1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శ్రీ వివేకానందుని అంతరంగ తరంగాల్లో అమ్మ

శ్రీ వివేకానందుని అంతరంగ తరంగాల్లో అమ్మ

Radha
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : May
Issue Number : 10
Year : 2021

11-09-1893 – స్వామి వివేకానంద చికాగోలో పరమత సహనం లక్ష్యంగా తొలి Parliament of Religions’ లో హిందూదేశానికీ హిందూత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ‘సింహ గర్జన’ చేసిన రోజు. సత్యా న్వేషణ దిశగా హిందూదేశమే కాదు యావత్ప్రపంచమూ గర్వించిన రోజు, కళ్ళు తెరిచిన రోజు..

సభారంభమైన తర్వాత ఒక సమయంలో ‘Swamy Vivekananda!’ అని ఆహ్వానించారు. నిర్వాహకులు. వివేకానంద నిశ్చలంగా ‘next’ అన్నారు. తర్వాతి వక్త ప్రసంగానంతరం తిరిగి ‘Vivekananda!’ అంటూ పిలిచారు. మళ్ళీ ‘next’ అన్నారాయన. అలా చాలాసేపు గడిచింది. ‘Vivekananda’ అన్నపుడు మామూలుగా ‘next’ అన్నారు. ‘You are the last’ అన్నారు నిర్వాహకులు.

స్వామి వివేకానంద చివాలున లేచి Podium వద్దకు వెడుతున్నారు. ‘five minutes for you’ అన్నాడాయన. వారి మాటలు పట్టించుకోకుండా Mike ఎదురుగా నిలబడి ‘Sisters and Brothers of America!’ అని శ్రోతలను సంబోధించారు; అది కాళీమాత యొక్క పరవాక్కు. అంతే మూడు నిముషముల సేవు సభ ప్రాంగణం అంతా కరతాళధ్వనులతో ప్రతిధ్వనించింది.

ఆ ఆత్మీయ సంబోధన వాళ్ళ గుండెల్లోంచి. దూసుకుపోయింది. నిద్రాణమైయున్న విశ్వమానవ సౌభ్రాతృత్వ మధుర బంధాన్ని మేల్కొలిపింది. వారి హృదయకేదారాలపై అమృతసేచనమయి ఆనంద తరంగాల్లో తేలియాడారు. Ladies and Gentlemen’ అనే సంప్రదాయానుగత రసవిహీనమైన పలకరింపుతో విసుగెత్తిపోయారు.

‘Sisters and Brothers!’ ఏకోదర రక్త సంబంధబాంధవ్యం పెల్లుబికింది.

గాఢనిద్రలో ఉన్న అమ్మను తట్టిలేపి ప్రశ్నించినా అమ్మ అత్యంత సహజంగా ఒక్కమాటను ఉద్ఘాటిస్తుంది “నాకు మీకూ ఉన్న నంబంధం తల్లీ బిడ్డా సంబంధం; మీకూ మీకు ఉన్న సంబంధం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళసంబంధం” అని. 

“No men are strange, no Country is foreign;

Beneath all uniforms a single body breathes ” అంటారు James Kirkup. “అందరూ ఒకే తల్లిపిల్లలు అనే భావం కలిగి ఉండండి; ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోండి” – అనేది జగన్మాత అమ్మ మహితోక్తి.

6 నిముషాల్లో 458 మాటల్లో వివేకానంద తన ప్రసంగాన్ని అవ్యక్త మధురంగా, ప్రసన్న గంభీరంగా అతిలోక సుందరంగా ఆప్తవాక్తుల్యంగా వినిపించారు. నాకు తెలిసినంతవరకు వారి పసిడి పలుకుల్లోని అమ్మ – మహనీయ దివ్యతత్వాన్ని ఆవిష్కరిస్తాను.

  1. ప్రారంభంలోనే ‘I thank you in the name of the most ancient order of monks in the world, I thank you in the name of the mother of religions’ అంటూ కృతజ్ఞత చాటారు. శ్రీరామచంద్రుని పరమ ఔదార్యగుణాల్లో ‘కృతజ్ఞత’ ఒకటి. Mother of religions’ అన్ని మతాలకు తల్లి ఒకరే; ఒకే మూలం ఉన్నది అన్నారు. “సర్వసమ్మతమే నా మతం” అన్నది అమ్మ. ‘నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచాచార్య పర్యంతాం వందే గురు పరం పరాం’- అంటూ గురు పరంపరని స్మరిస్తాం, అంజలి ఘటిస్తాం అది భారతీయ ఆర్ష సంస్కృతి, ఇదే స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ వివేకానందులు ‘ancient order of monks in the world’ ప్రపంచంలోని ఋషి పరంపరకి నమస్కరించాడు, నీరాజనాలర్పించాడు.

