అమ్మ మూలకారణమైన పరదదేవత; ఆది, అంతము లేనిది, సర్వానికీ ఆధారమైనది. జగజ్జనని అమ్మ తల్లి రంగమ్మగారు, తండ్రి సీతాపతిశర్మ గారు. మన్నవ అనే చిన్న గ్రామంలో జన్మించింది. బాల్యంనుంచే, పువ్వుపుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, మాతృభావన ప్రభవించి ప్రసరించింది. ఎవరిని చూసినా తన బిడ్డేనన్న విశ్వజనీన భావనతో ప్రేమానురాగతరంగాలు ఉప్పొంగేవి. మానవాకృతి ధరించి మాననీయ మానవీయ విలువలతో మనుష్యులనేకాదు, పశుపక్ష్యాదులు, సకల జీవకోటిని ఉద్ధరించటానికి వచ్చిన సౌభాగ్యదేవత, ప్రేమైక స్వరూపిణి అమ్మ.
అమ్మ భర్త శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు. వారు జిల్లెళ్ళమూడి గ్రామ కరణం; నిరాడంబర మూర్తి – ప్రేమైరస స్ఫూర్తి. అమ్మ ఒక సామాన్య గృహిణిగా ముగ్గురు బిడ్డల తల్లిగా కనిపిస్తుంది. కానీ తరతమ భేదం లేక అందరినీ కన్న బిడ్డలుగా ఎంచటం ద్వారా వసుధైక కుటుంబ భావనకి ప్రాణం పోసింది.
అమ్మ కాపురానికి వచ్చిన రోజులలో జిల్లెళ్ళమూడి ఎడారిని తలపించింది. గ్రామస్థులు అధికభాగం వ్యవసాయ కూలీలు. కానీ తరచుగా వరదలు కారణంగా కరువు రాజ్యం ఏలేది. ఫలితంగా పస్తులు ఆకలిబాధలతో దుర్భరపరిస్థితి. ఆ ఆపత్కాలంలో అమ్మ ఇంటింటా గుప్పెడు బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామస్థులకు ఊపిరిపోసి నవ జీవితాన్ని ప్రసాదించింది. అమ్మ దృష్టిలో అన్ని బాధలకంటే ఆకలిబాధ గొప్పది. తొలి రోజులలో బంధువులకు, వచ్చే యాత్రికులకు అమ్మయే స్వయంగా వండి వడ్డించేది.
ఈ కలిలో ఆకలికేకలు దూరం చేయాలనే గొప్ప సంకల్పంతో 1958వ సంవత్సరం ఆగష్టు 15వ తేదీన అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది. అక్కడ కులమత వర్గాలకు అతీతంగా ఆకలి అర్హతగా ఎవరైనా ఏవేళనైనా అచట అమ్మ (అన్న) ప్రసారం స్వీకరించవచ్చు. ఈ సహపంక్తి భోజనంతో పాటు అందరిలో అన్నదమ్ములు- అక్కచెల్లెళ్ళు అనే విశ్వాసౌభ్రాతృత్వ భావనని అమ్మ పెంచిపోషించింది.
అమ్మకు ఏబది సంవత్సరాలు నిండిన సందర్భంగా ‘స్వర్ణోత్సవాలు’ వైభవంగా నిర్వహించబడ్డాయి. అందు ముఖ్యంగా లక్షమంది ఒకే పంక్తిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మకు 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా ‘వత్రోత్సవాలు’ నిర్భహించబడ్డాయి. వేలాది మంది అమ్మ దర్శన ప్రసాదాలను పొందారు. తర్వాత వాత్సల్యయాత్ర పేరిట అనాధలను, పేదలను, రోగగ్రస్థులను, బాధితులను వెతుక్కుంటూ వెళ్ళి అమ్మ కోటిమందిని అక్కున చేర్చుకున్నది.
