జిల్లెళ్ళమూడిలో అడుగు పెట్టగానే అమ్మ నివాస మందిరం మనకు కనువిందు చేస్తుంది. ఆ మందిరానికి ఉన్న ‘అందరిల్లు’ అనే పేరు మనస్సును పులకింప చేస్తుంది. తన నివాసానికి ”అందరిల్లు’ అని ఎవరు పేరు పెట్టగలరు? అందరికీ, అన్నింటికీ, సర్వ సృష్టికీ జన్మ నిచ్చిన అమ్మకే అది సాధ్యం.
సర్వసాధారణంగా ఆధ్యాత్మిక గురువులు, ప్రవక్తలు నివసించే భవనాలకు ఆశ్రమం అనో, పీఠం అనో, మఠం అనే పేరు ఉంటుంది. అలాకాక అమ్మ తన ఇంటిని అందరిల్లు చేసింది.
తన ఇంటికి అందరిల్లు అని పేరు పెట్టడంలో అమ్మ ఆంతర్యం ఏమిటి? లోకోత్తరమైన ఒక దివ్య భావనకు సంకేతం ఈ పేరు అనిపిస్తుంది.
అందరి ఇల్లు అనేది ఈ లోకంలో ఏదైనా ఉంటుందా! ఉంటే, అది ఏమై ఉంటుంది? ఈ సమస్త విశ్వమే కదా! అందరికీ ఇల్లు.
“నేను దైవాన్ని కాను- మీరు భక్తులూ కారు. నేను గురువును కాను – మీరు శిష్యులూ కారు. నేను అమ్మను – మీరు బిడ్డలు.
నేను అమ్మను నీకు, మీకు, అందరికీ. పశుపక్ష్యాదులకు, క్రిమి కీటకాదులకు కూడా” అని స్పష్టంగా ప్రకటించింది అమ్మ. అందుకే
“భక్తి సంబంధ మన ఫక్కున నవ్వావు,
రక్త సంబంధమని అక్కున చేర్చావు”
అని అమ్మ సన్నిధిలో పరవశించి పాడుకున్నారు కవులు.
తాను విశ్వజనని కనుక, సృష్టి అంతా తన సంతానమే కనుక తన ఇల్లు ‘అందరిల్లు’ కాక మరేమవుతుంది? అని అమ్మకు అనిపించింది కాబోలు.
“నాకు ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తుంది నాన్నా!”,
“నేనే మీ అందరినీ కని మీ మీ తల్లులకు పెంపుడిచ్చాను అనిపిస్తుంది” అని చెప్పింది అమ్మ. అందుకే అమ్మ అందరికీ అమ్మ.
ఆ ఇల్లు ‘అందరిల్లు’.
“ఎల్ల లోకము ఒక్క ఇల్లె
వర్ణ భేదము లెల్ల కల్లై….” తరతమ భేదాలు మరచి అందరూ ఒక తల్లి బిడ్డలుగా కలసిమెలసి మెలగినప్పుడే ఈ లోకంలో సుఖ శాంతులు వర్ధిల్లుతాయి.
ఈ సృష్టిలో తనకోసం దాచుకునే అలవాటు ఒక్క మానవజాతికే ఉన్నది. తక్కిన వారినుండి. తనను వేరు చేసుకుని తానూ, తన కుటుంబం బాగుండాలని పరిమితులకు లోబడి ఆలోచించే మనస్తత్వం మానవ సహజం. అయితే, ఇది హద్దులు దాటితే సమాజం అశాంతిమయం అవుతుంది. నేటి సామాజిక జీవనం అస్తవ్యస్తం కావటానికి ఈ స్వార్థ సంకుచిత భావాలే కారణం అని వేరుగా చెప్పనక్కరలేదు.
“నీవే తల్లివి తండ్రివి …” అని ప్రార్థిస్తూ పరమాత్మతో ప్రేమానుబంధం అల్లుకుని మానవులందరూ ఒకే తల్లి బిడ్డలుగా పరస్పర ప్రేమాదరాలతో జీవించటమే అసలైన ఆధ్యాత్మికత.
