‘అమ్మ’లో ‘అ’ అక్షరాన్నీ, ‘నాన్న’ లో ‘న్న’ అక్షరాన్నీ తీసుకుని ‘అన్న’ అనే పదం వచ్చిందంటారు. అది చమత్కారం అనిపించినా శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్య విషయకంగా అక్షరసత్యం.
వారిలో అమ్మలో ఉండే ఆప్యాయత, ప్రేమ, రాగం, త్యాగం ఉన్నాయి; నాన్నలో ఉండే క్రమశిక్షణ, విధినిషేధాలు, బాధ్యత, మందలింపు ఉన్నాయి. లక్షణద్వయ సమన్వయాస్వాదన రామణీయకం కాదు, సాధ్యమూ కాదు.
ముందుగా పి.యస్.ఆర్. గారిలో ఉండే మాతృత్వ లక్షణానికి ఉదా: జనవరి 2022 సంచిక ప్రచురణ సమయంలో అన్నాను. ‘చాలా ఫోటోలు ఉన్నాయి. ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు, కోటినామ పారాయణ, ఆంగ్లసంవత్సరాది వేడుకలు… ఎన్నో’ అని. “కలర్ ఫోటోలు వేద్దాం – ఎవరైనా డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా” – అన్నారాయన, వేశారు. నవంబరు సంచిక టైటిల్ పేజి పైన ‘హైమను దేవతగా ఆరాధించిన’ వారి ఫోటోలు వేశారు. పత్రిక ప్రచురితమైన తర్వాత “తప్పు జరిగింది. నా ఫోటోకి బదులు తంగిరాల శాస్త్రిగారి ఫోటో వేయాల్సింది” అని బాధపడ్డారు. నాన్నగారి శతజయంతి ఉత్సవ సందర్భంగా మెమెంటోలు ఆర్డర్చేయాలని SVJP కార్యవర్గసభ్యులు గుంటూరు వచ్చారు. చిన్న, పెద్ద ఏవి ఎన్ని అనేది నిర్ణయించారు. రూ.20 వేలు ఖర్చు అవుతుంది అంటే “నేను ఇస్తాను, సంస్థకి భారం ఎందుకు?” అని వారే ఇచ్చారు. నిరంతరం ఒకటే ధ్యాస – ‘అమ్మ సాహిత్యం ముద్రించాలి’ అని; ఆ గ్రంథం ఎవరు వ్రాశారు అనే ఆలోచన, విచక్షణ లేదు. ఏటా ధాన్యాభిషేకానికి గుంటూరులో తిరిగి లక్షలలో విరాళాలు సేకరించి తెచ్చేవారు. నేటి అన్నపూర్ణాలయ స్వయం సమృద్ధికి మూలస్తంభంగా నిలిచిన ధాన్యాభిషేక రూపశిల్పి శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్య; అది అమ్మ మహత్సంకల్పం, నాన్నగారి మహదాశీర్వచన ఫలం వారి ద్వారా ప్రకటితమైంది.
తరువాత శ్రీ పి.యస్.ఆర్.గారి పితృలక్షణానికి ఉదా: “ఇది గొప్పవారి వ్యాసం, వేద్దాం” అని నేనంటే, “ఎవరు గొప్ప? నువ్వు వేద్దాం అంటే వేద్దాం. నువ్వు ఎడిటర్గా వుండు. ఇష్టం వచ్చినట్లు వెయ్యి. నేనైతే వెయ్యను. ఏముంది ఇందులో ? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతకథల్నో సంప్రదాయ వేదాంతాన్నో నూరిపోయటం “అమ్మపత్రిక” లక్ష్యం కాదు. అమ్మ తత్వాన్ని అనుసంధానం చేయని, సమన్వయం చేయని ఏ రచననైనా ప్రచురించాల్సిన అవసరం లేదు – వారెంత గొప్పవారైనా” అంటూ నన్ను తరచు హెచ్చరించేవారు, చురకలు వేసేవారు.
