1. Home
  2. Articles
  3. Mother of All
  4. సంఘర్షణలో సంయమి – నాన్నగారు

సంఘర్షణలో సంయమి – నాన్నగారు

Prasad Varma Kamarushi
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : July
Issue Number : 3
Year : 2017

1950ల నాటికి సామాన్య గృహిణి అయినా దివ్య శక్తులు గల ఆధ్యాత్మికవేత్త ఒకరు జిల్లెళ్ళమూడిలో ఉన్నది అన్న సంగతి ఆ పరిసర ప్రాంతాలలో ప్రచారం పొందసాగింది. కొందరైతే క్రమం తప్పకుండా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకునే వారు. ఏ రవాణా సౌకర్యంగాని, కనీసం రోడ్డుగాని లేకున్నా పొలాలవెంట పడి రావలసిన కష్టదశ అది. ఆ కష్టాన్ని ఇష్టంగా భరించారు. అమ్మ కోసం. అమ్మ సానిధ్య భాగ్యం కోసం,

ఒకసారి అమ్మకు నలతగా ఉందని డా. వీరయ్య గార్ని పిలిచి చూపించారు. ఆయన అమ్మను పరీక్షించి ‘యోగ’ లక్షణాలే గాని ‘రోగ’ లక్షణాలు లేవని చెప్పేరు. మరొకసారి కొమ్మూరు డాక్టరు సీతాచలం గారు ధర్మామీటర్ 110 డిగ్రీలకు ఎగబాకటం, లేక మాత్రంగానైనా నాడి కొట్టుకోకపోవటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అమ్మ మాత్రం ప్రశాంతంగా చిరునవ్వుతో కూర్చుని ఉంది ఏపరీక్షలు చేసుకుంటావో చేసుకో అన్నట్టు. నోరి మాణిక్యమ్మగారు (పూండ్ల) అమ్మ అలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడి – స్వర్గం నుంచి దిగివచ్చిన సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉందని అన్నది. గంగరాజు లోకనాథం గారి భార్య పక్షవాతం నయమయింది అమ్మ కర స్పర్శతో. ఇలా … అమ్మలో దాగిన మహిమలు, మహత్తులు ఆ ప్రాంతమంతా తెలిసి రాకపోకలు పెరగ సాగేయి. అడవి మధ్యలో మల్లె, మాలతి ఎవరికోసమో వికసిస్తాయా? వాటి అందానికి సువాసనకు ఆకర్షింపబడి మనమే వెతుక్కుంటూ వెళతాం. అమ్మ దగ్గరకు రావటమూ అంతే..

నాన్నగారు మొదట్లో జనం యిలా అమ్మ చుట్టూ చేరటం చూసి కలవర పడేవారు. ఎలా స్పందించాలి అన్న విషయంలో అయోమయంలో పడిపోయేవారు. నాన్నగారు ఎదుర్కొన్న అతి ఇబ్బందికర పరిస్థితి యేమిటంటే – భక్తులు అమ్మ పాదాలు పట్టుకోవటం, అమ్మ ఒళ్ళో తల పెట్టు కోవటం, అమ్మ చేత్తో నిమిరి లాలించటం, బిడ్డలు ఎంతో స్వాంతన పొందటం జరగుతూ ఉండేది. “పిల్లలు తల్లి దగ్గరకొచ్చినట్టే వాళ్ళంతా నా దగ్గర కొస్తున్నారు” అని అమ్మ అనునయించింది. ఏది యేమైనా నాన్నగారి అనుమానాలు అమ్మ కర్తవ్యాన్ని స్పష్టపరచాయి. సుబ్బయ్యను గానీ ఇతరులెవరినీ గానీ తన వద్దకు రావద్దని ఆంక్ష పెట్టింది అమ్మ. అమ్మ తనకు తాను విధించుకున్న ఏకాంతవాసం.

వంటరితనం నాన్నగారి మనసులో మార్పు తెచ్చింది. ఆయన మూర్తిమత్వంలోని ఆంతరంగిక ప్రచోదక శక్తి ఏదో జాగృతమై, అంతర్గత సంకటస్థితి నుంచి ఆత్మ విశ్లేషణ వైపుగా సాగింది ఆయన ప్రయాణం. దర్శనానికి వచ్చే భక్తులకు అమ్మపట్ల పవిత్ర మాతృభావన తప్ప మరొకటిలేదని అర్థం చేసుకున్నారు. నాన్నగారి సహృదయతతో, పరివర్తనతో యధాపూర్వ స్థితి నెలకొన్నది.

