లక్షలమంది ‘అమ్మ’ను దర్శించారు. అందులో కొన్ని వందల కుటుంబాలు తమ జీవితము, జీవనమూ అన్నీ అమ్మ ప్రసాదాలనే సంపూర్ణ విశ్వాసంతో అమ్మ చుట్టూ అల్లుకొని, పెనవేసుకొని అమ్మతోటిదే తమ జీవితంగా జీవనం సాగిస్తున్నాయి. మంచి చెడులు, సుఖదుఃఖాలు సర్వద్వందాలు అన్నీ భగవత్ ప్రసాదాలే అన్న ‘అమ్మ’ను త్రికరణశుద్ధిగా విశ్వసిస్తూ, ఎప్పుడు ఏమివస్తే దాన్ని అనుభవిస్తూ, అంతా అమ్మ అను గ్రహమన్న సమన్వయ భావనతో సడలని విశ్వాసంతో తమ జీవనాన్ని గడుపుతున్నాయి. అలాంటి కుటుంబాలలో కీ॥శే॥ శ్రీ జన్నాభట్ల వెంకటరామయ్య గారి కుటుంబం ఒకటి.
శ్రీ వెంకటరామయ్యగారిది గుంటూరులో సంప్రదాయ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. పిత్ర, పితామహులు వేద పండితులు, సదాచార సంపన్నులు. శ్రీవెంకటరామయ్యగారు గుంటూరులోని హిందూకాలేజి హైస్కూలులో ఉపాధ్యాయుడుగా పనిచేసే రోజులలో ‘అమ్మ’ పెద్దకుమారుడు కీ.శే. శ్రీ బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్యకూడా అదే స్కూలు లైబ్రరీలో పనిచేసేవారు. ఒకసారి వారిమధ్య మాటలలో జిల్లెళ్లమూడి అమ్మ ప్రస్తావన వచ్చినపుడు, ఆవిడ మా అమ్మే అన్నారు సుబ్బారావు అన్నయ్య. 1960 ద్వితీయార్థంలో ఆ తర్వాత కొద్దిరోజులకే సుబ్బారావు అన్నయ్యతో కలసివచ్చి, మొదటిసారి అమ్మని దర్శించారు శ్రీ వెంకటరామయ్య గారు. అమ్మను చూడగానే తెలియని అవ్యక్తానందాను భూతి ఆయన్ను ఆవహించి, పరవశంతో పులకించి పోయారు. ఆనందాశ్రువులతో అమ్మపాదాల్ని అభిషేకించి, ఆ దివ్యపాదాలపై ఒరిగిపోయారు. ఆయనపై అమ్మ తన అవ్యాజకరుణను వర్షించింది.
వీరి భార్యపేరు సీతారావమ్మ గారు. ఈ దంపతులకు సంతానం నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. వారి పిల్లలతోపాటుగా ఇద్దరు, ముగ్గురు దాకా వారాలు చేసి చదువుకొనే పేదవిద్యార్థులు యింట నిత్యం భోజనాలు చేసేవారు. మడి, ఆచారాలతో, సంధ్యావందనాది, జప, పూజాక్రతువులతో అతిథి అభ్యాగతులతో పూటకి రమారమి 15, 20 మందికి తక్కువ లేకుండా భోజనాలు జరిగేవి వారింట. భర్త అభీష్టానికి అనుగుణంగా మడితో వంటచేసి అందరికీ ఆదరంగా అన్నం పెట్టేది ఆ ఇంటి ఇల్లాలు శ్రీమతి సీతారావమ్మగారు. శ్రీ వెంకటరామయ్య గారితోపాటు, ఆ కుటుంబసభ్యులందరికీ క్రమంగా అమ్మ జిల్లెళ్లమూడితో అనుబంధం బలపడింది. సదాచార సాంప్రదాయాలను అనుక్షణం విశ్వసించి పాటించే శ్రీమతి సీతారావమ్మగార్కి మొదటిసారి అమ్మని దర్శించినపుడు, అన్నపూర్ణాలయంలో అందరూ కలిసి ఏ పట్టింపులూ లేకుండా భోజనాలు చేయడం కష్టంగా తోచింది. అక్కడ భోజనం చేయటానికి మనస్కరించక అన్నతినకుండా ఉంటే, అన్నీ తెలిసిన అమ్మ ఆమెను తనవద్దకు పిలిపించి అన్నపూర్ణాలయం నించి ఆహారాన్ని తెప్పించి తానే ఆమెచేత అన్నం తినిపించితే, ఏ అభ్యంతరాలు లేక ఎంతో ఆనందంగా, మహాప్రసాదంగా ఆహారాన్ని ఆవిడ స్వీకరించింది. అనంతర కాలంలో ఆమెలోని కులభేద భావతీవ్రత సమసింది.
