1. Home
  2. Articles
  3. Mother of All
  4. సంకల్పం మనదైనా సాధించేది ‘అమ్మే’

సంకల్పం మనదైనా సాధించేది ‘అమ్మే’

V. Satya Narayana Murthy
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 17
Month : July
Issue Number : 3
Year : 2018

అవును. ఒక పనిని చేద్దామనే సంకల్పం మనదైనా దానిని సాధించి పెట్టేది అమ్మే. అది మన వ్యక్తిగత జీవితానిది అవనీయండి, అమ్మకు, అమ్మ సంస్థకు చెందినదే అవనీయండి ‘అమ్మే’ దానికి పరిష్కర్త. కర్త, కర్మ, క్రియ అన్ని అమ్మే. త్రిపుట త్రయేశ్వరి ఆమే!

అందుకు ఉదాహరణ – అన్నపూర్ణాలయ ప్రస్తుత భవన నిర్మాణము. అంతకు ముందున్న రేకుల షెడ్డును పడగొట్టి, దాని స్థానంలో పక్కా భవన నిర్మాణానికి సంస్థ పెద్దలు ఉపక్రమించారు. దానిని ప్రారంభించి నిర్మాణము పూర్తయేవరకు చాలా అడ్డంకులు ఏర్పడినాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు. శ్రీ రవి అన్నయ్య ఆ ఇబ్బందుల నధిగమించడానికి ఎంతో శ్రమ పడ్డారు. ఎందరెందరినో సంప్రదించారు. చివరకు శ్రీ టి.టి.డి వారు చేసిన ఆర్థిక సహాయముగాక, కొంత మంది అమ్మ బిడ్డలు ఇచ్చిన విరాళములతో కొంత ధనము సమకూడి మొత్తానికి ఈ సంస్థకు గుండె కాయవంటి శ్రీ అన్నపూర్ణాలయం సర్వాంగ సుందరంగా, సకల సదుపాయములతో 2015 సంవత్సరానికి పూర్తయినది.

అయితే ఇంత బృహత్కార్యం కేవలం ధర్మ సంస్థల, భక్తుల తోడ్పాటుతో మాత్రమే జరుగలేదు. దాని వెనుక అమ్మ సంకల్పం, దీవెనలు కూడ ఉన్నవి. అసలు వారిలో విరాళాల నందించే శక్తినీ, ఆసక్తిని అమ్మే కలిగించిందను కోవాలి. అంతేకాదు – సంస్థ ఆవరణలో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ సోఫాలు నిర్మించిన వారి హృదయాలలో కూడా అమ్మే ప్రవేశించి వారి ద్వారా తన పనులు నెరవేర్చుకున్నది.

ఇంతకీ నేనిక్కడ ప్రస్తావించ దలచుకున్న దేమిటంటే, ఇటువంటి ‘అమ్మ’ సంకల్పమే జిల్లెళ్ళమూడిలో వున్న అనసూయేశ్వరాలయం విషయంలో జరిగింది.

ఆ ఆలయం వెనుక నున్న ధ్వజస్తంభం ప్రక్కనే ఒక పున్నాగ చెట్టు ఉన్నది. నేను జిల్లెళ్ళమూడికి వచ్చిన దగ్గర్నుంచీ చూస్తున్నాను ఆ చెట్టు నుంచి జారి పడిన పున్నాగపూలు ధ్వజస్తంభం దిమ్మెపై బడి దానిని పూలతో పూజించినట్టుగా అనిపించేది. అయితే దానితో బాటుగా ఆ చెట్టువల్ల కొంత ఇబ్బంది కూడ కలిగేది. రాత్రంతా ఆ చెట్టుపై నిద్రించే పక్షులు రెట్టలు వేయటంవల్ల, తెల్లారేసరికల్లా ధ్వజస్తంభం దిమ్మె అంతా రెట్టలతో నిండిపోయి అసహ్యంగా రోతగా కనబడేది. పైగా దుర్గంధం. నాకు వీలైనపుడల్లా కొబ్బరిపీచుని తడిపి, ఆ రెట్టలను తుడిచి, దిమ్మెను శుభ్రం చేసేవాడిని. దానికి శాశ్వత పరిష్కారం స్తంభం వైపున వున్న ఆ చెట్టుకొమ్మను నరికించడమే ననిపించింది. ఆ రోజుల్లో స్వర్గీయ మల్లన్నయ్య ఆలయానికి సంబంధించిన చిన్నచిన్న పనులను చేయించేవాడు. ఆయనకు ఈ సమస్యను గురించి చెప్పి స్తంభంవైపు వున్న చెట్టుకొమ్మను నరికించమని చెప్పాను. ఆయన సరేనని చెట్టుకొమ్మను నరికించాడు. అయితే స్తంభంవైపు ఒకే ఒక చిన్న కొమ్మ మిగిలిపోయింది. చిన్నదే కదా దాని మీద పక్షులేం పడుకుంటాయిలే అని ఊరుకున్నాం. అయితే కొద్ది రోజుల్లోనే ఆ చిన్న కొమ్మ పెద్దదై మరల పక్షుల కాలవాలమై పోయింది. అంతే…. కథ మళ్ళీ మొదటి కొచ్చింది. ఇది వరకటి కన్నా ఎక్కువ పక్షిరెట్టలు స్తంభంపై పడసాగాయి.