అందుకే కాబోలు అమ్మ అంటూ ఉండేది – కేవలం నాన్నగారి అంగీకారం వల్లనే వేలాది భక్తులు నిస్సంకోచంగా యథేచ్ఛగా చెంతకు చేరి కష్టసుఖాలు చెప్పుకోగలుగుతున్నారు అని. ఏ క్షణంలో నయినా వారు అభ్యంతర పెడితే విశ్వజనని అవతార లక్ష్యమే అర్థాంతరంగా ఆగిపోయేది. ఈ ప్రపంచం అమ్మ అండను ఆదరణను టెర్రిబుల్గా మిస్సయ్యేది! అమ్మ లేని అనాధగా, బేలగా, నిస్సహాయంగా మిగిలి పోయేది. నాన్నగారు సాధించిన ఎమోషనల్ డెవలప్మెంట్, సోషియా స్పిరిట్యువల్ డెవలప్మెంటుగా మారి లక్షలాది మందికి వరప్రసాదమయ్యింది.

“నాన్నగారి త్యాగాన్ని ఎవరూ గుర్తించలేదు నాన్నా” అని అమ్మ అంది ఒక సందర్భంలో. నేటి పరిభాషలో చెప్పాలంటే భార్య ఒక గొప్ప సెలబ్రిటీ స్టేటస్కి చేరి, లక్షలాది మంది గుర్తింపు పొందితే, కేవలం ఆమె భర్తగానో, అనామకుడిగానో మిగిలిపోయిన భర్తలో చెలరేగే కల్లోలం, ఆత్మన్యూనత, మానసిక సంఘర్షణ, అసూయలను అధిగమించి స్థితప్రజ్ఞునిగా ఉండగలగటం అరుదైన విషయం. తనకు ఒక గుర్తింపు, ఒక ప్రత్యేక స్థానం, ప్రాధాన్యం ఉండాలని ఏనాడూ కోరుకోలేదు నాన్నగారు. అతి సామాన్యునిగానే జీవించారు. నాన్నగారు అపుడపుడు “నేను జిల్లెళ్ళమూడి అమ్మ” గారి భర్తను అని చెప్పుకుంటేనే నాకు మర్యాద గౌరవం, కాని జిల్లెళ్ళమూడి కరణాన్ని అని చెప్పుకుంటే ఎవరు గౌరవిస్తారు” అని అంటూ ఉండేవారట, ఎంత నిగర్వి వారు?

ప్రారంభ దినాల్లో అమ్మ చెంతకు వచ్చే భక్తుల మనో భావాలతో అంతగా యేకీభవించే వారు కాదు నాన్నగారు. ఒక సాధారణ ‘భర్త’ భార్యను దేవతగానో, భగవద్రూపంగానో భావించి తనకుతాను సమాధాన పడటం అన్నది ఒక అతిమానుష చర్యే! ఎవరో యోగులు మహర్షులు అలా సంభావన చేసి నిస్సంగులై రాగద్వేషాతీతంగా ఉండగలరేమో? మనకు తెలిసినంతలో నాన్నగారు యోగీకాదు, ఋషీ కాదు. అయినప్పటికీ ఆయన ఉన్నత భావనాస్థితి వల్లనే, విశాల హృదయం వల్లనే మనమందరం (నాడూ, నేడూ) అరమరికలు లేని మానసిక బంధాన్ని ఏర్పరచుకుని అమ్మ వాత్సల్యాన్ని, ఆప్యాయతనూ,

మార్గదర్శనాన్నీ పొందగలుగుతున్నాం. కాలక్రమంలో వారి అవగాహనలో మార్పు వచ్చింది. ఆలోచనా సరళి పరిపక్వత చెందింది. నాది, నా స్వంతం (ప్రొసెసివ్ నెస్) అన్న భావన క్రమంగా అదృశ్యమవ సాగింది. జిల్లెళ్ళమూడి వచ్చిపోయే జనంతో, భక్తులతో, స్నేహితులతో సంభాషించేటప్పుడు ‘నా భార్య’ కు బదులు ‘మీ అమ్మగారు’ అనటం గమనార్హం. సృష్టిలో అతి బలీయమైన బంధం భార్యాభర్తల బంధమేకదా. అట్టి బంధాన్నే మనస్సులో బంధించి, పరిమితులు, హద్దులు ఏర్పరచుకున్నారు నాగేశ్వరులు. ఔద్వేగికానుభవం నుంచి బయటపడి వారు తన సాంఘిక, కౌటుంబిక పరిసరాలతో, పరిజనులతో ఎప్పటికప్పుడు ఎమోషనల్ యూనిటీని, ఇన్టెగ్రిటీని సాధించుకున్న మహామనీషి. ధర్మ మీమాంస చాటున దాక్కొనే ప్రయత్నం చెయ్యకపోవటం వారి గొప్పతనం. సహధర్మచారిణిలో సహజ దివ్యత్వాన్ని చూసి, ఆమోదించి అనుభూతి చెంది పునీతులయ్యారు.

