సో॥ శ్రీ హనుమబాబు నవవిధభక్తిమార్గాల అమ్మను ఆరాధించారు; నాకు తెలిసినంత వరకు వివరిస్తాను.
తను హృద్భాషల సఖ్యమున్ :
త్రికరశుద్ధిగా అమ్మ (సంస్థ)ను సేవించారు. అన్నపూర్ణాలయంలో, దేవాలయంలో, ఉత్సవాల్లో, జిల్లెళ్ళమూడి వెలుపల పలు దూర సుదూరప్రాంతాల్లో సభలు, పూజలు, శుభకార్యాలు, సేవాకార్యక్రమాలకి సారధ్యం వహించారు; దీక్ష వహించి జయప్రదం చేశారు.
శ్రవణమున్ :
అమ్మ ప్రబోధాన్ని అవగాహన చేసికొని ఆచరణలో పెట్టారు. ప్రచారం కోసం బానర్లు, కరపత్రాలు సిద్ధం చేసికొని అమ్మతత్త్వాన్ని విస్తృతంగా వినిపించేందుకు శ్రీకారం చుట్టారు.
దాసత్వమున్ :
ధాన్యాభిషేకం, అమ్మ జన్మదినోత్సవం, అమ్మ కళ్యాణ దినోత్సవాల సందర్భంగా గ్రామ గ్రామాలు తిరిగి విరాళాల్ని సేకరించి అందరి హృదయాల్ని కలుపుకుని సహస్రదళ హృదయ పద్మాలతో అమ్మ శ్రీ చరణాల నర్చించారు.
వందనముల్ :
పూర్ణదీక్షను స్వీకరించి, అనుదినం శ్రీ చక్రార్చన చేసి, బిందురూపంగా పరాత్పరిగా అమ్మకు అంజలి ఘటించారు.
అర్చనముల్ :
మండలదీక్షలను గైకొని ‘శ్రీవిద్యారణ్య ప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీ సూక్తపారాయణ’ జప హోమ తర్పణాలదులను నిర్వహించారు.
సేవయున్:
ప్రతి ఏటా అమ్మనామ సప్తసప్తాహాలూ, హైమక్కయ్య జన్మదినోత్సవ సందర్భంగా శ్రీ లలితాకోటి నామపారాయణలు బాధ్యతను వహించి భక్తబృందాలకు వాహనములను పంపి రప్పించి, వారికి తగు సౌకర్యాల్ని కలిగించి, అహోరాత్రములు కృషి చేసి జయప్రదం, ఫలప్రదం చేసిన కర్మయోగి. కార్తీకమాసంలో ఉపవాసాలూ, విశేషపూజలూ, వనభోజనాలు వంటి సనాతన సంప్రదాయబద్ధ ఆచారాల్ని పాటించారు.
ఆత్మలో ఎరుకయున్ :
‘జిల్లెళ్ళమూడి ముక్తి క్షేత్రం – అమ్మ ముక్తిమాత’గా దర్శించి, పదిమందికి చాటి చెప్పారు. అమ్మను మూలకారణశక్తిగా ఎరిగి పర్వదినాల్లో స్వహస్తాలతో అమ్మను కిరీటధారిణిని చేసిన విశిష్టులు, వశిష్టులు. వారు పురోహితులు – అంటే ముందుగా శ్రేయస్సును కోరేవారు.
సంకీర్తనల్ :
బాపట్ల హైమవతీ బామ్మగారి దగ్గర హార్మోనియం నేర్చుకుని, రాగతాళ భావభరితంగా ఆర్తితో ఉచ్ఛైస్వరంతో అమ్మ దివ్యనామ సంకీరన చేశారు. ధనుర్మాసంలో తిరుప్పావై పఠించి సిసలైన రాధామాధవ తత్త్వాన్ని బోధించారు.
