అమ్మ ఎవరిచేత, ఏ పని, ఎప్పుడు, ఎలా చేయిస్తుందో మనకు తెలియదు. అమ్మ పని చేయకలగడం ఆ చేసిన వ్యక్తి అదృష్టం, వారిపై అమ్మ ప్రసరించే కరుణ అని మనం భావించవచ్చు.
ఈ రోజు మీరు వాత్సల్యాలయంలో చూస్తున్న అమ్మ పెద్ద ఫోటో గురించి మీకు చెప్పదలిచాను.
2008 సంవత్సరంలో ఒక రోజు సోదరుడు కామరాజు మద్రాసులో ఉంటున్న సోదరుడు గంటి కాళీప్రసాద్ ఇంటికి వెళ్ళడం జరిగింది. జిల్లెళ్ళమూడి విశేషాలు మాట్లాడుతూ, ప్రస్తుతం వాత్సల్యాలయంలో ఉన్న అమ్మ పెద్ద ఫోటో పాడయిపోతోంది. ఇంకొక పెద్ద ఫోటో ఉంటే బాగుంటుంది అని అన్నాడు. కాళీప్రసాద్ వెంటనే ఏమీ స్పందించలేదు. కామరాజుకి కూడా ఈ పని కాళీప్రసాద్ చేత చేయించాలనే ఉద్దేశ్యం ఏమీ లేదు. As a piece of information చెప్పాడు. అంతే. –
– అయితే కొన్ని రోజుల తరువాత “ఈ పని నేను ఎందుకు చేయకూడదు” అనే ఆలోచన కాళీప్రసాద్కు కలిగింది. మెల్లగా ఈ కోరిక బలపడింది. వెంటనే నాకు ఫోన్ చేసి తెలియచేసాడు. ఎందుకంటే, కొన్ని సంవత్సరాల నుంచీ బెంగుళూరులో ఒక ఫోటో స్టూడియో యజమాని, మూర్తి అనే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా నేను అమ్మ ఫోటోలు, రకరకాల సైజులలో ప్రింటు చేయించి, నా చిన్న సేవగా మన సంస్థకు ఇచ్చేవాడిని. మూర్తిగారికి అమ్మ గురించి కన్నడంలో విపులంగా చెప్పేవాడిని. ఆయన ఎంతో ఆసక్తిగా, భక్తిగా వినేవారు. తనవంతుగా ప్రింటుధరలలో చాలా ఎక్కువ రాయితీలు ఇచ్చేవారు.
అందువల్ల నేను మూర్తిగారి దగ్గరకు వెళ్ళి అమ్మ ఫోటో చూపించి, ఇది 6 అడుగుల పొడవు దాదాపు 4 అడుగుల వెడల్పు ఉండే ఫోటోగా పెద్ద ప్రింటు తీసి ఇవ్వమని అడిగాను. ఆయన ఇంత పెద్ద ఫోటో ప్రింటు తీయడానికి special machine కావాలి. అటువంటి దానిని నేను దాదాపు రెండు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలకు పైగా వెచ్చించి కొన్నాను. కొన్న 6 నెలలకే అది పని చేయడం మానేసింది. రెండు, మూడుసార్లు రిపేరు చేయించాను. ప్రింట్లు సరిగా రావడం లేదు. బొమ్మ సరిగా రాకపోవడమో, సగం వచ్చిన మీదట, ఫోటో cut అయిపోవడమో జరుగుతోంది. కంపెనీ వాళ్ళు కూడా విసిగిపోయి చేతులెత్తేశారు” అని చెప్పారు. ఇది విన్న నేను నిరాశ చెందటం చూచి ఆయన “నేను ఒక ప్రయత్నం చేస్తాను. నా మెషీన్లో రాకపోతే వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి చేయించి మీకు ఇస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి” అని చెప్పారు.
