మార్చి 1 వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ విశ్వజననీ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారి సంస్మరణ సభ జరిగింది. వాత్సల్యాలయ ప్రాంగణంలో శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. కళాశాల విద్యార్థినులు కుమారి పద్మావతి, వసంత కుమారి ప్రార్థనా శ్లోకం ఆలపించారు.
తొలిపలుకులలో అధ్యక్షులు శ్రీ ఎం.దినకర్ ఆంజనేయ ప్రసాద్ గారి వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. అమ్మకు సాటిలేని సేవలు అందించిన శ్రీ పి.యస్. ఆర్. కాలంమీద తనదైన ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. అమ్మ చరిత్రను సంక్షిప్తం చేసి, నిత్య పారాయణ గ్రంథంగా అందించి, ఫలశ్రుతిని కూడా కూర్చి, శ్రీ పి.యస్.ఆర్. అందరింటి సోదరులకు ఎంతో ఉపకారం చేశారన్నారు.
ప్యాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారు మాట్లాడుతూ- పి.యస్ ఆర్.తో తమకున్న అరవైయేళ్ళ అనుబంధాన్ని సజల నయనాలతో నెమరు వేసుకున్నారు. అనుక్షణం అమ్మ చింతనతో, అమ్మ సేవలో గడిపి, అమ్మ స్మరణలోనే కన్నుమూసిన పి.యస్.ఆర్. గారి బహుముఖ ప్రతిభకు నీరాజనం సమర్పించారు.
అమ్మచేత “ఈ స్థాన కవి” అనే గుర్తింపును పొంది, ఎన్నో రచనలు చేశారని, తమ కుటుంబానికి అత్యంత ఆప్తులు శ్రీ పి.యస్.ఆర్. అని రుద్ద కంఠంతో వివరించారు. సంస్థకు ఎంతో మేలు చేస్తూ, ఎంద రెందరికో అమ్మ అనుగ్రహాన్ని పంచుతున్న ధాన్యాభిషేకం ప్రతిపాదన శ్రీ పి.యస్.ఆర్. గారిదే ననీ, అది ‘సార్థకం’ కావటానికి ఏటేటా వారు చేస్తున్న కృషి అసాధారణమనీ అన్నారు. వారి కుమారులు, కుటుంబ సభ్యులు అమ్మ సంస్థతో అనుబంధాన్ని కొన సాగించాలనే ఆకాంక్షను వెల్లడించారు శ్రీ రవి అన్నయ్య.
‘అందరి మామయ్య’ శ్రీ మన్నవ నరసింహారావు గారు ఆంజనేయప్రసాద్ గారి దైవీ గుణాలను ప్రస్తుతించారు. అమ్మను మించిన దైవం లేదని నమ్మిన పి.యస్.ఆర్. మనందరి భావనలలో చిరంజీవిగా ఉంటారని వివరించారు.
సంస్థ పూర్వాధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు మాట్లాడుతూ, పి.యస్.ఆర్. గారితో తమ అనుబంధాన్ని వివరించారు. సమర్పణ, శరణాగతి, వినయం మొదలైన ఆదర్శ గుణాల సమ్మేళనం శ్రీపీయస్సార్- అన్నారు. సంస్థకు వారు అందించిన వివిధ సేవలను, పత్రికా సంపాదకులుగా వారి విలక్షణ విశిష్టతను ప్రస్తుతించారు.
బహుముఖ ప్రతిభాశాలి పి.యస్.ఆర్. ప్రారంభించిన మన స్థానిక కార్యదర్శిశ్రీ లక్కరాజు సత్యనారాయణ (లాలన్నయ్య) పి.యస్.అర్. అనే సంకేతాక్షరాలను వివరించారు.
P stands for Personality, power and Purity –
S – for Service and Sacrifice
R for Royalty and Resourcefulness అనివివరిస్తూ, ఆ ఔన్నత్యానికి మరణం లేదన్నారు.
అమ్మకు నాల్గవ సంతానం శ్రీ పీయస్సార్ అని వివరిస్తూ, పీయస్సార్ గారి సానుకూల దృక్పథాన్ని కొనియాడారు శ్రీ వల్లూరు బసవరాజు గారు.
సభకు స్వాగతం పలికిన శ్రీ డి.వి.ఎన్. కామరాజు గారు తమ ప్రసంగంలో పి.యస్.ఆర్. గారి విశేష ప్రతిభను సేవలను ప్రస్తుతించారు. ఆధ్యాత్మిక సత్యాలను ఆకళింపు చేసుకొని, వాటిని త్రికరణ శుద్ధిగా అచరించిన మహనీయులు పి.యస్.ఆర్. అన్నారు. అనసూయా వ్రతాలను నిర్వహించటంలో వారి నిబద్ధత, వ్రతకథలను వినిపించటంలో వారి వాచకంలోని భావవ్యక్తీకరణ సామర్థ్యమూ సాటిలేని వన్నారు.
