పూవులు ఎన్నో పూస్తాయి. కానీ భగవతి శ్రీచరణాలను అలంకరించినవే చరితార్ధతను, సార్ధకతను సంతరించుకుంటాయి. శ్రీ లక్ష్మీనారాయణ అన్నయ్య మాతృశ్రీ చరణ సమలంకృత పూజాపుష్పం.
అన్నయ్యను తలచుకుంటే ఎన్నో వాస్తవాలు కళ్ళముందు నిలుస్తాయి. కలం ఎన్నోరీతుల పరుగెడుతుంది. ‘శ్రీ లక్ష్మీనారాయణ’ అందామా అంటే ‘శ్రీ’ అంటే ‘లక్ష్మి’ అని అర్థం.
‘మాలక్ష్మీనారాయణ’ అందామా అంటే ‘మా’ అన్నా ‘లక్ష్మి’ అని అర్థం.
నిజానికి అన్నయ్య లక్షనారాయణ, లక్షణ నారాయణ, లక్షల నారాయణ, కమలానారాయణ; వివరిస్తా.
అమ్మ దివ్య సన్నిధిలో ప్రప్రధమంగా శ్రీ లలితాకోటి నామ పారాయణ దీక్షాదక్షుడు కావున లక్షనారాయణ. నేడు జిల్లెళ్ళమూడి ఆలయాల్లో శ్రీ లలితా లక్షనామపారాయణ ప్రతి సోమ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు.
మాతృసేవా తత్పరతతో లక్షల విరాళాన్నిచ్చి అమ్మ సంకల్పానికి ఆచరణ రూపంగా నిలిచాడు. కావున లక్షల నారాయణ.
హైమాలయంలో శ్రీ అనసూయేశ్వరాలయంలో నిరాహారంగా ఎన్నో దీక్షలను క్రమశిక్షణతో చేపట్టాడు, జగదేకైక శాసని అమ్మను ఉపాసించాడు. అమ్మను రాజరాజేశ్వరిగా దర్శించాడు. అలా శుభలక్షణ సంశోభితుడు కావున లక్షణ నారాయణ.
కమలక్కయ్యకు పతిదేవుడు. కావున కమలా నారాయణ ‘కమలా’ అన్నా ‘లక్ష్మి’ అనే అర్ధం.
‘లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీహరిప్రియా
ఇందిరా లోకమాతా మా రమా మంగళదేవతా
భార్గవీ లోకజననీ క్షీరసాగరకన్యకా’ – అనేవి లక్ష్మీదేవి పేర్లనీ అమరకోశం స్పష్టం చేస్తుంది.
శ్రీ శంకరభగవత్పాదులవారు దేవ్యపరాధక్షమాపణస్తోత్రంలో ‘న వాదత్తం దేవి! ద్రవిణమపి భూయ స్తవ మయా (అమ్మా! జగన్మాతా! కష్టార్జితమైన ధనాన్నైనా నేను నీకు సమర్పించలేదు) – అన్నారు.
ఆ పరమార్థాన్ని చక్కగా తెలుసుకున్న అన్నయ్య – ఇంట్లో దొంగలు పడి సంపదనంతా దోచుకు పోయిన క్లిష్టపరిస్థితిలో ఈషణ్మాత్రమూ చలించక అమ్మకు నిలువుదోపిడి సమర్పించాడు.
‘క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీః నాశయామ్యహమ్
అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్ణుద మే గృహత్’ అని శ్రీసూక్తంలో చెప్పబడింది.
అమ్మ సేవకు సమర్పించబడిన ధనం ఇచ్చే ఫలం ఆకలిదప్పులు, దారిద్ర్యం, అవిద్య, అజ్ఞానం, లోటు, లోపం వారి గృహంలో ఉండనే ఉండవు. కనుకనే లక్ష్మీనారాయణ అన్నయ్య సార్థక నామధేయుడు.
అన్నయ్యను తలచుకుంటే –
‘జిహ్వేకీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం
పాణిద్వంద్వ సమార్చయ అచ్యుత కధాః శ్రోతద్వయ త్వంశృణు |
కృష్ణం లోకయ లోచన ద్వయం హరేః గచ్చాం మ్రియుగ్మాలయం
జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధ న్నమాధోక్షజమ్ ॥ –
అనే ఒక భాగవతుని ఆదర్శలక్షణ సంపద గుర్తుకు వస్తుంది.
గోపీభర్త్యః పదకమలయోః దాసదాసాను దాసః” అనే దాసభక్తికి దర్పణం పడుతూ త్రికరణశుద్ధిగా అమ్మను సేవించిన కృష్ణవేణమ్మక్కయ్య, గజేంద్రమ్మక్కయ్య, హరిదాసుగారు వంటి సోదరీ సోదరుల యోగక్షేమాన్ని విచారించి, ఆదుకున్నాడు.
‘మాతుః పవిత్రచరణా శరణం ప్రపద్యే’ అంటూ అమ్మకు శరణాగతుడైనాడు.
‘వినైవానసూయాం న మాతా న మాతా
సదైవానసూయాం స్మరామి స్మరామి’ – అంటూ సర్వాత్మనా అమ్మను అర్చించాడు. కనుకనే ‘నేనెట కేగెదనమ్మా కాదని నినుకాదని’ అని గొంతెత్తి వినమ్రతతో అభ్యర్థించాడు.
‘నీలోనేనై’, నాలోనీవై
అంతట అమ్మయి నిండిన నిన్ను’ తాదాత్మ్యం చెందాడు. అంటూ ఆద్యంతరహిత అమ్మతో
అమ్మ విగ్రహప్రతిష్ఠ మహావైభవంగా నిర్వహించుకోవాలని ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ గ్రంథాలను పారాయణకర్తలకు ఉచితంగా అందజేశాడు.
స్వర్ణోత్సవ సింహద్వార నిర్మాణం; ఆలయాల నిర్మాణం – నిర్వహణ విషయంగా అవిశ్రాంతంగా కృషి చేసి కృతకృత్యుడైనాడు.
‘శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి’ మరియు ‘శ్రీ మాతృశ్రీ అష్టోత్తర శతనామావళు’లను అర్థవంతంగా హృదయంగమంగా పఠించాలంటే లక్ష్మీనారాయణ అన్నయ్యే సమర్థుడు. అన్నయ్య చదివితేనే అమ్మ సంతోషించేది.
అలా అమ్మ హృదయకమలంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన లక్ష్మీనారాయణ అన్నయ్య తేది 13.4.2014న తన తనువును చాలించి, జన్మదాత జగన్మాత అమ్మలో ఐక్యమైనాడు.
అన్నయ్య జీవితం, ఆచరణ అన్ని కాలాల్లో అందరికీ మార్గదర్శకం. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఈ దుఃఖసమయంలో వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వారి సహధర్మచారిణి కమలక్కయ్యకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించమని అమ్మను వేడుకుంటున్నాము.
Mother of All పక్షాన అనుంగుసోదరునికి ఆత్మీయతాంజలిని ఘటిస్తున్నాము.
సంపాదకులు