”…. పోషణ చేసేవానిని ప్రభువు అంటారు. రాజు భార్యను రాజ్ఞి అని వ్యవహరిస్తూ ఉంటాం. తనంత తాను పోషణ చేసే శక్తిసామర్థ్యాలు కలది కనుకనే ‘మహారాజ్ఞి’ అయింది. ఈ సృష్టిలోని సకల జీవరాసులను పోషించడంలో ఎవరికి, ఎలాంటి ఆహారం అవసరమో, ఎప్పుడవసరమో, ఎంత అవసరమో వారి వారి స్థితి ననుసరించి పోషించగల ప్రభావం జగన్మాతకే ఉంది. …. మానవులు కోరిన కోర్కెలు తీర్చి, పోషణ చేసేది కనుకనే ‘శ్రీ మహారాజ్ఞి’ అయింది. వారి కోరికలు తీర్చడం అంటే కోరినది ఇవ్వడం కాదు. హితమైనది ఇవ్వటం… జడమైన ఈ శరీరాన్ని కదిలించేది, నడిపించేది, పలికించేది ఆ పరాశక్తియే. వినబడేది, చూడబడేది, వినిపించేది, చూపించేది ఆ పరాశక్తియే. అమ్మ సన్నిధిలో మనమంతా ఉపకరణాలమే. ఆమె సంకల్పబలం చేత మనమంతా రకరకాల విధులను నిర్వర్తిస్తూ ఉంటాం. ఆమె ఆజ్ఞలేనిదే గడ్డిపరక కూడా కదలలేదు. అలాంటి శక్తి రూపంలో – సర్వజీవులనూ, సర్వకాలములలోనూ పోషణ చేసే సామర్థ్యం కలది కనుకనే ‘శ్రీమహారాజ్ఞి’ అయింది.” – భారతీ వ్యాఖ్య.
ముగ్గురమ్ములకు మూలపుటమ్మ, చాల పెద్దమ్మ అయిన శ్రీ లలితాదేవి – ‘శ్రీ మహారాజ్ఞి’. సృష్టి స్థితి లయాలను త్రిమూర్తుల చేత నిర్వహింప చేసే తల్లి. ఇంద్రాది దిక్పాలురు, మహర్షులు, వారి పత్నులు, రంభాది అప్సరసలు, యక్షరాక్షస కిన్నెర కింపురుష గంధర్వాది గణాలు పూజించే శ్రీమాత ‘శ్రీమహారాజ్ఞి’. వారికి పనులను ఆజ్ఞాపించే ‘శ్రీ మహారాజ్ఞి’ ఆమె.
‘శ్రీ మహారాజ్ఞి’ అయిన తల్లి తన బిడ్డల పోషణ బాధ్యతను స్వీకరించి, ఎవరెవరికి, ఎప్పుడేది కావాలో వారికి వాటిని అందచేస్తుంది. తన పిల్లలకు ఏది హితమో, దానిని వారికి ప్రసాదిస్తుంది. సర్వజీవులనూ, సర్వకాలా ల్లోనూ పోషించే శ్రీమాత ‘శ్రీ మహారాజ్ఞి’.
