1959-60లలో నేను మా తమ్ముడు రామకృష్ణ ఇంకా కొంత మంది స్నేహితులం చీరాల VRS & YRN కాలేజీలో చదువుతుండే వాళ్ళం. సాయంత్రాలు చీరాలలో కొత్తమాసువారి తోటదాటి, రైల్వేలైను దగ్గర క్రికెట్ ఆడుకుని తిరిగి వచ్చేవాళ్ళం. మేము వెళుతుండే సమయానికి ఒక స్ఫురద్రూపి. యువకులకు, కొందరు పిల్లలకు తోటముందు ఖాళీ స్థలంలో వ్యాయామమూ, కర్రతిప్పటమూ నేర్పుతుండే వారు. మేము తిరిగి వచ్చేసమయానికి అందరినీ కూర్చోపెట్టి ఏవేవో విషయాలు చెప్తూ ఉండేవారు. నేను అప్పుడప్పుడూ ఆగి ఆయన చెప్పేవి విని ఇంటికి వస్తూ ఉండే వాడిని.
ఒక రోజు వారు రవీంద్రనాథ్ టాగూర్ జనగణమన గురించి మాట్లాడుతున్నారు. వేటపాలెంలో సారస్వత నికేతనం అనే పెద్ద గ్రంథాలయానికి మా తాతగారు గౌరవ కార్యదర్శి. మా ఇల్లు గ్రంథాలయానికి ఆనుకునే ఉండటంతో నేను అధిక సమయం గ్రంథాలయంలోనే గడపడం అలవాటు. టాగూర్ గీతాంజలి, టాగూర్ రీడర్ దాకా దాదాపు అన్నీ చూడటం జరిగింది. అందుకని వారు మాట్లాడేవి కొన్ని నాకు రుచించలేదు. వారు చెప్పడం అయిపోయి అందరూ వెళ్ళిపోయినా నేను అక్కడే ఏదో ఆలోచిస్తూ నిలుచోవడం చూసి వారు నా దగ్గరికి వచ్చారు. “ఏమిటి? ఆలోచిస్తున్నారు? అంటూ – “ఫలానా పుస్తకంలో ఇలా ఉంది కదా” అంటూ నా సందేహాన్ని బయట పెట్టాను. అదా! అని నవ్వి వెళ్ళి పోయారు. తర్వాత అప్పుడప్పుడు అలాగే వారి ప్రసంగాలు వింటూ ఉండేవాణ్ణి. తర్వాత అప్పుడప్పుడు అలాగే వారి ప్రంగాలు వింటూ ఉండేవాణ్ణి. ఏవో కబుర్లు చెప్పేవారు. అలా పరిచయమైన వ్యక్తి అప్పట్లో RSS ప్రచారక్ గా ఉన్న శ్రీ తంగిరాల కేశవశర్మగారు. ఆ విధంగా వారికీ నాకూ దాదాపు 50 సం॥ల పరిచయం.
తర్వాత వారిని నేను జిల్లెళ్ళమూడిలో అమ్మ దగ్గర చూడటం జరిగింది. వారు తరచుగా అమ్మ దగ్గరకు వచ్చేవారు. కానీ అక్కడ పలకరింపుగా ఒక చిరునవ్వు వయోభేధం ఉన్నది కదా! ఒక రోజు రాత్రి అన్నయ్య ఒక 40 లేక 60 పేజీల నోట్సుపుస్తకంలో వచన కవిత తాము వ్రాసినది – అమ్మకు చదివి వినిపించారు. ఆ సమయంలో నేను అమ్మ గదిలోనే వున్నాను. అమ్మ ఆ పుస్తకాన్ని తీసికొని ‘చూడరా’ అని నా చేతికి ఇచ్చింది. ఆ రచనలోని తీవ్రమైన భావావేశం, ఉద్వేగం నన్ను ఎంతగానో కదిలించి ప్రభావితం చేశాయి.