కళాశాల పూర్వ విద్యార్థి డా. జయంతి చక్రవర్తిగారు పి.యస్.ఆర్. గారి అనన్య భక్తిని వివరిస్తూ ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. శ్రీ పి.యస్.ఆర్. గారి అన్నగారు శ్రీశ్రీశ్రీసిద్ధేశ్వరానంద భారతీస్వామి వారు కొన్ని వేలమందికి మంత్రోపదేశాలు చేసినా, శ్రీ పి.యస్.ఆర్. గారు అన్నగారిని ఏ నాడూ ఏ మంత్రమూ కోరలేదనీ, పి.యస్.ఆర్. గారికి అమ్మే దైవమనీ అమ్మ నామమే మంత్రమనీ అన్నారు.
పూర్వ విద్యార్థి సమితి ప్రధానకార్యదర్శి శ్రీ కె.శేషాద్రిగారు స్వర్ణోత్సవ నిర్వహణలో తమకు వెన్నుదన్నుగా నిలిచి, మార్గ దర్శకత్వం వహించి, ఉత్సవ విజయానికి కారకులైన మహనీయులుగా వారిని స్మరించి నివాళు లర్పించారు.
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ డా. బి.ఎల్. సుగుణ గారు మాట్లాడుతూ, జిల్లెళ్ళమూడికి చెందిన ప్రతి ఉత్సవంలోనూ శ్రీ పి.యన్.ఆర్. గారి సమర్పణ కీలకమని ఉద్ఘాటించారు. రామాయణ కథలో ఆంజనేయుడి పాత్ర ఎలాంటిదో, అర్కపురి చరిత్రలో పి.యస్.ఆర్. గారి పాత్ర అలాంటిది అన్నారు. ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకూ సూత్రధారిగా పాత్రధారిగా, ధాన్యాభిషేక మహోత్సవానికి కర్త, కర్మ, క్రియ అయిన పి.యస్.ఆర్. గారు తనలోనే అమ్మను దర్శించి, తన్ను తాను అమ్మకు సమర్పించుకున్న ధన్యజీవి- అన్నారు.
శ్రీ వై. వి. మధుసూదన రావుగారు తమ ప్రసంగంలో అందరింటి సోదరుల ఆత్మ బంధువుగా శ్రీ పి.యస్.ఆర్.ను వర్ణించారు.
శ్రీ ఓంకారానందగిరిగారు మాట్లాడుతూ అమ్మను గురించి, సంస్థను గురించి, కళాశాలను గురించి తప్ప మరో మాట మాట్లాడి ఎఱుగని ఆంజనేయ ప్రసాద్ గారి వ్యక్తిత్వాన్ని కీర్తించారు.
కొండముది ప్రేమకుమార్ గారు ఉద్యోగ జీవితంలో శ్రీ పి.యన్. ఆర్. గారు అందించిన సహకారాన్ని, రామకృష్ణన్నయ్య ఫౌండేషన్కు వారి సలహా సహకారాలను మరువలేమనీ, రామకృష్ణన్నయ్య పేరుతో విశిష్ట సంచిక రావాలని తమకు సూచన చేసిన శ్రీ పి.యస్.ఆర్. ఉదారతకు కైమోడ్పు లర్పించారు.
అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాద్ గారు – శ్రీ పి.యస్.ఆర్. గారి సార్థక జీవన వైఖరిని వివరిస్తూ, వారందించిన భక్తి గీతాలకు స్వరకల్పన చేసి, తమ మధురగళంతో ఆలపించారు. పి.యస్.ఆర్. గారికి అమ్మపట్ల గల అచంచల భక్తి విశ్వాసాలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీ పి.యస్.ఆర్.గారి కుమారులు శ్రీ రవికిశోర్, శ్రీ హైమానంద్లకు అమ్మ ప్రసాదంగా శ్రీ విశ్వజననీపరిషత్ ఆదరణ వస్త్రాలు అందించింది.
తమ తండ్రిగారి క్రమశిక్షణ, నిబద్ధతలను, అమ్మ పట్ల భక్తివిశ్వాసాలతో ఆ సోదరులు వివరించారు. తమపట్ల అందరింటి సోదరీ సోదరులు చూపిన ప్రేమాదరాలకు ధన్యవాదాలు తెలియచేశారు. తమ తండ్రిగారి ఆశయం మేరకు అమ్మ సంస్థతో అనుబంధాన్ని కొనసాగించగలమని, అమ్మ తమకు ఇలవేల్పు అనీ వెల్లడించారు.
శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు ఈ సభను ఆర్ద్రభావంతో నిర్వహిస్తూ, సందర్భాను సారంగా పి.యస్.ఆర్. గారి మహనీయ వ్యక్తిత్వ విశేషాలను, వారికి అమ్మపట్ల కల భక్తినీ వివరించారు.
శ్రీమతి శైలజ, కుమారి మనీషా ఈ కార్యక్రమంలో పి.యస్.ఆర్. గారు రచించగా, శ్రీ రావూరి ప్రసాద్ గారు స్వరబద్దం చేసిన భక్తి గీతాలను మధురంగా ఆలపించారు.
మంగళము హైమమ్మ తల్లికి అనే మంగళ హారతితో, శాంతిమంత్రంతో సభ ముగిసింది.