వీరి పెద్దకుమారుడు శ్రీ వీరభద్రశాస్త్రి కూడా చిన్ననాటి నుంచే ‘అమ్మ’యందు అచంచల భక్తివిశ్వాసాలు కలవాడు. అమ్మతో చాలా చనువుగా మెసిలేవాడు. తాత, ముత్తాతలనుంచి సంక్రమించిన ఆచార, వ్యవహారాలు, నియమ నిష్ఠలు, పూజా పునస్కారాలు, యజ్ఞ యాగాదులు, సనాతన ఆధ్యాత్మిక క్రతువులందు ఆసక్తి, అనురక్తి మెండు. డిగ్రీ చదువు పూర్తి అయిన వెంటనే అమ్మ అనుగ్రహంతో మంచి ఉద్యోగాన్ని పొంది, తండ్రిచేతికి అందివచ్చిన తనయుడతడు. అమ్మ ఇచ్చిన చనువుతో అమ్మను తన హాస్యసంభాషణలతో ఆనంద పరచిన హాస్యచతురుడు. జిల్లెళ్లమూడి ఆలయాలలో జరిగే అనేక అభిషేక పూజాకార్యక్రమాలలో పాల్గొని అమ్మని అర్చించుకొంటూనే, అక్కడ జరిగే యజ్ఞయాగాదులు, విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలలో పాల్గొనటమే కాక, నిర్వహణ బాధ్యతలు చేపట్టి, ప్రముఖ భూమిక పోషించిన కార్యదక్షుడు.
ఆ రోజులలో ఎవరైనా గుంటూరు వెళుతున్నామని అమ్మతో చెబితే, మీ పని అయ్యాక వెంకటరామయ్య గారింటిలో భోజనం చేయమని అమ్మ అనేది. అమ్మ చెప్పిందికదా! అని గుంటూరులో వారింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవారు. అలా జిల్లెళ్లమూడి నుంచి వచ్చే సోదరీసోదరులను అతిథి మర్యాదలతో ఆనందంగా ఆదరించేవారు శ్రీ జన్నాభొట్ల వారు. గుంటూరులో మాతృశ్రీ స్టడీ సర్కిల్ ఉండేది. నెలకొకసారి ఇంట్లో అమ్మ పూజలు జరిగేవి. ఏదైనా వాటి విషయంగా వెంకట రామయ్యగారితో మాట్లాడదాం! అని గుంటూరులోని సోదరులు వెళ్ళినప్పుడు ఆయన పలకరింపులోని ఆప్యాయతను వినితీరాల్సిందే! లోపల పనిచేసుకొంటున్న భార్యనుద్దేశించి ఏమోయ్! ఇదిగో! మీ తమ్ముడొచ్చాడు చూడు! అని కేకవేసి భార్యతో పెద్దగా చెప్పి, తర్వాత వచ్చిన వారిని కుశల ప్రశ్నలు వేసేవారు. ఇక వారి పిల్లలు, చిన్నా, పెద్దా అంతా ఆ తల్లితండ్రులకు తగ్గవారే. అందరూ తమ ఇంటికి రావాలని కోరుకోవటమే కాదు. భోజనం కూడా చేయాలని పట్టుబట్టేవారు.
