డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మ గారు “శృంగారలహరి” స్తోత్రరాజంలో అమ్మ విరాడ్రూపాన్ని వర్ణిస్తూ- ‘శరీరే తే మాతః వసతి సకలా దేవ పరిషత్
త్వదంఫ్రి స్పృష్టాంభసి అమల సురగంగా విజయతే’. (శ్లో-86)
‘త్వ మాధారాధరః త్వమసి విధిహేతుః విధి రపి
అహో! మూల స్యాపి త్వం అసి ఖలు మూలం శివకరి!’ (శ్లో-111)
అమ్మా! నీ దివ్య శరీరంలో దేవతాగణములు నివసిస్తున్నాయి.
నీ పాదపద్మములలో గంగానది ప్రవహిస్తోంది.
నీవు ఆధారమునకు ఆధారము; విధి-విధానములను నిర్దేశించే విధి.
నీవు మూలమునకు మూలము” అని బహువిధాల కీర్తించారు. అట్టి వాస్తవాలను వివరించే ఉదాహరణలు అనేకం.
దైవత్వాన్ని, అద్వైతసిద్ధిని ప్రసాదించిన అమ్మ దేవతలకు దేవత. అమ్మ చేతి గోరుముద్దలు తిని శ్రీ విశ్వంజీ విశ్వయోగి అయ్యారు, కేవలం దృష్టి ప్రసారమాత్రం చేత మూగజీవులు యోగపరాకాష్ట స్థితులను పొందాయి.
అమ్మ పావన పాదతీర్థమహిమ నిరుపమానమైనది. ఆయుష్షునూ, సంపదలనూ, శాంతి సౌఖ్యాలనూ, జ్ఞానవైరాగ్యాలనూ ప్రసాదించింది.
ఆధారానికే ఆధారం అమ్మ. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, దానిని అమ్మ తెలుసుకున్నది. తనను అంతటా, అంతటినీ తనలో దర్శించి తాదాత్మ్యం చెందింది. లాలన, పాలన, పోషణ, రక్షణ, శిక్షణ, సముద్ధరణ – అమ్మ అవతార లక్షణాంశాలు.
– విధి-విధానాన్ని నిర్దేశించే విధి అమ్మ. ఒక్క ఉదాహరణ చెప్పక తప్పదు. శ్రీ కె. రామచంద్రారెడ్డి గారు అమ్మను సర్వాత్మనా ఆరాధించారు. వారి తమ్ముడికి వివాహమైన 4 సంవత్సరాలకు అబ్బాయి పుట్టాడు. ఆ బాబుకి రెండున్నర సంవత్సరాల వయస్సులో Brain Fever వచ్చింది. ఆస్పత్రిలో కొనఊపిరితో ఉన్నాడు. రెడ్డిగారు అమ్మ ఫోటో ముందు నిల్చుని, అంజలి ఘటించి కన్నీళ్ళతో ఆ బిడ్డను కాపాడమని ప్రార్థించారు. మర్నాటి ఉదయానికి ఆ బాబు నార్మల్ కి వచ్చాడు.
Discharge చేసే సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఒక ప్రశ్న వేశారు. “మీ బంధువులెవరైనా Nurse Training అయిన వారున్నారా? తెల్లగా, లావుగా ఉండే ఒక Nurse పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని రాత్రి అంతా బాబుని ఒళ్ళో పెట్టుకుని సేవ చేసింది” అని. అమ్మ స్వయంగా వచ్చి ప్రాణం పోసింది, విధాతరాతను తిరగరాసింది. అనేది వారికి అనుభవం నేర్పిన పాఠం; విశ్వాసం. –
అమ్మ మూలమునకు మూలము: అమ్మకు స్వపర భేదం లేదు. ఆశ్రిత పక్షపాతం లేదు. చరిత్ర ఎరుగని ఒక అమోఘ వరదానం చేసింది – “నమ్మినా – నమ్మకపోయినా, నమస్కరించినా – నమస్కరించకపోయినా – అందరికీ సుగతే” – అని. “సృష్టేదైవం” – అని సృష్టికీ సృష్టికర్తకీ అభేదత్వాన్ని ఆవిష్కరించింది. “సంకల్పరహితః అసంకల్పజాతః”, “సృష్టికి కారణం అకారణం” అని సృష్టి ఆవిర్భావక్రమాన్ని విస్పష్టం చేసింది. “సృష్టిలో నేను కానిదీ, నాది కానిదీ లేదు” అని ప్రకటించింది.
శ్రీ కొమరవోలు గోపాలరావుగారితో “నాన్నా! విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఒక గంపలో పోసిన పండ్లులాగ కనిపిస్తాయి” అన్న విశాలాక్షి అమ్మ. “నాకు భూతభవిష్యద్వర్తమానములు అనే త్రికాలములు లేవు. అంతా వర్తమానమే” – అన్న కాలాతీతమహాశక్తి అమ్మ.
శ్రీ రాజుబావ, గోపాలన్నయ్య వంటి అనేకులకు అమ్మ ‘విశ్వరూప సందర్శన’ భాగ్యాన్ని ప్రసాదించింది. పరిమిత రూపంగా ఉన్న అనసూయమ్మను అనంతశక్తిగా దర్శించగలిగారు. “మీరు (స్థావర అంటే జంగమాత్మక సకల జగత్తు) నా బిడ్డలే కాదు, నా అవయవాలు” అనే ఒక్క అమ్మ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటే ‘అమ్మ విశ్వరూపవైభవం’ సుబోధకం అవుతుంది.
ఒక ఏడాది శరన్నవరాత్రి పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అందు భాగంగా అమ్మ త్రిశూలాది ఆయుధాలను ధరించి మహాలక్ష్మీదేవిగా దర్శనం ఇచ్చింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సోదరుడు, “అమ్మా! లక్ష్మీదేవి త్రిశూలం ధరించదు కదా!” అన్నారు.
అమ్మ శైవమా? వైష్ణవమా ? సౌరమా ? శాక్తేయమా ? గాణాపత్యమా ? ఏది అవును ? ఏది కాదు? కనుకనే అమ్మ, “నాన్నా! ఒకరితో పోలిక ఏమిటి?” అని తిరిగి ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానం లేదు మన వద్ద. స్వయంప్రకాశమైన, అద్వితీయమైన, అవాజ్మానస గోచరమైన, మూలకారణశక్తి అమ్మ, ఆద్య, సర్వాధార, విశ్వసవిత్రి, విశ్వరూప – సంపూర్ణత్వం.