“ధన్యతమం ధన్యతమం మాత: మమజీవనం” అని ఒక ఉపనిషత్ సమాన వాక్యాన్ని అమ్మతో అనిన అనతగిన అనుభవం గల ఒక ఉత్తమోత్తమ వ్యక్తిని గూర్చి, వారి మంచి వ్యక్తిత్వాన్ని గురించి మనం తెలుసుకుందాం. తలుచుకుందాం. అమ్మ దర్శనమాత్రం చేతనే వారు ధన్యులుకారు, ధన్యతములయినారట.
ఒకరి సాధన, ఒకరి సిద్ధులు మరి ఒకరు ప్రస్తావన చేయటం, చేయాలనుకోవటం అంత సాధ్యమయిన విషయం కాదు, కానీ వారి శిష్యరికంలో బ్రతికి, ఒక బ్రతుకు తెరువుగన్న నేను పలకటం సముచితమే అని అనుకుంటున్నాను. మనం ఈ కళాశాల విద్యార్థులం. అందరం కూడా ఒక గొప్ప సుకృతం కలవారమే. ఎంతో గొప్ప సుకృతం ప్రేరేపించక పోతే మనం ఇంత గొప్ప, అవతారమూర్తి, ప్రేమ స్ఫూర్తి, దయాకృతి, కరుణావర్తిని అయిన అమ్మసన్నిధికి వచ్చి ఉండటం; వచ్చాక కూడ అమ్మ సన్నిధి సుఖం, సౌకర్యములే కాక జీవిత ఆదర్శాలను ఆచరణలో పెట్టుకుని జీవించే మన గురువర్యుల ఆదర్శాలను, ఆధ్యాత్మికతను ప్రతిరోజు కళాశాలలో అవగాహన చేసుకుంటూ వారి వాక్కులను, తత్త్వబోధనలను ప్రతిరోజు చెవులారా వింటూ మనసారా ఆస్వాదిస్తూ మనం 5 సంవత్సరాల కాలం గడపటం మన జీవితానికి, జీవిత కాలానికి ఒక అపూర్వ అదృష్టకాలం.
శ్రీశర్మగారు దర్శనానికి అమ్మవద్దకు వచ్చే రోజుల్లోనే అమ్మలోని అలౌకిక దివ్యతత్త్వాన్ని అర్థం చేసుకుంటూ ఉండేవారు. ఆ దర్శనంలో అమ్మ ప్రసాదించిన నిదర్శనాలు చూచి ఊరుకోక వారు దర్శించిన తత్త్వాలు, సత్యాలు తన తోటి సోదరులందరికీ అందాలని, తరింపు కావాలని తలంపుతో వాటినన్నింటిని అక్షరబద్ధం చేసి కవితల రూపంలో గానయోగ్యత, ధ్యాన యోగ్యత నిచ్చే స్తోత్రాల రూపంలో రచించి అమ్మకు వినిపించేవారు. వాటిని వింటున్న అమ్మ ఆనందం, వినిపిస్తూ తరిస్తున్న మన గురువుగారి ఆనందం వాచామగోచరంగా ఉండేది. అమ్మ ‘సంధ్యావందనం’, అమ్మ ‘సుప్రభాతం’, అమ్మ ‘కరావలంబ స్తోత్రం’ ఇలా చాలా రచనలు అప్పుడప్పుడు వారి నోట వెలువడినవే. అమ్మ వారి రచనలను, స్తుతులను విని పరవశించి వారిని ‘అపరశంకరులు’ అని ప్రశంసించింది.
వారు తమ బాల్యంలో సంస్కృతం నేర్చుకునే సమయంలో విద్యార్థిగా కొన్ని బాధలు పడుతుండగా వారి మదిలో ‘నాలాగా భాష అధ్యయనంలో ఎవరూ కష్టపడకుండా ఉండే విధంగా నేను విద్యాబోధన చేయగలగాలి’ అనే ఒక శుభసంకల్పం చేసుకున్నారట. ఆ శుభసంకల్పం యొక్క శుభఫలితమే ఈ కళాశాలగా రూపం పొంది, ఇంతమంది విద్యార్థుల మనుగడకు మార్గమయింది. అమ్మ ‘నాన్నా! సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్ గా వస్తావా!’ అని ఆహ్వానించటం ఈ రెంటికి సమన్వయం కుదిరింది. అమ్మ సంకల్పం మన గురువర్యుల బాల్య సంకల్పమే మనందరి ఈ కళాశాల విద్యార్థినీ విద్యార్థుల పాలిట ఒక వరంగా రూపొందింది. జిల్లెళ్ళమూడి కళాశాల రాష్ట్ర సంస్కృత కళాశాలలకు ఆదర్శంగా ఉండాలని భావించేవారు. ఈ కళాశాల అతి చిన్నపల్లెలో ఉన్నా దీని ఫలితాలు, విద్యాప్రమాణాలు రాష్ట్రస్థాయిలో గొప్పగా ఉండాలని మనసారా కోరుకునేవారు. ఈ కళాశాలలో సంస్కృత తెలుగు విభాగాలు రెండు నిండుగా ఉండేందుకు సంస్కృత, తెలుగు విభాగాలలో మంచి విద్యా సంపన్నులు, సమర్థులయిన ఉదార చరితులయిన గురువులను నియమించారు. తాము కళాశాలను నిర్వహిస్తూ, అమ్మ తత్త్వ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ కళాశాల నిత్యపాఠ్య కార్యక్రమాలను విద్యార్థినీ విద్యార్థుల పాఠ్యబోధలకు ఎమీ లోపం జరగకుండా ఉండే విధంగా ఒక ప్రిన్సిపాల్గా శ్రీ విశాల రామచంద్రమూర్తిగారిని, సంస్కృత విభాగానికి శ్రీ శ్రిష్టి ప్రసన్నాంజనేయశర్మ గారిని, శ్రీ శ్రిష్టి కుమారశర్మ గారిని, తెలుగు భాషకు శ్రీమతి ఉప్పల వరలక్ష్మిగారిని ఏర్పరిచారు. కళాశాల నిర్వహణ బాధ్యతను, అమ్మతత్త్వ ప్రచార కార్యక్రమాన్ని విద్యార్థులకు సకల ఏర్పాట్లను సమభావంగా పోషించేవారు.