శ్రీ వెంకటరామయ్య గారి 2వ కుమారుడు జొన్నాభట్ల రాము నాకు మంచి స్నేహితుడు. నేను కానీ, మన్నవ దత్తుగానీ ఎప్పుడయినా గుంటూరు వెళితే, వాళ్ళింట్లో భోజనం చేయాల్సిందేనంటూ బలవంతపెట్టి వారింటికి మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. విసుగూ, విరామం లేకుండా సీతారావమ్మ అక్కయ్య నిత్యం కుటుంబ సభ్యులతో పాటు, అతిథి అభ్యాగతులకందరికీ కలిపి రోజూ దాదాపు ఒక చిన్న గుండిగ అన్నం వండేది. మేం వారింట భోజనాల సమయంలోపు వాళ్ళపిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకొంటూ, కేరింతలతో సరదాగా గడిపేవారం. భోజనసమయం కాగానే అక్కయ్యవచ్చి మా అందరితో, నాయనా మాట్లాడుకొని, మాట్లాడుకొని అలసిపోయారు కానీ ‘ఇక అన్నానికి లేవండి’ అన్న పిలుపులోని సామాన్య మధ్యతరగతి కుటుంబపు తల్లి ఆప్యాయతానురాగాలు గోచరించి, ఆనందమనిపించేది. ఇట్లా ‘అందరమ్మ’ అంతర్లీనంగా అందరినీ తన అనురాగబంధంతో కలిపి ముడివేయకపోతే ఎవరికి ఎవరం? ఎక్కడిదీ అనుబంధం? అనిపిస్తుంది.
1970 లో నా తమ్ముడు కీ.శే. లక్ష్మీనారాయణకు ఒక చిన్న ఉద్యోగం గుంటూరులో వచ్చింది. గుంటూరులో బంధులెవరూ లేని కారణాన వాడు అక్కడ ఎలా! ఎక్కడ ఉండాలి? అన్నది మా నాన్న బెంగ. ఆయన విచారం తెలుసుకొన్న వెంకటరామయ్యగారు వాడ్ని మా ఇంట్లో వుంచుకొంటాను నాతో పంపండి, అని తమతో వారింటికి తీసుకెళ్ళి 3, 4 నెలలు వారి పిల్లలతో సమానంగా వాడ్ని ఆదరించారు. అలాగే సింగుపాలెం నుంచి ఆ రోజులలో తరచు అమ్మని దర్శించే ఉత్తమ పేద విద్యార్థి రావినూతల రఘునందనరావు గుంటూరు హిందూ కాలేజీలో సీటువస్తే, వారిని విడిగా ఉంచి అతడ్ని చదివించే ఆర్థికస్తోమత లేదని అమ్మద్వారా తెలుసుకొని 5, 6 సంవత్సరాలు అతడ్ని వారి పిల్లలతో సమానంగా వారింటనే ఉంచుకొని, చదివించిన ఘనత శ్రీ జన్నాభట్లవారిది. ఇప్పుడతడు కెనడాలో ఉన్నత స్థితిలో జీవనం చేస్తున్నాడు. అయితే ఇంతమందికి ఇలా ఉదారంగా, తమయింట ఉంచుకొని ఆదరించగల ఆర్థిక సంపన్నులా శ్రీవెంకటామయ్యగారు? అంటే కాదు. కానీ జన్నాభట్ల కుటుంబ సభ్యుల మనస్సులే సుసంపన్నమైనవి అని చెప్పక తప్పదు. తండ్రి ఆశయాలని గౌరవించి ఆర్థికంగా తన సంపూర్ణ సహకారాలందించే పెద్ద తనయుడు శ్రీ వీరభద్రశాస్త్రి, అతని భార్య జయలక్ష్మిల దైతే, వచ్చిన అందరికీ ఆదరంతో విసుగు, విరామం లేక వండివడ్డిస్తూ ఆదరించే ఆ ఇంటి ఇల్లాలు శ్రీమతి సీతారావమ్మక్కయ్యది. అందుకే ‘అందరమ్మ’ వారింటిని “ఒక చిన్న అన్నపూర్నాలయంగా అభివర్ణించింది. అమ్మనోట అంతటి ప్రశంసలందుకొనే అదృష్టం ఎందరికుంటుంది?
