పాఠశాల ఉపాధ్యాయులకు సన్మానం,
విద్యార్థులకు బహుమతులు
సమాజ ప్రగతిలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్, మాతృశ్రీ విద్యాపరిషత్ అభివృద్ధి మండలి ఛైర్మన్ శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు స్పష్టం చేశారు. పబ్లిక్ పరీక్షలలో మాతృశ్రీ ఓరియంటల్ సంస్కృత విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణతను సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని, ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన ఘనంగా సత్కరించారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించి, విద్యా సంస్థ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప జేయాలని ఆయన హితవు పలికారు. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ దినకర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమాన్ని మాతృశ్రీ ఓరియంటల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.యల్.సుగుణ, పాఠశాల హెచ్.యమ్. శ్రీ కె.ప్రేమకుమార్ గార్లు పర్యవేక్షించారు. శ్రీ రామబ్రహ్మంగారు మాతృశ్రీ అనసూయాదేవి అనుగ్రహంతో మాతృశ్రీ విద్యాసంస్థల అభివృద్ధికి తమ సేవలు అందించడం అభినందనీయమని ప్రిన్సిపల్ డాక్టర్ సుగుణగారు వివరించారు. ఈ విద్యాసంస్థల ప్రగతికి జీవితాంతం యథాశక్తి శ్రమించగలనని శ్రీ రామబ్రహ్మంగారు స్పష్టం చేశారు. 4.9.2013న జన్మదినోత్సవ సందర్భంగా శ్రీ బొప్పూడి రామబ్రహ్మం, స్వరూపరాణి దంపతులను, నూతన వస్త్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అమ్మభక్తులు శ్రీ టి.టి. అప్పారావు, శ్రీ ఎన్. లక్ష్మణరావు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ, శ్రీ రావూరి ప్రసాద్ గార్లు రామబ్రహ్మంగారి కుటుంబసభ్యులు,మిత్రులు, ఆహ్వానితులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదే వేదికపై పచ్చదనం, – పరిశుభ్రత, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలలో విజేతలైన విద్యార్థులకు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారి సౌజన్యంతో పెద్దల చేతులమీదుగా బహుమతి ప్రదానం జరిగింది.