- జిల్లెళ్ళమూడిలో :-
12-11-2014 తేదీన శ్రీ హైమవతీదేవి 72వ జయంతి ఉత్సవ సందర్భంగా శ్రీ లలితా కోటి నామపారాయణ శ్రద్ధాసక్తులతో దిగ్విజయంగా వైభవంగా నిర్వహించబడింది. ఈ సంప్రదాయానికి మూలం కీ॥శే॥ రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్య.
హైమ స్వరూప లలిత, స్వభావ మధుర, కారుణ్యరూపిణి, కామితార్థ ప్రదాయిని, భోగమోక్ష ప్రసాదిని.
ఉదయం గం.6.00 లకు శ్రీ అనసూయేశ్వ రాలయం, శ్రీ హైమాలయాల్లో హైమవతీ జనయత్రీ వ్రతాలు కల్పోక్తంగా నిర్వహించబడ్డాయి.
ఉదయం గం.8.00 లకు అందరింటి ఆవరణలో అన్నపూర్ణాలయ నూతన భవన ప్రాంగణంలో శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ అమ్మ-హైమలకు నమస్సు మాంజలుల నర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి, అనుగ్రహ భాషణం చేసి పారాయణను స్వయంగా ప్రారంభించారు. తమ అనుగ్రహ భాషణంలో లలితాదేవి పావన నామముల విశేషార్ధాల్ని వివరించారు. అమ్మ “సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతీ”. సృష్టి స్థితిలయకారిణి అమ్మ అన్న దా- అన్నం పేట్టెది. అన్న పూర్ణాలయం అమ్మ ఉదరం. బిడ్డలకు అన్నం పెట్టుకోవటం అమ్మకు మహదానందదాయకం” – అని అమ్మ సహజ మాతృప్రేమను శ్లాఘించారు.
గం.10.00 లకు హైమాలయంలో శ్రీ ఎమ్. శరత్ చంద్ర కుమార్ సంకలనం చేసిన ‘హైమ – హైమాలయం’ 3 సంపుటాల్ని హైమ పావన పాద పద్మములకు అంకితం చేశారు. శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్, శ్రీ రవి అన్నయ్య ప్రభృతులు హైమ కాలెండర్లను ఆవిష్కరించి అందరికీ పంచారు.
హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగుళూరు, విజయవాడ, గుంటూరు, పెద్దపులిపాక, బాపట్ల, కంకిపాడు, జమ్ములపాలెం, కాకుమాను, అప్పాపురం, కొమ్మూరు, పొన్నూరు, పెదనందిపాడు వంటి సమీప దూర సుదూర ప్రాంతాల్నించి జట్లు జట్లుగా సుమారు 800మంది ఇందు పాల్గొన్నారు.
సో॥ శ్రీ P.S.R. ఆంజనేయప్రసాద్ గారి ధర్మపత్ని శ్రీమతి గిరిబాల తీవ్ర అస్వస్థతకు లోను కావటం వలన శ్రీ హైమవతీశ్వరికి ఆపద మొక్కుగా 1000 కొబ్బరికాయలు కొట్టారు. అమ్మకు కూడా మరొక 1000 కొబ్బరికాయలు కొట్టారు.
హైదరాబాద్ నుంచి శ్రీ స్వామి సాయిదాస్ విచ్చేసి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. “అమ్మ అనుగ్రహం, మా గురుదేవులు పూజ్యశ్రీ పూర్ణానందస్వామి అనుగ్రహం వలన ఈ మహత్తర కార్యం సులభ సాధ్యమైంది. గురుమహిమ అపారమైనది” అని అనుగ్రహ భాషణం చేశారు.
హైమక్కయ్య 72వ జయంతి సందర్భంగా విజయవాడ వాస్తవ్యులు శ్రీ మొవ్వ కృష్ణప్రసాద్, వారి ధర్మపత్ని శ్రీమతి శేషుమణిగారలు 72మంది కన్యలకు శ్రీ హైమవతీశ్వరి ఆశీఃపూర్వకంగా నూతన వస్త్రాలను అందించి అమ్మకు మహదానందాన్ని కలిగించారు. అమ్మ బలీయమైన కోరిక – వచ్చిన వారికి కడుపునిండా అన్నం, కట్టుకోను గుడ్డలు పెట్టుకోవాలి – అనేది.
-ఈ సామూహిక పారాయణ కార్యక్రమంలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది ప్రధానపాత్ర పోషించారు. వచ్చిన వారందరికీ శ్రీ విశ్వజననీ పరిషత్ సకల సదుపాయాల్ని కలుగజేసింది; శ్రీ టి.టి. అప్పారావు, డా॥ బి.యల్ సుగుణ (ప్రిన్సిపాల్)ల ఆధ్వర్యంలో ఒక కోటి 11లక్షల నామపారాయణ చేసినట్లు ప్రకటింపబడింది; పారాయణ కర్తలకు నిండు మనస్సుతో కృతజ్ఞతలను తెలియజేశారు, యాత్రికుల సౌకర్యార్థం APSRTC వారు బాపట్ల వరకు ప్రత్యేక సర్వీసులు నడిపారు. రాత్రి గం. 9.00 ల ప్రాంతంలో భారీ వర్షం ముంచెత్తి వేసింది. మర్నాడూ కురుస్తూనే వుంది. ఉత్సవం నాటి ఉదయం నుంచీ కురిసి వుంటే – కార్యక్రమాలకు ఎంతో విఘాతం కలిగేది. పర్జన్యుడూ (వానదేవుడు) సభక్తికంగా తనవంతు సేవ చేసి అమ్మ శ్రీ చరణాల నర్చించాడు. అదే అమ్మ-హైమమ్మల కృపాదృష్టి అని అందరూ ఆనందించారు.
- హైదరాబాద్ లో:-
శ్రీ T.S. శాస్త్రిగారు 18-11-2014 తేదీన హైమ జయంతిని నేత్ర పర్వంగా నిర్వహించారు. వారి తల్లి శ్రీమతి తంగిరాల దమయంతి గారితో హైమకి ప్రగాఢమైన ఆత్మీయతానుబంధం ఉండేది. సంవత్సరోత్సవంగా ఏటా హబ్సిగుడాలోని వారి స్వగృహంలో తేదీ ననుసరించి హైమ జయంతి జరుపుకుంటారు. జిల్లెళ్ళమూడి రాలేని సోదరీ సోదరులకు ఇదొక మహదవకాశము.
శ్రీ శాస్త్రి అన్నయ్య గారి అమ్మాయి చి||సౌ| అనసూయ కార్తీకమాస పావన పరిమళాన్ని, తెలుగింటి సంప్రదాయాల్ని కలబోసి బహుసుందరంగా పూజావేదికను అలంకరించింది. సోదరీసోదరులంతా 3సార్లు శ్రీ లలిత సహస్రనామ పారాయణ అనంతరం శ్రీ అంబికా అష్టోత్తర శతనామ, శ్రీ హైమవతీ అష్టోత్తర శతనామ పూర్వకంగా కారుణ్యాలయ, కమలాలయ హైమను ఎర్రని కమలాలతో అర్చించారు.
“సో॥ శ్రీ M. దినకర్, శ్రీ V.S.R. మూర్తి, శ్రీ B. రవీంద్రరావు, శ్రీ Y.V. శ్రీరామమూర్తి ప్రభృతులు హైమ పూజాదికములలో పాల్గొనటం విశేషం.
హైమమ్మ శుభాశీస్సులతో పాటు, అమ్మ మహాప్రసాదాన్ని అందరూ సంతోషంగా స్వీకరించారు.