అశరీరం వావ సంతం న ప్రియా ప్రియే స్పృశతః – శరీరభావం లేనివాణ్ణి సుఖదుఃఖాలు తాకజాలవు’ అని స్పష్టంగా వివరించారు. (ఛాందోగ్య ఉపనిషత్తు)
మా అమ్మగారు శ్రీమతి నడింపల్లి అనసూయమ్మ గారు, మా బాబాయి కీ.శే. నడింపల్లి పాపరాజుగారు ఆయన సతీమణి మా పిన్ని, మనవిన విమలమ్మగారు, మా బంధువుల ఆమె, జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించుటకు వచ్చారు. బాపట్ల వచ్చేటప్పటికి చీకటిపడింది. శ్రీభావ నారాయణస్వామి వారి గుడి సమీపంలో ఒక వ్యాన్ ఆగి వుంది. ఆ డ్రైవర్ వీరిని ఎక్కించుకొన్నాడు. ఇంకొంతమంది ప్రయాణీకులు కూడా ఎక్కినారు. జమ్ములపాలెం వచ్చిన తర్వాత వ్యాను ఇక వెళ్లదు, దారి బావుండలేదు, చీకటి అని అనగానే మిగిలిన అందరూ దిగేసి వెళ్ళారు. ఈ ముగ్గురు అక్కయ్యలు వున్నారు. వంటి మీద బంగారం, మధ్యవయస్సువారు. కొంచెం మా అమ్మగారే పెద్దది. డ్రైవర్ వీళ్లని ఈ రాత్రికి మా యింటికి రండి మా ఆడవాళ్ళు కూడా వున్నారు. అందరం భోజనాలు చేసి, సెకండ్ షో సినిమాకి వెళ్తాం అని అంటున్నాడు. మా అమ్మగారు వెంటనే ఇక్కడనుండి మమ్మల్ని బాపట్ల తీసికెళ్ళమని అని అనగానే తిరుగు ముఖంపట్టాడు. రాత్రికి పళ్ళు కొనుక్కుంటామని అని అడిగితే ఎక్కడో గుడిసెలున్న చోటున ఆపాడట. చప్పున వాన్ దిగి పళ్ళ దుకాణంలో పండ్లు కొనుక్కుని పొట్టి ప్లీడర్ గారింటికి వచ్చారట. ఆయన మంచినీళ్ళిచ్చి చాప యిస్తే ఆ రాత్రికి వరండాలో పడుకొని తెల్లారి అమ్మ వద్ద కెళ్ళారు. మా పిన్ని అమ్మకు ఆ సంఘటన వర్ణించి చేస్తోందట. దానికి సమాధానంగా అమ్మ వాడా శంకరుగాడు నాకు తెలుసు అని అన్నదట.
అమ్మ అప్పటి నివాసగృహం పూరిపాక. వీరు మరల తెల్లారి తిరుగుప్రయాణం కట్టారు. కీ.శే. శ్రీ యార్లగడ్డ రాఘవయ్యగారు రచించిన పుస్తకం మా అమ్మకు, లలితా సహస్రం మా పిన్నికి. మా చుట్టాల ఆమెకు కుంకుమ పొట్లం ఇచ్చింది అమ్మ. ఆ అక్కయ్య అమ్మను కావలించుకొని ఎక్కులు పెట్టి ఒకటే ఏడ్చిందట.
