సహజసేవాసక్తి సంప్రదాయపు రక్తి
జతచేసి యోగిగా సాగువాడు.
మనసులో నున్నదే తనువుతో చేయుచు
ధనమును వెచ్చించి తనరువాడు.
హృదయనైర్మల్యన ముదమార నవ్వుచు
స్నిగ్ధమాధుర్యాన చెలగువాడు
ఆత్మీయమైత్రితో ఆప్యాయతలతోడ
మానవత్వమ్మున మసలు వాడు
మధురవాత్సల్యమూర్తియౌ మాతృమూర్తి
పాదములు పట్టి – విశ్వాసపరతతోడ
అమ్మ సేవయె శ్వాసగా అలరువాడు.
తంగిరాల కేశవశర్మ ధన్యు డిలను
కళ్యాణానందనాధ నామాంకితు డాతండు
కళ్యాణ స్వర్ణోత్సవ విభవోజ్జ్వలు డాతండు
శారద హృదయాంతరంగ విశారదుం డాతండు
స్వచ్ఛమైన దరహాసము చిందించిన వాడాతడు
నష్టమ్ములు కష్టమ్ములు నవ్వుతూ అనుభవించు
అనుగ్రహము నర్ధించెను అఖిలలోకజనని
అడిగినదే తడవుగ వరాలిచ్చు దేవతగద
అడిగీ అడగకముందే అనుగ్రహించినది అమ్మ
సంసారపు ఒడిదుడుకులు సంతానపు ఒడిదుడుకులు
అన్నిటినీ నవ్వులోన అనుభవించు వాడాతడు
కన్నకొడుకు కళ్ళముందు బలియైనా చిరునవ్వే
తనను తాను అర్పించిన నవ్వే శరణ్యమైనది
తనకున్నను లేకున్నను ధర్మకార్యమొనరింపగ
తననుతాను కుదువపెట్టుకొన్నట్టి త్యాగధనుడు.
తన ఆశయ సాధనకై తనకున్నది అమ్మివేసి
సర్వస్వము అర్పించెడి ఆదర్శపు వీరుడతడు
ఆతం డొక వ్యక్తికాదు సామూహికశక్తి అతడు
నలుగురిపని తానొక్కడె అనాయసముగా చేయును
పనిలో నిస్పృహ పొందడు మధ్యలోన ఆపబోడు
కడదాకా సాగించే ప్రజ్ఞాధీరుం డాతడు
యేబడేండ్ల పైచిల్కుగ అమ్మచూపు అనురాగము
ఆప్యాయత వాత్సల్యము జుట్టుకొన్న భాగ్యశాలి
అమ్మ ఇచ్చు అనుభవాల అంతరంగ తరంగాల
ఓలలాడినట్టి వాడు క్రియాశీలి యైనవాడు
కష్టసుఖము లమ్మ ఇచ్చు ప్రసాదమని భావించెను
అమ్మకు తగు బిడ్డడగుచు అహర్నిశము తపియించెను
జీవితమొక యజ్ఞముగా జీవించిన అగ్రజుడు
సేవలోన జీవితమ్ము పండించిన వాడాతడు
విశ్వాసము రూపమెత్తి కేశవశర్మగ మారెను
శ్వాసశ్వాస అమ్మాలయ వైభవమే నినదించెను
మైత్రీ మానవతల మారుపేరు కేశవుడు
ఆప్యాయత ఆత్మీయత కసలుపేరు కేశవుడు.
అనన్యమౌ విశ్వాసపు రూపమ్మే కేశవుడు
అచంచలమ్మౌ సేవకు చిరునామా కేశవుడు