“మాతా చ పార్వతీదేవీ
పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివ భక్తాశ్చ
స్వదేశో భువన త్రయం” అని ఈ విశ్వ విశాల భావననే మన సంప్రదాయం ఉద్బోధించింది. అయితే, కాలక్రమేణా దైవారాధన కర్మ కాండలకు పరిమితమై, కష్టాలు తీరడానికో, ఇష్టాలు నెరవేరడానికో సాధనం అనే భావన ప్రబలిపోయింది. అర్చనలు, అభిషేకాలు, వ్రతాలు, యజ్ఞాలు మొదలైన వాటి నిర్వహణలో ఆడంబరం పెరిగి పోయింది.
భక్తి పేరుతో సంస్కరింపబడే సదవకాశం చేజారి పోయింది
భగవద్గీతలోని ‘భక్తి యోగం’లో మనం సాధారణంగా అనుకునే పసుపు కుంకుమలు, పూలూ పండ్లూ మొదలైన పూజా సామగ్రి కనిపించదు.
“అద్వేష్టా సర్వ భూతానాం
మైత్రః కరుణ ఏవ చ
నిర్మమో నిరహంకారః
సమ దుఃఖ సుఖ క్షమీ”
అని ప్రారంభించి సత్ప్రవర్తనకు కావలసిన నియమావళినే నిజమైన పూజా ద్రవ్యాలుగా నిర్వచించాడు పరమాత్మ. సమాజంలో శాంతియుత సహజీవనం నెలకొనడానికి కావలసింది సత్ప్రవర్తన.
అందుకు తగిన శిక్షణ ఇచ్చేదే భక్తి అని తెలుస్తోంది. “మానవుని ఋజుమార్గ ప్రవర్తక భావ వ్యాపారమే భక్తి” అని హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస మహోదయులు నిర్వచించారు. మానసిక పరిపక్వత తప్ప ఆడంబరమైన కర్మకాండ భక్తి కాదని, భక్తి అంటే ప్రవర్తన తప్ప ప్రదర్శన కాదని మన మహర్షులు చాటి చెప్పారు.
యథార్థమైన జీవిత లక్ష్యాన్ని మరచి ఎండమావుల వెంట పరుగులు తీస్తూ అలసి పోతున్న మానవాళికి ఓదార్పు కావాలి. స్వార్థ సంకుచిత భావాలతో సమాజాన్ని అశాంతిమయం చేస్తున్నవారికి కనువిప్పు కలిగించాలి.
ఈ లక్ష్యంతోనే వివిధ యుగాలలో, భిన్నభిన్న దేశాలలో ఆధ్యాత్మిక గురువులు, ప్రవక్తలు దిగి వచ్చారు.
అమ్మ అవతరణకు కూడా ఇదే లక్ష్యం అనిపిస్తుంది.
అయితే, ఈ లక్ష్యాన్ని సాధించడానికి అమ్మ ఎన్నుకున్న ఉపకరణం అవ్యాజ ప్రేమ సూత్రం. ఆధునిక యుగంలో సామ్యవాదులు కోరుకునే సమ సమాజానికి నమూనాగా అందరింటిని నెలకొల్పింది అమ్మ.
ఈ భవనానికి సమతా మమతలే పునాదులు.
వసుధైక కుటుంబ భావనమే పతాక శిఖరం.
అందరికోసం అందరూ అందరితో కలసి పనిచేయటం ఒక్కటే సమ సమాజ స్థాపనకు మార్గం. వసుధైక కుటుంబం ఏర్పడాలంటే మనలో ఈ ప్రేమ అంకురించాలి. అందుకే ముందుగా ఈ ప్రేమను తన జీవన వైఖరిలో మనకు చవి చూపించింది అమ్మ.
అందరం ఒకే తల్లి బిడ్డలం, అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం అని మనం గుర్తించాలి. అలాంటి వికాసాన్ని మనలో కలిగించటమే అందరింటి స్థాపనలో అమ్మ ఆంతర్యం అనిపిస్తుంది.
మనిషికి ఏమి కావాలి? మొదటగా ఈ శరీరానికి ఆకలి తీరాలి. అందుకోసం అందరింటిలో ప్రధాన వ్యవస్థగా ‘అన్నపూర్ణాలయం’ నెలకొల్పింది అమ్మ.
