ఆచారమూ సంప్రదాయములు వాస్తవికత మరుగున పడగా అంద విశ్వాసాలూ, మూఢనమ్మకాలు పగ్గాలు చేపడితే మానవ మేధస్సు వెర్రితలలు వేస్తుంది. మానవ జీవన పధము అగమ్యము అంధకార పరీవృతము అవుతుంది. అప్పుడు దైవం రాజారామోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, విలియం బెంటిక్ వంటి మహనీయుల రూపంలో వచ్చి ప్రవాహానికి ఎదురీది మార్గదర్శనం చేస్తుంది.
ఆచరణాత్మకంగా అమ్మ ప్రబోధించిన కొన్ని సంస్కరణలను అవగాహన చేసుకుందాం.
- విశ్వాసమే భగవంతుడు:
ఒక రోజు రాత్రి సమయం. అమ్మ మంచం మీద కూర్చున్నది. “దిండు ఎటువైపు పెట్టమంటావు?” అని అడిగాను. “ఏ దిక్కున అయినా ఒకటే, నాన్నా! అన్నింటికీ వాడే (దైవం) దిక్కు” అన్నది అమ్మ. స్వప్నాలకీ, ప్రయాణాలకీ శకునాలు, వాటి అర్థాలు అనర్థాల గురించి ఆందోళనతో భయంతో ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవటం పరిపాటి.
“ఇది ఏమిటి?” అనేది అమ్మ ప్రవచించే పంచాక్షరి”. “అసలు ఇది ఏమిటి?” అనేది అమ్మ ప్రవచించే అష్టాక్షరి. ‘ఆత్మ బుద్ధి: సుఖం’ అన్నట్లు తర్కించుకొని వివేచన కలిగి సత్యాన్ని ఆశ్రయించమంటుంది అమ్మ. ఒక్కొక్కసారి అమ్మ నాస్తికురాలా అని అనిపిస్తుంది. నిజం. అమ్మ దివ్యప్రభోదం- “నిన్ను నమ్మకో.
నన్ను నమ్ముకో. ఏదయినా ఒకటే. విశ్వాసమే భగవంతుడు-” అనేది. కనుకనే అమ్మ ఆస్తికులకూ, నాస్తికులకూ పరమ ఆప్తురాలు.
- తిథులు విధిని మార్చలేవు:
‘అష్టమి నవమిలు కష్టదినాలు’, ద్వాదశి దగ్ధయోగం, ‘గొడ్డు అమావాస్య…. ఇలా కొన్ని తిధులు అనర్థదాయకములనీ కొన్ని కళ్యాణకారకములనీ ప్రతీతి. వాస్తవానికి ఏకాదశికి అధిపతి యముడు, ద్వాదశికి శ్రీ మహావిష్ణువు – అని శాస్త్రం చెపుతోంది. అమ్మ అంటుంది: “చవితి- వినాయక చవితి, అష్టమి దుర్గాష్టమి, నవమి- శ్రీరామనవమి, షష్ఠి-సుబ్రహ్మణ్య షష్ఠి.. ఇలా ఇవన్నీ దేవుని కళ్యాణ తిథులు, కాగా మనకి పనికిమాలిన తిధులుగా పరిగణింపబడు తున్నాయి”- అని.
ఒకసారి నాన్నగార్కి (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారికి అనారోగ్యం చేసింది. బాపట్లలో వారం రోజులు చికిత్స పొందారు. స్వస్థత చేకూరగానే జిల్లెళ్ళమూడి తిరిగి వచ్చారు. నాడు నవమి, “నవమినాడు తీసుకు వచ్చారేమిటి? అన్నారొకరు. తీసుకువచ్చింది నేను. కూడదని తెలియదు. మనస్సు కలుక్కుమంది. వెంటనే అమ్మ, “వాళ్ళను నా ఎదుట పడి అనమను. చెంపలు పగులకొడతాను” అని అజ్ఞాన తిమిరంపై ఆగ్రహాన్ని ప్రదర్శించింది.
