“ఈ కలిలో నా కాకలి లేదు”అని చెప్పిన “అమ్మ” “అన్ని బాధలకంటే ఆకలి బాధ ఎక్కువ” అని ప్రకటించి, తన బిడ్డలందరి ఆకలికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. ‘డ్రస్సూ, ఎడ్రస్సూ కాక ఆకలే అన్నం పెట్టటానికి అర్హత’ అని ప్రకటించింది.
నిజమే కదా! కూటికి లేని నిరుపేద నుంచీ, కొండంత ఆస్తి ఉన్న కోటీశ్వరుడి వరకూ అందరికీ ఆకలి సమానమే.
“అమ్మ” జీవిత చరిత్రను గమనిస్తే, ఇంటిలో తనకు పెట్టిన ఆహారాన్నీ ఆ వీధి చివరి బిచ్చగాళ్లకు పెట్టటం, గుడిలో ప్రసాదంగా ఇచ్చిన పెసరపప్పుతో పచ్చడిచేసి, పనిపాటలు చేసుకునే పేదవారికి అన్నంలో ఆధరువుగా అందించటం వంటి సన్నివేశాలు కోకొల్లలు.
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదరించటం “అమ్మ”కు పుట్టుకతో వచ్చిన గుణం అనిపిస్తుంది. అసలు “అమ్మ” పుట్టుకే ఇందుకోసం అని కూడా మనకు అనిపిస్తుంది. అన్నపూర్ణాలయం ప్రారంభించటానికి ముందే “అమ్మ” ప్రతి ఇంటినుంచి ప్రతిరోజూ గుప్పెడు బియ్యం దాచిపెట్టే పథకం ప్రకారం అవసర సమయాల్లో అన్నార్తుల ఆకలి బాధను తీర్చే ఆలోచన చేసింది. కొంతవరకు అమలుచేసింది కూడా.
“అమ్మ” ఆలోచన లెప్పుడూ సాటివారి ఆకలిని గురించే సాగుతూ ఉంటాయి. అందుకే ‘మీకు వచ్చే ఆలోచనలు ఎటు వంటివి?’ అని ప్రశ్నించిన ఒకరితో “మీకు పెట్టు కోవాలనిపించేటటువంటివి-” అని తిరుగు లేని సమాధానం ఇచ్చింది.
‘మీకు కోరికలు లేవా?’ అని అడిగిన మరొకరితో “ఎందుకు లేవూ? మీకు పెట్టుకోవాలి అనుకోవడం కోరికే కదా!” అని ఎదురు ప్రశ్న వేసింది. ‘అమ్మా! నీకేమనిపిస్తోంది?’ అనే ప్రశ్నకు “నువ్వు అన్నం తినలేదు. తినాలనిపిస్తోంది” అని సమాధానం ఇచ్చింది. వీటిని గమనిస్తే మనకు ఒక విషయం అర్థం అవుతుంది. మనకు పెట్టుకోవడంలోనే “అమ్మ”కు ఆనందం, తృప్తి ఉన్నాయి అని.
“అడగకుండానే పెట్టేది అమ్మ” అని కొత్త నిర్వచనాన్ని అందించిన “అమ్మ”ను తన స్వర్ణోత్సవ వేడుకల్లో..
“లక్ష మంది ఒకే పంక్తిలో భోజనం చేస్తుంటే చూడాలని ఉంది” అనే వింత కోరికను వెల్లడించింది. ‘లక్షమంది తిన్నప్పటికీ ఒక్కడు తినకపోతే’ “అమ్మ” మనసు గిలగిల లాడేది. “ఒక్కడు చాలడూ తినకుండా వెళితే” అని బాధ పడేది.
“మీరు తింటే నేను తిన్నట్లే”, “మీకు పెట్టుకోకపోతే నేను చిక్కిపోతాను” అని మన కడుపు నింపటానికి ఆరాట పడిన తల్లి…. “నీ కున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో”….అని మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రసాదించింది.
“నిత్యాన్నదానం అంటే రోజూ అన్నం పెడుతున్నామని కాదుగా? ఎప్పుడూ అన్నం పెట్టాలని”.. అని అన్నపూర్ణాలయ ప్రధాన ఉద్దేశాన్ని నిర్ద్వంద్వంగా నిర్దేశించింది. అంతేకాదు. ఏదో పెట్టా మంటే పెట్టాం అన్నట్లు కాక… “వచ్చే వారందరికీ ‘ఆదరణ’ అనుపాకంగా చేసి పెట్టాలి. గుండిగ దిగితే గుండిగ ఎక్కాలి. ఎప్పుడు వచ్చిన వాడికైనా తీరిక లేదనుకుండా అన్నం పెట్టాలి”……అని అన్నపూర్ణాలయం ఏర్పాటు లోని ఆంతర్యాన్ని తేటతెల్లం చేసింది.
“నా రాశి బియ్యపు రాశి”… అని స్పష్టంగా చెప్పిన “అమ్మ” ఒక ఆదర్శం కోసమే అన్నపూర్ణాలయం స్థాపించింది.
అందుకే… ఆ ఆలయ నిర్వహణ నిర్విఘ్నంగా, నిర్విరామంగా, దిగ్విజయంగా కొనసాగేటందుకు ధాన్యాభిషేక కార్యక్రమాన్ని రూపొందించారు కార్యకర్తలు.
“అమ్మ” ఇక తన భౌతికరూపాన్ని ఉపసంహరించుకోవాలనుకున్న సమయంలో తీవ్ర అనారోగ్యం “అమ్మ”లో కనిపించింది. “అమ్మ”కు సెలైన్ పెట్టాలని డాక్టర్లు వచ్చారు. “అన్నపూర్ణాలయం నా గుండెకాయ. దానికి సెలైన్ పెట్టండి” అన్నది “అమ్మ”.
“అమ్మ” హృదయమే అన్నపూర్ణాలయం.
ఆ తల్లి గుండె చప్పుడే ఆ ఆలయంలోని ఘంటా రావం. ఆ గంట వినబడుతూ ఉన్నంతకాలం “అమ్మ” గుండె చప్పుడు మనం వింటూనే ఉంటాం. ఆ ఆలయంలోని అన్నపురాశిలో “అమ్మ”ను కన్నుల పండుగగా దర్శిస్తూనే ఉంటాం.
1958 ఆగస్టు 15 న “అమ్మ” తన సువర్ణ హస్తాలతో ప్రారంభించిన అన్నపూర్ణాలయం మరింత వైభవంగా నిరంతరాయంగా కొనసాగేలా అనుగ్రహించ వలసిందిగా “అమ్మ”ను వేడుకుంటూ….
జయహెూమాతా…