ఇక చేసేదేమీ లేక అమ్మకు నమస్కరించి ‘అమ్మా’ నేను ఓడిపోయాను. ఈ సమస్యను నువ్వే పరిష్కరించి నీ ధ్వజస్తంభాన్ని నువ్వే శుభ్రపడేలా చేసుకో తల్లీ !” అని ప్రార్థించాను. అంతేకాదు. కొన్నాళ్ళు ఆ దృశ్యాన్ని చూడలేక ఆ స్తంభం వైపు వెళ్ళడమే మానివేశాను.

అయితే – అది వరకు ఆ స్తంభాన్ని శుభ్రపరచినపుడల్లా నల్లగా నిగనిగలాడుతున్న ఆ స్తంభాన్ని చూసి, సంతోషించడమే కాదు, నావల్లనే ఈ స్తంభం ఇంత శుభ్రంగా ఉన్నదన్న కించిత్తు గర్వం కూడా నాలో కలిగేది. అప్పుడు అమ్మ నవ్వుకుంటూ –

“పిచ్చి నాగన్నా ! నువ్వు చివరికంటా ప్రయత్నించలేదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది నీ గొప్పేననుకుంటావు. అది నీ ప్రేరణే ననుకుంటావు. కాని, నీకా ప్రేరణను కలిగించింది నేనేనని అనుకోవు. పైగా ‘ఆ (అమ్మ) కార్యం నెరవేర్చటం కోసం నేనెంతో ప్రయత్నించాను, కాని అది జరగలేదు. నేనేం చెయ్యను? అందుకని నీ పనిని నువ్వే నెరవేర్చుకో’ అని ర మీద సి చేతులెత్తేశావు.” అని అనుకుని వుంటుంది.

అవును. అసలు నాలో ఆ ఆలోచన కలిగి, ఆ పనిని సాధిద్దామని ప్రయత్నించినపుడే” అమ్మా! నా యీ ప్రయత్నం సఫలమయ్యేట్టు దీవించు.” అని అమ్మను ప్రార్థించవలసింది. అప్పుడు అమ్మ విఘ్నేశ్వరుడై నా కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చేది. “అది అమ్మ కార్యమే కదా, ఎందుకు జరగదు?” అని అమ్మను అడక్కుండానే కార్యసాధనకు ప్రయత్నించాను. కాని అది ఫలించలేదు. చివరకు నా ప్రయత్నం లేకుండా అమ్మే తన కార్యాన్ని నెరవేర్చుకున్నది. అందుకే వినాయకుడిని పూజించేటప్పుడు కూడా చిన్న పసుపు వినాయకుడిని చేసి అసలు వినాయక పూజ నిర్విఘ్నంగా జరిగేందుకు, ఆ పసుపు వినాయకుడిని పూజిస్తారు. అలాగే అమ్మ కార్యం కొరకు కూడా అమ్మను ప్రార్థించాల్సింది అనుకున్నాను.

పై పశ్చాత్తాప భావన నాకు ఎప్పుడు కలిగిందంటే – కొన్ని రోజులు గడిచాక ఒక శుభోదయాన నేను యధాప్రకారం ధ్వజస్తంభం వద్దకు వెళ్ళి దాని దిమ్మె మీద ఎన్ని రెట్టలు పేరుకుని వున్నాయోనని చూడబోతే దానిపై ఒక్క రెట్టలేదు సరికదా ఆ దిమ్మె నిగనిగలాడుతూ మెరుస్తోంది. “ఏమైందబ్బా! పక్షులు కాని పై కొమ్మను వదలి వేరేచోటికి పోయాయా?” అని తలపైకెత్తి చూస్తే పైన ధ్వజస్తంభం వైపు కొమ్మ లేదు. అది మొదలుకంటా నరకబడి చెట్టు మాను నిటారుగా నిలబడి వున్నది, పైన నిగనిగలాడే ఆకాశంవైపు చూస్తూ ” అరె! ఆ కొమ్మనెవరు తొలగించారు?” అని ఆశ్చర్యపోయాను. ఇంకెవరు? అమ్మే తన కార్యాన్ని నెరవేర్చుకున్నది. నా వంటి అసహాయుడ్నికాక, ఆ పనిని చేయగల సమర్ధుడ్ని ఎవర్నో ఎంచుకుని వారి ద్వారా తన కార్యాన్ని నెరవేర్చుకుని వుంటుంది. ఎలానైతేనేం ఆ ధ్వజస్థంభం శుభ్రంగా నిగనిగలాడుతూ వున్నది.” అని సంతృప్తి పడి ఇటు ఎదురుగా ధ్వజస్తంభం వైపే చూస్తూవున్న అమ్మకు, అటు అమ్మ కార్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చిన ఆ అజ్ఞాత వ్యక్తికి మనసారా నమస్కరించుకున్నాను – “నువ్వు చేసే ఏ పనికీ నువ్వు కర్తవు కావు” అన్న అమ్మ సూక్తిని మననం చేసుకుంటూ.

జయహోమాతా ! ఓం హైమా !

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!