22-10-13 తేదీ నుండి 26-10-13 తేదీ వరకు పంచాహ్నికంగా జిల్లెళ్ళమూడిలో శ్రీనాన్నగారి శతజయంతి ఉత్సవాలు మహోత్సాహంతో కన్నులవిందుగా జరిగాయి. ఎడతెరపిలేని వర్షమూ, భయానకంగా వరద ముంచెత్తినా జగన్మాత అమ్మ, జగత్పిత నాన్నగార్ల దివ్యాశీస్సులతో రసవత్తరంగా హృద్యంగా అవ్యక్తమధురంగా సంకల్పించిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జయప్రదంగా నిర్వహించబడ్డాయి.
హైమాలయ ప్రాంగణంలో మండలదీక్షగా అమ్మనామసంకీర్తన ఏకాహాలు, యాగశాలలో శ్రీ విశ్వజననీ చరితమ్ పారాయణా, హోమమూ, కళ్యాణ మండపంలో శ్రీ నాన్నగారి శతజయంతి సంచిక (సావనీర్)తో సహ అష్టదళ పద్మారాధనగా ఎనిమిది సాహిత్య గ్రంథాల ఆవిష్కరణ ప్రసంగాలతో ఆదిదంపతులైన అమ్మ- నాన్నగార్ల శ్రీ చరణార్చన; మహనీయులకు సత్కారము, శ్రీ అనసూయా సాహితీ సామ్రాజ్యరూపకము వంటి సంగీత సాహిత్య రూప అర్చనాది కార్యక్రమాలు కడువైభవంగా నిర్వహింపబడి అందరి హృదయాలపై చెరగని ముద్ర వేశాయి.
వివరాలు : 22-10-13 తేదీ ఉదయం గం.6-00లకు శ్రీ నాగేశ్వరాలయ ప్రాంగణంలో శ్రీ యార్లగడ్డ భాస్కరరావు అన్నయ్య ‘అనసూయేశ్వర నమో నమో శ్రీ నాగేశ్వర నమో నమో’ అనే నాన్నగారి పావన నామసంకీర్తన ఏకాహాన్ని ప్రారంభించారు. ఇందు SVJP అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్, శ్రీమతి భ్రమరాంబ అక్కయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఉదయం గం. 10-00 లకు కళ్యాణమండపంలో శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు రచించిన ‘ధన్యజీవులు’ గ్రంథావిష్కరణ సభ శ్రీ బి. రవీంద్రరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. శ్రీ రావూరి ప్రసాద్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. శ్రీ ఎమ్. దినకర్ తమ అధ్యక్ష ఉపన్యాసంలో “అమ్మ, నాన్నగారు, హైమక్కయ్య మూడు దివ్యశక్తులు, మూడు దివ్య ప్రణాళికలలో అవతరించారు” అన్నారు. శ్రీ రవి అన్నయ్య మాట్లాడుతూ ఆ ముగ్గురుమూర్తులూ ఆచరణాత్మకంగా సంస్కారరూపమైన సందేశాన్ని అందించారని అన్నారు. గ్రంథ ఆవిష్కర్త శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావుగారు మాట్లాడుతూ “అమ్మ ఒక కుటుంబ వ్యవస్థని ఏర్పరిచింది. మన కంటికి కనిపించే మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ వాస్తవానికి మంచివాళ్ళూ చెడ్డవాళ్ళూ కాకపోవచ్చు. కనుకనే తల్లికి తప్పే కనిపించదు” అంటూ శ్రీ నాన్నగారి ప్రమేయంతో అమ్మ అనుగ్రహంతో తమ జీవితంలో ఒక మహిమాన్విత సంఘటనని వివరించారు. నాన్నగారి ఔదార్యాన్ని శ్లాఘించారు. గ్రంధసమీక్ష చేస్తూ డాక్టర్ బి. యల్. సుగుణ “ధన్యజీవులు” గ్రంధం మరొక భాగవతం – భాగవతుల చరిత్ర చిత్రణ. అందు అన్నీ అమ్మ లీలలే. లీల అంటే దేనికీ బద్ధం కానిది; భౌతిక ప్రపంచంలో నమ్మశక్యం కానిది. ఆ లీలకు ఆధారం అంతస్సూత్రం అమ్మ అలౌకిక ప్రేమతత్వం” అన్నారు. గ్రంధ రచయిత శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ “ధన్యజీవులంతా మహానుభావులు” అంటూ ఆ గ్రంథప్రచురణకు సహకరించిన ఉదార హృదయులకు కృతజ్ఞతాంజలి ఘటించారు.
