6-12-2020 కార్తీక బహుళషష్ఠి నాడు శ్రీ హైమవతీశ్వరి 78వ జన్మదినోత్సవాలు జిల్లెళ్ళమూడిలో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా 5-12-2020న సాయంత్రం గం.5-00 లకు ప్రారంభమైన జూమ్ సత్సంగంలో హైమవతీదేవి కరుణ, ప్రేమ, నిర్మలత్వం, త్యాగం, తపన, సాధన, విశ్వశ్రేయః కామన, అనుగ్రహం మున్నగు కళ్యాణ గుణవైభవాన్ని స్వానుభవపూర్వకంగా వివరిస్తూ పలువురు ప్రసంగించారు.
సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ యు.వరలక్ష్మి గారు ‘హైమ మానవిగా పుట్టి మాధవిగా ఎదిగిందని, ఆ పయనం సాధకులకు మార్గదర్శకం’ అని తమ తొలిపలుకుల్లో వినిపించారు.
శ్రీ రావూరి ప్రసాద్ : ప్రార్థనాగీతంగా ‘మనసు వెన్నపూస, హైమమ్మయె మణిపూస’ అనే నదీరా గీతాన్ని భావయుక్తంగా, రాగయుక్తంగా ఆలపించి హైమక్కయ్య నిజతత్వానికి నిలువెత్తు దర్పణం పట్టారు.
శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు : అందరూ ఆ రోజుల్లో ‘అమ్మ నాది’ అనే భావంతో బంధంతో ఉండేవారని, తను హైమ ఒకే తల్లిబిడ్డలైనా అమ్మ బిడ్డలందరి యెడల తమకి ఏకోదర రక్త సంబంధ బంధం ఉన్నదని – జిల్లెళ్ళమూడి విలక్షణ విశేష తత్వాన్ని సహజంగా ఆవిష్కరించారు.
శ్రీ వి.యస్.ఆర్.మూర్తి : ‘శ్రీమాత’ నామ సదృశంగా హైమక్కయ్యను ‘శ్రీహైమ’ అని అభివర్ణించారు. కావున హైమను మనోవాంఛాఫలసిద్ధిని ప్రసాదించే కల్పవృక్షంగా మాత్రమే కాదు, చిన్ముద్రధారిణిగా అద్వైత రససిద్ధిరూపిణిగా దర్శించాలని ప్రబోధించారు.
శ్రీ ఎమ్.దినకర్ : స్వపరభేదం లేని, వసుధైక కుటుంబం అనే ఆర్షకామనికి సాకారరూపం హైమ అని ప్రస్తుతించారు.
శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ : వారి స్వీయరచన ‘శ్రీహైమవతీ వ్రతకల్పం’ లో పేర్కొన్న పలు సందర్భ పూర్వకంగా హైమతో- తనకు గల సాన్నిహిత్యాన్ని వెల్లడించారు.
శ్రీమతి బ్రహ్మాండం వసుంధర : అమ్మ అవతారలక్ష్యం హైమాలయ ఆవిర్భావం అనీ, హైమ నిజానికి నిజం అనే పరమసత్యాన్ని అమ్మ మాటల్లో స్పష్టం చేశారు.
శ్రీమతి ఎమ్.బి.డి. శ్యామల : ”’అల్లదే హైమాలయం – అది చల్లని దేవాలయం” అనే నదీరా గీతాన్ని మృదు మధురంగా ఆలపించారు. ”దయ గల హృదయం దైవ నిలయం – అదే హైమాలయం” అనే సత్యాన్ని చెప్పకనే చెప్పారు.
శ్రీ ఐ.రామకృష్ణారావు : హైమాలయానికి వెళ్ళి అర్చన చేసుకొమ్మని అమ్మ తనను కర్తవ్యోన్ముఖుని చేసిన వైనాన్నీ, హైమ సహజ కృపతో, ప్రేమతో స్వప్న దర్శనం ఇచ్చిన సందర్భాల్నీ పేర్కొంటూ ఆర్ద్రనయనులై హృద యాల్ని కదిలించారు.