‘పురాణ మిత్యేవ నసాధు సర్వం
నచాపి కావ్యం నవమిత్య వద్యం
సంతః పరీక్షాన్యతరద్భజంతే
మూఢః పరః ప్రత్యయ నేయ బుద్ధిః’ అనేది అమ్మ ప్రగాఢ విశ్వాసం.
- కూతురిని కోడలుని ఒకేలా చూడటం అద్వైతం
‘కోడలు గృహప్రవేశం, అత్తగారు గంగా ప్రవేశం’- అనేది జనవాక్యం. ఈ మూఢ నమ్మకాన్ని ఖండిస్తూ,
‘కుడికాలు పెట్టి కొత్త కోడలు వచ్చె
ఆడపడచు వచ్చి హారతిచ్చె
మంచె మీద నున్న మామ టపాకట్టె
మృత్యు వాపదరమె ఎవరికైన?’ అని ప్రశ్నిస్తారు సోదరులు పి. వెంకటేశ్వరరావు గారు.
‘మగ శిశువు గానీ, ఆడ శిశువు గానీ జన్మించడానికి భర్తే బాధ్యుడు; స్త్రీ కానే కాదు. Sex Deciding Chromosome విడుదలయ్యేది పురుషుని శుక్లం నుండి’ – అని సైన్సు స్వరపేటిక పగిలేలా ఘోషించింది; ఋజువు చేసింది. అయినా కొందరు అత్తలు మూర్ఖత్వంగా ‘మా కోడలికి ఎప్పుడూ ఆడపిల్లలే. మా అబ్బాయికి వేరే మనువు చేయాలి’ – అనటం నేటికీ ఒక హృదయ విదారక వాస్తవం. మగపిల్లలే వంశోద్ధారకులట; అపుత్రస్య గతిర్నాస్తియట.
ఒక రోజున అమ్మ హాలులో శేషతల్పశాయిలా దర్శనం ఇస్తోంది. వెలుపల వరండాలో సంధ్యావందనం జరుగుతోంది. నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో మాతృశ్రీ అధ్యయన పరిషత్తుల ప్రారంభ విషయమై అమ్మ నాకు సూచనలు ఇస్తోంది. ఇంతలో అమ్మ పెద్దకోడలు సోదరి శ్రీమతి బ్రహ్మాండం శేషు లోపలకు వచ్చింది. అమ్మ శేషు అక్కయ్యను దగ్గరకు తీసుకొని, ముద్దు పెట్టుకొని, తలను తన గుండెలకు హత్తుకుని ‘నా కోడలు చాలా మంచిది’ అని అన్నది. భావములోన బాహ్యమునందును అమ్మ కోడళ్ళు అమ్మను ‘అత్త’ అని సంభావన చేయడం, సంబోధన చేయడం ఎరుగరు. కూతురిని, కోడలిని ఒకేలా చూడటం అనేది అమ్మకి మాత్రమే సాధ్యం. Mother-in-law, Daughter-in-law అనే పదాలు అమ్మహృదిలో సన్నిధిలో సార్థకతను సంతరించుకున్నాయి.
- భర్తకు భార్య దేవత
లోగడ నేను ఒక ప్రాధమికోన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాను. నాకు ఒక పనిమనిషి ఉండేది. బుట్టలు అల్లేది, పందులను మేపేది, నాలుగిళ్ళల్లో దాసీ పనిచేసేది. తనకి ఐదుగురు పిల్లలు. సూర్యోదయం, సూర్యాస్తమయాలకు తేడా తెలియక శ్రమించేది; సంసారాన్ని పోషించేది. భర్త ఎప్పుడూ అరుగు మీద బుట్టలు అల్లుతుండేవాడు. ఒక రోజున నాతో ‘నా భార్య తాగి రోజూ నన్ను కొడుతోంది. మీరు దానిని మందలించండి’- అన్నాడు.