శ్రీ సత్యానందభారతీస్వామి, ఉత్తరపీఠాధిపతులు, భువనేశ్వరీపీఠం, గన్నవరం వారు “వాగర్థావివ సంపృక్తే అన్నట్లు అమ్మ నాన్నగారు ఒక లీలా వినోదంగా రెండు విభిన్నమూర్తులుగా విరాజిల్లుతున్నారు, కానీ ఒకే తత్త్వం” అంటూ అనుగ్రహభాషణం చేశారు. శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి రసబంధురంగా సభానిర్వహణ చేయగా శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు సవినయంగా వందన సమర్పణ చేశారు.
నాటి సాయంకాలం గం.5-00లకు కీ.శే. శ్రీ కోన వెంకట సుబ్బారావు గారు రచించిన ‘కైతలకోన’ గ్రంతావిష్కరణ సభ నిర్వహించబడింది. నాటి సభాధ్యక్షు శ్రీ గోపాల్ అన్నయ్య “అమ్మ అంటే అంతులేనిది, అడ్డులేనిది, అన్నిటికి ఆధారమైనది. అమ్మ సర్వాంతరాత్మ. గ్రంధ రచయిత, నాన్నగారు అత్యంత సన్నిహితులు, మిత్రులు, రంగస్థల నటులు” అని వివరించారు. గ్రంధావిష్కర్త శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావుగారు ప్రసంగిస్తూ “జిల్లెళ్ళమూడిలో ఫలానా వారు రచయిత, ఫలానా వారు కాదు అని చెప్పలేము. అమ్మ అనుగ్రహంతో అనేకులు, విశిష్టమైన రచనలు చేశారు. రచయిత నా బావ. వసుంధర నా మేనకోడలు, సత్యం – వేంకటేశ్వరరావు నా మేనల్లుళ్ళు. నాన్నగారి ఈ వేడుకల్లో ఈ గ్రంధం వెలుగులోకి రావటం ఎంతో ఆనందదాయకం” అన్నారు. వసుంధర అక్కయ్య, డాక్టర్ సత్యం అన్నయ్య అమ్మ-నాన్నగార్లతో తమ ప్రగాఢ అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని సజలనయనాలతో గ్రంధ ప్రచురణకు చొరవ తీసుకున్న సో॥పి.యస్.ఆర్. గార్కి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ రామడుగు వేంకటేశ్వరశర్మగారు గ్రంథ సమీక్ష చేస్తూ “ఈ గ్రంథం అచ్చతెనుగు భాషలో వ్రాయబడిన పద్యకవితా సంపుటి. భాగవత గ్రంధం వలె కవి తన హృదయాన్ని ఆవిష్కరించారు. కందపద్యాల్లో రామాయణాన్ని వ్రాయటానికి ప్రయత్నించారు. జాతీయ, నైతిక, సాంఘిక విలువలకు ఈ గ్రంథం నిలువెత్తు దర్పణం ఆంధ్రీకరించబడిన పద్యాలు, అతులితమైనవి, గుఱ్ఱం జాషువా గారి పద్యాలను గుర్తుచేస్తాయి” అని శ్లాఘించారు. శ్రీ ఎ.రవితేజ వందన సమర్పణ చేశారు.
23.10.13 తేదీ ఉదయం హైదరాబాద్ వాస్తవులు శ్రీ బెల్లంకొండ దినకర్ గారు రచించిన “అమ్మతో నా అనుభవాలు” గ్రంధం ఆవిష్కరించబడింది. గ్రంధ రచయిత తమ స్పందనను తెలియ చేస్తూ “నా అనుభవాలు నావరకే పరిమితమై, మరుగునపడకుండా పదిమందితో పంచుకోవాలనే లక్ష్యంతో ఈ గ్రంధాన్ని రచించాను” అన్నారు. సభానిర్వాహకులు శ్రీ లక్కరాజు సత్యనారాయణ నాన్నగారికి ఇష్టమైన ఆటలపోటీలను నిర్వహించి నాటి సభలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. సోదరీమణులు మన్నవ జయ, రమ చిరకాలం నుంచి అమ్మ సూచన మేరకు శ్రీ నాన్నగారి జన్మదినోత్సవాన్ని నిర్వహించు కుంటున్నామని తెలుపుతూ ‘పంచాశత్పీఠ రూపిణీ’ అంటూ అమ్మను జ్ఞప్తి చేసుకుంటూ వారు సుమధురంగా గానం చేశారు. Mother of All త్రైమాసిక పత్రిక సంపాదకవర్గ సభ్యులు శ్రీ టి.యస్.శాస్త్రిగారు నాటి సభకు అధ్యక్షత వహించగా శ్రీ మన్నవదత్తాత్రేయశర్మ గ్రంధాన్ని ఆవిష్కరించారు. శ్రీ సుధామవంశి వందన సమర్పణ చేశారు.