గూడవల్లిలో 7 గురు, మాయింట్లో 7 గురు అందరం చిన్న వాళ్ళమే. అందరం చదువుల సంరంభంలో వున్నాం. నేను మరీ చిన్నదాన్ని. మా బాబాయి గూడవల్లి కరణంగారు. 40 ఎకరాల మాగాణిపొలం, ఎద్దులబండ్లు, ఆవులు, కడివెడు పాలిచ్చే గేదెలు ఇంటినిండా వేరుశెనగ కాయలు బస్తాలు ఓహ్ అలనాటి వైభవం. మా పిన్ని ప్రతి శుక్రవారం పాలతో వుడికించే పొంగలి, దద్ధోజనం చేసేది. ఏ శుక్రవారం అన్నా మర్చిపోయినా, బద్ధకించినా, ఈ కడివెడు పాలు గోవింద. ఆ గేదె కాస్త తన్నిపాలిచ్చేది. ఆ కాదు. చూశారా మన జిల్లెళ్ళమూడి అమ్మవారి గొప్పదైన చరిత్ర. ఇక మాయిల్లు సరస్వతీ కంఠాభరణమే సుమా. ఇంటినిండా పనిమనుషులు, పిండివంటలు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అదొక గుప్తరాజుల స్వర్ణయుగం వలె వుండేది. మా పెద్ద అన్నయ్య శ్రీ నడింపల్లి సత్యన్నారాయణ, M.Sc. (Tech) Meteriology and ocanography అతి చిన్న వయస్సు కావడంతో – ఎక్కువ చదువుతో బలహీనుడై పోవడంతో ఇల్లంతా అయోమయంలో పడిపోయింది. – మా అమ్మగారు శోకదేవతై పోయింది. మరల శ్రీ అమ్మవారి యొక్క సాంగత్యబలంతో గోవాడకరణం గారి సంస్థానం బలపడి వృద్ధిలోకి రావడం తటస్థపడింది. మా అమ్మకు దుఃఖోపశమనం కల్గింది అప్పటికాలంలో. జిల్లెళ్ళమూడి బురదవూరు ప్రవాహంలో వున్న నల్లమడడ్రైన్, ఎటుచూచినా, దిబ్బలు – జిల్లెళ్ళు – వాగులు, వంకలు, దారిలేని డొంకరోడ్డు – చింత, ఉసిరిక, గోంగూర చారునీళ్ళు, మజ్జిగనీళ్ళు – మరి ఇప్పుడో శ్రీ అమ్మగారి అనుగ్రహ సంపద. శ్రీ విశ్వజననీ పరిషత్ ఏర్పాటై అనేక బ్రాంచీలుగా విభజించారు. ఐనప్పటికి కాలప్రవాహంతో ఎన్నో అద్భుతాలు జరిగినా ఆ కుగ్రామం నుండి యిప్పటికి కూడా ఎటునుంచి చూచిన 20 కి.మీ. దూరం వరకు ఏ జనం సంచారం కన్పడదు. చిన్న సూది కావాలన్నా టౌను రావాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ ద్వీపకల్పంలో తనపాటికి తానొక స్వచ్ఛంద సేవాసంస్థగా కొనియాడబడ్డూ – శ్రీ విశ్వజననీపరిషత్ – అందరి సంతోషమే తన సంతోషమని పల్కుతోంది. అందరి కోరికలను తీర్చటమే తనధ్యేయంగా చెప్తోంది. తోటి మనిషిని ప్రేమతో పల్కరించి గుక్కెడు మంచి నీళ్ళిచ్చి ఆదరించమని గొంతెత్తి పాడుతోంది. అన్ని రంగాల్లో ఉత్తమంగా రాణించి, భారతదేశపు ఔన్నత్యమును ఎలుగెత్తి చాటమని జండా ఎగురవేస్తోంది. మానవతా విలువలకు శ్రీకారం చుట్టి చింతలన్నీ రూపు మాపేస్తానని శపధం చేసింది. అందరూ ఈ యజ్ఞంలో పాల్గొని తరించండి. ఆ కుగ్రామంలోని కరణంగారికి భార్యయై ఆ వూరికి కోడలుగా అడుగుపెట్టి – అనసూయేశ్వర గోపురంగా మారింది అమ్మ. ఇవన్నీ కూడా మనం చూసినవే కదా. అందువల్ల సందేహాలు, భయాలు, బిడియాలు, అను మానాలు, తీర్మానాలు, చట్టాలు, వాదోపవాదాలు, ఖండనలు, అపోహలు, ప్రశ్నలు, జవాబులు, లౌకికాలు, రగడలు, రచ్చలు, చర్చలు, అన్నింటికీ స్వస్తిపల్కి శ్రీమాతృశ్రీ చరణారవిందయోః సర్వం సమర్పయామి అని అనండి. అందరం అందాము.