ఈ సన్నివేశం, సంభాషణ అంతా అమ్మకు ‘విడ్డూరం’ అని విన్నవించాను. వెంటనే అమ్మ “అంటే నీకు ఆశ్చర్యం వేస్తోంది. మీరు (మగవారు కొడితే వాళ్ళు (ఆడవారు) పడాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోందే అని. మీతో సమానంగా వాళ్ళు కష్టపడటం లేదా? ఉద్యోగాలు చేయటం లేదా ఇంటిపని, పిల్లల చాకిరి చేసుకుని? ఏమిటిరా మీ గొప్ప? అయినా అది (పురుషాహంకారం) మీ రక్తంలో జీర్ణం అయిపోయింది” అనర్గళంగా, ఒకించుక ఆవేదనా భరితంగా. అన్నది
పతివ్రత, పవిత్రత అనే పదాలకి అర్థం అమ్మ. భార్యకు భర్త దేవుడు (స్త్రీణాం ఆర్య స్వభావానాం పరమం దైవతం పతి) అనే ఆర్షవాక్యానికి అమ్మ జీవితం దర్పణం పడుతుంది. అయినా ‘భర్తకు భార్యదేవత’ అని సంపూర్ణత్వాన్ని దర్శింపచేస్తుంది. అమ్మ మీద Feminist అనో Revolutionist అనో స్త్రీ జనపక్షపాతి అనో ముద్రవేస్తే అది పొరపాటే. వివాహం అనేది ఒక అర్పణ, ఒక ఆరాధన అనేది అమ్మ విశ్వాసం. స్త్రీకి కావాల్సింది స్వాతంత్ర్యం కాదు, పరస్పర ఆలంబనం అనే వాస్తవాన్ని దర్శింపచేస్తుంది. కనుకనే “నడుంవంచి తాళి కట్టేది భర్త, తల వంచి తాళి కట్టించుకునేది భార్య” అని వారి వారి పాత్రలను, బాధ్యతలను వివరిస్తుంది.
- విశ్వ మానవ సౌభ్రాతృత్వభావం -అస్పృశ్యతకి చరమగీతం
వసుధైక కటుంబ భావానికి ప్రతిరూపం జిల్లెళ్ళమూడి. అందరకీ తాను అమ్మ అనీ, అందరూ తన బిడ్డలనీ అంటుంది అమ్మ ప్రేమ రూపిణి, ప్రేమ భాషిణి, ప్రేమ వర్షిణీ, ప్రేమోన్మాదిని అమ్మ. ” నేనే మిమ్మలందరినీ కన్నాను. మీ తల్లులకు పెంపుడిచ్చాను” – అనే అచ్చమైన వాత్సల్యరూపిణి అమ్మ. ఒకే తల్లి పిల్లలు అనే భావం కలిగి ఉండండి. ఎవరైనా ఆపదలో వుంటే ఆదుకోండి”- అని అంటుంది విశ్వజనని హృదయం. “నీకు రెక్కలు ఇచ్చింది. ఎగిరిపోవటానికి కాదు, రెక్కలు రాని వారిని ఆదుకోవటానికి” అని ఆదేశిస్తుంది; బిడ్డలంతా ఏకోదరభావంతో కలిసి మెలసి వుంటే అందరమ్మ ఎంతో ఆనందిస్తుంది; హృదయం పరవశిస్తుంది.
మన అమ్మ ఈశ్వరి, నాన్నగారు ఈశ్వరుడు, సోదరి (హైమ) దేవత… అనే భావం అడుగడుగునా అణువు అణువునా జిల్లెళ్ళమూడిలో సర్వసాధారణంగా వెల్లి విరుస్తుంది; మానవులంతా అమృతస్యపుత్రా: అనీ, ‘మాతాచ పార్వతీ దేవీ, పితాదేవో మహేశ్వరః అనే భావం సహజంగా ప్రస్ఫుటమౌతుంది. అమ్మ సన్నిధి ఆదరణ, అప్యాయతలకి ఆలవాలం. అక్కడ భగవంతునికీ భక్తునికీ మధ్య సంబంధం తల్లీ బిడ్డల సంబంధం, రక్త సంబంధం. ‘అన్నయ్యా!’ ‘అక్కయ్యా!’ అనే ఆత్మీయతా పిలుపులతో ఆ వాతావరణం అవ్యక్త మధురం అవుతుంది, నందనవన సౌరభాల్ని గుబాళిస్తుంది. అందరూ అన్నపూర్ణాలయంలో ఒకే పంక్తిన ‘సహనావవతు’ అంటూ కలిసి భోజనం చేస్తారు. కష్టించి, అమ్మను దర్శింప వచ్చిన వారికి ప్రేమతో అన్నం పెడతారు. కష్టసుఖాల్ని కలిసి పంచుకుంటారు. ఎవరిది ఏ కులమో, ఏ మతమో తెల్సుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అందరిదీ మాతృశ్రీ గోత్రం. అంతే. ‘అస్పృశ్యత’ అనే పిశాచం జిల్లెళ్ళమూడిలో తన అస్తిత్వాన్ని కోల్పోయింది, అంతిమశ్వాస విడిచింది.
