(గత సంచిక తరువాయి…..)
- దేవుడంటే రాయి కాదు, తనకీ మనస్సు ఉన్నది.
‘కాలువ నిండా నీరు వున్నా త్రాగటానికి రేపు కావాలి’ – అన్నట్లు దైవం సర్వే సర్వత్రా పరివ్యాప్తమై ఉన్నా తదనుగ్రహాన్ని పొందాలంటే దేవాలయమే శరణ్యం. అయితే దేవుడంటే విగ్రహా? విగ్రహమేనా? శిలా? కాదు. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం ఇవి దైవ లక్షణాలు..
కాగా అమ్మ “దేవునికి మనస్సు వున్నది” అని విలక్షణంగా ప్రవచించింది. మరి రక్తమాంసాదులచే నిర్మితులైన పాంచ భౌతిక దేహ దారులకు కదా మనస్సు వుండేది! దైవం కూడా మానవులు. పశుపక్ష్యాదులవలె మన సౌఖ్యం చూసి మైమరచిపోతాడా? దుఃఖాన్ని చూసి తల్లడిల్లిపోతాడా? ఔను. అసలు దైవానికి సృష్టి అందలి ప్రాణులపై వర్షించే మమకారం, వాత్సల్యం, ప్రేమ రుచిని తెలియచెప్పటం కోసమే జంతుకోటికి సంతానాన్ని అనుగ్రహించాడు. జగన్మాత అమ్మది విశ్వకుటుంబం. ప్రపంచంలో ఎక్కడైనా ‘ప్రేమ’ అనేది వుంటే దానికి మూలం జిల్లెళ్ళమూడిలో వున్నది. కనుకనే “నేను మిమ్మలందర్నీ కన్నాను, “మీ తల్లులకు పెంపుడిచ్చాను” – అనే వాస్తవాన్ని నినర్గసుందరంగా, అలవోకగా చాటింది అమ్మ “సర్వత్రా పరివ్యాప్తమైన మమకారమే మాధవత్వం” అనే విప్లవాత్మక ప్రవచన సారం ఇదే. దైవత్వ ప్రాప్తికి అమ్మ సూచించే దగ్గర దారి “ఎదుటి వారిలో మంచిని చూడటం .
అవ్యాజమైన ప్రేమ, అకారణ కారుణ్యం, విచక్షణలేని వీక్షణ… మన అమ్మ దివ్య లక్షణాలు: శ్రీ పరాత్పరి దివ్య దీధితులు, అందుకు ఒక ఉదాహరణ.
ఒకసారి రెండు నెలల కాలం జిల్లెళ్ళమూడిలో వున్నాను. ఒక రోజున మా ఇంటి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మా అమ్మకు పక్షవాతం వచ్చిందనీ, ఆస్పత్రిలో చేర్చారని. వెంటనే అమ్మ వద్దకు పరుగు తీశాను. నాలుగు అడుగుల దూరంలో అమ్మకు ఎదురుగా నేను, నా నోట మాట రావటం లేదు. అమ్మకు తెలియనిదేముంది? “నరసాపురం వెడతావా?” అడిగింది. “అవును” అని విషయం వివరించాను. ‘ఎప్పుడు వెడతావు’ అని అంటే ‘మర్నాడు’ అని అన్నాను. “సరే” అన్నది. అందుకు నా ఆతృత అంతరించింది. ప్రమాదం అయితే వెంటనే బయలుదేరమనేది కదా! ఆ రాత్రి అలవాటు ప్రకారం అమ్మ మంచం దగ్గరే పడుకున్నాను. తెల్లవారింది. మా అమ్మకోసం చీర, రవికె, పసుపు కుంకుమ పొట్లాలు, పటిక బెల్లం… ప్రసాదంగా ఇచ్చింది. అమ్మ పాదాలకు ప్రణమిల్లి “బొట్టు పెట్టమ్మా వెళ్ళొస్తాను” అన్నాను. అమ్మ నా వైపు చూడటం లేదు. ఎటో చూస్తోంది. మరలా నా మాట అదే. ‘బొట్టు పెట్టమ్మా, వెళ్ళొస్తాను’ అని, ఈసారి అమ్మ నన్ను చూసింది. అమ్మ కళ్ళనిండానీరు. వదనం రాహుగ్రస్త భానుమండలంలా వుంది. ఏమా? అని నా మనస్సు పరిపరి విధాల పోయింది. అమాంతం అమ్మ నన్ను ఒడిలోకి లాక్కొని “ఎవరినీ ఇంత అలవాటు చేసుకోకూడదు” అంటూ వాత్సల్యామృతరూప అశ్రుధారలను వర్షించింది.