నాటి సాయంకాలం కీ॥శే॥ శ్రీ బృందావనం రంగాచార్యులు గారు రచించిన ‘పూజాపుష్పాలు’ (ద్వితీయ ముద్రణ) గ్రంధాన్ని శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య ఆవిష్కరించారు. సభా సమ్రాట్ శ్రీ కె.వి.యస్. ఆచార్య గ్రంథ సమీక్షచేస్తూ “అమ్మ అపరసరస్వతి. అంటే ప్రశ్నించకుండానే సందేహాలకు సమాధానాన్ని, సమస్యలకు పరిష్కారాన్ని, మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం అన్నట్లు అందించేది. ప్రతి పద్యానికి అంతస్సూత్రం భక్తి. “నాహంకర్తా హరిః కర్తా” అన్నట్లు అమ్మయే ఈ రచన చేయించింది. ఋక్కుల్ని అమ్మ తన వాక్కులలో వినిపించిన దానికి అక్షరరూప చిత్రమాలిక ఈ గ్రంథం” అని వివరించారు.
“బ్రహ్మాండం వంశం అంతా మా ఇంటికి వచ్చింది”. అని శ్రీ జె.వి.బి. శాస్త్రిగారు, “అమ్మ మా అమ్మాయి, నాన్నగారు మా తండ్రి” అని శ్రీమతి భ్రమరాంబ అక్కయ్య మనోజ్ఞంగా ప్రసంగించారు.
శ్రీ ఎన్. లక్ష్మణరావుగారు సభకు అధ్యక్షత వహించగా శ్రీమతి బి.యల్.సుగుణ సభానిర్వహణ చేశారు. శ్రీ యస్.ప్రసాద్ వందన సమర్పణ చేశారు.
24.10.13 తేదీన ప్రఖ్యాత ఆధ్యాత్మికశాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు రచించిన “అమ్మతత్త్వం” గ్రంధాన్ని శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం ఐ.ఎ.యస్. గారు ఆవిష్కరించారు. నాటి సభకు శ్రీ యస్.మోహనకృష్ణ అధ్యక్షత వహించగా, శ్రీ పి.యస్.ఆర్. గారు సభను నిర్వహించారు. ‘అమ్మత్వం’ గ్రంధం – శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు శాస్త్రీయ దృక్పధంతో, వైజ్ఞానిక దృష్టితో, హేతుబద్ధంగా ఆలోచన చేసి వాసిన వ్యాసముల సంపుటి అని అభివర్ణించారు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావుగారు. శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు ప్రసంగిస్తూ “అమ్మ ప్రేమ, వాత్సల్యం సహజమైనవి. సత్యాన్ని మనం ధైర్యంగా మాట్లాడాలి. ఈ ఉత్సవాల ఆహ్వానాన్ని అందుకున్న నేను అది అమ్మ ఆజ్ఞగా భావించి వచ్చాను” అన్నారు. శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు ప్రసంగిస్తూ “లోగడ నేను వ్రాసిన రమణాయణం గ్రంధాన్ని శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారే ఆవిష్కరించారు. అమ్మ మీద ఒక గ్రంధాన్ని వ్రాయమని నన్నుకోరగా నేను అందుకు అంగీకరించి దానిని కూడా వారే ఆవిష్కరించాలని, తొలి ప్రతిని శ్రీ రవిఅన్నయ్య గార్కి అందించాలని కోరుకున్నాను” అని తెల్పారు. అది కార్య రూపం ధరించినందుకు అమ్మకు కృతజ్ఞతాంజలిని ఘటించారు.