అమ్మ పురాణాల్ని, ఇతిహాసాల్ని, వేదవాఙ్మయాన్ని సముచిత సమున్నత స్థాయిలో గౌరవించింది. “విరామం లేనిది రామం” అనీ, “రాధ అంటే ఆరాధన” అనీ నిర్వచనాలిస్తూ “శాస్త్రాలలో అన్నీ చెప్పబడే ఉన్నాయి, “నాన్నా!” అనీ “భగవద్గీతలో చెప్పనిది నేను చెబుతున్నది లేదు; చెప్పే తీరు వేరుకావచ్చు కాని”అని వివరించింది. 

  1. అమ్మ అంటుంది “నేనేం చదువుకోలేదు. ఏది చెప్పినా నా అనుభవంలోంచే చెపుతాను” అని.

ఈ సత్యాన్నే శ్రీ వివేకానందులు “టన్ను శాస్త్ర జ్ఞానం కన్నా ఔన్సు అనుభవం గొప్పది”అని విస్పష్టంగా చాటారు. “స్మృతిః ప్రత్యక్షం ఐతిహ్యం అనుమానః చతుష్టయమ్ – పరతత్త్వానుభవ ప్రాప్తికి వేదములు 4 మార్గాల్ని సూచించాయి. స్మృతులు, అనుభవం, ఇతిహాసం, వివేచన అని అమ్మ చెప్పినదీ, వివేకానందులు చెప్పినదీ వేదవాక్కే. అంటే అమ్మ మాటే, వివేకానందు నోట, అదే వేదములు నిర్దేశించిన బాట. “సాహిత్యంతో రాహిత్యం కాదు” అని అమ్మ చాటితే, ‘ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైతవాసనా” అని వక్కాణించారు శ్రీశంకరభగవత్పాదులు.

  1. “We believe not only in universal toleration but we accept all religions as true” అన్నారు స్వామి వివేకానంద. హిందూత్వం తీర్చింది. విశ్వమంతటా సహనశీలతను నమ్ముతుంది; అన్ని మతాలూ సత్యమైనవేనని విశ్వసిస్తుంది – అని.

అమ్మ ప్రబోధిస్తుంది “ఆచరించేవాడికి (బైబిల్ అయినా, గీత అయినా, కొరాను అయినా) ఏదయినా ఒకటే. అదిలేని వాడికే ఇన్ని మార్గాలూ, ఇన్ని పుస్తకాలు అవసరమూ” అని.

“ఏది చదివినా ఆచరించే వాడికి ఏదైనా ఒకటే. ఆచరించలేని వాడే దానిలో ఏముందీ, దీనిలో ఏముందీ. -అని వెతుకుతాడు. కాని చివరకు వెతకటం తోనే సరిపోతుంది”అని వివరించింది. బైబిల్ సారాంశం ఏమిటమ్మా అని అడిగితే “మమాత్మా సర్వ భూతాత్మా” అన్నది అమ్మ. ఈ మాట శ్రీగురుగీతామృతం లోనిది.

‘మన్నాథః శ్రీ జగన్నాథో మద్గురుః శ్రీ జగద్గురుః | మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవేనమః’ అంటే; నా ప్రభువు లోకమునకు ప్రభువు; నా గురువు జగత్తంతటికీ గురువు; నాలోని ఆత్మ సర్వభూతాంతరాత్మ, అట్టి గురువుకు నమస్కరిస్తున్నాను. అని ఖురాన్ సారాంశమేమిటమ్మా అని అడిగితే “అది అన్నీ చెపుతూనే “అహం బ్రహ్మాస్మి” అంటుంది” అన్నది అమ్మ.

  1. “అసలైన జాతి గుడిసెల్లో నివసిస్తోంది; ఆకలితో అలమటిస్తున్న దరిద్రనారాయణులను సేవించండి’ అన్నారు స్వామి వివేకానంద.

వాత్సల్యయాత్రలో భాగంగా అమ్మ హైదరాబాద్ వెళ్ళినపుడు “ఇక్కడ మనవాళ్ళు ఎందరున్నారు?” అని అడిగింది. అమ్మ ప్రశ్న విని మన సోదరులు “మనవాళ్ళు” అంటే అమ్మకు సన్నిహితంగా మెలిగేవాళ్ళు, అమ్మదర్శనం. కోరి వచ్చేవాళ్ళు అనుకుని లెక్కలు వేస్తున్నారు. అది గమనించి వెంటనే అమ్మ “మనవాళ్ళు అంటే, రోడ్డు మీద భిక్షాటన చేసుకుంటూ నిలువ నీడలేక నివాసం చేస్తూ ఉంటారే వాళ్ళు” అన్నది. “అన్ని బాధలకంటే ఆకలి బాధ గొప్పది” అని పదే పదే హెచ్చరిస్తుంది; తను వండి పెట్టి, వండించిపెట్టి లక్షలాదిమంది క్షుద్బాధను తీర్చింది. 