నేను ప్రప్రధమంగా అమ్మను వత్రోత్సవాల్లో దర్శించుకున్నాను. తనువు పులకరించింది, మనస్సు పరవశించింది, కన్నులు తదేక దృష్టితో ఆర్ద్రమై ఆనంద బాష్పాలను వర్షించాయి, జన్మజన్మలుగా ఆ పరదేవతతో ముడిపడిన సంబంధ బాంధవ్యాలు అవ్యక్తంగా జాగృతమై మనస్సు ఆనంద తరంగితమైంది. అలా అమ్మకృప నాపై ప్రసరించింది.
క్రమేణ జిల్లెళ్ళమూడి గ్రామం ప్రపంచపటంలో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం – ముక్తిక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. దూర సుదూర ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి ఎందరో వచ్చి దర్శించుకున్నారు. అమ్మ ప్రేమ, వాత్సల్యం, ఆదరణ, తత్త్వం విశ్వవ్యాప్తమై వేనోళ్ళ కొనియాడబడుతున్నవి.
అందరికీ కూడు, గూడు, ఆరోగ్యం, విద్య, ఆనందం సమకూర్చుటకు అమ్మ అందరిల్లు, అన్నపూర్ణాలయం సరసన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలను స్థాపించింది. ఎందరో పేద విద్యార్థులు అక్కడ విద్యతో పాటు ఉత్తమ సంస్కారాన్ని నేర్చుకుని అమ్మ అనుగ్రహంతో ఎంతో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. అలాగే మాతృశ్రీ మెడికల్ సెంటర్ ద్వారా జిల్లెళ్ళమూడి ఆశ్రమవాసులు – గ్రామస్ధులకే. కాక పరిసర గ్రామాలలో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించి, ఉచితంగా పరీక్షలు జరిపి మందులను పంపిణీ చేస్తున్నారు.
అంతేకాదు, అమ్మ సందేశాన్ని ఆచరణలో పెడుతూ జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి హైదరాబాదు, పార్వతీపురంలోనూ విశాఖ, తిరుపతి వంటి పలు ప్రాంతాల్లో మురికి వాడలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులు, ఫుట్పాత్ మీద నివసించేవారికి అన్న ప్రసాదంతోపాటు చలిబాధకు దుప్పట్లు, రగ్గులు పంచుతున్నారు.
జిల్లెళ్ళమూడి ఆలయాల్లో అనుదినం అభిషేకాలు, అర్చనలు, పర్వదినాల్లో ఉత్సవాలను నిర్వహించుట ద్వారా మనస్సు పనిత్రీకృతం అవుతుంది, ఆనందమయమవుతుంది, మనకి తెలియకుండా దీక్షగా సాధనా మార్గంలో ముందుకు సాగుతుంది.
అమ్మకు అందరూ బిడ్డలే. దర్శనార్థం వచ్చే, కోరికలతో – బాధల నివారణ కోసం – సమస్యల పరిష్కారం కోసం వచ్చే అందరిపైన అమ్మ వాత్సల్యామృత ధారలను కురిపిస్తోంది. దయాస్వరూపిణి, మంగళకారిణిగా దివ్య ప్రభలతో దర్శన మిస్తోంది, ఆశీర్వదిస్తోంది, అనుగ్రహిస్తోంది.
అమ్మ రాశి: బియ్యపు రాశి
అమ్మ కోరిక : ఈ కలిలో ఎవరూ ఆకలితో ఉండకూడదు.
అమ్మకు ఇష్టమైనది: మన కున్నంతలో ఇతరులకు అన్నవస్త్రాదులు పంచటం.
అమ్మ సందేశం : నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో.
అమ్మ ప్రబోధం : అందరూ ఒకే తల్లి పిల్లలం అనే భావన కలిగి ఉండండి. ఎవరైనా ఆపదలో ఆదుకోండి.
అమ్మప్రేమ: సహజము, అకారణము
అమ్మ (జగన్మాత) లేక జన్మ, జీవితం, జగత్తు లేవు. అన్నదాత, జన్మదాత, ముక్తి ప్రదాత అయిన అమ్మకి సాష్టాంగ ప్రణామాలు.