1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయం … అమ్మశక మిక మొదలు

సంపాదకీయం … అమ్మశక మిక మొదలు

D V N Kamaraju
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : May
Issue Number : 10
Year : 2022

అమ్మ అవతరించిన ఈ శతాబ్ది కాలం (1923-2023) ఒక స్వర్ణయుగం. ఈ సంవత్సరం మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకూ అమ్మ శతజయంతి ఉత్సవాలు మహా వైభవంగా జిల్లెళ్ళమూడిలో జరుపుకున్నాం. దానికి పూర్వాంగంగా అనేక చోట్ల అమ్మ శతజయంతి సందేశ సభలు నిర్వహించుకున్నాం. ఈ సభలన్నిటిలోనూ అమ్మ సంస్థలతో గానీ, అమ్మ సాహిత్యంతో గానీ పూర్వ పరిచయంలేని అనేకమంది ప్రముఖులు పాల్గొనటం విశేషం. బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వంటి ప్రవచన కారులు ఆ సందర్భంగా అమ్మ వాక్యాలనీ, అమ్మ చరిత్రనీ, అమ్మలోని అతి మానుష తత్త్వాన్నీ అధ్యయనం చేసి ఆశ్చర్యచకితులై కొనియాడటం అమ్మ సందేశం విశ్వవ్యాప్తం కావటంలో ఒక మలుపు.

జిల్లెళ్ళమూడిలో జరిగిన అమ్మ శతజయంతి సభలలో అనేకమంది ప్రముఖులు, పీఠాధిపతులు పాల్గొన్నారు. కుర్తాళం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి, విశ్వయోగి విశ్వంజీ మహరాజ్, గన్నవరం భువనేశ్వరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి, పెదపులిపాక శ్రీ విజయ రాజ రాజేశ్వరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి, బెంగళూరు కైలాసాశ్రమ సంస్థాన్, జ్ఞానాక్షి రాజరాజేశ్వరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్రపురి మహాస్వామి మొదలైన వారు పాల్గొనటం ఒక విశేషమైతే, వారు తమ ఆశ్రమ, పీఠ నియమాలను కూడా కాస్త పక్కకు పెట్టి, అమ్మను అవతారమూర్తిగా, విశ్వమాతగా, సాక్షాత్తూ రాజరాజేశ్వరిగా కీర్తించటం మరొక విశేషం.

కంచి కామకోటి పీఠం నుండి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆదేశానుసారం, వారి ప్రతినిధిగా విచ్చేసిన శ్రీ ధూళిపాళ రామకృష్ణ గారు అమ్మ అవతార తత్త్వాన్ని వివరిస్తూ కామాక్షి అమ్మవారికి, అమ్మకూ అభేదాన్ని ప్రకటించటం ప్రేక్షకులకు ఆశ్చర్య ఆనందాలను కలిగించింది. అమ్మ ఈ అవని పై నడయాడిన 62 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు

కానీ, తత్త్వోపదేశాలు చేయడం కానీ, మహిమలు ప్రదర్శించడం కానీ ఏమీ చేయలేదు. తానొక అవతారమూర్తిగా ప్రచారాలను ప్రోత్సహించడం లేదు. మరి వీరంతా అమ్మను కొనియాడటానికి కారణాలు వెదికితే, అమ్మలోని విచక్షణ లేని వీక్షణ, గుణభేద మెరుగని విశ్వమాతృ ప్రేమతో బాటు ప్రస్ఫుటంగా గోచరమయేది అమ్మ ఆచరణాత్మక ప్రబోధం! “తన జీవితమే సందేశమనీ”, “నేనేది చెప్పినా నా అనుభవంలో నుంచే చెపుతాను” అని చెప్పిన అమ్మ – లోకానికి అందించిన సందేశాలన్నీ ఆచరణాత్మక ప్రబోధాలే! తాను ఆచరించి చూపించినవే!!

