నాగేశ్వరు శతజయంతి – నాన్నగారి శతజయంతి
అర్కపురి క్షేత్రములో – అనసూయా హృదయకాంతి |
పృథివీస్థలిలో నున్న పుష్కర తీర్థములన్నీ
కలసివచ్చి కాళ్ళు కడిగి కళకళలాడే వేళ
ఆదెమ్మను ఆదెయ్యను అర్చించుచు అలరువేళ॥ నాగేశ్వర॥
ముక్తిక్షేత్రము లేదు మురిసిపోయి కదలివచ్చి
అష్టమ ముక్తిక్షేత్రపు అత్యద్భుత శక్తి కాంచి
“ఆనందించెడివేళ అనురాగము నించు వేళ ॥నాగేశ్వర॥
పగటి వెలుగు రాత్రివెలుగు పరిమళకాంతిని పరచగ
నింగిలోని తారలన్ని తొంగి తొంగి చూచుచుండ
దేవతలాశ్చర్యముతో తేరిపారచూచువేళ ॥నాగేశ్వర॥
కైలాసము గుండెపైన దాల్చి తాండవమును కను
ఈ భువిపై ఎత్తయిన హిమవన్నగరాజమ్మే.
తలవంచి తలపులెంచి పులకలెత్తి చూచువేళ ॥ నాగేశ్వర॥
నిరంజనుడు నిరామయుడు నిర్వికల్పు డఖిలేశుడు
నాగేశుండైవచ్చి అనసూయేశ్వరుడౌచు
అర్కపురీ నిలయుండై అద్వైతిగ వెలయువేళ ॥ నాగేశ్వర॥
జగదీశ్వర ! నాగేశ్వర ! శతజయంతి మొనగాడ !
అంతు అడ్డులేని శక్తి కాధారమ్మైన రేడ !
కన్నబిడ్డలిచ్చునట్టి కల్యాణపు వందనం
మన్ను మిన్ను పరిమళించు కమనీయపు చందనం ॥
తెలియనిదేదో అదియే తెలియచెప్పవచ్చినట్టి
తెలివియే తానైన తల్లి కలిమి బలిమియైన వాడ !
సృష్టియై తానైన తల్లి కిష్టమైన మొనగాడా !॥
నీ సతియే అందరమ్మ నీవో అందరి తండ్రివి
నీ యిల్లే అందరిల్లు నీ కూతురు కల్పవల్లి.
సర్వత్రా మమకారం సాగించిన మొనగాడా ॥
మీ పదముల తీర్థమ్మే మేదిని కమృతపు తీర్ధము
మీ పదముల శబ్ద మమ్మ కుచ్ఛ్వాసము
విశ్వాసము విశ్వజనని విజయదీప్తి కూపిరులూదినవాడా ॥
మీ పదములె సూత్రములుగ గళమున దాల్చెను అమ్మ:
మీరు వదలి పెట్టినను మిమ్ము వదిలిపెట్టదమ్మ
విడదీయరాని బంధ మెఱిగినట్టి మొనగాడా ॥
మీకోరిక తీర్చగా మీ మాటను మన్నించగ
ఆలయమున మిమ్ము చేర్చి తానూ చేరినదమ్మ
అనసూయేశ్వర ! జయహో! శతవసంత యోగేశ్వర ॥