1975 లో నా చెల్లెలికి గుంటూరులో ఒక వివాహసంబంధం ఉందని తెలిసింది. అమ్మతో చెబితే పెళ్ళివారికి చెప్పేందుకు జన్నాభట్ల వెంకటరామయ్య గార్ని, శ్రీ రామరాజు కృష్ణమూర్తి, శ్రీ పి.ఎస్.ఆర్ లను వెంటతీసుకొని వెళ్ళి అమ్మాయిని చూచేందుకు జిల్లెళ్లమూడికి రావల్సిందిగా ఆహ్వానించాం. పిల్లకు తల్లీ, దండ్రీ లేరంటున్నారు. అమ్మాయి అన్న కూడా చిన్నవాడు. ఇంతకీ అమ్మాయికి మీరేమౌతారు? అన్న సూటిప్రశ్న నా వెంట ఉన్న మువ్వురినీ తాకింది. తడుముకోకుండా వెంకటరామయ్యగారు అమ్మాయికి నేను మేనమామను అన్నారు. మా అన్నయ్యగారి అమ్మాయే అన్నారు కృష్ణమూర్తి గారు, పి.ఎస్.ఆర్ లు. వారి సమాధానాలు విన్న నా కనులనీరు క్రమ్మింది. అయాచితంగా ఆప్యాయతలు ఒలకబోసే ఈ బంధుగణాన్ని ఏర్పరచిన అమ్మకి మదిలోనే ప్రణమిల్లాను. అలాగే నా చెల్లిపెళ్ళిలో మేనమామగా పెళ్ళికూతురి బుట్టమోసారు శ్రీ – వెంకటరామయ్యగారు.
వెంకటరామయ్యగారు ఉద్యోగ విరమణ చివరిదశలోనే అకస్మికంగా తీవ్రఅనారోగ్యం పాలై అవసానదశకు చేరుకొన్నారు. ఆయన పరిస్థితి అమ్మతో చెప్పగా, అమ్మ ఆయన్ను జిల్లెళ్లమూడి తన చెంతకు పిలిపించుకొంది. ఆయన కోరికమేర పరిక్షిత్ మహారాజు లాగా నిరంతరం ఆయన చెంత అమ్మనామ సంకీర్తన జరిగే ఏర్పాట్లుతోపాటు ఆయనకు సన్యాస దీక్షనికూడా అమ్మ ప్రసాదించింది. తుదకు ది. 18.01.1980 లో ఆయన్ను అమ్మ తనలో ఐక్యం చేసుకొని సద్గతిని ప్రసాదించింది. అదే సంవత్సరం 27-09-1980 న వారి రెండవకుమారుడు జన్నాభట్ల రాము అకస్మికంగా అమ్మలో లయమయ్యాడు. అంతటి విషాదాన్ని భరించి మొక్కవోని విశ్వాసంతో అమ్మకు అనేక సేవలందించ సాగిందా కుటుంబం.