”అమ్మ” – ‘శ్రీ మహారాజ్ఞి’. తన చిన్నగదిలో బుల్లి మంచం మీద ఉన్నా, ”అమ్మ”కు తెలియనివి లేవు. రాజుకు ‘చారచకక్షువు’ అని పేరు. తాను కోటలో ఉన్నా రాజ్యంలో ఏమూల ఏం జరుగుతున్నదో రాజుకు చేరవేసే గూఢచారులుంటారు. వారు ఎప్పటికప్పుడు రాజ్యంలోని వార్తలను రాజుకు చేరవేస్తూ ఉంటారు. ఇది సామాన్య ప్రభువు విషయం. ‘అమ్మ’ ‘శ్రీ మహారాజ్ఞి’. అంటే అన్నింటికీ, అందరికీ మహారాణి ఆమె. అందువల్ల ఆమెకు చారులతో పనిలేదు. ఆమె చూడలేనివి లేవు. ఆమె ”సహస్రాక్షి”. ”నేను ఈ మంచం మీద కూర్చున్నానని నాకేమీ తెలీదనుకుంటున్నారు. కానీ, నాకు గోడచాటు లేదు” … ఎవరేం చేస్తున్నదీ, ఎక్కడ ఏం జరుగుతున్నదీ నాకు తెలుసు” – అనే వాక్యాలు ”అమ్మ”కు గల శ్రీమహారాజ్ఞీత్వాన్ని ప్రకటిస్తున్నాయి. అందరింటికి ఎన్ని వేలమంది వచ్చినా, లక్షలమంది వచ్చినా వారికి సమయంతో సంబంధం లేకుండా, ఆహారాన్ని అందించి, వారి ఆకలిబాధ తీర్చినతల్లి ”శ్రీ మహారాజ్ఞి”. ”ఆ వడ్డె వాళ్ళని భోజనానికి పిలుస్తున్నారు. కనుక వాళ్ళకు వీలుగా ఉన్న సమయంలో పిలవండి. ఉదయమే పనిలోకి వెళతారు. కనుక మన వడ్డన అందదు. సాయంత్రం పిలిచినా ఆ పిలుపు ప్రొద్దు గుంకక ముందైతే వాళ్ళ అలవాటుకు సరిపోతుంది. పని చేసిచేసి ఉంటారు. పని నుండి రాగానే అన్నాలు తిని పడుకుంటారు”. ఇవి కూలి పని చేసుకుని ఇంటికి వచ్చే పేదవారిని గురించి ”అమ్మ” పలికిన మాటలు. ఎవరిపట్లనైనా అంతటి వాత్సల్యా మృతాన్ని వర్షించగల తల్లి. ప్రేమ మాత్రమే కాదు ఎంత శ్రద్ధ లేకపోతే అంతలా ఆలోచించగలుగుతుంది. పాలకులకు పాలితులపై ఉండవలసినది అలాంటి ఆదరణే. అందుకే ”అమ్మ” – ”శ్రీ మహారాజ్ఞి”.
ఈ ప్రేమ ఒక్క మానవులపైన మాత్రమేనా! అనుకుంటే పొరబాటు. పశుపక్ష్యాదుల పట్ల కూడా ఇంతటి ప్రేమాదరాలను ప్రదర్శించిన తల్లి.
జబ్బు చేసిన పెద్దకుక్క దగ్గరికి హటాత్తుగా వర్షంలో బయలుదేరిన ”అమ్మ”ను అడ్డుకున్న వారితో ”ఈ వర్షం, బురద ఇవన్నీ నాకేం కొత్త కాదు. వీటికి అలవాటు పడ్డదాన్నే. పాపం పిచ్చిది. దానికి నేనంటే ఎంతో ప్రేమ. దానికి ఓపిక ఉన్నన్నాళ్ళూ నా దగ్గరికి వచ్చేది. ఇవ్వాళ దానికోసం నేను వెళ్తాను.” అంటూ ఆ బురదలో నడిచి, ఆ కుక్క దగ్గరికి వెళ్ళి దానిపక్కనే కూర్చుని, దాన్ని తన చేత్తో నిమిరి, పాలు బట్టి, మూతి తుడిచి, దాని బాధను అర్థం చేసుకుని, దాన్ని వెచ్చగా ఉండే చోటికి మార్చమని హెచ్చరిక చేసిన తల్లి – శ్రీ మహారాజ్ఞి.
మహారాణి అంటే అంతఃపురంలో అందరికీ అందనంత దూరంలో హాయిగా కాలుమీద కాలేసుకుని, తాను భోగభాగ్యాలతో తులతూగుతూ సుఖంగా ఉండడం కాదు. తన ప్రజల (బిడ్డల) కష్టాలకు తల్లడిల్లడం, వారికి తన సాయం అందించడం. విశ్వానికే మహారాజ్ఞి అయిన ”అమ్మ”కు పశుపక్ష్యాదులకు, మానవులకు తేడా తెలియదు. కాదు; తేడా లేదు. మినప్పప్పులో, గిన్నెలో చైతన్యాన్ని చూసిన తల్లి కదా ఆమె.
”శుష్కించి పోయి, వేసిన మేత తినే స్థితి కూడా లేదు పిచ్చిముండ. నలుపురంగేసి పోయింది. నాలుగు రోజులుండు. మీ అబ్బాయికో, అమ్మాయికో జబ్బు చేస్తే ఉండవూ?” అంటూ ఆ నోరు లేని జంతువు కోసం తపన పడిన తల్లి. చిన్నతనంలోనే పందిపిల్లలతో ఆడుకున్న ”అమ్మ” – ఆ వయస్సులోనే ఆ పందిపిల్లల తల్లికి, తనకు పెట్టిన అన్నం తెచ్చి ప్రేమతో పెట్టిన తల్లి. ”శ్రీ మహారాజ్ఞి” అయిన ”అమ్మ”కు మనమూ, పశుపక్ష్యాదులూ సమానమే.