ఎందరో దేశనాయకులు, ప్రవక్తలు, సంఘసంస్కర్తలు చట్టాల ద్వారా, చేతల ద్వారా, ప్రవచనాల ద్వారా సాధింప యత్నించి విఫలమైన సర్వమానవ సౌభ్రాతత్వం అలవోకగా ప్రేమ పూర్వకంగా జిల్లెళ్ళమూడిలో అమ్మ ప్రతిష్ఠించి (ప్రకృష్టేన తిష్ఠతి ఇతి ప్రతిష్ఠా). ఏకోదర భావం అమ్మ అనుగ్రహం వలన జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులకు శ్వాసక్రియ, రక్తప్రసరణ, హృదయస్పందన అంత సహజం. ఈ సంస్కరణని సో॥ పొత్తూరి వేంకటేశ్వరరావుగారు, “నూత్న యుగారంభ సూచకమైన శుభపరిణామ ప్రత్యూష” అని అభివర్ణించారు.
- భర్త అంటే శరీరం కాదు, భావన
ఎప్పుడూ అమ్మ స్వీయ అనుభవసారాన్నే ప్రబోధిస్తుంది. కనుకనే అది ఆప్తవాక్యం, శాస్త్రసమ్మతం, సత్యసంశోభితం అయి దివ్యరోచిస్సులను వెదజల్లుతుంది. అమ్మ మహోన్నత ప్రవచనాలలో ‘భర్త అంటే శరీరం కాదు, భావన’ అనేది ఒకటి.
ఒకసారి నాన్నగారికి జ్వరం వచ్చింది. మందులు వాడారు తగ్గింది. నాన్నగారికి నేనంటే ఇష్టం. అందువలన నేను కూడా వారి దగ్గర ఉండేవాడిని. మరి నాలుగు రోజుల తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది అని తెల్సింది. వెంటనే ఈ సంతోషవార్త అమ్మకు విన్నవించాను. పరమాన్నం నివేదన చేశాను. అమ్మ నానోసట బొట్టుపెట్టి, నోటికి ప్రసాదం అందించి పూలు చల్లి ఆశీర్వదించింది. “నీ సంతోషాన్ని పదిమందికి పంచటమే దీని పరమార్థం” అని అంటూ పరమానాన్ని చుట్టూ ఉన్న పదిమందికీ పంచింది. హఠాత్తుగా “నాన్నా! ఇవాళ నాన్నగారికి టెంపరేచర్ చుశావా?” అన్నది. నేను గతుక్కుమన్నాను. “అమ్మా! నాలుగు రోజుల నుండి జ్వరం రావడం లేదు. ఇవాళ చూడలేదు” అని నసిగాను. ఆదరాబాదరగా మెట్లు దిగి క్రిందికి వచ్చాను. ఆశ్చర్యం నాన్నగార్ని 100 డిగ్రీల జ్వరం వుంది. నాన్నగారు ఎక్కడ వుంటే అమ్మ ధ్యాస అక్కడే.. అమ్మకి నాన్నగారే దైవం.
భర్త వుండగా కన్నుమూసిన స్త్రీ యే పునిస్త్రీ అని, పసుపు-కుంకుమలతో వెళ్ళింది అని పరిగణించడం లోకం పరిపాటి. కానీ అది వాస్తవంగా వాస్తవం కాదు. పునిస్త్రీ అర్థాన్ని పరమార్థాన్నీ అమ్మ ఆచరణాత్మకంగా చాటి చెప్పింది.