శ్రీ వెంకటరామయ్యగారి పెద్దకుమారుడు శ్రీ వీరభద్రశాస్త్రికి అభిషేక, పూజా, జప, తప, యజ్ఞ యాగాదులంటే ఎక్కువ మక్కువ. అన్నదాన కార్యక్రమా లంటే ప్రీతి. కీ॥శే॥ శ్రీ తంగిరాల కేశవశర్మ గారు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గార్ల సారధ్యంలో అమ్మ సన్నిధిన జరిగిన అనేక యజ్ఞయాగాది క్రతువులలో, దసరా త్రికాల పూజల్లో, శ్రీసూక్త హోమాల్లో, శివరాత్రి లింగోద్భవా భిషేకాల్లో, లక్షబిల్వార్చనలలో పాల్గొని నిర్వహించటమే కాక, వివిధ నదీ పుష్కరాల సమయాన అమ్మ పేర అన్నవితరణ కార్యక్రమాలు చేశారు. ‘కరోనా’ బాధితులకు అనేక చోట్ల, వారికి అవసరమైన గ్రాసాన్ని ఉచితంగా ‘అమ్మ’ పేర పంపిణీచేశారు. హైమక్కకి 75 ఏళ్ళు నిండి జిల్లెళ్లమూడిలో జరిపిన మహోత్సవంలో హైమక్కకు వివిధ పుష్పాలతో భారీఎత్తున త్రికాల పూజలు నిర్వహించటమే కాక, లక్ష గాజులతో హైమక్కకి అర్చన సల్పారు.
రకరకాల నివేదనలు హైమక్కకు సమర్పించి ఆ ఉత్సవాలలో పూజాదికాలు అత్యద్భుతంగా నిర్వ హించారు. అనసూయేశ్వరాలయంలో సహస్ర ఘటాభిషేకాలు, నవదుర్గల ప్రతిష్ఠాపన కార్యక్రమ నిర్వహణలలాంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంద రింటిలో సారథ్య బాధ్యతలు వహించి, ఆనందకరంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిడదవోలులో నివాసం ఉండే శ్రీవీరభద్రశాస్త్రిగారు అందరూ అన్నపూర్ణా లయంలో ఆనందంగా ఆరగిస్తే సంతోషించాలనీ అక్కడనించి తరచూ మామిడిపళ్ళూ, పచ్చళ్ళకు కావాల్సిన దబ్బకాయలు, నిమ్మకాయలు సమకూర్చేవారు.
తండ్రి అనంతరం కుటుంబ బాధ్యతలు చేపట్టి శ్రీ శాస్త్రిగారు తమ సంతానం నలుగురు ఆడపిల్లలతోపాటు, తన ఇద్దరు తోబుట్టువులకీ వివాహాలు చేయటమేకాక తమ్ముళ్ళ సంతానానికి కూడా ఇంటిపెద్దగా దగ్గరుండి వివాహాలు జరిపించి తండ్రి ఋణం తీర్చుకొన్న సుపుత్రుడు, అమ్మకి ప్రీతిపాత్రుడు.
రెండుసంవత్సరాల క్రితం ఉద్యోగవిరమణ చేసి, అన్నిబాధ్యతలనుండి విముక్తిపొంది, ఇక అమ్మ సన్నిధిన జిల్లెళ్లమూడిలో ఉండి సేవచేసుకొందామనుకొనే సమయాన 11-06-1948 లో జన్మించిన శ్రీ వీరభద్రశాస్త్రిగారు 18-05-2021న ‘కరోనా’ బారినపడి ఆకస్మికంగా కాకినాడలో తన తనువు చాలించి అమ్మచెంతకు చేరారు. ఆయనకెటూ సద్గతినే అమ్మ ప్రసాదించింది. ఆయన భార్యా, పిల్లలతోపాటు, కుటుంబసభ్యులందరికీ, ముఖ్యంగా తొమ్మిది పదులు దాటిన ఆ ముదుసలి తల్లికి స్వాంతన చేకూర్చమని అమ్మకు శతకోటి నమస్కారాలతో ప్రార్థిస్తూ….
“అందరింటి చరిత్రలో మరొకరి చరిత్రపుట ముగిసిందని విచారిస్తూ”.
“సర్వేజనాః సుఖినోభవంతు”
జయహోమాతా !!