సో॥ శ్రీ బి. రవీంద్రరావు మాట్లాడుతూ “సుగుణ సార్థక నామధేయురాలు. అమ్మ శిల్పి అయితే, సోదరి సుగుణ అమ్మ ఎంతో సుందరంగా చెక్కిన మనోహర శిల్పం, సంస్కారరూపం” అని ప్రస్తుతించారు. డాక్టర్ యు. వరలక్ష్మి గారు గ్రంధ సమీక్ష చేస్తూ గ్రంధం అంతా. ‘అమ్మతత్వంలోని కమ్మదనం. గ్రంధాన్ని పఠిస్తుంటే గుండె చమర్చిస్తుంది. శీలం నుంచి వచ్చేదే శైలి. ఈ పరిశోధనా గ్రంధం డాక్టర్ సుగుణ అసాధారణ వ్యాకరణ వైదుష్యానికి అమ్మ మహిమాన్విత తత్త్వసారానికి దర్పణం పడుతుంది. ఇందలి అమ్మ జీవితచరిత్ర పారాయణ గ్రంధం” అని ప్రశంసించారు. శ్రీ బి.యల్.యస్.శాస్త్రిగారు, డాక్టర్ సుగుణ సద్గుణాల్ని వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ‘సౌమ్య’ అని అభినందించారు; ఆశీర్వదించారు. శ్రీ ఎమ్. శ్రీమన్నా రాయణమూర్తిగారు గ్రంధాన్ని ప్రస్తుతిస్తూ ‘వాఙ్మయ సమర్పణ’ అన్నారు.
రచయిత్రి డాక్టర్ సుగుణ తన స్పందనను తెలియజేస్తూ అమ్మ శరీరత్యాగం చేసే కొన్ని రోజుల ముందు తనతో ‘పరిశోధన చెయ్యి’ అని చెప్పిందని తెలిపారు; తన జీవితంలోను జీవనంలోనూ అడుగడుగునా సహాయ సహకారాలను అందించిన ఆత్మీయులను కృతజ్ఞతా పూర్వకంగా సత్కరించారు.
నాటి సాయంకాలం జరిగిన ‘ఆశుకవితా సమర్చనం’ కార్యక్రమాన్ని శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి సమర్థవంతంగా నిర్వహించారు. శతావధాన శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానందప్రసాద్ గారు ‘అమ్మలోని దైవత్వం’, ‘అమ్మ అమ్మే’, ‘అన్నపూర్ణాలయం’, ‘అమ్మ గురువు కాదు సద్గురువు’ వంటి అనేక అంశాలపై సభ్యులు వేసిన ప్రశ్నలకు ఆశించిన దానికంటే అద్భుతంగా ఆశుకవితా సమర్చన చేశారు. నాటి సభలో శ్రీ జె.వి.బి. శాస్త్రి ఛలోక్తులతో, హాస్య రసోక్తులతో సభను అలరించారు. బ్రహ్మాండం శేషు (నాన్నగారి పెద్దకోడలు) ‘తల్లిదండ్రుల వంటి అత్తమామలు’ అంటూ అమ్మ, నాన్నగార్ల నిరుపమాన ప్రేమతత్వాన్ని స్వీయ అనుభవాల్లో వివరించారు. శ్రీ వల్లూరి త్రయంబకం వందన సమర్పణ చేశారు. శ్రీ లక్కరాజు రామకోటేశ్వరరావుగారు స్పాన్సర్ చేయగా సమతా నాటక గురుకులం గుంటూరు మరియు ‘షిరిడీ సాయి నాట్యమండలి’, రాజమండ్రి వారిచే ‘మయసభ’, ‘శ్రీకృష్ణరాయబారం’ నాటకాలు ప్రదర్శింప బడినవి. శ్రీ పొత్తూరి లక్ష్మీనరసింహారావుగారు ట్రూప్ మేనేజర్ను మరియు నటులను, కళాకారులను శ్రీ విశ్వజననీపరిషత్ సముచిత రీతిలో సత్కరించింది.
25-10-13 తేదీన ఉదయం గం. 10-00లకు శ్రీ మన్నవ బుచ్చిరాజుశర్మ (రాజుబావ) గారు రచించిన ‘లోచూపు’ గ్రంధాన్ని శ్రీ బి. రవీంద్రరావు ఆవిష్కరించారు. నాటి సభాధ్యక్షులు శ్రీ బి. రామబ్రహ్మంగారు మాట్లాడుతూ ‘అంతర్ముఖ సమారాధ్య’ అయిన అమ్మను అంతర్ముఖమై దర్శించుకోవడం నిమిత్తం సాధకునికి ఈ గ్రంధం ఎంతో ఉపయోగకరం” అన్నారు.
