అది 1985 జనవరి మాసము. నేను పనుల మీద మదరాసు ఎక్కువగా పోతూ ఉండేవాడిని. మదరాసులో గంగాధర్ అనే ప్రసిద్ధి చెందిన సినిమా ఆర్టిస్టు ఉండేవాడు. అతడు చాలా భగవత్ భక్తుడు. వారిని అమ్మ సినిమా ఎడిటర్, దర్శకుడైన ఎమ్.ఎస్.ఎన్. మూర్తిగారు నాకు పరిచయం చేశారు. మన పబ్లికేషన్స్ గ్రంథాలకు కావల్సిన టైటిల్స్ డిజైను ఆయన దగ్గర చేయిస్తూ ఉండేవాడిని. ఒకసారి వెళ్ళినపుడు అమ్మను గూర్చిన విశేషాలను ఆయనతో ముచ్చటించటం జరిగింది. అవి ఆయన విన్న తర్వాత తను కూడా అమ్మను ఒక్కసారి దర్శించుకోవలెననే కోరిక ఆయనకు ఉదయించింది. తాను ఒక్కసారి జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకుంటానని చెప్పారు. ‘జనవరి 13వ తేదీ భోగిపండుగ. నాడు వేలమంది అమ్మ బిడ్డలు ఆడ, మగ, బాలలు, ముదుసలులు, యువకులు… తారతమ్యం లేకుండా వచ్చి అమ్మచే భోగిపళ్ళు పోయించుకుంటారు. గడ్డాలు వచ్చిన వారు కూడా అమ్మకు బిడ్డలే. అందరినీ బారులుగా కూర్చో బెట్టి, బారులు మధ్యలో నుండి నడుస్తూ అందరికీ భోగిపండ్లు అమ్మే స్వయంగా పోయటం; తలమీద పడ్డ భోగిపండ్లలోని రేగుపండ్లు, పూలూ, చిల్లర నాణాలు పిల్లలు పెద్దలు పోటీపడి ఏరుకోవటం, వాటిని భద్రపరచుకోవటం, నడయాడే దేవతామూర్తిగా అమ్మను దర్శించటం… ఈ దృశ్యము ‘న భూతో నభవిష్యతి’ అన్నాను.
అరుదైన ఇట్టి దృశ్యము ఎక్కడా కానరాదు. చూడవలసిందే, ఆ ఆనందాన్ని అనుభవించాల్సిందే కాని వర్ణింపనలవి కాదు. చిన్నప్పుడు ఎవరికి వారు తమ తమ పసిపాపలకు భోగిపళ్ళు పోయటం ఆనవాయితి. ఇది సామాన్యమైనదే. కాని ఈ అశేష జనసందోహాన్ని తన పసిపాపలుగా ఎంచి భోగి పళ్ళు పోయడం ఎవరికి సాధ్యం? ఒక్క జగజ్జనని, సర్వేశ్వరి, విశ్వజనని అమ్మకి తప్ప. అటువంటి దృశ్యాన్ని ఎవరూ MISS కాకూడదు. అది ఒక అదృష్ట పురాకృత పుణ్యఫలం’ ఆ విషయం వారికి వివరించాను. ‘మీరు కుటుంబ సహితంగా వచ్చి ఆ అదృష్టాన్ని పొందండి’ అని కోరాను. ‘నాకు 3, 4 చిత్రాలు రిలీజు కానున్నవి. ఇప్పుడు. రావటం కష్టం. వచ్చే సంవత్సరము వస్తాము లెండి’ అని అన్నారు. ‘వచ్చే సంవత్సరం మీరు రావచ్చును. కాని అప్పుడు మీరు అమ్మను చూడాలి గదా!” అన్నాను నాకు తెలియకుండానే.
ఆ సంవత్సరము భోగిపండుగ రోజున అందరికీ అమ్మ భోగిపండ్లు పోయటం ప్రారంభించింది. కొంతసేపటికి ఆ క్రియాకలాపం చివర కొచ్చింది. అంతలో ఒక కారులో మదరాసు నుండి గంగాధర్ దంపతులు జిల్లెళ్ళమూడి రానే వచ్చారు; అమ్మ చే భోగిపండ్లు పోయించుకున్నారు. అమ్మ వారికి నూతన వస్త్రాలను ప్రసాదించి ఆశీర్వదించింది. వారి ఆనందానికి అవధులు లేవు.
తర్వాత జూన్ 12న అమ్మ ఆలయ ప్రవేశం చేయటం యాదృచ్ఛికం. నేను మరల ఒకసారి మదరాసు వెళ్ళినపుడు గంగాధర్ గారు ‘మీరు ఆ రోజు అట్లా అనకపోతే నేను ఆ అదృష్టాన్ని చేజార్చుకునేవాడిని’ – అన్నారు.
దేనికైనా మనం కర్తలం కాము; “తోచిందోదో చెయ్యి – తోపించేవాడు వాడేగా” అన్నారు అమ్మ..