ఈ నెల 5వ తేదీ అమ్మ కళ్యాణ దినోత్సవం. అమ్మ వివాహం మేనత్త కొడుకైన బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో 1936 మే నెల 5వ తేదీన జరుగుతుంది. “దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్లు, అమ్మకి బాల్యంలోనే తల్లి పోవటం, బంధువులెవరూ అమ్మను పెద్దగా పట్టించుకోకపోవటంతో అమ్మ వివాహానికి అందరూ తమకు తాము నిర్ణయాలు తీసుకున్నా అమ్మ మాత్రం తండ్రిగారైన సీతాపతి తాతగారి నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఒక సమయంలో సీతాపతి తాతగారు మేనల్లుడైన బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో వివాహం నిర్ణయించి శుభలేఖలు వ్రాయించినా, అనుకోని కొన్ని సంఘటనలతో వెనుకకు తగ్గుతారు. ఆ సంబంధం నుండి ఇరు వర్గాలూ దాదాపు విరమించుకుంటారు.

అయితే “భర్త అంటే భావన” అన్న నిర్వచనం ఇచ్చిన అమ్మ మాత్రం ఆనాటి నుండీ మనసా, వాచా, కర్మణా నాగేశ్వరరావు గారే తన భర్త అనే విషయంలో నిశ్చయాత్మక బుద్ధితో వుంటుంది. మానసికంగా వివాహమయిపోయింది అనే భావనతోనే వుంటుంది.

తరువాత ఒక సందర్భంలో అమ్మ, నాన్నగారు (నాగేశ్వరరావు గారు) కలుసుకుంటారు. అప్పుడు నాన్నగారు అమ్మని “అసలు పెళ్ళి చేసుకోవాలని వున్నదా” అని అడుగుతారు. సమాధానంగా అమ్మ అంటుంది, “ఇంతకుముందు దాన్ని గురించి నా మనస్సులో ఆలోచన లేదు. మొన్న లగ్నాలు పెట్టిన తరువాత, శుభలేఖలు కొట్టించిన తరువాత పెళ్ళయిపోయిందేమో అనిపించింది” అంటూ, “శుభలేఖలో వున్న నామాన్ని చేసుకున్నా ఆ నామం చేస్తే ఆ రూపం దగ్గరకు చేరతానని”. నాన్నగారు “నేను ఏమీ లేనివాడిని. నాకు ఆస్తి ఏమీ లేదు. నిన్ను సుఖపెట్టలేను ఇష్టమేనా?” అని అడుగుతారు.

“నేను చేసుకుండేది ఆస్తిని కాదు మనస్సును. నాకు శరీరంతో కూడా సంబంధంలేదు.” అంటుంది అమ్మ. ఈ సంఘటన మనకు పూర్వం లోపాముద్ర – అగస్త్యుడు, సుకన్య – చ్యవనుల వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తుంది.

“కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా ఒకరికి అర్పించడమే కళ్యాణం” అన్న సూక్తి అమ్మ స్వయంగా ఆచరించి అందించిన మహత్తర సందేశం మాత్రమే కాదు – భారతీయ వైవాహిక వ్యవస్థలోని ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని గురించి లోకానికి చేసిన ఉపదేశం. ఆధునిక వైవాహిక వ్యవస్థలోని ఒడిదుడుకులకీ ఇది అనుసరణీయ పరిష్కారం.

అంతేకాదు. వైవాహిక జీవితంలో స్త్రీ పురుషులకిద్దరికీ సమాన ప్రాధాన్యత వుందని చెప్పింది.

“భార్యకు భర్త దేవుడైతే, భర్తకు భార్య దేవత” అన్నది. ఇది కూడా అమ్మ ఆచరించిన విధానమే! అమ్మ ప్రతిరోజూ తన మంగళసూత్రాలను అభిషేకించి ఆ తీర్ధం తీసుకునేది. నాన్నగారు అమ్మకు చెప్పకుండా ఏ పనీ చేసేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా అమ్మ అనుమతి తీసుకుని, అమ్మచేత కుంకుమ బొట్టు పెట్టించుకునే వెళ్ళేవారు.

ఇలాంటి ఎన్నెన్నో ఆచరణాత్మక ప్రబోధాల ద్వారా సమాజంలో, తద్వారా ప్రపంచంలో మార్పును తీసుకురావడమే అమ్మ అవతార లక్ష్యం.

అమ్మ అవతరణ – జీవకోటి సముద్ధరణ. అమ్మ కళ్యాణం – జగత్కళ్యాణం. అదే ఈ శతజయంతి ఉత్సవాల సందేశం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!