స్వభాను నామ సంవత్సరం – కార్తీక బహుళ షష్ఠి. 1943 నవంబరు 18, తెల్లవారు జామున, నిర్మల శరదృతు వైభవంతో పులకించిన ప్రకృతి పరవశిస్తున్న వేళ, రాకా సుధాకరుడు కృష్ణ పక్షమైనా కూడా వినూత్న కాంతులతో అభ్రమండల వీధులలో విహరించి, అలసి విశ్రమిస్తున్న వేళ, మరికొన్ని క్షణాలలో ఉదయించ బోతున్న బాలార్కబింబానికి తొలి ఉషోదయ కాంతులు స్వాగత సుమాంజలి సమర్పిస్తున్న శుభసమయాన, పక్షులు కిలకిలారావాలతో సుప్రభాత గీతికలు ఆలపిస్తుండగా, మమతల గర్భగుడి తలుపులు తెరుచు కుని అవనిపై అవతరించింది మహనీయ మంజుల లలిత లావణ్యమూర్తి హైమవతీదేవి.
రసవంతమైన మామిడి చెట్టు తీయని ఫలాలనే అందిస్తుంది కాని, చేదు వేపకాయలని ఇవ్వదు కదా! విశ్వజనని, మాతృప్రేమస్వరూపిణి, అందరిచే ‘అమ్మా!’ అని పిలువబడే బ్రహ్మాండం అనసూయాదేవి గర్భంనుండి జన్మించిన హైమవతీదేవి మనోహర సుకుమార సుందర లలితాంగి. అంతకన్నా సున్నితమైన మనస్సుకల దయామతి.
“కాచన విహరతి కరుణా,
కాశ్మీరస్తబక కోమలాంగ లతా!” అని స్తుతించారు మూకకవి.
‘ఒకానొక’ కరుణ కాంచీపురంలో విహ రిస్తున్నదిట. ఆ కరుణ అనిర్వచనీయమైనది. ఆ కరుణని గుర్తించిన వారికి అర్ధమౌతుంది, అనుభవించిన వానికి వివరించనవసరం లేదు. కేవలం అనుభవైకవేద్యమైన ఆ కరుణని వివరించాలంటే సరియైన పదములు లేక ‘ఒకానొక’ కరుణ అన్నారు.
కాంచీపురంలో విహరిస్తున్న ఆ కరుణ, జిల్లెళ్ళమూడిలో విహరిస్తున్న కరుణ ఒక్కటే – ఆ కరుణే హైమ. విశ్వంలోని కారుణ్యం, ప్రేమ, దయ అంతా ఒకానొక రూపు దాల్చితే ఆ రూపం “హైమవతీదేవి”.
కారుణ్యమే గాని కాఠిన్యం లేని హృదయం, నిలువెల్లా ప్రేమే గాని ద్వేషం లేని మనస్సు, నిరంతరం జాలువారే దయ, ఇవీ “అమ్మ కన్న హైమవతీదేవి” లక్షణాలు. “అమ్మ కన్న దయామతీ” అన్న నదీరా మాటలు అక్షర సత్యాలు. ఎక్కడో పక్షి గూటిలోని గుడ్డు పొరపాటున జారి క్రిందపడితే, ఆరోజంతా విలవిలలాడి పోయి తాను అన్నం తినటం కూడా మానివేసి బాధపడే వారిని ఎక్కడైనా చూశారా? అంతటి కరుణామయి హైమ.
జన్మించిన నాటినుండీ హైమ లక్షణాలన్నీ విలక్షణంగానే వున్నాయి. ఐహిక సుఖాలపై వాంఛలేని హైమలో సహజ మాతృత్వలక్షణాలు మూర్తీభవించి వున్నాయి. శ్రీ ఎక్కిరాల భరద్వాజ అమ్మ వద్దకు వస్తే, ఆయనలో బాల్యంలోనే తల్లిని కోల్పోయిన శూన్యతను గుర్తించి హైమలోని మాతృత్వం పొంగి పొరలింది. శ్రీభరద్వాజ గారిని తానే తల్లియై లాలించింది. ప్రేమించింది. హైమ శరీరం చాలించినప్పుడు శ్రీ భరద్వాజ గారు అంటారు “నేను మరోసారి కన్నతల్లిని “కోల్పోయాను” అని.
తాను నిరంతరం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నా, అమ్మను ఒక్కసారి కూడా ఏమీ అడగని హైమ…. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చమని అమ్మను వేడుకునే హైమ…. అమ్మ కన్నా దయామతి కదా!
“నా దాకా ఎందుకు హైమా? నీవే తీర్చగలవు” అని హైమను మనకోసం త్యాగం చేసి, దేవతను చేసి, ఆలయంలో సుప్రతిష్ఠితను చేసి లోకానికి అందించింది అమ్మ.