అమ్మ అంటుంది: “భర్త ఎడల అంకిత భావం గల భార్య- తానే భర్త యోగక్షేమాల్ని చివరి క్షణం వరకూ చూడాలి, సాగనంపాలి అని కోరుకోవాలి” . అని. మహోదధిని మరిపించే గంభీర హృదయంతో, మనస్సును రాయి చేసుకుని ఆచరించే అసిధారావ్రతం అది.
” భర్త కంటే ముందు పోవాలి అనేది, అనుకునేది స్వార్థం” అనే వాస్తవం విడ్డూరంగా కన్పించే అనిపించే అమ్మ వ్యక్తిగతమైన యోచన, అలౌకిక భావన. ఒకరు నొచ్చుకోవచ్చు, మరొకరికి నచ్చకపోవచ్చు.
ప్రేమ అంటే తచ్చుఖసుఖిత్వం (తాను ప్రేమించే వ్యక్తి సుఖంగా వుండాలి, అదే తనకు ఆనందం). అమ్మ తాలు మాటల మనిషి కాదు; సత్యానికి సత్యం, ధర్మానికి ధర్మం, అగ్నికి అగ్ని, అమ్మ సర్వమంగళ. అమ్మ ఉచ్ఛ్వాసనిశ్వాసాలే. నాన్నగారు. నాన్నగారు ఆలయ ప్రవేశం చేసిన తరువాత మాంగల్య చిహ్నాలతో దర్శనం ఇచ్చిన అమ్మను చూడగానే నాకు అశోకవృక్షం క్రింద సీతాసాధ్వి (ఉపవాసేన శోకేన ధ్యానేన యేన చ | పరిక్షీణాం కృశాం దీనాం అల్పాహారాం తపోధనాం)ని దర్శించినట్లయింది. నాన్నగారి అభీష్టం మేరకు తన చేతుల మీదుగా వారిని ఆలయప్రవేశం చేసిన పావకప్రభ అమ్మ. తన హృదయ సాగరాంతర్గత బడబాగ్నిచే దహింపబడుతూ, తన గుండె గోడల నడుమ శోకసాగరానికి చెలియలికట్టను నిర్మించుకున్నది.
శ్రీ అనసూయేశ్వరాలయ ప్రాదుర్భావం అయిన తర్వాత అమ్మ మన మధ్య ఛాయా మాత్రంగా వున్నది. తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది. హాలాహలాన్ని మ్రింగి లోకరక్షణ చేయమని పరమేశ్వరుని ప్రార్థించిన పార్వతీమాత త్యాగాన్ని మరిపించింది. అమ్మ మంగళసూత్రాలు అంటే భర్త రెండు పాదాలు అని నిర్వచించింది. అనునిత్యం తన ముఖప్రక్షాళన అనంతరం మంగళ సూత్రాలను అభిషేకించి కళ్ళకు అద్దుకొని, ఆతీర్ధం త్రాగుతుంది. అది ఒక్కటే నిత్యం అమ్మ చేసే పూజ అని అనవచ్చు.
అమ్మ అంటే చీరె, రవిక, గాజులు ధరించిన ఒక స్త్రీ మూర్తి కాదు. సతపోతప్యత (తపస్సుతో తపించుము) అనే ఉపనిషత్సారమే అమ్మ. కనుకనే –
‘పరధ్యానంగా ఉన్నావేమిటమ్మా?” అంటే “పరధ్యానం కాదు, నాన్నా! పతి ధ్యానం” అన్నది. కనుకనే ఒక వితంతువు నొసట కుంకుమ బొట్టు పెట్టి “ నీ భర్త గురించిన భావన వున్నంత వరకు నువ్వు పునిస్త్రీ” అని అన్నది.
ధరిత్రి కానని వేదం అమ్మ. ఈశ్వరుడు ఎరుగని నాదం అమ్మ.
- సృష్టి అంతా సజీవం, చైతన్యతరంగితం; జడమేమీ లేదు.