వాస్తవం ఏమంటే నా స్థానంలో గోపాలన్నయ్య, లక్ష్మీనారాయణ అన్నయ్య, పాపక్కయ్య, ఢిల్లీ ఉషక్కయ్య, ఎవరితోనైనా అమ్మ అదే మాట “ఎవరినీ ఇంత అలవాటు చేసుకోకూడదు” అంటుంది. అమ్మ హృదయంలో ఎవరిస్థానం వారిదే. వేరొకరు భర్తీ చేయలేరు. అలాగే రామబ్రహ్మం అన్నయ్య, దినకర్ అన్నయ్య, అప్పారావు అన్నయ్య… అందరికీ “అమ్మనాది” అనే కాదు. “అమ్మనాదే” అనే భావం నిరంతరం వారి వారి హృదయాంతరాలాల్లో ప్రతిధ్వనిస్తూంటుంది. ఇదే రాధామాధవతత్వం. అందుకే జిల్లెళ్ళమూడి ఒక గోకులం. అందరిల్లు ఒక బృందావనం: అమ్మ మురళీ మనోహరుడు.
అసలు అమ్మకూ, మనకూ వున్న బంధం ఎటువంటిదో ఒక పోలికతో వివరిస్తాను. ఒక చిక్కుడు కాయను వలిచి చూస్తే గింజలు కాయ లోపల గోడకు సన్నని పోగుతో అతకబడి వ్రేలాడుతూంటాయి. ఇక్కడ చిక్కుడు కాయ అమ్మ, గింజలు మనం, సన్నని పోగు నాభి (Placenta) తత్త్వతః మనం భూమి మీద పడక ముందూ, రేపూ, ఎప్పుడూ వుండేది అమ్మ గర్భంలోనే. “విశ్వ ప్రకాశునకు వెలి ఏడ? లోనేడ? అని కీర్తిస్తారు శ్రీ అన్నమాచార్యులు. చిక్కుడు కాయను ఎందుకు ఉదాహరణగా తీసికొన్నానంటే చిక్కులను కలిగించే పిల్లకాయలు మనం: చిక్కుముడి విప్పి సేదతీర్చే చింతామణి అమ్మ. వాస్తవానికి అమ్మకీ, మనకీ ఏ పోలికాలేదు. అమ్మ శరీరం వేరు, మన శరీరం వేరు. మానవ శరీరం నశ్వరమైన పాంచ భౌతికమైనది. నానాచ్ఛిద్ర ఘటోదర స్థితి మహాప్రదీప ప్రభాసదృశ జ్ఞాన స్వరూపిణి అమ్మ. అమ్మ వాక్కు, దృష్టి, లక్ష్యం వేరు. మానవులకు స్వార్థమే పరమార్థం. మధుర మమతా స్రవంతి అందరి అమ్మకి పరమార్ధమే స్వార్థం.
మనకు అమ్మ మీద కంటే, అమ్మకు మన మీద ప్రేమ ఎక్కువ. తనను కన్న వారిపై కంటే తాను కన్నవారిపైనే ఎవరికైనా ఎక్కువ మమకారం. “పునర్దర్శన ప్రాప్తి కోసం పరితపించేది ఎవరు? అమ్మా, బిడ్డలా? – భగవంతుడా, భక్తుడా? అని ప్రశ్నిస్తే ‘భగవంతుడే అమ్మ’ – అని సమాధానం చెప్పాలి. ఆశ్చర్యపోకండి. అబ్బాయి / అమ్మాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చి, నాలుగు నెలలు వుండి తిరిగి వెడుతున్నారు. మరి 2 లేదా 3 ఏళ్ళ వరకూ రాలేరు. ‘పునర్జదర్శన ప్రాప్తి’ కోసం తపించేది ఎవరు? కన్నవారు కాదా? కనుకనే అమ్మ అంటుంది “దేవుడంటే రాయి కాదు కదా! తనకీ మనస్సు ఉన్నది” – అని.