అనంతమైన కాలవాహినిలో వంద సంవత్సరాలు త్రుటిప్రాయమే కావచ్చు. మనిషి జీవనయానంలో ఆ కాలం దాని ప్రభావం అనల్పమని అంగీకరించక తప్పదు. అమ్మ అవనిపై నడయాడిన మహత్తర సన్నివేశాన్ని స్మరించుకొంటూ శత జయంతి ఉత్సవాలను అయిదురోజుల పండుగగా అంగరంగవైభవంగా నిర్వహించుకున్నాం. అంబరాన్ని తాకే జిలుగు వెలుగుల తోరణాలు, మహనీయుల సందేశాలు, సమధికోత్సాహంతో సాగిన గ్రంథావిష్కరణలు అమ్మబిడ్డలు అంతరంగాలలో చెరగని ముద్రవేశాయి. ఈ జన్మకిది చాలు అన్నంతటి తృప్తిని, ఆనందాన్ని కలిగించాయి అనటంలో సందేహం లేదు. ‘ఉత్సవప్రియాః ఖలు మానవాః’ అంటాడు – మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో. అయితే ఏ ఉత్సవమైనా సంరంభానికి సంబరానికి పరిమితం కాకుండా వినూత్నమైన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అందించి కరావలంబనమై కర్తవ్యపథంలో నడిపించాలి.
‘ఇది నిత్య ప్రస్థానం – ఎగుడు దిగుళ్ళు తప్పవు
ఇది నిత్య ప్రయోగం – ఎదురు దెబ్బలు తప్పవు’
– అన్నాడొక దార్శనికుడైన కవి. ఎగుడు దిగుళ్ళూ ఎదురు దెబ్బలు తలచుకొని ఆగిపోతే ముందుకు సాగలేం. వ్యక్తి జీవితానికి, సామాజిక ప్రగతికీ వర్తించే నిత్యసత్యమిది.
‘గతానికి వర్తమానం భవిష్యత్తు – భవిష్యత్తుకు వర్తమాన గతం’ అన్న అవగాహనతో నిన్న నేడు రేపు ప్రాతిపదికగా సరికొత్త ఆలోచనలను అనుభవాలతో సమన్వయించుకుంటూ నవశకానికి నాంది పలుకవలసిన తరుణమిది. ‘అమ్మశక మిక మొదలు’ అన్న విబుధుల అంతరంగాన్ని, ఆలోచనలను సమీక్షించుకొని అమ్మ ఆశయసాధనకు సంస్థల నిర్వహణకు స్పష్టమైన ప్రణాళికారచనతో ముందుకు సాగినపుడే ఈ మలుపును గెలుపుగా మలచుకొనగలం. ఉత్సవం అయిదురోజులే అయినా అది అందించే స్ఫూర్తి అయిదు తరాలను ప్రభావితం చేయగలగుతుంది.
గతాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే భౌతికంగా అమ్మ పెట్ట కోట అందరికీ అన్నింటికీ ఆనాడు. అమ్మ అనంతత్వంలోకి అడుగిడి భౌతికంగా కనుమరుగైన ఈనాడు అమ్మపట్ల భక్తి అంటే – అమ్మ అడుగుజాడలలో నడవాలనే అనురక్తే. సమతా మమతలు భూమికగా సాగే అమ్మ ఆశయాలే ఊపిరిగా పరిక్రమించటం మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం. నింగిని తాకే నూరంతస్థుల భవనానికైనా పునాదులే ఆధారం అన్న విషయం విస్మరింపరానిదని గుర్తించి ఆచితూచి అడుగు వేయవలసిన సమయమిది. అర్చన చేసినా, అభిషేకం చేసినా, వడ్డన చేసినా, ప్రసంగం చేసినా, పారాయణ చేసినా, సందేహం తీర్చినా, సందేశం ఇచ్చినా, నామం చేసినా, కావ్యం వ్రాసినా మన ఆలోచనలు ఆచరణ అమ్మ పదముద్రలపై పరిఢవిల్లుతున్నాయా? అన్నదే గీటురాయి. ఎప్పుడయినా అంతరంగంలో ఆ పావన పదస్పర్శ మసకబారితే సైకత శ్రేణులలో గోపికలమై అన్వేషించాలి. అలమటించాలి. తపించాలి. తరించాలి.
‘భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం’ అని చెప్పిన అమ్మే ‘భిన్నత్వం సృష్టిధర్మ”మని చెప్పింది. మన చేతి వేళ్ళయినా ఒకే పరిమాణంలో వుంటే పిడికిలి బిగించలేక ఇబ్బంది పడతాం. వైరుధ్యం లేని వైవిధ్యం ఇంద్రధనుస్సులా ఇంపు నింపుతుంది అనేది అందరికీ అనుభవమే. ఆంతరమైన వైవిధ్యాన్ని స్వాగతిద్దాం! ‘సామాజికత లేని ఆధ్యాత్మికత రేవు లేని కాలువవంటిది’ అని చెప్పి, అమ్మ ‘మీరు నా బిడ్డలే కాదు నా అవయవాలు’ ‘మీరు కానిది నేనేవీ కాదు’ అన్నది. ‘నువ్వెవరమ్మా?’ అంటే ‘నువ్వే నాన్నా!’ అని బదులిచ్చిన అమ్మకు మనపట్ల ఉన్న అద్వైత భావన తెలిసినదే. మనకు అమ్మలా – అమ్మగా ఆలోచించే అవలోకించే శక్తి నిమ్మని అమ్మ పద మంటి ప్రార్థిస్తూ అమ్మ చూపిన దారిలో మనం ఒక్క అడుగు వేసినా తల్లి కదా ముచ్చటపడుతుంది. మురిసి పోతుంది. శతజయంతి సందర్భంగా మనకు మనమే నిర్దేశించుకున్న లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధితో పునరంకితమవుదాం!!!
– యు. వరలక్ష్మి
—
పుష్కరానికి ఒక్కసారి వచ్చే అనసూయేశ్వరాలయ కుంభాభిషేకానికి ఆహ్వానము
సాక్షాత్తు ఆదిదంపతులైన అమ్మ నాన్నగార్లు సుప్రతిష్ఠితులైన మహిమాలయం అనసూయేశ్వరాలయం. ఏటా మే 5 న అమ్మ అనసూయేశ్వరాలయ ఉపరిభాగాన అసంఖ్యాకంగా గుమ్మడికాయలు, కొబ్బరి కాయలు కొట్టి, పసుపు – కుంకుమలు వెదజల్లి ఆలయానికి పరిపుష్టిని చేకూర్చేది. ఆగమశాస్త్ర రీత్యా ఆలయానికి 12 ఏళ్ళకు ఒకసారి కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆలయ వాస్తు శాస్త్ర రీత్యా ఆలయశిఖరం అంటే అర్చామూర్తి శిరస్సు. ఆ సంప్రదాయాన్ని అనుసరించి 14 జూన్ 2023 జ్యేష్ఠ బహుళ ఏకాదశి బుధవారం (14-6-2023) న అనసూయేశ్వరాలయ శిఖరానికి వేదోక్తంగా పంచామృతాలతో పవిత్ర నదీనద తీర్థాలతో సుగంధద్రవ్యాలతో కుంభాభిషేకం నిర్వహించబడుతుంది. అమ్మ మూలవిరాట్కు సహస్ర ఘటాభిషేకం నిర్వహించ బడుతుంది. ఈ పవిత్ర క్రతువునందు సోదరీ సోదరులందరూ పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కాగోరుచున్నాము.
- శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్, జిల్లెళ్ళమూడి.