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు గారు ప్రసంగిస్తూ “తొలి రోజుల్లో రాజుబావ వ్రాసిన పాటల్ని హైమ శ్రావ్యంగా పాడి వినిపించేది” అన్నారు. శ్రీ రవి అన్నయ్య మాట్లాడుతూ “అమ్మ వద్ద అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి రాజుబావ. అమ్మపైన నాన్నగారి పైన తొలిసాహిత్యం వ్రాసింది వారే” అన్నారు. సభానిర్వహణ సమర్ధవంతంగా ఆకర్షణీయంగా చేసిన శ్రీ రావూరిప్రసాద్ శ్రీరాజు బావ అందరింటి ఆత్మబంధువు. అమ్మ సాహిత్యానికి ఆద్యుడు అన్నాడు. శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు హృద్యంగా గ్రంధపరిచయం చేశారు. శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం గ్రంథ సమీక్ష చేస్తూ “ఉన్నది ఉన్నట్టు కనటమే లోచూపు అన్నది అమ్మ. ‘అనుభవసారం’ పేరిట రాజుబావ వ్రాసిన 72 పాటలలో కొన్ని సులభంగా అర్థం అవుతాయి. కొన్ని రచయిత వివరిస్తే అర్థం అవుతాయి. కొన్ని వివరించినా అర్థంగాని ఆధ్యాత్మని గూఢ సత్యాల్ని ఆవిష్కరిస్తాయి” అంటూ కొన్ని పాటలు పాడి వివరణను అందించారు. శ్రీ పి.యస్.ఆర్. గారు ‘అమ్మ అనుభవాల్ని తన అనుభవాలుగా పొందిన భాగ్యశాలి రాజు బావ. వారు వ్రాసిన పాటల్ని రాజాపాటలు అని అమ్మ సమ్మానించింది” అన్నారు. రచయిత శ్రీరాజుబావ తమ స్పందనతో పాటు అపూర్వ స్వీయ అనుభవాల్ని వివరించారు. సో॥ శ్రీ డి.వి.యన్. కామరాజుగారు వందన సమర్పణ చేశారు.
సాయంకాలం గం. 5-00లకు కీ.శే. శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య వ్రాసిన ‘మాతృదర్శనం’ (ద్వితీయ ముద్రణ) గ్రంధాన్ని సభాధ్యక్షులు శ్రీ పి.యస్.ఆర్. గారు ఆవిష్కరించారు. మాతృశ్రీ విద్యాపరిషత్, శ్రీ విశ్వజననీ పరిషత్, శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య పౌండేషన్స్ వారి ప్రోత్సాహంతో ఈ గ్రంధాన్ని వెలువరించారు. ఇందుకు ముఖ్యకారకులు ధూళిపాళ్ళ భాస్కరశర్మ. వారు రామకృష్ణ అన్నయ్య వ్యక్తిత్వ, రచనా ఔన్నత్యాన్ని శ్లాఘించారు. తొలిముద్రణలో తాను చొరవ తీసుకున్నానని శ్రీ బి. రామబ్రహ్మంగారు తెలియచేశారు. గ్రంధసమీక్ష చేస్తూ శ్రీమతి యు. వరలక్ష్మిగారు “అమ్మే నా కలం, నా సకలం” రచన నా అర్చన. చూసే కన్ను, వ్రాసే పెన్ను ఉంటే ఎన్నాళ్ళైనా వ్రాయొచ్చు; ఎన్ని ఏళ్ళైనా వ్రాయొచ్చు – అన్నారు రామకృష్ణ అన్నయ్య” అని ప్రశంసించారు. అమ్మ “రామకృష్ణ అప్పికట్లకు కరణం, నాకు ఉపకరణం” అన్నది అమ్మ ఆంతరంగిక కార్యదర్శి అన్నయ్య – అనీ వివరించారు.