నాలుగు రోజుల తరువాత మూర్తిగారి పిలుపు మేరకు నేను వారి studio కి వెళ్ళాను. 6′ x 4′ కొలతలు గల అమ్మ అద్భుతమైన ఫోటో నాకు చూపించారు. ఎంతో ఆనందంతో ఎవరు చేశారు. ఖర్చు ఎంత అయింది అని నేను అడగగా “మీరూ, నేను కూడ నమ్మలేని సంఘటన జరిగింది. ఈ ప్రింటు నా మెషీన్ లోంచే వచ్చింది. మొదటి రెండుసార్లు ఫోటో సరిగ్గా రాలేదు – ప్రింట్ మధ్యలోనే ఆగిపోవడం, చిరిగి పోవడం. జరిగింది. నేను నిరుత్సాహంలో “అమ్మా నీ ఇష్టం, నా వల్ల కాదు” అని అనుకొన్నాను. ఎందుకో మళ్ళీ ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పేముంది అన్న ఆలోచనతో తిరిగి మెషీన్ నడిపాను. ఇదిగో ఇలా చక్కగా వచ్చింది. ఏ రిపైరు లేకుండా, మెషీన్ మళ్ళీ పని చేయడం నా ఆశ్చర్యానికి అంతులేదు. ఈ బాగుపడటం కేవలం అమ్మ ఫోటోకే పరిమితమా లేక నిజంగానే బాగయిందా అనే అనుమానంతో ఇంకొక 2-3 ఫోటోలు (వేరేవి) ఇవే సైజువి try చేశాను. అవి కూడా ఇలాగే చక్కగా వచ్చాయి. ఆనందంతో గెంతులేశాననుకోండి. ఏ Repair లేకుండా, మూతపడిన మెషీన్ పనిచేయడం అమ్మ చేసిన మిరెకల్ కదా! నా ఈ dead investment ని క్షణంలో useful investment గా మార్చిన అమ్మకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను. కాబట్టి ఈ ఫోటో చేసినందుకు నేను మీ దగ్గర ఏమీ తీసుకోను. నాకు కూడా అమ్మ ఈ చిన్న సేవ చేసే అవకాశం ఇచ్చింది”. అని ఎంతో సంతోషంగా చెప్పారు.
– నేను ఆ పెద్ద (6 అడుగుల పొడవు కదా) ఫోటోని, సాక్షాత్తూ అమ్మ అనే భావనతో బెంగుళూరు. – నుంచి మద్రాసు వెళ్ళడానికి AC 3 … లో ఒక Berth Separate గా book చేశాను. TC వచ్చి ఈ Berth passager ఏరి? అని అడిగినప్పుడు ఆయనకు (ఆ కొద్ది సమయములోనే) అమ్మ గురించి చెప్పి, separate berth ఎందుకు తీసుకొన్నానో చెప్పాను. ఆయన కొంచెం ఆశ్చర్యపడి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
– మర్నాడు కాశీప్రసాద్ ఇంటికి మద్రాసులో చేరుకొన్నాను. అప్పటికే ఆయన మంచి ఫ్రేములు తయారుచేసే కంపెనీల గురించి వాకబు చేసి, ఒక కంపెనీ యజమానితో మాట్లాడి రెడిగా ఉన్నారు. మేమిద్దరం అక్కడకు వెళ్ళి మంచి frame ఎన్నుకొని ఆర్డరు చేశాము.
– ఫోటో అన్ని విధాల రెడీ అయిన తరువాత, అది జిల్లెళ్ళమూడి చేరాలి. నేను, కాళీప్రసాద్ ముందు మంచి transport లో special packing చేయించి బాపట్ల వరకు పంపించుదాము అని అనుకొన్నాము. కాని ఒక రోజు కాళీప్రసాదుకు “మన అమ్మని (జన్మ ఇచ్చిన తల్లి) అయితే ఇలా పంపిస్తామా” అన్న ఆలోచన వచ్చి, అమ్మని స్వయంగా తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకొన్నారు. తన Van లో కొన్ని సీట్లని తొలగించి, విశాలంగా చేసి, ఎంతో జాగ్రత్తగా తను స్వయంగా కూడా తోడు వచ్చి మద్రాసు నుంచి జిల్లెళ్ళమూడి వచ్చారు. ఆ రోజులలో సెక్రటరిగా ఉన్న మధు అన్నయ్య (అడవుల దీవి) వ్యాన్ జిల్లెళ్ళమూడి ఆవరణకు చేరగానే కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి అమ్మని తన గదికి తీసుకెళ్ళారు. అమ్మ సర్వజీవకళలతో ఆ ఫోటోలో ఉండి వచ్చిన వారిని ప్రేమతో పలకరించి, ఆశీస్సులందు జేస్తోందనటానికి ఎటువంటి సందేహం లేదు.