వారి నిబద్ధత, అంకితభావం తలచుకుంటే కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతుంది. 1-2-22న పి.యస్.ఆర్. అన్నయ్య I.C.U. లో ఉంటూ నాకు ఫోన్ చేశారు. నేను ఉలిక్కిపడ్డాను. “పత్రికలో ఏం వ్యాసాలు వేస్తున్నావు?” అని అడిగారు, చెప్పాను. అందు ఒక వ్యాసాన్ని ఎత్తిపట్టి “దానిని జనవరి సంచికలో వేశాము కదా! మళ్ళీ ఎందుకు?” అని గద్దించారు. “మీరు అన్నమాట నిజం. కానీ ప్రింట్ ఆర్డరు ఇచ్చే ముందు మీరు ప్రెస్కి వెళ్ళి 2 పేజీల ఆ వ్యాసాన్ని తొలగించి, ఆ స్థానంలో శ్రీ రావూరి ప్రసాద్ పురస్కారం, వసుంధరక్కయ్య కనకాభిషేకం వేయించారు కదా!” అన్నాను. వెంటనే నొచ్చుకుని “నిజమేనయ్యా. సరే విను” అంటూ టైటిలేజి మీద ఇతరత్రా ఏఏ కలర్ ఫోటోలు వేయాలో నిర్దుష్టంగా చెప్పారు.
తంగిరాల కేశవన్నయ్య, పి.యన్.ఆర్. అన్నయ్య ఇద్దరూ ఒకే బడి (ఆర్.యస్.యస్.) లో చదువుకున్నారు. కోపదారులు కారు; కాగా, అమ్మ సేవలో ఎవరైనా ప్రమత్తులై ఉంటే దులిపేస్తారు అంతే.
అయితే పి.యస్.అర్.అన్నయ్య అంటే ఇవాల్టికీ నాకు భయభక్తులు ఉన్నాయి. అయితే వారికి నా మీద ప్రేమ లేదా? పి.యస్.ఆర్.లేనిదే ఎ.వి.ఆర్. లేడు. నన్ను తన స్థాయికి తీసుకుని వెళ్ళి వ్యక్తిగా తీర్చిదిద్దా లని విశ్వప్రయత్నం చేశారు. కానీ, ఎలుకతోలు తెలుపురాదు కదా! ఆ క్రమాన్ని కొద్దిగా వివరిస్తాను.
ఆంగ్ల ఉపన్యాసకునిగా పనిచేసి 2008లో రిటైర్ అయ్యాను. పి.యస్.ఆర్. అన్నయ్య “నువ్వు జిల్లెళ్ళమూడిలో ఉండు. మనం అమ్మ సాహిత్యసేవ వచ్చింది వారి నుంచే. చేసుకుందాం. అంతకంటే మనకేం కావాలి?” అని పిలుపు నిచ్చారు. ముందు బాపట్ల వచ్చి ఉన్నా. నాకు తెలుగు భాషలో ప్రావీణ్యం లేదు, కానీ ప్రతి నెల ఫ్రూప్ రీడింగ్ పని మీద గుంటూరు వెళ్లేవాడిని. 2012. ప్రాంతంలో వారు వ్రాసిన మొత్తం సంపాదకీయాలు (800 పేజీలు) నా చేతిలో పెట్టి, దానిని ఒక క్రమంలో పెట్టమన్నారు. అది అమ్మసేవగా భావించి ఒక తపస్సుగా నెలరోజులు శ్రమించి సవరణలు పేర్కొంటూ 10 పేజీలు నివేదిక ఇచ్చాను. ఆయన మహదానంద పడ్డారు. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించింది. అని అహంకారం చెందలేదు. ఆ గ్రంథం ‘శ్రీ విశ్వజననీ వీక్షణం’ పేరుతో ప్రచురితమైంది. తదాది నన్ను ఒక వర్క్షావ్లో ఉంచి శిక్షణ ఇచ్చారు. ‘నాన్నగారి శతజయంతి ప్రత్యేక సంచిక’, ‘ధన్యజీవులు’, ‘అమృతసేచనం’, ‘అమ్మ పూజా విధానం’, ‘లోచూపు, ‘అమ్మతోనేను’, ‘అమ్మ కృపావృష్టి’, ‘మహోదార మాతృత్వ దీప్తి” ఎన్నో గ్రంథాలకి డిజైన్ చెప్పి గ్రంథాలు నాచే రూపొందించేవారు.
వాత్సల్యం పొంగులు వారగా “నన్నయకు నారాయణభట్టులా నా కోసం శ్రమిస్తున్నావు” అని ఆనందించేవారు, అభినందించేవారు, ఆశీర్వదించే వారు. ఆశ్చర్యం. అన్నయ్య అంటే నాకు ఎంత భయమో అంత చనువు కూడా ఉంది. చాలాసార్లు నా మాట వేదవాక్కే వారికి. ఉదాహరణకి వారికి ‘జిల్లెళ్ళమూడి అమ్మ నిత్యపారాయణ’ గ్రంథ రచన సందర్భంగా దిశా నిర్దేశం చేశాను. ‘ఫలాన అంశాలు ఉండాలి, ఫలానా కొత్త వ్యాసాలు వ్రాయాలి. పారాయణ ఉపక్రమము, సమాపనము రెండు సందర్భాల్లో సందర్భోచితంగా పద్యాలు వ్రాయాలి’ అని. “అలాగేనయ్యా” అంటూ ఆ విధంగానే చేశారు – నిండుమనస్సుతో. నాకు ఆశక్తి వచ్చింది వారి నుంచే.