“నీ బిడ్డకు మోక్షమిచ్చి దేవతను చేస్తాను రా!” అని అంటే ఎంతమంది ముందుకు వచ్చి తమ బిడ్డను అందిస్తారో సందేహమే!
అందుకే అమ్మకు అందరూ సమానమే అయినా తన గర్భవాసాన జన్మించిన హైమను దేవతను చేసింది. “హైమను నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే చంపుకున్నాను” అని ప్రకటించింది అమ్మ. ఆ మాటలను జాగ్రత్తగా అర్ధం చేసుకుంటే…..
హైమను దేవతగా లోకానికి అందించటం కోసమే హైమను “కన్నది”. వయసుతో పాటుగా హైమలోని దైవీ సంపదను “పెంచింది”. పాంచ భౌతికమైన దేహాన్ని నశింపచేసింది. శాశ్వతమైన దైవత్వమిచ్చి ఆలయంలో ప్రతిష్ఠించింది. నిజానికి ప్రత్యేకించి హైమను దేవతను చేయనవసరం లేదు. పరిపూర్ణమైన దైవీ లక్షణాలన్నీ హైమలో మూర్తీభవించి వున్నాయి. అమ్మ చేసిందల్లా విదేహ అయిన హైమవతీ దేవి మూర్తిలో ఆ లక్షణాలన్నిటినీ ఘనీభవింపచేసి, ప్రాణప్రతిష్ఠ చేసి లోకానికి అందించింది.
హైమను ప్రతిష్ఠ చేసి ఆలయం నిర్మించిన విధానం ఒక అపూర్వమైన ప్రక్రియ. 1968 ఏప్రియల్ 5వ తేది, చైత్ర శుద్ధ సప్తమి హైమ శరీరం చాలించింది. ఏప్రియల్ 6వ తేదీ సాయంత్రం ఎవరూ ఊహించని రీతిలో హైమను అప్పటి తన నివాసం ఎదురుగా వున్న స్థలంలో ప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభించింది అమ్మ.
అప్పటికి హైమ దేహం చాలించి ఇరవైనాలుగు గంటలు దాటినా, పార్వతీదేవి వినాయకుడిని సృజించినట్లుగా, హైమను సిద్ధాసనంలో కూర్చుండబెట్టి, శిరస్సుపై తన పాదాన్ని వుంచి, పాద అంగుష్ఠంతో చిన్నగా నొక్కగానే రుధిరధార ఒక్కసారి పైకి ఉబికింది. శరీరంలో జీవలక్షణాలు పొడసూపాయి. ఉష్ణశక్తి ఉద్భవించింది. అక్కడున్న వారు పరిశీలించి ఆశ్చర్యపోయారు. సజీవమూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేసింది. చరిత్ర ఎరుగని అనితరసాధ్యమైన ప్రక్రియ అది.
ఆ ప్రదేశంలో నేడు క్షీరశిలారూపంలో ఆలయంలో సుప్రతిష్ఠితయై వున్నది లలితా స్వరూపిణి హైమవతీ దేవి. “ హైమాలయం” లో నిత్యం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లలితా సహస్ర నామాలతో అర్చన జరుగుతుంది.
హైమ ప్రతిష్టానంతరం అమ్మ ఒకసారి కీ.శే. రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యతో అన్నది- “హైమాలయంలో పదకొండు రోజులు అభిషేకం చేసుకున్నా, నలభై రోజుల పాటు రోజుకు పదకొండు సార్లు లలితా సహస్రనామ పారాయణం చేసుకున్నా, అభీష్టాలు నెరవేరతాయి” అని. ఆయనను నిమిత్తం చేసుకొని లోకానికి అందించిన సందేశం అది. ఆ విధంగా కామితార్థాలు నెరవేర్చుకున్న సోదరీ సోదరులు ఎందరో వున్నారు.
హైమవతీదేవి జయంతిని పురస్కరించుకుని, గత నాలుగు దశాబ్దాలకు పైగా ప్రతి సంవత్సరం కార్తిక బహుళ షష్ఠి నాడు లలితా కోటి నామ పారాయణ కార్యక్రమం సంప్రదాయంగా వస్తున్నది. ఈ సంవత్సరం నవంబరు 14 కార్తీక బహుళ షష్ఠి, హైమవతీ దేవి 80వ జన్మదిన సందర్భంగా జరిగే లలితా కోటి నామ పారాయణ కార్యక్రమంలో సోదరీ సోదరులందరూ పాల్గొని అమ్మ, హైమ, నాన్న గార్ల అఖండ ఆశీస్సులు పొందెదరు గాక!
– డి వి యన్ కామరాజు