లోకకల్యాణం కోసం అవతరించిన అమ్మ తన కల్యాణ దినోత్సవమైన మే 5 నాడే శ్రీ అనసూయేశ్వరా లయ శంకుస్థాపన వంటి ఎన్నో దివ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
అవతారమూర్తి, జ్ఞానస్వరూపిణి, తత్త్వవేత్త, ‘అన్ని నేనులు నేనైన నేను’ అని ప్రవచించిన, పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మ వివాహం చేసుకోవడంలోని అంతర్యం ఏమిటి?సాధారణంగా వివాహాన్ని పరమార్థ సాధనకు సోపానంగా చెబుతారు. పరమాత్మే తానైన అమ్మకు చేయవలసిన సాధన అంటూ ఏముంటుంది? అంతేకాదు “సృష్టి అనాది, నాది. నేను అమ్మను, నీకు, మీకు, అందరికీ అన్నింటికీ” అంటూ లోకాన్నే బిడ్డగా భావించగలిగిన అమ్మకు ఈ వివాహ ప్రక్రియతో నిమిత్తమేముంటుంది? అనేది ఎందరిలోనో ఉదయించే ప్రశ్న.
అమ్మ ప్రత్యేకతను విశిష్టతను గుర్తించిన అమ్మ చినతాతగారైన చిదంబరరావుగారు అమ్మతో ‘నీకీ పెండ్లి ఎందుకమ్మా?’ అని అడిగితే లోకంలో ఉన్న కష్టాలన్నింటినీ భరిస్తూ, సంసార జీవితం ఎలా సాగించాలో లోకానికి నేర్పడం కోసమేననీ, అన్నీ అనుభవిస్తూ మనసుకు ఏదీ అంటకుండా ఉండటం సాధ్యమే అని నిరూపించడానికేననీ, పెళ్ళిలో పెద్దపులి ఉందని భయపడే వారి భయం పోగొట్టడానికే తాను వివాహం చేసుకుంటున్నట్లుగా అమ్మ చెప్పింది. రాముడు, కృష్ణుడు మొదలయిన అవతారమూర్తుల జీవితాలను పరిశీలించినా వారు నిండుగా గృహస్థ జీవితాన్ని సాగించినట్లుగా తెలుస్తోంది. అనంతమైన శక్తి పరిమిత రూపంలో అవతరించడం లోక కల్యాణం కోసమే. సమాజ రక్షణ కోసం అమ్మ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో గృహస్థాశ్రమ స్వీకారం ఒకటి.
ఈనాటి సమాజ పరిస్థితిని బట్టి లుప్తమైపోతున్న ప్రేమతత్త్వాన్నీ, మానవత్వాన్నీ పునరుద్ధరించడం కోసం వివాహ వ్యవస్థలో కనుమరుగైపోతున్న విలువలను పరిరక్షించడం కోసం వైవాహిక బంధంలో ఉన్న పరమార్థాన్ని బోధించడం కోసం అమ్మ అవతరించింది. తాను అసాధారణ స్థితిలో ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తివలెనే వివాహం చేసికొని గృహస్థాశ్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియ చేసింది. ఇల్లాలుగా కోడలుగా తల్లిగా అనేక భూమికల్లో తన కర్తవ్యాన్ని ఎంతో సహనంతో నిర్వర్తించింది.
అమ్మ దగ్గరకు ఎందరో స్త్రీలు వస్తూ ఉండేవారు. ఈ సంసారంలో చిక్కుకుని ఏమీ ఈ సాధించలేకపోతున్నాం, తరించడానికి మాకేదయినా మార్గం చెప్పమని ప్రార్థించేవారు. కానీ, అమ్మ ఎప్పుడు చెప్పినా తన అనుభవం నుంచే చెప్పింది. ‘ఏ భగవంతుని ఆరాధిద్దాం, ఏ భక్తి మార్గాన్ని అనుసరిద్దాం’ అని ఆలోచింపక భర్తనే దైవంగా పూజించి, ఆరాధించమనీ భర్తను సేవించి ఎంతటి మహాకార్యాన్నైనా సాధించవచ్చనీ, స్త్రీలందరికీ అమ్మ ఆచరణాత్మకమయిన ప్రబోధాన్ని అందించింది.