శ్రీ వై.వి.మధుసూదనరావు : అందరిపై అమ్మ మాతృవాత్సల్యం కురిపిస్తే, హైమ సోదరీప్రేమను వర్షించిందనీ, తనకు తోబుట్టువులు లేరని హైమ ఆ లోటును భర్తీ చేసిందనీ, తన వివాహ సమయంలో ఆడబిడ్డ స్థానాన్ని అలంకరించిందనీ, ఆత్మీయతని సిరాగా చేసుకుని లేఖలు వ్రాసేదని, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అదే అనురాగం అదే అనుబంధంతో చూస్తున్నదని స్వీయ అనుభవాన్ని రసరమ్యంగా వివరించారు.
శ్రీ కరణం శంకరరావు : ‘అమ్మకి మరో రూపమే హైమ’ అనే పూజ్యశ్రీ లక్షణయతీంద్రులవారి ప్రబోధాన్ని గుర్తు చేస్తూ, అమ్మ-హైమ బింబ ప్రతిబింబాలని స్పష్టం చేశారు.
శ్రీ మాజేటి రామకృష్ణ : హైమకి ప్రీతిపాత్రమైన అఖండ నామ సంకీర్తనని అమ్మ ఆరంభించినదని, ఆ బాటే సర్వులకు ఆచరణీయం అనుసరణీయమని, తన కుమార్తెకు ‘జయ హైమ’ అని నామకరణం చేసుకుని ప్రేమైక రసామృతమూర్తి హైమను స్మరించుకుంటూ ఉంటానని సత్పదాన్ని సత్పధాన్ని ఆవిష్కరించారు.
శ్రీ వల్లూరి రమేష్ : హైమాలయంలో నిర్వహించే పూజలూ, వ్రతాలూ, ఏకాహాలూ లలితా లక్ష-కోటి నామపారాయణ కార్యక్రమాల్ని ప్రస్తావిస్తూ తదాచరణ చతుర్విధ పురుషార్థ సిద్ధిని ప్రసాదిస్తుందని వివరిస్తూ వాటిని త్రికరణశుద్ధిగా ఆచరించిన శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యని గుర్తుచేశారు.
శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం : వందన సమర్పణ చేస్తూ శ్రీ టి.యస్.శాస్త్రిగారి కుటుంబ సభ్యులకు హైమ సహజంగా తోబుట్టువనీ, శ్రీ ఎక్కిరాల భరద్వాజ బాల్యంలో దూరమైన మాతృప్రేమను తిరిగి హైమ నుండి పొందిన ఏకైక భాగ్యశాలి అనే సంగతులను ప్రస్తావించారు.
డాక్టర్ యు.వరలక్ష్మి : తమ మలిపలుకుల్లో – స్వార్థరహితమూ పరహితార్థ కలితము అయిన హైమ తపన చూసి అమ్మ ఆ మూర్తిని దేవతగా ప్రతిష్ఠించి అనుగ్రహరోచిస్సులను ప్రసృతం చేస్తున్నది అంటూ వియద్గంగా ప్రవాహంలా మలిపలుకుల్ని వినిపించారు.
‘సర్వే భవంతు సుఖినః, సర్వేసంతు నిరామయాః
సర్వభద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖభాగ్భవేత్
అనేదే హైమ ఏకైక ఆకాంక్ష. హైమమ్మ శుభాశీస్సులు అందరిపై అనవరతం వర్షించుగాక! ప్రసారం చేసిన ఐఙఅఆ కార్య నిర్వాహకులకు కృతజ్ఞతలు. అమ్మ తత్త్వ ప్రచార సమితి ఈ కార్యక్రమాన్ని దీక్షగా నిర్వహించింది. 2021 జనవరి నుంచి ప్రతి నెలా ఒక కార్యక్రమం అమ్మ తత్త్వ ప్రచారం లక్ష్యంగా జరుగుతుందని ప్రచారసమితి కన్వీనర్ డాక్టర్ బి.యల్.సుగుణ తెలియచేశారు.