేకమే. అమ్మకి తన శరీరమే ప్రధాన ఉపకరణం విశ్వ కల్యాణ కారక లక్ష్యసాధనకి. అమ్మకు మడి లేదు, మైల లేదు అని కొందరంటూంటారు. ఎవరైనా, ఎప్పుడైనా తాకవచ్చు అని. అన్నీ తానైనా శరీరం దాల్చిన అమ్మకి అన్నీ ఉన్నాయి. “మీరు బురద పూసుకొస్తే కడిగి శుభ్రం చేయాల్సిన బాధ్యత నాది” అని తన తల్లి ధర్మాన్ని వివరించింది.
(గర్భాలయంలోని అర్చామూర్తిని తాకనివ్వరు), అలాగే మఠాధిపతులూ, పీఠాధిపతులూ వారి పాదాలను తాకనివ్వరు. అందులో రహస్యం ఇదే. కానీ అందరి మలినాల్ని, మైలని అమ్మ స్వీకరిస్తుంది. విశేషస్నాన ప్రక్రియలో క్షాళనం చేసి, మరల పున్నమి చంద్రునిలా, జ్ఞాన స్వరూపంలా, మూలప్రకృతిలా దర్శనం అనుగ్రహిస్తుంది. రాజుబావ ‘పతిత మానవ వ్యధాకలిత హృదయ హృదయంతరాళములో మలినమంతయు వెలికి లాగి కడిగి వేసే జాహ్నవీవె” అని కీర్తించారు పరమపావని అమ్మని.
అమ్మ అనురాగరక్తాన్ని పంచుకుని పుట్టిన జగన్మాత ముద్దుబిడ్డలం మనం. అమ్మ బిడ్డలకి వాస్తవంగా జన్మదినం వారు ప్రప్రధమంగా అమ్మను దర్శించిన రోజు. ఆ క్షణాన అవ్యాజమైన కన్నీటి ప్రవాహంతో ప్రతి ఒక్కరు అమ్మ శ్రీ చరణాలను అభిషేకించినవారే. దీనిని (Baptism of tears) కన్నీటిలోని దివ్యత్వం అని అంటారు. సో॥ ఆచార్య ఎక్కిరాల భరద్వాజతో పుట్టినపుడు శిశువు ఎందుకు ఏడుస్తాడో ఇందుకు అదే కారణం అని అమ్మ అన్నది. అంటే అది ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక పునర్జన్మ అని అర్థం.
అమ్మ కంటే సౌందర్యలహరి సృష్టిలో లేదు. జగన్మాతకి మనకి, గతంలో ఎన్నో జన్మలుగా బంధం తెగిపోయినట్లు దూరంగా ఉంటూ వచ్చామో. అమ్మను చూడగానే ‘రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యుత్సుఖితోపి జంతుః’ అని కాళిదాసు మహాకవి అన్నట్లు జన్మాంతర మమకార దివ్యబంధాలు జ్ఞప్తికి వచ్చి ఆనందరసార్ణవంలో మరల ఒక మునక వేయటమే అమ్మ అపురూప దర్శన రహస్యం.
అదే సమయంలో వాత్సల్యామృతరసవాహిని అమ్మ తన కృపావృష్టితో మనల్ని తడిపి ముద్ద చేస్తుంది.
(ఆవుకు దూడ పుట్టగానే శరీరంపై మాయ అనే మురికి ఉంటుంది. దానిని ‘వత్సము’ అని అంటారు. తల్లి ఆవు, ఆ మురికిని నాకి దూడను శుభ్రం చేస్తుంది. ఆ కన్నప్రేమను వాత్సల్యం అంటారు) అమ్మ దర్శనఫలాన్ని వివరిస్తూ అమ్మ “నన్ను చూడటమే లక్ష్యాన్ని గమ్యాన్ని పొందటం” అని అన్నది.
“అందరికీ సుగతే” అని అమ్మ మాత్రమే ప్రప్రధమంగా ఉద్ధరించింది. భేషరతుగా సకలజీవకోటిని “తెలిసిన వాడికి తెలియనివాడికీ, నమస్కారం చేసిన వాడికీ – చెయ్యని వాడికీ, నమ్మిన వాడికీ – నమ్మని వాడికీ, విన్నవాడికి – వినని వాడికీ, వచ్చినవాడికీ – రానివాడికీ అందరికీ ఒకే గతి” అని స్పష్టం చేసింది.
‘నాస్తికునికీ సుగతి ఉన్నదా, అమ్మా ?’ అని ప్రశ్నిస్తే “నాస్తికుడైనా, ఆస్తికుడైనా ఎవరైనా సరే, నేను ఇవ్వదలచుకున్ననప్పుడు ‘వాడికి సుగతి’ – దుర్గతి అనేదెక్క డుంది?” అని ప్రశ్నిస్తూ సందేహ నివృత్తి చేసింది.
అట్టి సర్వశుభంకరి అమ్మకి శైత్యోపచారం చేద్దాం శిశువులంతా కలిసి. వేసవికాలం సాయంసమయంలో స్నానం చేస్తే మనకి ఎంత హాయిగా ఉంటుందో సంవత్సరానికి ఒక్కసారైనా ఆలయ శిఖరానికి కుంభాభిషేకం చేస్తే అర్చామూర్తి (చల్లని తల్లి అమ్మ)కి అంత హాయిగా ఉంటుంది.
‘ఆలయం, అని నామకరణం చేసింది అమ్మ. ఇక ఆలయ లక్షణాలు, ఆలయ మర్యాదలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు నిర్వహించాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉన్నది.