‘మాతృదర్శనం’ గ్రంధపారాయణవలన ఇహపర సౌఖ్యాలను పొందవచ్చునని సోదాహరణంగా ప్రసం గించారు సో॥శ్రీ కె. రాజేంద్ర ప్రసాద్ గారు. శ్రీ కొండముది ప్రేమకుమార్ వందన సమర్పణ చేశారు.
సాయంకాలం గం.6-00లకు ప్రదర్శించబడిన ‘అనసూయా సాహితీ సామ్రాజ్య రూపకా’న్ని శ్రీ పి.యస్.ఆర్.గారు, డా॥ప్రసాదరాయకులపతిగా సభ నిర్వహించారు. శ్రీరావూరి ప్రసాద్ గారు నదీరా పాత్రను, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యంగారు రాజు బావపాత్రను, శ్రీ ఎన్.లక్ష్మణరావుగారు, శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారి పాత్రను, శ్రీ కె.వి.కోటయ్యగారు శ్రీ కోన వెంకట సుమ్బారావుగారి పాత్రను, శ్రీ ఎమ్. శ్రీమన్నారాయణమూర్తి గారు శ్రీ ఎన్.శ్రీధరరావుగారి పాత్రను, శ్రీ ఎమ్. సత్యనారాయణ గారు శ్రీ బృందావన. రంగాచార్యులుగారి పాత్రను పోషించి సభను అలరించారు. శ్రీ డి.వి.యన్. కామరాజు వందన సమర్పణ చేశారు.
- 10. 13వ తేదీ ఉదయం గం. 10-00లకు శ్రీ నాన్నగారి శతజయంతి ఉత్సవ సమారోపణ సభ నిర్వహించబడింది. చి. సో॥ బ్రహ్మాండం హైమ జ్యోతి ప్రజ్వలనం చేసింది. శ్రీ జయంతి చక్రవర్తి సంకలనం చేసిన ‘లలితాత్రిపురసుందరీ విశేష ఉపచారాలు’, ‘గణేశ పూజాకల్పము’ ‘గురుదత్తాత్రేయ విశేష పూజాకల్పము’, ‘శరన్నవరాత్రి పూజా విశేషకల్పము అనెడి నాలుగు ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే ఆరాధనా మార్గ సువర్ణ సోపానమునదగు గ్రంథాలను అతిధులు ఆవిష్కరించారు.
సభాధ్యక్షులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ శతజయంతి మహత్కార్యాన్ని ఆలోచన చేసిన వారికి, ఆచరణలో పెట్టిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు; ‘సనాతనధర్మం, ధర్మరక్షణ గురించి ఏ పద్ధతిలో రచనలు చేయాల్సి ఉంది అంటే శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారు అనుసరించే పద్ధతిలో’ అని అన్నారు.
శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ మాట్లాడుతూ “అమ్మ కన్నబిడ్డకి, కట్టుకున్న భర్తకి దైవత్వాన్నిచ్చింది. ఇది పాతివ్రత్యానికి పరాకాష్ఠ. నాన్నగారిలోని దివ్యత్వం అతఃపూర్వం మనకి అనుభవంలోకి రాలేదు. నాన్నగారు ఆలయప్రవేశం తర్వాత ఎన్నోసార్లు నాకు దర్శనం ఇచ్చి సంరక్షించారు. వారు భక్త సులభులు” అన్నారు.
శ్రీ రవి అన్నయ్య ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. వారు ప్రసంగిస్తూ “నాన్నగారికి గ్రామస్థులన్నా, గ్రామస్థులకు నాన్నగారన్నా ఎంతో ప్రేమ. నాన్నగారి శతజయంతి ఉత్సవాల నిర్వహణలో శ్రమకోర్చి జయప్రదం చేసిన వారందరికీ నేను కృతజ్ఞతలు తెల్పుతూ పాదాభివందనం చేస్తున్నాను” అన్నారు. శ్రీ ఎమ్. శ్రీమన్నారాయణమూర్తి సావనీరును సమీక్షిస్తూ “అమ్మ శివశక్తేక్య స్వరూపిణి. అమ్మ, నాన్నగారు అర్థనారీశ్వర స్వరూపులు. ఆ తత్త్వాన్నే కాళిదాసు మహాకవి ‘వాగర్థావివ సంపృక్తా’ అని అభివర్ణించారు. నాన్నగారు నిరాడంబరత, నిర్మలత్వం, నిశ్చలభక్తి అనే మూడింటి త్రివేణీ సంగమం. వారితో తమ అనుబంధాలను స్మరించుకుంటూ ఆంధ్ర, ఆంగ్ల భాషలలో ఎన్నో వ్యాసాలతో, గేయాలతో, శ్లోకాలతో, పద్యాలతో సుందర వర్ణ చిత్రాలతో యీ సంచిక విరాజిల్లుతోంది. వారి దివ్య ఆశీస్సుల్ని వర్షిస్తోంది” అన్నారు. చి.సౌ. బ్రహ్మాండం హైమ నాన్నగారి గురించి సంక్షిప్త సుందరంగా ప్రసంగించింది.