అమ్మ గొప్పతనాన్ని ఎవరయినా అమ్మ ఎదుట ప్రస్తావిస్తే “నాదేముంది, నాన్నా! నాకు నా భర్తను సేవించడం తప్ప మరేమీ తెలియదు” అనేది. అమ్మ అనుదినం తన గళసీమను అలంకరించిన మంగళసూత్రాలను అభిషేకించి, ఆ తీర్థం స్వీకరించేది. ఆ తీర్ధం తీసుకున్నందు వలననే ఇతరులకు తీర్థం వేసే అర్హత తనకు వచ్చిందని చెప్పింది. వివాహ సందర్భంగా అమ్మ లోకానికి అనేక నిర్వచనాలను ప్రసాదించింది. “కళంక రహితమైన మనస్సును కళంక రహితంగా అర్పించడమే కల్యాణం” అనీ, “ఒక పెన్నిధి అండన చేరడమే పెండ్లి” అనీ. సాధారణంగా పెన్నిధి అండన చేరడం అంటే స్త్రీ భర్త అండన చేరడం అని అర్థం చేసుకుంటాం. కానీ అమ్మ దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరికీ సమప్రాధాన్యమే. ఇక్కడ పెన్నిధి అంటే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి చేసే వైదిక సంస్కారమే పెండ్లి. సమాజంలోని సర్వధర్మాలకు కేంద్ర బిందువు గార్హస్యం. పెన్నిధిని (గృహస్థాశ్రమాన్ని) ఆధారం చేసుకుని స్త్రీ పురుషు లిద్దరూ ధర్మాచరణ చేయాలని, గృహస్థాశ్రమమే కర్తవ్య నిర్వహణకు, సమాజసేవకు ఆధారమని పై నిర్వచనం ద్వారా సందేశాన్ని అందిస్తున్నది అమ్మ.
అలాగే “సర్వాన్నీ అనుభవిస్తూ, సర్వాన్నీ విడిచిపెట్టేదే వివాహం” అని వివాహానికి అమ్మ ఇచ్చిన మరొక నిర్వచనం. బాహ్యంగా గృహిణి అయినా, ఆచరణలో అతీతమైన స్థితి అమ్మది. అమ్మ జీవితంలో ఇది కావాలనీ లేదు, ఇది అక్కరలేదనీ లేదు. ఏది తటస్థపడితే అదే స్వీకరించింది. అమ్మ తనదంటూ సంసారం వుండి, తనకంటూ పిల్లలుండి, తాను సంసారంలో వుండి, దానికి అతీతంగా ఉన్నది. నీటిలోకి దిగిన గజ ఈతగాడైనా, నీటి తడి అంటకుండా బయటకు రాలేడు గదా! కానీ, అమ్మ తాను సంసారంలో వుండి, దానికతీతంగా వుండి “తాను సంసారంలో వుండవచ్చు కానీ, తనలో సంసారం వుండకూడదు” అని లోకానికి ఆచరించి చూపింది.
అంతేకాదు, ఆధ్యాత్మిక సాధనకు సంసారం బంధకారణమని అభిప్రాయపడేవారికి ‘చేసేదంతా భగవత్సేవ అనుకుంటే’ సంసారం ఆధ్యాత్మిక సాధనకు అడ్డు కాదనీ, సంసారం పట్ల మనకున్న ఆలోచనాధోరణే బంధానికి కారణమనీ, భావబంధమే తప్ప భవబంధం లేదన్న సత్యాన్ని ఆవిష్కరించింది. అమ్మకి లౌకికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. లౌకిక జీవితానికీ, ఆధ్యాత్మిక సాధనకూ వారధి నిర్మించిన సమన్వయ సారధి అమ్మ.
ఆధ్యాత్మిక సాధన అంటే వేరే ఏదో కాదు, మనం చేసే ప్రతీ పనినీ భగవంతుని సేవే అనుకోగలిగితే, భగవంతుని ఇచ్చగా అనుకుని చేయగలిగితే ఈ సంసారం ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం కానే కాదు. అంటే మన దృష్టిని, భావనను ఈ రకంగా మలచుకుని మసలుకోవడమే మనం చేయవలసినది.
‘ఆధ్యాత్మిక జీవితం ప్రసాదించమ్మా’ అని అడిగిన ఒక సోదరునితో “ఆధ్యాత్మిక జీవనం ప్రత్యేకంగా ఉందని అనుకోవడం లేదు. నీవు చేసే ప్రతి పనీ దైవకార్యమే. జగత్తే దైవ స్వరూపం అయితే నీవు చూసేది ఏది దైవం కాదు, నీవు చేసేది ఏది ఆధ్యాత్మికం కాదూ?” అని అమ్మ ప్రబోధించింది.
ఒక సోదరితో “వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురైతే వాటిని సహనానికి శిక్షణగా భావించు. నీవు పసిబిడ్డలను సాకేటప్పుడు బాలకృష్ణుడనే దృష్టితో చూడు, ఆ దృక్పథంతోను పెంచు, వాళ్ళకు స్నానం చేయించేటప్పుడు, భగవంతుడికి అభిషేకం చేస్తున్నాను అనుకో, ఆ విధంగా గృహస్థ జీవితమంతా అనితరమైన, విశుద్ధమైన సాధనగా మారుతుంది” అనీ, “సంకల్పమే సంసారము” అనీ, “సంసారంలో వుండి సాధన చేయటం కోటలో వుండి యుద్ధం చేయడం” అనీ వివాహాన్నే తరణోపాయంగా చూపింది అమ్మ. దినచర్యను దేవునికి అర్బనగా నిర్వహించటమే మానవజీవితానికి పరమార్థం అని అమ్మ ప్రబోధం.