“డ్రస్సుతో, అడ్రస్సుతో నిమిత్తం లేకుండా, ఆకలే అర్హతగా” ఎవరైనా అక్కడ భోజనం చేయవచ్చు. మనిషికి శరీరమే కాదు, హృదయం కూడా ఉన్నది. ఆ హృదయానికి ప్రశాంతత కావాలి. అది ప్రేమ వల్లనే కలుగుతుంది. అవ్యాజమూ, అపరిమితమూ, అమృతమయమూ అయిన తల్లి ప్రేమను మనందరిపై కురిపించింది అమ్మ. మనలో సంస్కారం వికసించి అది ప్రేమ పూరితమైన సత్ప్రవర్తనగా వ్యక్తం కావాలని, ఆ సత్ప్రవర్తన ‘అక్కయ్యా!’ ‘అన్నయ్యా!’ అనే పిలుపులో ప్రతి ధ్వనించాలని అమ్మ అభిలాష. అందరిల్లు అనే భావన అందుకు దోహదం చేస్తుంది.
మనిషికి మెదడు కూడా ఉన్నది. అందులోని ఆలోచనలు అవ్యాజ ప్రేమ ప్రవాహంలో ప్రక్షాళితం కావాలి. ఇది అందరి ఇల్లని, అందరం ఒకే తల్లి బిడ్డలం అని అనుభూతి కలగాలి. మన మస్తిష్కాలు సంస్కరణ పొందాలి. అందుకు చిన్న చిన్న మాటలతో శిక్షణ ఇచ్చింది అమ్మ.
“మీ రంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు కూడా” అన్నది. మనం అచంచల భక్తితో అమ్మ పాదాలకు నమస్కరిస్తాం.
ఆ సమయంలో మన చేతి గడియారం పిన్ను కానీ, మనవే నొక్కు కానీ సుకుమారమైన ఆ పాదాలకు గుచ్చుకుంటుందేమో అని ఎంతో జాగరూకత వహిస్తాం. ఏకాగ్రతతో వ్యవహరిస్తాం. అమ్మ విరాడ్రూప
ఆ విశ్వరూపంలో మనం అందరం అవయవాలం. మనలో ఎవ్వరూ
ఏ ఒక్కరినీ మనసా, వాచా, కర్మణా నొప్పించకుండా ఉండాలి.
ఇది గుర్తింప చేయటానికే అమ్మ మనందరినీ తన అవయువాలుగా చెప్పింది.
అంతేకాదు. ఒకే వ్యక్తికి చెందిన అవయవాల మధ్య వైవిధ్యం ఉంటుంది కాని, వైరుధ్యం వుండదు.
కుడిచేయి ఎడమచేతిని ఖండిస్తుందా?
కుడి కాలు ఎడమ కాలిని తాడనం చేస్తుందా?
తన వేలితో తన కన్నే ఎవరైనా పొడుచు కుంటారా?
మనం అందరం ఆ విరాడ్రూపంలో భాగమైనప్పుడు మన ఆలోచన ఎంతగా ఎదగాలో, మన ప్రవర్తనను ఎలా దిద్దుకోవాలో వేరుగా చెప్పనక్కర లేదు కదా!
మనలో మరుగున పడుతున్న మానవత్వాన్ని మేల్కొల్పటానికే అమ్మ అవతరించింది. అందుకే అందరింటిని నెలకొల్పింది.
దేహము, మనస్సు, బుద్ధి అనే మూడింటినీ సంస్కరించుకుని మనం ఆనందంగా జీవనం గడపాలన్నదే అమ్మ ఆంతర్యం. అందరింటి స్థాపనకు అదే లక్ష్యం.
‘ఆనందాల హరివిల్లు’ అయిన అందరింటిని నెలకొల్పి ఆ ఇంటిలో మనకు చోటు కల్పించిన అమ్మకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
‘అమ్మా! నువ్వు చూపిన దారిలో నడుస్తాం.
నీ బిడ్డలుగా ప్రేమమయమైన సంస్కారంతో జీవిస్తాం’ అని అమ్మ శ్రీచరణాల సాక్షిగా మనం ప్రమాణం చేద్దాం.
ఈ శతవసంత మహాత్సవ శుభ తరుణంలో అమ్మకు ఈ కానుక సమర్పిద్దాం.
అమ్మకు అసలైన వారసులుగా బ్రతకటానికి మనం పునరంకితం అవుదాం.
ఆ దివ్య ప్రేమ లహారిలో సస్మాతలపై తరిద్దాం.