చింతనము :
అమ్మ తత్త్వ చింతన సభల్లో ప్రసంగించారు. అమ్మవిశ్వజననీ మాతృతత్త్వవైభవాన్ని, అలౌకిక శక్తి మాహాత్మ్యాన్ని చాటుతూ ‘ఈమె అంబికాసిద్ధురాలు’, ‘భయం -అభయం’, ‘పాపం అంటుకుంటే పుణ్యం అంటుకోదా?’ వంటి వ్యాసరూపసాహిత్యకుసుమాలతో అమ్మను అర్చించారు.
హనుమబాబు అంటే భాగ్యమ్మక్కయ్య కుమారుడు. భాగ్యమ్మక్కయ్య అంటే మూర్తీభవించిన ఆదరణ, ఆప్యాయత, సేవాతత్పరత. హనుమబాబు రేటూరు గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో తెలుగు పండిట్గా పనిచేసేవారు. అమ్మ అనుగ్రహంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఉపన్యాసకులుగా పదోన్నతి పొందారు. అమ్మ సేవాభాగ్యానికి నోచుకోవటమే వాస్తవంగా పదోన్నతి వారి దృష్టిలో. హనుమబాబు గారి ప్రమేయం లేకుండా వారి కుమార్తె వివాహ బాధ్యతని అమ్మే స్వీకరించి సంతోషంగా నిర్వహించింది. మాష్టారు పదవీ విరమణానంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థుల విద్యాప్రమాణస్థాయిని పెంచటం కోసం స్వచ్ఛందంగా అదనపు తరగతులను నిర్వహించారు. శ్రీ లలితాసహస్ర నామ స్తోత్రపారాయణ క్రమాన్ని నేర్పారు.
హనుమబాబు సార్థకనామధేయులు. ‘మీరు ఈ పనిచేయాలి’ అని అడిగితే ముందూ వెనుకా ఆలోచించకుండా తక్షణం కార్యరంగంలోకి దూకేవారు.
అమ్మే శ్రీరామచంద్రుడు అనీ, రామాయణ కాలం నాటి వ్యక్తులంతా ఏదోరూపంలో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకుని కృతార్థులౌతున్నారని విశ్వసించారు. ‘అసుచయస్తవనిశ్వసితానిలే యదిలయం సముపైతి మృతేర్య ! ప్రియతరం నహి కించిది మస్తిహేజనని! తత్సఫలం కురువాంఛితమ్’ అనే వారి కడసారి కోరిక మేరకు అమ్మ నడయాడిన అవనీ స్థలిపై 11-6-13 తేదీన అమ్మలో ఐక్యం చెందారు.
1985 జూన్ 12వ తేదీన అమ్మ మహాభినిష్క్రమణం చేసిన రోజు. దానిని తలచుకుంటూ ఆయన అమ్మ ఉండగానే ఒకరోజు ముందే శరీరాన్ని త్యజించాలి అని భావించారా అనిపిస్తుంది. కానీ అమ్మ హృదయగత భావన వేరు. “నేనుండి నువ్వు లేకపోతే ఆ బాధను నేను భరించలేను” అంటుంది కన్నబిడ్డలతో అసలైన కన్నతల్లి.
జిల్లెళ్ళమూడిలో అపరకర్మల నిర్వహణ సౌలభ్యం కోసం ‘సుగతిపధం’ భవన నిర్మాణానికి హనుమబాబు ఎంతో కృషి చేశారు. కాగా అమ్మ అందరికీ సుగతినే అనుగ్రహిస్తోంది.
ఒక భాగవత శ్రేష్ఠుడు, కర్మిష్ఠి, భక్తుడు, అమ్మ శ్రీచరణ రేణువు, అనుష్ఠానవేదాంతి అయిన అమ్మగారాల బాబు హనుమబాబు భౌతికంగా ఇక లేరు. ఆ ఆర్ద్రహృదయుని కిదే అనురాగ ప్రపూర్ణ అశ్రుతర్పణం.