(Sound is the origin of creation but not matter) ‘శబ్దమే సృష్టి ప్రాదుర్భావానికి మూలం, పదార్థం కాదు’ అని ఇటీవల శాస్త్రజ్ఞులు తెల్సుకున్నారు. సృష్టిక్రమాన్ని వర్ణిస్తూ వేదములు (ఆకాశాద్వాయు:) తొలుత ఆకాశము వున్నది. ఆకాశము నుండి శబ్దగుణ ప్రధానమైన వాయువు వచ్చింది’ అని పేర్కొన్నాయి. ఆకాశము అనేది అదృశ్యమైన అనంతమైన అమూర్త భావన (Abstract Concept).
“ఆకాశము అంటే అవకాశము” అని అద్భుతమైన అనిర్వచనీయమైన నిర్వచనాన్ని ఇచ్చింది అమ్మ. “అజాయమానో బహుధా విజాయతే” అని చెప్పబడినట్లు నిర్గుణుడు కాలాతీతుడు అయిన దైవం దృశ్యాదృశ్యమైన సృష్టిగా సంభవించడానికి ఒక వేదిక, ఒక అవకాశం ఆకాశం. ఆకాశం అంటే శూన్యం అని కాదు. మన కంటికి అగుపించని కాంతి కిరణాలు, చెవికి వినిపించని ధ్వని తరంగాలు వున్నాయి. దానినే కొందరు బ్లాక్ హోల్ అని సంభావన చేస్తే పోతన గారు పెంజీకటి అని వర్ణించారు. క్రమేణ వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి మొక్కలు, మొక్కల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణి కోటి (living organism) ఏర్పడ్డాయి.
‘శ్రాంతి అంటే అలసట; దీనికి వ్యతిరేకం విశ్రాంతి. అలాగే విరామం అంటే విశ్రాంతి; దీనికి వ్యతిరేకం రామం. కనుకనే జ్ఞానస్వరూపిణి సత్య స్వరూపిణి అమ్మ “రామం అంటే విరామం లేనిది” అనీ, సృష్టికి విరామం లేదని ఉఛ్ఛ్వాస నిశ్వాసలకు విరామం లేదనీ సోదాహరణంగా విపులీకరించింది.
(Matter and Energy can neither be created nor destroyed) పదార్ధాన్ని కానీ శక్తిని కానీ సృష్టించలేము నాశనం చేయలేము అని సైన్స్ ఘంటాపధంగా ప్రయోగశాలలో పరీక్షనాళికలో ఋజువు చేసింది. అమ్మ ఎప్పుడో చెప్పింది. “సృష్టికి పరిణామం వున్నది. నాశనం లేదు” అని ‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ (సృష్టిని శాసించే శక్తి అణువు కంటే చిన్నది, మహత్తు కంటే పెద్దది). అని వేదాలు పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని సర్వశక్తిమత్వాన్ని ఉద్ఘాటించాయి. నేడు శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి పరమాణువు (ATOM)ను విచ్ఛిన్నం చేస్తే అనూహ్యమైన శక్తి ఉత్పన్నమౌతుందని తేల్చారు. నేడు ప్రపంచానికి ఆధారమైన ఏకైకశక్తి (Atomic Reactors) నుండి లభించే పరమాణుశక్తి అని అందరికీ తెలుసు. కనుకనే – ‘పిపీలికాది బ్రహ్మపర్యంతం’ అని అంటారేమి? పిపీలిక (చీమ) బ్రహ్మ కాకపోతే కదా? అని అమ్మ ప్రశ్నిస్తుంది. ఈ మౌలిక అంశాన్ని స్పృశిస్తూ Emerson (The American Scholar) – To achieve the high, explore the low’ – అని అన్నారు.
ఈ సందర్భంలో అమ్మ మరో మెట్టును అధిరోహించి “సృష్టి అంతా సజీవమే, చైతన్య తరంగితమే; జడమేమి లేదు, నాన్నా!” “అంతా సత్యమే, మిధ్య ఏమీ లేదు”- అని వక్కాణించింది. నేటి శాస్త్రజ్ఞులు అమ్మ ప్రవచనాన్ని అర్థం చేసుకునే దిశలో పయనించాలి; Protoplasm వుంటేనే సజీవము అనే పాత నిర్వచనానికి స్వస్తి చెప్పాలి. పరమాణువులో Protoplasm లేదు కాబట్టి నిర్జీవపదార్థం (Inert substance) అని అందామా?
– (సశేషం…)