కాని నాన్నగారి పట్ల అమ్మ భావన, వైఖరి, మనోభావాలు చెక్కుచెదరక ఆసాంతమూ ఒకేలా కొనసాగేయి. మంగళసూత్రాలనే భర్తపాదాలుగా భావించి, ఆ పాదతీర్థ సేవనంతోనే అమ్మ దినచర్య ప్రారంభం అయ్యేది. చిన్న, పెద్ద అన్ని విషయాల్లోను భర్తమాటే వేదంగా భావించిన ‘భర్తృవాక్య పరిపాలనా ‘ దక్షురాలు అమ్మ. ఏ పని చెయ్యాలన్నా, యిల్లు దాటాలన్నా ముందు నాన్నగారి అనుమతి పొందవలసిందే. భక్తులు తనను ఎంత ఉన్నత స్థానంలో నిలిపినా, అంతకన్న ఉన్నత స్థానంలో నాన్నగారిని నిలిపింది అమ్మ. మనిషి దైవాన్ని ఆరాధించటంలో ఎంత యేమీలేదు. కాని దైవమే మనిషిని ఆరాధిస్తే ?? అందులోని అంతరార్థం మన బోంట్లకు ఎంతవరకు అందుతుంది? ఆగష్ట్ 15, మే 5 వంటి సందర్భాలలో యితర పర్వదినాల్లో అమ్మ నాన్నగారి మెడలో దండవేసి పాదాల మీద పూలు పోసేది. నాన్నగారు అమ్మ మెడలో దండవేసి శిరసు మీద పూలు చల్లేవారు. కాని ఒకసారి – కాదు కాదు. (1980) మామూలుగా అమ్మ మెడలో మాల వేసి, పాదాల మీద పూలు వేసేరు. అది వారి మనఃపరిణతకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అర్ధనాగేశ్వరులు పూర్ణనాగేశ్వరులయ్యారు. కాని మళ్ళీ అట్టి సందర్భం రాలేదు. 1981 ఫిబ్రవరి 16న మహాప్రస్థానం చేశారు నాన్నగారు. అమ్మ మెళ్ళో వేసిన మాలలో (తానూ) ఒక పువ్వయి అమ్మలో ఐక్యమై పోయారు.

అతి సాధారణ యిల్లాలు అనసూయగా ఆమె జిల్లెళ్ళమూడి కరణంగారి భార్య. అట్టి సంబంధం ఏర్పడబట్టే, ఆ సంసారపు పరిధిలో తననుతాను ఇముడ్చుకోబట్టే అమ్మ మన మధ్య మసలి, మనకందుబాటులో భక్త సులభురాలిగా ఉండి మనలనుద్దరించింది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అమ్మ ఒడిలో వాలి సోలి సేదతీరటం మనకు తెలుసు. వాళ్ళ కులమత లింగ వయో భేదాలకతీతంగా అమ్మ ఓదారుస్తూ అనునయిస్తూ ఉండేది. ఇది కేవలం నాన్నగారి అనంత కృష్ణా విశేషమే. ఆయన ఏర్పరచుకున్న డిటాచ్డ్ ఎటాచ్మెంట్ ఫలితమే.

“భార్య అన్న స్థితిని దాటి లోకానికి అమ్మగా ఎదుగుతుంటే చూచి పరిశీలించి సత్యశోధకునిగా తృప్తి పొంది సహకరించిన ధీశాలి నాగేశ్వరరావు గారు.” – అన్న సిద్ధేశ్వరానందభారతీ స్వామి వారి ఆశాసనం అక్షరసత్యం.

(రిచర్డ్ షిఫ్మన్ రచన మదర్ ఆఫ్ ఆల్ ఆధారంగా)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!