ఇన్ని భిన్న విషయాలను సమన్వయంగా సమబుద్ధితో చూస్తూనే వీరు తమ స్వంత పి. హెచ్.డి డిగ్రీని ఆంధ్రా యూనివర్సిటీ ద్వారా పొందారు. ఉపాధ్యాయులను గౌరవిస్తూ, విద్యాప్రమాణాలు తగ్గకుండా ఉండేట్లు చూస్తూ వీరు విద్యార్థుల విద్యా ప్రమాణాలు యూనివర్శిటీ స్థాయిలో పెరగాలని, విద్యార్థుల విజయాలు కూడా తమ కళాశాల ద్వారా జరగాలని కోరుకునేవారు.
ఇంతమంచి మన గురువర్యులు అమ్మ పరిపూర్ణ దయచే సృష్టించబడిన మన మాతృశ్రీ ఓరియంటల్ – సంస్కృత కళాశాలలో నేను ప్రథమ విద్యార్థినికావటం నా సుకృతకారణం అనుకుంటాను. వారు తమ కున్న అన్ని ప్రత్యేకతలు తన విద్యార్థినీ విద్యార్థులకు, తమ వద్ద పని చేయు విద్యా ఉపాసకులకు ఉండాలని కోరుకునేవారు. అది వారి విశిష్ట గుణం.
రాష్ట్రస్థాయిలో మన కళాశాల ఉత్తమస్థాయి కలది కావాలనే వారి కోర్కె అమ్మదయతో నా పట్ల ఫలించింది. నేను చేరిన రెండవ సంవత్సరం నుండి రాష్ట్ర స్థాయిలో జరిగే సంస్కృత వక్తృత్వ పోటీలకు నన్ను తీసుకెళ్ళేవారు. అందు ప్రథమ బహుమతి వచ్చింది. అన్ని రాష్ట్రాలలో జరిగే ఆ సంస్కృత వక్తృత్వ పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు నాకు ప్రాప్తించేవి. నా విద్యార్థి దశ చివరి సంవత్సరంలో కాశీలో జరిగే సంస్కృత వక్తృత్వ పోటీకి తీసుకు వెళితే అక్కడ అన్ని శాస్త్రాల్లో ద్వితీయ బహుమతులు, కవిత జయదేవుని అష్టపదుల గానం పోటీలో ప్రథమ బహుమతి వచ్చాయి. కేరళలో జాతీయస్థాయిలో జరిగిన సంస్కృత వక్తృత్వ పోటీలో ద్వితీయ బహుమతి ప్రాప్తించింది.
మన సంస్కృత కళాశాలలో నేను ఉపన్యాసకు రాల నయ్యాను. మన కళాశాలలో చదువుకుని, మన కళాశాలలో ఉపాధ్యాయునిగా పని చేసి, ఇక్కడే రిటైర్ అయ్యాను.
మన గురువుగారు పి. హెచ్.డి. పూర్తికాగానే మన కాలేజీ స్టాఫ్ అందరిని కూడ పి.హెచ్.డి. చేయమని ప్రోత్స హించారు. మన కళాశాల టీచర్లందరూ పి.హెచ్.డి. పట్టభద్రులే. మనం మన గురువుగారిలో గమనించ వలసినది, అన్ని పనులు తృప్తిగా చేయటం, ఫలితం అమ్మదయవల్లనే అని అనుకోవటం, అహంకార రహిత జీవనం, మితభాషణం, హితభాషణం.
మన రావూరి ప్రసాద్ అన్నయ్య వారిని చక్కగా ప్రశ్నించి వారి అత్యుత్తమ మాతృసేవలను వారి మాటలలో మనం వినేట్లు మన కందించారు. వీడియో ప్రదర్శన ద్వారా నెట్ లో పెట్టిన వారికి కృతజ్ఞతలు. (డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మగారు 12 ఏప్రియల్ 2020న పరమపదించారు. ఈ వ్యాసం వారి సంస్మరణార్థంగా…)