”రేపటి నుండి కోసుకురాబోకండి. అవి తింటే జలుబు ఎక్కువ అవుతుంది. మీకిస్తే మీరు తింటారు. అందుకని నేనే తింటున్నా” అని అంటూ రాచఉసిరిక పళ్ళన్నీ తానే తిన్నది ”అమ్మ” గొంతునొప్పితో, దగ్గుతో బాధపడుతూ కూడా. ఆవరణలో చాలమంది జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారు. ఆ పళ్ళు ప్రసాదంగా ఇస్తే వాళ్ళంతా తింటారని, ”అమ్మ” ఆ పళ్ళను ఎవరికీ ఇవ్వకుండా అన్నీ తనే తినేసింది. తన బిడ్డల యోగక్షేమాలను కాంక్షించే తల్లి – ”శ్రీ మహారాజ్ఞి”యే కదా!
”కరణం అనిపించుకోను కానీ, కరణీకం చేస్తాను” అని చెప్పిన ”అమ్మ” ఒక సందర్భంలో ఆ మాట నిజం చేసింది. జిల్లెళ్ళమూడికి వచ్చాక గొలుసు పోయిందని అనుకున్న ఒక అన్నయ్య ఆవరణలోని చిన్న పిల్లలను, వాళ్ళు తీసారేమో అనే ఉద్దేశంతో నిలదీస్తుంటే – ”పసిపిల్లలను నిర్బంధించకండి. దారిలో ఎక్కడైనా పోయిందేమో!” అని మందలించారు. ”అమ్మ” అన్నట్లుగానే ఆవరణలో కాక, దారిలోనే పోయినట్లు తర్వాత తెలిసింది. మహారాణి గారి తీర్పుకు తిరుగేముంటుంది?
‘ఏమి అడగాలో తెలీడం లేదమ్మా’ – అని ఒకరంటే ”ఏమీ (అడగటం) అవసరం లేదు నాన్నా” అని ”అమ్మ” సమాధానం. అంటే ”అమ్మ”ను మనం ఏదీ అడగనవసరం లేదు.ఆమె మనకేది అవసరమో దాన్నే మనకు ఇస్తుంది. అందుకే ”వాళ్ళ కిష్టమని పెడతానా? నాకు పెట్టాలనిపిస్తే పెడతాను” అని అంటుంది ”అమ్మ”. అవును మరి. మన మడిగిన దాని కంటే, మన మడగకుండా ”అమ్మ”కే పెట్టాలనిపిస్తే, మన కంటే అదృష్టవంతులెవరు ? ”అమ్మ అడిగిన బిడ్డకు అడిగిందే పెడ్తుంది. ఊరుకున్న బిడ్డకు ఏమి కావాలో తానే చూసి పెట్తుంది” అనేది ”అమ్మ” వాక్యం. మామూలు తల్లుల విషయంలోనే ఇలా ఉంటే ”శ్రీ మహారాజ్ఞి” అయిన ”అమ్మ”ను గురిచి చెప్పేదేముంటుంది ?
”అమ్మ”లో కనిపించే కార్యనిర్వహణ సామర్థ్యం, జీవుల పట్ల చూపే ప్రేమానురాగాలు, బిడ్డల పోషణలో గల శ్రద్ధ, పెట్టుపోతల్లో ”అమ్మ” చూపించే నిష్పక్షపాత వైఖరి, పలుకులలోని గాంభీర్యం ”శ్రీమహారాజ్ఞి”గా ”అమ్మ”ను సాక్షాత్కరింప చేస్తున్నాయి. అందుకే ”అమ్మ” అంటుంది. ”నేను సర్వసిద్ధాంత సార్వభౌమను” అని.
అర్కపురిలోని అందరింటిలో అనసూయేశ్వ రాలయంలో ”శ్రీ మహారాజ్ఞి”గా కొలువై ఉన్న తల్లి – ఈ నూతన సంవత్సరారంభ శుభవేళ మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సుఖశాంతులను అను గ్రహించి, సదా మనల్ని రక్షించాలని కోరుకుంటూ, ”అమ్మ” పాద రాజీవములకు ప్రణమిల్లుతూ – జయహోమాతా ! శ్రీ అనసూయా!