2010 నుండి నిన్నటి వరకు వారు నా చేయి పట్టుకుని నడిచారు, నడిపించారు. ఈ సందర్భంగా ఒక సన్నివేశం స్ఫురిస్తుంది. మనలో చాల మంది సాయం సమయంలో ‘అమ్మ’ను చేయిపట్టుకుని నడిపించే వాళ్ళం. నిజం చెప్పాలంటే మనం ‘అమ్మ’ని నడిపించటం లేదు, అమ్మే మనల్ని నడిపిస్తోంది. పి.యస్.ఆర్.అన్నయ్యకి నేను ఒక చేతికర్ర (Walking Stick) అనుకుంటాను.
వారి మదిలో నా స్థానం ఉన్నతమైనది. ఎవరైనా అమ్మతో తమ అనుభవ కుసుమాలను కూర్చి ఒక గ్రంథంగా వ్రాసియో, వ్రాయ సంకల్పించియో తగు సలహా నిమిత్తం వారిని సంప్రదించినపుడు “సుబ్రహ్మణ్యాన్ని అడగండి. తను చేస్తాడు” అని మార్గదర్శనం చేసేవారు.
అమ్మ మహత్తత్త్వాన్ని రెండు కళ్ళతో దర్శించిన ధన్యులు శ్రీ పి.యస్.ఆర్. ఒక ఉదాహరణ. ముక్కోటి ఏకాదశికి వారి జీవితంలో ఒక విశిష్టస్థానం ఉంది. ఒక ఏడాది ముక్కోటి ఏకాదశికి ఆయన పెందలకడ లేచి ద్వారదర్శనం చేసుకోవాలని గబగబా జిల్లెళ్ళమూడి చేరుకున్నారు. అప్పటికే అమ్మదర్శనం ఇవ్వటం అయిపోయింది. ఖిన్నమనస్కులై అమ్మ సన్నిధిలో ఆసీనులై “ఇదేమిటమ్మా, ఇట్లా చేశావు? నేనెంత తపన వడి వచ్చాను?” అన్నారు. తక్షణం అమ్మ “ఇప్పుడేమైంది, నాన్నా! ఇప్పుడు చూస్తున్నావు కదా!” అన్నది. ఈ ఒక్క అమ్మ వాక్యం శీర్షికగా గొప్ప వ్యాసం వ్రాసుకోవచ్చు. సామాన్యదృష్టికి అమ్మ కిరీటము, శంఖచక్రాది ఆయుధాలను ధరించినపుడే ‘దేవత’గా అర్థమవుతుంది. అది సత్యము కాదు. అమ్మ శరీరం పంచభూతాలకు అతీతమైన దివ్యదేహం. అమ్మ నిద్రిస్తున్నా, నడుస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా అమ్మ ఉన్న చోటు దేవాలయం, అమ్మదేవత.
ఆశ్చర్యం. పి.యస్.ఆర్. అన్నయ్య కడసారిగా అమ్మను దర్శించుకున్నది (13-1-22) ముక్కోటి ఏకాదశినాడు. అంతకంటే ఆశ్చర్యం 13-2-22న అమ్మలో ఐక్యం కావడం.
వారి ఉజ్జ్వల సాహితీ వైభవాన్నీ ధీశక్తినీ అభివర్ణించే సామర్థ్యం నాకు లేదు. నా ప్రియతమ అగ్రజులు శ్రీ పి.యస్.ఆర్. ఏ లోకంలో ఉన్నా నా కలంలోని సిరాలో ఉంటూ నా ఆలోచనల వీధుల్లో విహరిస్తూ అమ్మ వాఙ్మయసేవ చేసికొనే దిశగా నిరంతరం మార్గదర్శనం చేయాలని కోరుకుంటూ, అలా అనుగ్రహించమని పరదేవతా స్వరూపిణి అమ్మ శ్రీ చరణాల నంటి ప్రార్థిస్తున్నాను.
ఆత్మీయ సోదరుని కిదే అక్షర నీరాజనం. ***