శ్రీ జయంతి చక్రవర్తి మృదుమధురంగా లలిత గీతాన్ని గానం చేశారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారిని పరిషత్ సభ్యులు అమ్మ ఆశీః పూర్వక నూతన వస్త్రాలు, పూలమాలలు, సన్మానపత్రము, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
సన్మానగ్రహీత శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు తమ స్పందనలో “ఈ శ్వాస ఉన్నంతవరకు అమ్మ సమస్త కార్యక్రమాల్లో నా యావచ్చక్తిని వినియోగిస్తానని 2011లోనే ప్రమాణం చేశాను. అమ్మను సేవించుకోవటం కోసం ఎన్ని జన్మలైనా ఎత్తాలి. మాతృఋణం తీర్చుకోలేము. కనురెప్పలు వాలేదాక అమ్మ కార్యక్రమాల్లో పాల్గొని పునః పునః సేవచేసుకుంటాను. మనమంతా కలిసి జిల్లెళ్ళమూడి మహాక్షేత్రాన్ని ప్రపంచపటంలో ప్రస్ఫుటం చేయాలి”అన్నారు.
ఈ ఉత్సవాల్లో విశేష కృషి చేసినవారికీ, నాన్నగారి బంధువులకు అమ్మ-నాన్నగార్ల ఆశీఃపూర్వకంగా నూతన వస్త్రాలను, జ్ఞాపికలలను ఇచ్చి శ్రీ విశ్వజననీపరిషత్ సమ్మానించింది. శాంతిమంత్ర పఠనంతో సభలు ముగిశాయి. శ్రీవిశ్వజననీపరిషత్ సంఘటనా కార్యదర్శి శ్రీ యస్.మోహనకృష్ణ వందన సమర్పణ చేశారు.
అమ్మ సంతానం అంతా తమ తమ ప్రసంగాల్లో ముందుగా నాన్నగారితో తమ ఆత్మీయతని స్మరించుకొని సార్ధనాయనాలలో, ఆర్ద్ర హృదయాలతో కృతజ్ఞతాంజలి ఘటించారు. అందరూ అమ్మ-నాన్నగారి కృపావృష్టిలో తడిసి ‘ధన్యోస్మి’ అనుకుని పరవశించారు. ఈ ఐదురోజుల సభాకార్యక్రమాల్లో, వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మహనీయులు, అధికారులు, అతిధులు ఓరియంటల్ కళాశాల, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు సోదరీ సోదరమణులకు శ్రీవిశ్వజననీ పరిషత్ సంస్థ అమ్మ నాన్నగార్ల ఆశీఃపూర్వకంగా శాలువాలు, నూతన వస్త్రాలు, జ్ఞాపికలను అందజేసి సత్కరించింది.
ఈ అయిదురోజుల ఆధ్యాత్మిక, సాహిత్య యజ్ఞంగా, నాన్నగారి గూర్చి అమ్మను గూర్చిన విశేషము విశిష్టమూ అయినా జ్ఞాపకాలతో గడపగలిగామనే సంతృప్తిని పొందారు అమ్మ బిడ్డలు. ప్రకృతి భీభత్సాన్ని సృష్టించినా ఎంతో ధైర్యంగా పట్టుదలగా ఊరి ప్రజలందరకూ భోజనాలు పెడుతూ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహింపబడినందుకు అమ్మకు కృతజ్ఞతలు సమర్పించారు పరిషత్వారు. శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు అతిథులందరికీ విశ్వజననీపరిషత్ కోరిన రీతిగా భోజన, వసతి సౌకర్యాలతో సేవచేయటమేగాక, వరదభీభత్సంలో ఉన్న కష్ట ప్రజలకు సానుభూతిగా ఒక నిమిషం మౌనం పాటింప చేశారు.