భాగ్యనగర యాత్రలో అమ్మ మురికి వాడల్ని, ఆస్పత్రులను, అనాధశరణాలయాల్ని సందర్శించి బాధితు లకు ప్రేమతో అన్నప్రసాదం నోటికి అందించింది. మానవ నేత్రాలకి అనాథలు, యాచకులుగా కనిపించే వాళ్ళంతా ‘కనిపించని దైవ స్వరూపాలు’అని సంభావన చేసింది.

 

  1. “You cannot believe in God until you believe in yourself” అన్నారు శ్రీ వివేకానంద.

అమ్మ ఒక సందర్భంలో అన్నది; తన్ను తాను గుర్తించినవాడు సర్వాన్నీ గుర్తిస్తాడు” అని. మరొక సందర్భంలో “మనస్సే దైవం. నీకు తోచినట్టు చెయ్యి. తోపింపచేసేది వాడే (దైవం/శక్తి)”అన్నది. చివరగా “నన్ను నమ్ముకో, నిన్ను నమ్ముకో. ఏదైనా ఒకటే; విశ్వాసమే భగవంతుడు”అన్నది.

  1. “As the different streams hav- ing their sources in different places all mingle their water in the sea, so, O Lord, the different paths which men take through different tenden- cies, various though they appear, crooked or straight, all lead to thee”.

“ఆకాశాత్ పతితం తోయం యధాగచ్ఛతి సాగరమ్ | సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి ||”అనే పరమ సత్యాన్ని చాటారు.

అమ్మ “మీరు ఏ నామంతో ఆరాధించినా ముట్టేది అన్నారు స్వామి వివేకానంద. ఒకరికే”అనీ, “ఏ పాదాలకు నమస్కరించినా ఆ పాదాలకే చెందుతాయి”అనీ వివరించింది.

  1. “Whosoever comes to me, through whatsoever form forever, I reach him” అంటూ “యే యథా మాం ప్రపద్యంతే తాం స్తదైవ భజామ్యహం” అనే గీతా ప్రవచనాన్ని చాటారు – స్వామి వివేకానంద.

“అందరిదీ తలా ఒక రాతయినా, చివరకు అన్నీ ఒకే రాతలో కలుస్తాయి. రాతకానీ, ఏదన్నా కానీ…” అన్నది అమ్మ. రామునిగా కృష్ణునిగా, సత్యనారాయణస్వామిగా, గాయత్రిగా, దుర్గగా, ఏసుగా, అల్లాగా వారివారి ఇష్టదైవ రూపాల్లో దర్శనాన్ని ప్రసాదించింది అమ్మ. కాగా అమ్మది సర్వసమాన దృష్టి. “మోక్షానికి ఇదీ దారి అంటూ లేదు. ఆ దైవం ఏం చేయిస్తే అది చెయ్యి” అంటుంది అమ్మ. చేతులు మనిషివి, చేతలు దైవానికి అని విశదీకరిస్తుంది.

  1. “You have to grow from the inside out.

None can teach you.

There is no other teacher but your own soul” అని ప్రబోధించారు స్వామి.

“గురువు వద్దని నేనెప్పుడూ అనలేదు. గురువే అక్కర్లేదంటాను. నీ మనస్సు చెప్పినట్టు చెయ్యి. మనస్సుకి భిన్నంగా దైవం లేడు” అనీ, “మనస్సే దైవం”అనీ వివరించింది అమ్మ. అనుభవిస్తున్న దానిని అవాస్తవం అని ఎవరు అనగలరు? ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా ఆచరణవద్దకు వచ్చేటప్పటికి మనస్సు నిర్దేశించినట్లుగానే ఆచరిస్తాం. ఈ సారాన్నే శ్రీరాజుబావ ‘గురువులెవ్వరు లేరు అనుభవంబున కన్న’ అన్నారు.

  1. “Sectarianism, bigotry and its horrible descendant, fanaticism, have long possessed this beautiful earth” –

మూఢ విశ్వాసం, మతదురభిమానం, మతోన్మాదం చిరకాలంగా పుడమితల్లిని పట్టిపీడిస్తున్న దయ్యాలు. (Possessed అనే మాటకి అర్థం Gods, demons… take control of a human body అని చెప్పబడింది.)

దేశం, ప్రాంతం, భాష, కులం వరంగా దురభిమానాన్ని పెంచుకుని తత్ఫలితంగా వైరాన్ని పెంచుకుని అడ్డుగోడలు కట్టుకొని ప్రజల శాంతియుత వ్యవస్థని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. రక్తపుటేరులు ప్రవహింపచేస్తున్నారు. అంతేకాదు మతం, విశ్వాసం, గురువుల పేరిట కూడా అగాధాలు సృష్టించుకుని మానవీయబంధాల్ని ముక్కలు చెక్కలు చేస్తున్నారు.

– (సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!