మా నాన్నగారు కీ.శే. రామచంద్రరావుగారికీ, కేశవశర్మగారికీ మంచి పరిచయం. ఆ విధంగా మాస్టరుగారి అబ్బాయిలు శేషు, కిష్టుగా వారికి గుర్తు ఉండి పోయాము. వారికి ఏదైనా పుస్తకాలు కావలసివస్తే. వేటపాలెం గ్రంధాలయానికి వచ్చేవారు. తరువాత కాలంలో నేను కొన్నిసార్లు వారికి కావలసిన పుస్తకాలు వారికి చేర్చి తిరిగి లైబ్రరీకి చేర్చేవాడిని. కొన్ని నా స్వంత పుస్తకాలు కూడా వారికి బాగా నచ్చినవి. తీసుకొని చూసి ఇచ్చేవారు. శ్రీచక్ర ప్రతిష్ఠ ఆలోచన చాలా బలీయంగా ఉండి దాని గురించిన ప్రసంగం వచ్చినప్పుడు శ్రీచక్రం గురించి ఈ మధ్యన వచ్చిన రెండు పుస్తకాలు వారు నా దగ్గర తీసికొని చూశారు. ఆ తర్వాత అందులో మాస్కో యూనివర్శిటీ వారు శ్రీచక్ర అధ్యయనాన్ని గురించి వ్రాసిన భాగం జిరాక్స్ కాపీ కావాలన్నారు. కానీ ఆ పుస్తకం నాకు సరైన సమయంలో తిరిగి కన్పించక కాపీ ఇవ్వలేక పోయాను.
శ్రీచక్రం గురించీ, ఆలయం గురించీ మా నాన్నగారు అమ్మ తనతో చెప్పిన విషయాల గురించి వ్రాసికొన్న విషయాలను హైదరాబాద్ వచ్చినప్పుడు చూశారు. అది ఆర్టికల్గా పంపించమని గట్టిగా చెప్పారు. (ఆ వ్యాసం Mother of All లోనూ విశ్వజననిలోనూ గూడా ప్రచురిత మయింది). అమ్మ ఆలయంలో బయట తొమ్మిది ఖాళీ గూళ్ళలో పిండ దశలు అని వారు అనుకునేవారు. కాని నాన్నగారు వ్రాసికొన్న దానిలో నవావరణలు ఏండదశ, జన్మించిన శిశువు, దోగాడే పాప, కన్య, వధువు, గృహిణి…. వృద్ధస్త్రీ చీపురు చేటతో రోకలితో కూర్చుని ఉన్నట్లు ఉన్నది. దానిని నాన్నగారు తాము వ్రాసే ఒక పుస్తకానికి అట్టలాగా వేసికొందామని తమ్ముడు చి॥ రామకృష్ణ చేత బొమ్మ వేయించి పెట్టుకొన్నారు. మధ్యలో బిందువు, త్రికోణం, నవచక్రాలు, నాగేంద్రుడు, త్రికోణం మధ్యలో అమ్మ, చుట్టూ పరిభ్రమిస్తూ పై తొమ్మిది రూపాలువున్న ఈ బొమ్మ చూశారు. “అరే! ఇది నేనెప్పుడూ చూడ లేదే! దాని కాపీ ఇవ్వు దీని మీద కూడా చర్చ జరగాలి” అని ఒక జిరాక్స్ కాపీ నా దగ్గర తీసుకున్నారు (హైద్రాబాద్లో వారు సంతకాల సేకరణకు వచ్చినప్పుడు). తాము పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనే మూర్ఖపు పట్టుదల వారికి ఎప్పుడూ లేదు. ఎంతో ఓపెన్గా ఉండేవారు. కాని నమ్మిన దాన్ని ఎంతో బలంగా త్రికరణ శుద్ధిగా పట్టుకోవడం వారికి తెలిసినట్లు ఎవ్వరికీ తెలియదు అనుకుంటాను.
ఈ అర్ధ దశాబ్ది కాలంలో కేశవ అన్నయ్యగారిని ఎన్నోసార్లు కలిసి వారి ప్రేమను ఆస్వాదించాను. అటువంటి ప్రేమమూర్తి హఠాత్తుగా నిష్క్రమించడం జిల్లెళ్ళమూడి సోదరసోదరీమణులందరితోపాటు నాకు గూడా వ్యక్తి గతంగా తీవ్రమైన వెలితిగా అన్పిస్తున్నది. వారు అమ్మలోనే ఉన్నారు, ఉంటారు. ఖి