భారతీయ కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైంది భార్యాభర్తల బంధం. ఇది తల్లివేరు లాంటిది. ఆ తల్లివేరే లేకపోతే ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు ఉన్నా ఆ చెట్టుకు ఆ ఉనికి ఏముంది? అసలు వివాహం అంటేనే ఇద్దరు వ్యక్తులు, భిన్న పరిస్థితులు, భిన్న అభిరుచులు అలవాట్లతో కలిసి జీవించాలి. దీనికి ఎంతో సహనం సర్దుబాటు మనస్తత్వం కావాలి. భార్యాభర్తల మధ్య సమన్వయ ధోరణికావాలి. సమన్వయం లేకపోతే సంఘర్షణ తప్పదు. నేటికాలంలో పాశ్చాత్యపోకడల వలన భార్యాభర్తలు ఒకరి అంతరంగాన్ని మరొకరు అర్థం చేసుకోలేక, అలానే పరస్పరం బాధ్యతగా మెలగలేక వారిరువురి మధ్య అభిప్రాయ భేదాలు చోటుచేసుకుని విపరీత పరిణామాలకు సైతం దారితీస్తున్నాయి.
అందుకే అమ్మ ‘భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య’ అనీ, బాధ్యత తెలుసుకుని ప్రవర్తించే వాడు భర్త అనీ నిర్వచించింది. సామాజికంగా గాని, వ్యక్తిగతంగా గాని సమాజంలో వివాహం అతి కీలకమైంది. వివాహం కేవలం ఆ స్త్రీ పురుషుల జీవితాలకే పరిమితమై ఉండదు. తరతరాల సంప్రదాయాన్ని, వంశగౌరవాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. ఈ వివాహం ద్వారా ఏర్పడిన అనుబంధం జీవితాంతం అవిచ్ఛిన్నంగా సాగిననాడే ఆ కుటుంబం ఆదర్శంగా నిలుస్తుంది. కనుక అమ్మ చెప్పినట్లుగా భార్యాభర్తలు ఒకరి భావాన్ని ఒకరు గుర్తెరిగి, పరస్పరంబాధ్యతతో నడుచుకుంటే అది అనుకూల దాంపత్యం అవుతుంది. అటువంటి వివాహ వ్యవస్థ సర్వాంగీణంగా శోభిల్లుతుంది. వైవాహిక బంధానికి కట్టుబడి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించిన నాడు ఆదర్శ సమాజం ఏర్పడుతుంది.
మరొక సందర్భంలో భార్యాభర్తల బంధాన్ని గురించి ‘భార్యకు భర్త దేవుడయితే, భర్తకు భార్య దేవత’అని సమన్వయాత్మకంగా సమానత్వాన్ని సంపూర్ణ త్వాన్ని ప్రబోధించింది. అమ్మ దృష్టిలో వివాహం అంటే సమర్పణ అని. మరొకసారి ‘తలవంచి తాళి కట్టించుకునేది భార్య’ అనీ, ‘నడుం వంచి తాళి కట్టేవాడు భర్త’ అని చెప్పి, ఇద్దరికీ సమామైన బాధ్యత ఉన్నదని సూచించింది. చిన్నతనంలోనే అమ్మ తన ప్రబోధం ద్వారా ఎంతోమందిని సంస్కరించి వారి సంసార జీవితాలను చక్కబెట్టింది. నిత్యజీవిత నిర్వహణ సక్రమంగా సాగించడమే ఆధ్యాత్మిక సౌధానికి సోపానమని అమ్మ సందేశం.
లౌకిక జీవితాన్ని ధర్మబద్ధంగా నిస్వార్థంగా నిష్కళంకంగా నిర్వహిస్తే అది ఆధ్యాత్మికమే అవుతుంది అని ఆచరణాత్మకంగా చూపింది అమ్మ.
“నా జీవితమే సందేశం” అని చెప్పిన అమ్మ వైవాహిక జీవితం ఆదర్శానికీ, ఆచరణకూ మధ్య సమన్వయాన్ని అందిస్తూ మనకు దర్పణమై నిలుస్తోంది. ‘అద్వైతం సుఖదుఃఖయోః’ అన్న దాంపత్య ధర్మం రక్షింపబడబడాలన్నా, వివాహం ద్వారా మన ఆర్ష సంప్రదాయం ఏం ఉద్దేశించిందో అటువంటి ఆదర్శ సమాజం ఏర్పడాలన్నా అమ్మ జీవితమే మనకు ఆదర్శం. అమ్మ ప్రబోధించిన మార్గాన్ని అనుసరించి, అదే ఒరవడిలో ముందుకు సాగితే అమ్మ ఏ పరమార్థాన్ని బోధించడం కోసం వివాహం చేసుకున్నదో ఆ ప్రయోజనం నెరవేరుతుంది.
జయహో మాతా!!!
బి లక్ష్మీ సుగుణ